భారతదేశం-ఒమన్ ఒప్పందం: వ్యవసాయం, పరిశ్రమలకు కొత్త అవకాశాలు
జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చిన భారత్-ఒమన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కొత్త మార్కెట్లను అందుబాటులోకి తేవడం, ఉపాధి కల్పనను వేగవంతం చేయడం ద్వారా భారత్ లోని విద్యార్థులు, కళాకారులు, మహిళలు, రైతులు, మత్స్యకారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ) ఆర్థిక వృద్ధికి అంతర్జాతీయ మార్గాలను సుగమం చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పానికి నిదర్శనం.
ఒమన్‌తో భారత్ కు అత్యంత బలమైన ఆర్థిక, సాంస్కృతిక, మానవీయ సంబంధాలు ఉన్నాయి. దాదాపు 7 లక్షల మంది భారతీయులు ఒమన్‌లో నివసిస్తున్నారు, వీరిలో కొన్ని వ్యాపార కుటుంబాల మూలాలు 200-300 సంవత్సరాల నాటివి. ఒమన్ నుంచి భారతదేశానికి ఏటా సుమారు 2 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం వస్తుండగా, 6,000 కి పైగా భారతీయ కంపెనీలు అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. రెండు దేశాల మధ్య కుదిరిన ఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) ఆర్థిక, వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ ఒప్పందం ద్వారా ఒమన్ మార్కెట్లో భారతదేశానికి చెందిన 99 శాతం ఎగుమతులకు తక్షణమే 100 శాతం సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. ఒప్పందానికి ముందు కేవలం 15.3 శాతం భారతీయ ఎగుమతులకు మాత్రమే ఒమన్‌లో సుంకం లేకుండా ప్రవేశం ఉండేది, ఆ వ్యవస్థతో పోలిస్తే ఇది అత్యంత గణనీయమైన మార్పు. ప్రస్తుతం ఒమన్‌లో 5 శాతం దిగుమతి సుంకం ఎదుర్కొంటున్న సుమారు 3.64 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ వస్తువులకు, ఇకపై మార్కెట్లో ప్రవేశం మరింత పెరుగుతుంది.
భారతదేశపు ఎంఎస్ఎంఇ రంగానికి సంబంధించి ఈ ఒప్పందం ఒక విప్లవాత్మక మార్పును తీసుకురానుంది. ఎందుకంటే దీని ద్వారా ప్రయోజనం పొందే అనేక రంగాలు చిన్న తరహా పరిశ్రమల పరిధిలోనే ఉన్నాయి. ఇనుము-ఉక్కు, జౌళి, తోలు, ఆటో విడిభాగాలు, పారిశ్రామిక పరికరాలు వంటి రంగాలలో ఎంఎస్ఎంఇలకు భారీ అంతర్జాతీయ ఆర్డర్లు లభిస్తాయని భావిస్తున్నారు. ఇది దేశీయంగా ఉత్పత్తి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, అస్థిరతలు పెరుగుతున్న తరుణంలో భారతీయ ఎగుమతిదారులకు తమ మార్కెట్లను విస్తరించుకోవడానికి, ఆర్థిక మాంద్యం, పెరుగుతున్న వాణిజ్య అడ్డంకులను ఎదుర్కొంటున్న దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ‘సెపా’ ఒక కీలకమైన అవకాశాన్ని కల్పిస్తుంది.
ఉపాధి కల్పన
ఈ వాణిజ్య ఒప్పందం వల్ల భారత్ లో అత్యధికంగా ఉపాధి కల్పించే జౌళి, దుస్తులు, తోలు, పాదరక్షలు, ఆహార శుద్ధి, సముద్ర ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, కొన్ని ఇంజనీరింగ్ రంగాలు వంటి శ్రమశక్తి ఆధారిత రంగాలు భారీగా లబ్ధి పొందుతాయి. ఒమన్‌కు జౌళి ఎగుమతులు పెరగడం వల్ల తిరుపూర్, సూరత్, లూథియానా, పానిపట్, కోయంబత్తూర్, కరూర్, భదోహి, మొరాదాబాద్, జైపూర్, అహ్మదాబాద్ వంటి ప్రధాన పారిశ్రామిక కేంద్రాలలో ఉత్పత్తి పెరిగి కొత్త ఉద్యోగాలు వస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్న హస్తకళాకారులు, చేనేత కార్మికులకు కూడా వారి ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌తో పాటు మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని ప్రధాన తోలు, పాదరక్షల తయారీ కేంద్రాలలో అనేక ఉద్యోగావకాశాలు లభిస్తాయి. రత్నాలు, ఆభరణాల రంగంలో కూడా ‘సెపా’ ఉపాధి వృద్ధిని వేగవంతం చేస్తుంది. డైమండ్ కటింగ్, పాలిషింగ్, బంగారం, వెండి ఆభరణాలు, హస్తకళా ఆభరణాల తయారీలో భారతదేశానికి మంచి బలమైన నైపుణ్యం ఉంది. టారిఫ్ అడ్డంకులు తొలగిపోవడంతో, యూరోపియన్, ఆసియా పోటీదారులపై భారతీయ ఎగుమతిదారులకు స్పష్టమైన ఆధిక్యత లభిస్తుంది. రాబోయే మూడేళ్లలో ఒమన్‌కు ఎగుమతులు 15 కోట్ల డాలర్ల మేర పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనివల్ల పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్‌లలోని ఆభరణాల తయారీ కేంద్రాలలో విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
రైతులకు, మత్స్యకారులకు ప్రయోజనం
దేశీయ రైతులను, పోటీ తట్టుకోలేని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ ను కాపాడటానికి గోధుమలు, వరి, మొక్కజొన్న, తృణధాన్యాలు, పాల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, వంట నూనెలు, నూనెగింజలు, టీ, కాఫీ, తేనె వంటి ఉత్పత్తులపై భారతదేశం ఎలాంటి సుంకం మినహాయింపులను ఇవ్వలేదు. అదే సమయంలో వెన్న, తేనె, తీపి బిస్కెట్లు, గుడ్లు, కొన్ని రకాల చాకోలెట్లు ఉత్పత్తుల విషయంలో భారత్‌కు ఇతర దేశాలతో పోలిస్తే ఉత్పత్తి ఖర్చులు తక్కువ. చౌకధరల వాటిని అమ్మగలదు. ఇది దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల డిమాండ్‌ను పెంచి గ్రామీణ ఆదాయాన్ని వృద్ధి చేస్తుంది. భారతదేశానికి చెందిన ‘జాతీయ సేంద్రియ ఉత్పత్తి కార్యక్రమం’ (NPOP) సర్టిఫికేషన్‌ను అంగీకరించేందుకు, గుర్తించేందుకు కూడా ఈ ఒప్పందంలో నిబంధనలు ఉన్నాయి. ఆహార పదార్థాలను భారీగా దిగుమతి చేసుకునే ఒమన్‌కు సేంద్రీయ ఉత్పత్తులను విక్రయించడానికి ఇది భారతీయ రైతులకు అపారమైన అవకాశాలను కల్పిస్తుంది. సముద్ర ఉత్పత్తుల రంగంలోనూ ఇంకా మనం ఉపయోగించుకోని భారీ అవకాశాలు ఉన్నాయి. 2022, 2024 మధ్య ఒమన్ దాదాపు 11.9 కోట్ల డాలర్ల విలువైన సముద్ర ఉత్పత్తులను దిగుమతి చేసుకోగా, భారతదేశం నుంచి దిగుమతులు కేవలం 77.5 లక్షల డాలర్లు మాత్రమే ఉన్నాయి. దీనివల్ల రొయ్యలు, ఘనీభవించిన కట్ల్‌ఫిష్ వంటి భారతీయ సీఫుడ్ ఎగుమతులకు భారీ అవకాశాలు లభిస్తాయి. శ్రమశక్తి ఆధారితమైన ఈ సముద్ర ఉత్పత్తుల పరిశ్రమ వల్ల చేపల వేట, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, కోల్డ్-చైన్ లాజిస్టిక్స్, ఎగుమతి కార్యకలాపాలలో అదనపు ఉద్యోగాలు లభిస్తాయి.
ఫార్మా , సంప్రదాయ వైద్యం
అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ, యూరప్, బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థల వంటి ప్రముఖ అంతర్జాతీయ నియంత్రణ సంస్థల ఆమోదం పొందిన భారతీయ ఔషధాలకు ఒమన్‌లో 90 రోజుల్లోగా ఆటోమేటిక్ మార్కెటింగ్ అనుమతి లభిస్తుంది. ఇది భారతీయ ఫార్మా ఎగుమతిదారులకు దక్కిన అతిపెద్ద విజయం. ముఖ్యంగా, ఈ సెపా ఒప్పందం భారతదేశ సంప్రదాయ వైద్య సేవలకు కూడా తగిన అవకాశాలను కల్పిస్తుంది. సంప్రదాయ వైద్య రంగంలో సంయుక్త పరిశోధనలకు కూడా ఇది వీలు కల్పిస్తుంది.
సేవలు, కార్మికుల రాకపోకలు
సేవలు, కార్మికు రంగాలు ఈ ఒప్పందంలో మరొక ముఖ్యమైన భాగం. ప్రొఫెషనల్ సేవలు, కంప్యూటర్, ఐటీ సేవలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యాటకం, పరిశోధన, అభివృద్ధి, పర్యావరణ సేవలు వంటి కీలక రంగాలలో భారత్ వనరులను ఉపయోగించుకునేందుకు ఒమన్ ఆసక్తి వ్యక్తం చేసింది. అకౌంటింగ్, ఇంజనీరింగ్, మెడిసిన్, నిర్మాణ రంగం, విద్య, కన్సల్టింగ్ రంగాల్లోని భారతీయ నిపుణులకు మెరుగైన మార్కెట్ ప్రవేశం లభిస్తుంది. భారతీయ నిపుణులు, కార్మికుల రాకపోకల నిబంధనలను సులభతరం చేసేందుకు ఒమన్ అంగీకరించింది. ఇంట్రా-కార్పొరేట్ బదిలీదారులు, ఒప్పంద సేవల సరఫరాదారులకు నాలుగు సంవత్సరాల వరకు నివసించేందుకు అనుమతి లభిస్తుంది. అలాగే వ్యాపార సందర్శకులు, స్వతంత్ర నిపుణులకు తాత్కాలిక ప్రవేశ నిబంధనలు సులభతరం చేస్తారు. ఇంట్రా-కార్పొరేట్ బదిలీల పరిమితిని ఒమన్ 20 శాతం నుంచి 50 శాతానికి పెంచింది. అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడంలో నరేంద్ర మోది ప్రభుత్వం చూపిస్తున్న చొరవ, ప్రతి భారతీయుడి జీవితాన్ని మెరుగుపరచాలనే ప్రధానమంత్రి సంకల్పంలో భాగమే. వాణిజ్యం ఆర్థిక వృద్ధికి, ఉపాధి కల్పనకు, పరస్పర సంపద పెంపొందించుకోవడానికి ఒక శక్తిమంతమైన సాధనమని ఒమన్‌తో కుదిరిన ఈ ఒప్పందం పునరుద్ఘాటిస్తోంది. వైషమ్యాలు, రక్షణవాదం పెరుగుతున్న ప్రస్తుత ప్రపంచంలో, సరికొత్త, ఆత్మవిశ్వాసంతో కూడిన భారతదేశం గోడల వెనుక దాక్కోదని, భాగస్వామ్యాలు, పోటీతత్వం, అంతర్జాతీయ సంబంధాల ద్వారా మరింత ఎత్తుకు ఎదుగుతుందని ప్రధాని మోదీ స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నారు.
పీయూష్ గోయల్,
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి

