బండి సంజయ్ చొరవతో సైబర్ వెట్టి నుంచి నలుగురు విముక్తి
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవతో సైబర్ కేటుగాళ్లకు చిక్కిన యువతకు విముక్తి లభించింది. బ్యాంకాక్ ఉద్యోగం ఆశతో సైబర్ కేటుగాళ్లకు చిక్కి, బంధీలు మారి, మయన్మార్ కేంద్రంగా సైబర్ వెట్టిచాకిరికి గురవుతున్న యువకులు స్వదేశం చేరుకున్నారు. వీరిలో ముగ్గురు తెలంగాణకు చెందిన వారు కాగా, మరొకరు ఏపీకి చెందిన వ్యక్తి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు బండి సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని వీరిని స్వదేశానికి రప్పించారు. వివరాల్లోకి వెళితే…
బ్యాంకాక్‌లో మంచి జాబ్ ఉందని, ప్రతి నెలా లక్షల రూపాయల జీతం వస్తుందని బ్రోకర్ ఆశ చూపడంతో వీరంతా నిజమేనని నమ్మి మోసపోయారు. మయన్మార్ కేంద్రంగా నడుస్తోన్న సైబర్ ముఠాకు చిక్కి, బంధీలుగా మారారు. ఆ ముఠా వీరితో సైబర్ క్రైమ్ చేయించేది. చెప్పినట్టు వినకపోతే హింసించేవారు. పాస్ పోర్టు లాక్కొని బెదిరించేవారు. అయినా వినకపోయేసరికి అక్రమంగా ఇక్కడకు వచ్చారంటూ పోలీసులకు పట్టించారు. పాస్ పోర్టు లేకపోవడంతో అక్కడి పోలీసులు సైబర్ ముఠా చెప్పింది విని, యువతను జైలులో పెట్టారు. దేశం కాని దేశంలో అరిగోస పడ్డారు. ఇదే విషయంపై రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కోహెడకు చెందిన మయన్మార్ బాధితుడు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మా ఏరియాలో ఉండే యశ్ నాథ్ గౌడ్ అనే వ్యక్తి బ్యాంకాక్‌లో మంచి ఉద్యోగం ఉందని ఆశ చూపడంతో నిజమేనని నమ్మిన. జగిత్యాలలోని బ్రోకర్ల ఏజెంట్ (టీం లీడర్) వంశీక్రిష్ణ వద్దకు తీసుకుపోయిండు. వంశీక్రిష్ణే నన్ను ఇంటర్వ్యూ చేసిండు. బ్యాంకాక్‌కు 200 కి.మీల దూరంలోనే జాబ్ అని చెప్పి తీసుకుపోయారు. తీరా అక్కడికిపోతే రోజుకు 16 గంటల పని అప్పగించారు. ఆ పని ఏందంటే సైబర్ క్రైమ్. ఆ పని చేయకపోతే భోజనం కూడా పెట్టకపోయేవాళ్లు. 5 నెలలు ఆ కంపెనీలో పనిచేసిన. అట్లాంటి పనిచేయడం నాకిష్టం లేక మొండికేసిన. దీంతో అక్కడున్న చైనీస్ వాళ్లు నా పాస్ పోర్టు గుంజుకున్నరు. అన్నం కూడా పెట్టకుండా హింసించారు. అయినా వినకపోవడంతో వాళ్లు అక్కడున్న ఆర్మీ వాళ్లకు మేం దొంగతనంగా ఆ దేశానికి వచ్చామని చెప్పి మమ్మల్ని పట్టించారు. వాళ్లు మమ్మల్ని జైల్లో వేశారు’’ అని వాపోయారు. ఇటీవల మయన్మార్ నుండి వందలాది మంది తనలాంటి బాధితులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్వదేశానికి రప్పించారని తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చానని రాకేష్ రెడ్డి తెలిపారు. బండి సంజయ్‌కు లెటర్ రాసిన వెంటనే స్పందించి విదేశాంగ శాఖకు లేఖ రాయడంతోపాటు వెంటనే మమ్మల్ని స్వదేశానికి రప్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారన్నారు. బండి సంజయ్‌కు మా కుటుంబమంతా రుణపడి ఉంటదని పేర్కొన్నారు.
రాకేశ్ రెడ్డితోపాటు కోహెడకు చెందిన ఏ.శివశంకర్, కరీంనగర్ జిల్లాకు చెందిన కనూరి గణేశ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆకుల గురు యువ కిశోర్ బ్రోకర్ల బారిన పడి మయన్మార్‌లో సైబర్ క్రైం వెట్టి చాకిరి చేస్తూ తీవ్రమైన హింసలకు గురయ్యారు. వీరంతా బండి సంజయ్ కార్యాలయ చొరవతో స్వదేశానికి తిరిగొచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ మయన్మార్‌లో పలువురు తెలుగు రాష్ట్రాల యువతతోపాటు వందలాది మంది భారతీయులు సైబర్ క్రైమ్ వెట్టి చాకిరి చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని, త్వరలోనే వారందరినీ స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

