Revanth Reddy

అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ వైఫల్యాలు ఒప్పుకున్న రేవంత్ రెడ్డి

న్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ అమలు కావడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. పలు పథకాలకు చెల్లింపులు కూడా సక్రమంగా జరగడం లేదని ఆయన పరోక్షంగా ఒప్పుకున్నారు. అయితే ఈ వైఫల్యాలకు తన పాలన కారణం కాదని, అంతకుముందున్న కేసీఆర్ పాలన అని నెపం నెట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని, జరగాల్సిన రీతిలో పనులు జరగడం లేదని సర్వత్రా విమర్శలు చెలరేగుతూ ఉండటం, ఎన్నికల హామీలపై మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడకు వెళ్లినా ప్రజలు నిలదీస్తూ ఉండడంతో ముఖ్యమంత్రికి వాస్తవం ఒప్పుకోక తప్పలేదు. వంద రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఏడాది గడిచినా ఎందుకు చేయడం లేదని వివిధ వర్గాల నుండి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. శాసనసభ సమావేశాలలో చివరి రోజున రైతుభరోసాపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఆర్థిక ఇబ్బందుల కారణంగా అమలు చేయలేకపోతున్నామని ఒప్పుకున్నారు. రైతులకు రైతు భరోసా ఇవ్వలేకపోతున్నామని, కౌలు రైతులకు సాయం చేయలేకపోతున్నామని, మహిళలకు ఇస్తామన్న డబ్బు ఇవ్వలేకపోతున్నామని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సమయానికి చేయలేకపోతున్నామని, హాస్టళ్ల బిల్లులు కట్టలేకపోతున్నామని, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌కు తులం బంగారం ఇవ్వలేకపోతున్నామని అంగీకరించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో చేసిన అప్పుల కారణంగానే హామీలు అమలు చేయలేకపోతున్నామని చెప్పారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం, తెస్తున్న అప్పులన్నీ గతంలో చేసిన అప్పులు చెల్లించేందుకే సరిపోతున్నాయని సమర్థించుకున్నారు.

‘నా దగ్గర రూ.1.27 లక్షల కోట్లు ఉంటే అద్భుతాలు సృష్టించేవాడిని. రైతులకు అన్ని పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చేవాడిని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూపాయి బకాయి లేకుండా చెల్లించేవాడిని, దవాఖానాలకు బిల్లులు చెల్లించడమే కాదు.. నెల అడ్వాన్స్‌ ఇచ్చేవాడిని. ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్క గ్యారంటీ అయినా ఆలస్యం అయిందంటే ఆ పాపం ఈ పాపాత్ములదే’ అని ప్రగల్భాలు పలికారు. పైగా, రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చడంతో తమ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంతో పోటీ పడుతున్నదని పరోక్షంగా అంగీకరిస్తూ తాము ఏడాది కాలంలో రూ.1.27 లక్షల కోట్లు అప్పులు తెచ్చామని రేవంత్ రెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి 2 గంటల పాటు మాట్లాడిన రేవంత్ రెడ్డి చివరకు రైతు భరోసాను ఎప్పుడు అమలు పరుస్తామో చెప్పనే చెప్పలేదు. రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పులకుప్పగా మార్చిందని ఎన్నికల ముందే స్పష్టమైంది. అన్ని ప్రతిపక్షాలు ఈ విషయమై విమర్శలు కురిపించాయి.అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల పట్ల అవగాహన లేకుండా ఎన్నికల హామీలు ఇచ్చారా? వాస్తవాలు తెలిసి కూడా అబద్ధాలతో ప్రజలను నమ్మించి, ఓట్లు దండుకొని, ఏదో విధంగా అధికారంలోకి వస్తే సరిపోతుందిలే అనుకొని ప్రజావంచనకు పాల్పడ్డారా? ఈ విషయం కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేయాల్సి ఉంది. అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి, అసెంబ్లీలో కూడా అబద్ధాలతోనే పాలన సాగించే ప్రయత్నం చేస్తున్నారు.

2 గంటల పాటు ప్రసంగించిన ముఖ్యమంత్రి ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక ఇబ్బందుల నుండి రాష్ట్రాన్ని బైటకు తీసుకొచ్చేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలు ఏమిటో చెప్పే ప్రయత్నం చేయలేదు. ఎన్నికల హామీలను ఎప్పటిలోగా అమలు చేస్తామో కూడా చెప్పే సాహసం చేయలేదు. సంవత్సరం తర్వాత కూడా గత ప్రభుత్వంపై విమర్శలతో కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. బహుశా ఇంత తక్కువ కాలంలో ఇంతటి ప్రజా వ్యతిరేకతను మరే ప్రభుత్వం కూడా ఎదుర్కొని ఉండదు. రూ.2 లక్షలకు పైగా ఉన్న అప్పును కడితే రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన మాట నమ్మి చాలామంది రైతులు రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణాన్ని కట్టేశారు. కానీ వాళ్లకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పడం లేదు. నవంబర్ 30న మహబూబ్‌నగర్ వెళ్లిన సీఎం నిధులు విడుదల చేశానని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క రైతు బ్యాంకులో ఆ డబ్బు జమ కాలేదు. తన పాలన వైఫల్యాలను ప్రస్తావించిన వారిని మాటల తూటాలతో నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారు.

సినీ హీరో అల్లు అర్జున్ విషయంలో కూడా అటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పోలీస్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నా తన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసం అల్లు అర్జున్ అరెస్ట్ తో ప్రయత్నం చేశారు. అల్లు అర్జున్ పై నమోదు చేసిన కేసులోని సెక్షన్ల పట్ల హైకోర్టు న్యాయమూర్తి కూడా విస్మయం వ్యక్తం చేయడం చూసాం. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మొత్తం చిత్ర పరిశ్రమనే బెదిరించే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడటం విస్మయం కలిగిస్తుంది. అరెస్ట్ అయిన అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించడాన్ని కూడా తప్పు పట్టడం ముఖ్యమంత్రిలోని అనాగరిక ధోరణులను వెల్లడిస్తుంది. బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వం, సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వం అని బెదిరిస్తున్నారు. ఆ విధంగా అనుమతులు ఇవ్వమని రాజకీయ పార్టీలు కోరాయా? ప్రజలు కోరారా? తన మంత్రివర్గంలోని ఓ మహిళా మంత్రి నాగార్జున కుటుంబంపై దారుణమైన విమర్శలు చేస్తే, మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే కనీసం మందలించే ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి చేయలేదు.

కృష్ణ చైతన్య