Cong

బీసీ రేజర్వేషన్లకు చట్టబద్ధత లేకుండా బీసీలకు మరోసారి కాంగ్రెస్ మోసం

కాంగ్రెస్ మరోసారి బీసీలను మోసం చేసింది. తెలంగాణ శాసనసభ వేదికగా బీసీలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తూ వారిని మభ్యపెట్టే రాజకీయాలు కొనసాగిస్తోంది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీకి తూట్లు పొడిచింది. బీసీ కుల గణన నివేదిక ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 4న ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం జరిపారు. కాంగ్రెస్ హామీ మేరకు బీసీలకు 42 శాతం రేజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం ప్రవేశ పెడతారని, దానికి చట్టబద్దత కల్పించేందుకు కేంద్రానికి పంపిస్తారని అందరూ భావించారు. అయితే తాము తెలంగాణలో చేసిన విధంగా దేశవ్యాప్తంగా ఇంటింటి సమగ్ర సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్యా, రాజకీయ, కుల సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసేందుకే పరిమితం అయ్యారు. కేంద్రం చట్టబద్దత కల్పిస్తేనే ఈ రేజర్వేషన్లు అమలు చేస్తామని చెప్తూ తాము పార్టీ పరంగా 42 శాతం సీట్లు బీసీలకు ఇస్తామని మాటమార్చారు. బీఆర్ఎస్, బిజెపి కూడా ఆ విధంగా ఇస్తాయా? అంటూ రాజకీయ ప్రసంగాలకే పరిమితం అయ్యారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అవసరమా? పార్టీ సమావేశంలో ప్రకటించవచ్చు గదా!

ఈ సర్వే రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు 56% ఉన్నాయని వెల్లడించడంతో, అది ఇప్పుడు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ గణన ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్లు పెరుగుతుండటంతో, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. రాహుల్ గాంధీ నినాదం “జిత్నీ ఆబాది, ఉత్నా హక్” (జనాభా మేరకు హక్కులు) ప్రకారం రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాల్సి ఉంటుంది. ఈ సర్వే గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సర్వే కన్నా తక్కువగా బీసీ జనాభాను చూపడం పట్ల బీఆర్ఎస్, బిజెపి సహా బీసీ సంఘాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. సర్వేలో బీసీల జనాభా తగ్గిందని, కులగణనలో తప్పులు జరిగాయని, సమగ్రంగా సర్వే జరగలేదని బిజెపి శాసనసభ పక్ష ఉప నాయకుడు పాయల్ శంకర్ అసెంబ్లీలో విమర్శించారు. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అంటూ కొత్త పదం సృష్టించారని, దీనిపై ఎవరు పిటిషన్ వేసిన కోర్టు వారం రోజుల్లో రిజర్వేషన్లను రద్దు చేస్తుందని అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా ఉండేందుకే ఈ నివేదిక ప్రవేశపెట్టారా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. లోక్‌సభలో కులగణనపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు పొంతన లేదని ధ్వజమెత్తారు.

కుల గణన సర్వే ప్రకారం ఆయా సామాజిక వర్గాల వారి సంఖ్య చెప్పమంటే, దాటవేయాలని చూస్తున్నారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంసీఆర్ వెబ్‌సైట్‌లో అధికారికంగా కులగణన డేటాను నాటి ప్రభుత్వం అందుబాటులో ఉంచగా, ఇప్పుడు ముఖ్యమంత్రి “ఆ డేటా ప్రామాణికం కాదు” అని అంటున్నారు. ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు కేటాయిస్తామని చెప్పి, కేవలం 1% మాత్రమే ఖర్చు చేయడం ఈ సందర్భంగా గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అనేక గృహాలను కుల సర్వేలో చేర్చలేదని బీసీ సంస్థలు ఆరోపిస్తున్నాయి. 

తెలంగాణలో మాత్రమే కాదు, పొరుగున ఉన్న కర్ణాటకలో కూడా కాంగ్రెస్ కుల గణన విషయంలో ఇబ్బంది పడుతోంది. 2018లో సిద్ధరామయ్య ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే నివేదికను బహిరంగంగా ప్రకటించాలా వద్దా అనే అంశంపై కాంగ్రెస్‌లో విభేదాలు నెలకొన్నాయి. జనవరిలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కొంతమంది అగ్రకుల మంత్రులు ఈ నివేదికను నిలిపివేయాలని కాంగ్రెస్ హైకమాండ్‌పై ఒత్తిడి చేసినట్లు తెలుస్తుంది. సుమారు రూ.160 కోట్ల వ్యయంతో సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రారంభించిన ఈ సర్వేను 2024లో విడుదల చేయాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం చేసుకోవడంతో నివేదిక విడుదల నిలిచిపోయింది. ఈ పరిణామం కాంగ్రెస్‌లో విభజన స్పష్టంగా చూపించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాహుల్ గాంధీ కుల గణనను దేశవ్యాప్త “ఎక్స్-రే”గా అభివర్ణించినప్పటికీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ అంశం కాంగ్రెస్‌ను సంక్షోభంలోకి నెట్టడం కనిపిస్తున్నది.

కృష్ణ చైతన్య