Higher Education

భారత విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు

దేళ్ల క్రితం ప్రపంచ అత్యుత్తమ ర్యాంకింగ్స్‌లో ఒక భారతీయ విశ్వవిద్యాలయం చోటు దక్కించుకోవడం చాలా అరుదైన, సంబరాలు చేసుకోవాల్సిన విషయం. కానీ నేడు అది దాదాపు ఒక సాధారణంగా మారిపోయింది. జూన్ 18, 2026న విడుదలైన ‘క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027’లో పది భారతీయ విద్యా సంస్థలు ప్రపంచంలోని టాప్ 500 జాబితాలో నిలిచాయి. గత దశాబ్ద కాలంగా భారత ఉన్నత విద్యా వ్యవస్థ నిశ్శబ్దంగా తనను తాను పునర్నిర్మించుకుంటోదనడానికి ఇంతకంటే స్పష్టమైన నిదర్శనం మరొకటి లేదు. అయితే ఈ ర్యాంకింగ్స్ కేవలం పైన కనిపించే విప్లవాత్మక మార్పులలో ఒక చిన్న భాగం మాత్రమే. పరిశోధన, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, విద్యా లభ్యత, ముఖ్యంగా, విద్య అసలైన ఉద్దేశం ఏమిటనే దానిపై పునఃసమీక్ష వంటి ఎన్నో కోణాలతో కూడిన విస్తృతమైన పరివర్తన దీని వెనుక ఉంది. ఈ అంశాలన్నీ కలిసి భారత విద్యా వ్యవస్థ కేవలం పరిమాణంలోనే కాకుండా విద్యార్థుల పట్ల మరింత బాధ్యతాయుతంగా ఎదిగిందనే సత్యాన్ని చాటిచెబుతున్నాయి.

ప్రపంచ స్థాయిలో ముందంజ

ఈ ఏడాది 118వ ప్రపంచ ర్యాంక్‌తో ఐఐటీ ఢిల్లీ భారత్ లోనే అత్యున్నత స్థానంలో నిలవగా ఐఐటీ బాంబే, ఐఐఎస్‌సీ బెంగళూరు, ఐఐటీ మద్రాస్, ఇతర ఐఐటీలు సైతం తమ స్థానాలను స్థిరంగా మెరుగుపరుచుకుంటూ వస్తున్నాయి. అయితే ఈ ప్రగతి కేవలం సాంకేతిక రంగానికే పరిమితం కాలేదు. ఢిల్లీ విశ్వవిద్యాలయం, అన్నా విశ్వవిద్యాలయాలు ప్రపంచ టాప్ 500 జాబితాలోకి చేరగా, హైదరాబాద్ విశ్వవిద్యాలయం, జామియా మిలియా ఇస్లామియా, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయాలు టాప్ 800 లో చోటు దక్కించుకున్నాయి. భారతదేశ వృద్ధి కేవలం ఇంజనీరింగ్, టెక్నాలజీలకే పరిమితం కాలేదనడానికి ఇవే నిదర్శనాలు. గణాంకాలను పరిశీలిస్తే ఈ మార్పు స్పష్టమవుతుంది: 2015లో క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో కేవలం 14 భారతీయ విద్యాసంస్థలు మాత్రమే ఉండగా, నేడు ఆ సంఖ్య 52కి చేరింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ప్రాతినిధ్యం ఉన్న నాల్గవ దేశంగా భారత్ అవతరించింది. మొత్తంగా ఈ విజయాలు కేవలం ఒక సంస్థ సాధించినవి కావు, యావత్ విద్యా వ్యవస్థ నాణ్యత, పరిశోధనా స్థాయి, అంతర్జాతీయ గుర్తింపునకు ప్రతిబింబాలు.

పరిశోధన, ఆవిష్కరణల చోదక శక్తి

ఈ ఎదుగుదల కేవలం కాగితాలకే పరిమితం కాలేదు, నిజమైన పునాదులపై నిర్మితమైంది. సైన్స్, ఇంజనీరింగ్ ప్రచురణలలో భారత్ ప్రస్తుతం ప్రపంచంలో మూడవ స్థానంలోనూ, పేటెంట్ దరఖాస్తులలో ఆరవ స్థానంలోనూ ఉంది. పరిశోధనలు ఇప్పుడు దేశీయ అవసరాలైన స్వఛ్చ ఇంధనం, కృత్రిమ మేధ, సైబర్ భద్రత, రోబోటిక్స్, సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ, అంతరిక్ష రంగాల దిశలో ఎక్కువగా సాగుతున్నాయి. అంతర్జాతీయ ఆవిష్కరణల సూచి (జిఐఐ) కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. 133 ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం 2015లో 81వ స్థానంలో ఉండగా, 2025 నాటికి 38వ స్థానానికి చేరుకుంది. వైపో 2025 సమాచారం ప్రకారం ప్రపంచంలోని టాప్ 30 ఆవిష్కరణల క్లస్టర్లలో భారత్‌కు చెందిన బెంగళూరు (21వ స్థానం), ఢిల్లీ (26వ స్థానం) చోటు దక్కించుకున్నాయి. అయితే ప్రచురణల సంఖ్య మాత్రమే అంతిమ లక్ష్యం కాకూడదు. పరిశోధనలు ఆచరణాత్మక ఫలితాలుగా మారాలి. పరిశ్రమలు సమస్యలను పరిష్కరించేవిగా, ప్రభుత్వ విధానాలకు దిశానిర్దేశం చేసేవిగా, ప్రజల జీవితాలను మెరుగుపరిచేవిగా ఉండాలి. అందుకే పరిశ్రమలు-విద్యాసంస్థల మధ్య మరింత బలమైన సమన్వయం సాధించడం భారతీయ ఉన్నత విద్యా సంస్థల ముందున్న తదుపరి సవాలు.

క్యాంపస్ నుంచి కంపెనీల వైపు

పరిశ్రమలతో ఉన్న ఈ అనుసంధానం భారతీయ క్యాంపస్‌లలో వస్తున్న స్టార్టప్ విప్లవంలో స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలోని 1,100కు పైగా ఇంక్యుబేటర్లలో దాదాపు మూడింట రెండు వంతులు ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్‌ఐటీలు, కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల పరిధిలోనే ఉన్నాయి. స్టార్టప్ ఇండియా (2016), అటల్ ఇన్నోవేషన్ మిషన్, 2018లో విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ‘ఇన్‌స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్’ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు వ్యవస్థాపకతను విద్యా స్రవంతిలోకి తీసుకెళ్లాయి. జాతీయ విద్యా విధానం (ఎన్ఇపి- 2020) సైతం ఈ వ్యవస్థాపక నైపుణ్యాలను డిగ్రీ పాఠ్యాంశాల్లో విడదీయరాని భాగం చేసింది. దీని ఫలితాలు మన కళ్లముందే కనిపిస్తున్నాయి. 2016లో కేవలం 450గా ఉన్న స్టార్టప్‌ల సంఖ్య, మార్చి 31, 2026 నాటికి 2.23 లక్షలు దాటింది. ఇవి 23.36 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉపాధిని సృష్టించడమే కాకుండా, భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థగా నిలబెట్టాయి.

అందరికీ అందుబాటులోకి విద్య 

నాణ్యత పెరగడంతో పాటు విద్య అందరికీ అందుబాటులోకి వచ్చే ప్రక్రియ కూడా వేగవంతమైంది. ఉన్నతవిద్యపై అఖిల భారత సర్వే (AISHE) వివరాల ప్రకారం, 2015-16, 2021-22 మధ్య కాలంలో ఉన్నత విద్యా సంస్థల సంఖ్య దాదాపు 15.8 శాతం పెరిగింది. అదే సమయంలో స్థూల నమోదు నిష్పత్తి (GER) 23.7 శాతం నుంచి 28.4శాతంకి చేరుకుంది. అంటే దశాబ్దం క్రితంతో పోలిస్తే కోట్లమంది యువ భారతీయులు తరగతి గదుల్లో అడుగుపెట్టారు. కొత్త కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, డిజిటల్, ఓపెన్-డిస్టెన్స్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, మహిళల భాగస్వామ్యం పెరగడం, ఎన్ఇపి-2020 ప్రవేశపెట్టిన సరళమైన, విభిన్న సబ్జెక్టుల కోర్సులు ఈ విస్తరణకు కారణమయ్యాయి. ఈ విభిన్న సబ్జెక్టుల విధానం విద్యార్థులు సైన్స్, మానవ శాస్త్రాలు, ఆర్ట్స్, వృత్తి కోర్సులను స్వేచ్ఛగా ఎంచుకునే అవకాశం కల్పించడం వల్ల గ్రాడ్యుయేట్ల ఆలోచనా విధానం మారుతోంది. 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన బహుముఖ ప్రజ్ఞను, సమస్యా పరిష్కార నైపుణ్యాలను ఇది అందిస్తోంది. ఎన్ఇపి-2020 మొదటిసారిగా భారతీయ జ్ఞాన వ్యవస్థలను ప్రధాన పాఠ్యాంశాల్లో చేర్చింది. సమకాలీన సైన్స్‌తో పాటుగా దేశ శాస్త్రీయ, తాత్విక, భాషా, కళాత్మక వారసత్వాన్ని, యోగ, ఆయుర్వేదం, శాస్త్రీయ భాషలు, భారతీయ తత్వశాస్త్రం వంటి వాటిని, విద్యార్థులకు పరిచయం చేస్తోంది.

భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం 

వీటన్నింటితో పాటు నైపుణ్యాభివృద్ధి కూడా వేగంగా పుంజుకుంది. స్కిల్ ఇండియా మిషన్ 2015 నుంచి ఆరు కోట్ల మందికి పైగా శిక్షణ ఇవ్వగా, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పరిశ్రమలకు అవసరమైన రంగాలలో 16 లక్షలకు పైగా యువతకు సర్టిఫికెట్లు ప్రదానం చేసింది. ఎన్ఇపి-2020 ఏఐ, డేటా సైన్స్, సైబర్ భద్రత, రోబోటిక్స్, నిపుణ వ్యవసాయం వంటి నైపుణ్యాభివృద్ధి కోర్సులను నేరుగా డిగ్రీ కోర్సులలో చేర్చింది. వీటితో పాటు తరగతి గది అభ్యసనాన్ని పని అనుభవంతో జోడించేలా అప్రెంటిస్‌షిప్ పథకాలను తెచ్చింది. దీని ఫలితం ఇప్పటికే కనిపిస్తోంది, ‘క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2027’లో 89 ఆర్థిక వ్యవస్థలలో భారత్ 13వ స్థానంలో నిలిచింది, ఏఐకి సిద్ధంగా ఉన్న ప్రముఖ ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందింది. అయితే వ్యవస్థ విస్తరిస్తున్న కొద్దీ సరికొత్త సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. దేశ ఉన్నత విద్యా వ్యవస్థ ఇప్పుడు 1,338 విశ్వవిద్యాలయాలు, 53,354 కళాశాలలతో విస్తరించి, 4.33 కోట్ల మంది విద్యార్థులకు సేవలందిస్తోంది. ఈ మానవ వనరుల ప్రయోజనాన్ని దేశం వృథా చేసుకోకూడదు. దశాబ్దాలుగా ఎక్కువ విద్యా కార్యక్రమాలు నిజంగా అవసరమైన నైపుణ్యాలపై దృష్టి పెట్టలేదు. దీంతో పట్టభద్రులు నేర్చుకున్న దానికి, పరిశ్రమల అవసరాలకు మధ్య పెద్ద అంతరం ఏర్పడింది. ఈ లోటును పూరించాలంటే సామాజిక ప్రాధాన్యాలు, పారిశ్రామిక డిమాండ్, మారుతున్న ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా విద్యా సంస్థలు తమ పాఠ్యాంశాలను మరింత వేగంగా మార్చాల్సి ఉంటుంది. అప్పుడే ‘వికసిత్ భారత్@2047’ కల సాకారం కావడానికి అవసరమైన భవిష్యత్తు శ్రామిక శక్తిని ఈ వ్యవస్థ అందించగలదు.

వ్యక్తిత్వ నిర్మాణానికి ప్రాధాన్యం 

ఒక వ్యక్తి నిజమైన విలువ వారి అర్హతా పత్రాల్లోకాక వారి ప్రవర్తన, శీలంలో ప్రతిబింబిస్తుందన్నది భారతదేశ ప్రాచీన భావనల్లో ఒకటి. నైపుణ్యాలు ఎంత ఉపయోగకరమైనవైనా, అవి మాత్రమే విద్య అంతిమ ఉద్దేశం కావు. స్వామి వివేకానంద, శ్రీ అరవిందో, పండిత మదన్ మోహన్ మాలవీయ వంటి సంస్కర్తలు విద్య ప్రాథమిక విధి వ్యక్తిత్వ నిర్మాణమేనని, జ్ఞానంతో పాటు స్వీయ-క్రమశిక్షణ, సచ్చీలత, సామాజిక బాధ్యతను పెంపొందించడమేనని నొక్కి చెప్పారు. 1916లో మాలవీయ బనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించినప్పుడు, ధర్మం, నైతికతపై ఆధారపడిన వ్యక్తిత్వ నిర్మాణాన్ని ఆ సంస్థ ముఖ్య ఉద్దేశంగా నిర్దేశించారు. ఈ సంప్రదాయం మన గ్రంథాలైన వేదాలు, మనుస్మృతి, భగవద్గీత, రామాయణం నుండి వచ్చింది. ఇవి సత్యం, అహింస, నిగ్రహం, కరుణ, సేవలను ధర్మం ముఖ్య గుణాలుగా పేర్కొంటాయి. వీటిని విద్యార్థులలో పెంపొందించే బాధ్యత అధ్యాపకులపై ఉంది. ఎన్ఇపి-2020 సాంకేతిక విద్యతో పాటు నైతికత, సహానుభూతి, నాయకత్వ లక్షణాలను పెంపొందించే కోర్సుల ద్వారా ఈ విధానాన్ని పునరుద్ధరించింది. అయితే విద్యార్థులు ఈ పాఠాలను ఎంతవరకు అవలంబిస్తారనేది బోధించే ఉపాధ్యాయుల నిబద్ధత, నిజాయితీ మీదే ఆధారపడి ఉంటుంది.

రాబోయే దశాబ్దం

మొత్తంగా చూస్తే గత దశాబ్దం ఒక స్పష్టమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది. భారతీయ ఉన్నత విద్య పరిమాణంలో పెరిగింది, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో దూసుకువెళ్ళింది, పరిశోధన, ఆవిష్కరణల పునాదిని బలోపేతం చేసింది. ఇప్పుడు మిగిలింది ఎన్ఇపి -2020 ప్రారంభించిన పనిని పూర్తి చేయడమే, అంటే పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను, నైతిక విలువల విద్యా విధానాన్ని ఒకే పాఠ్యప్రణాళికగా మార్చడం. తద్వారా భారతదేశపు పట్టభద్రులు కేవలం డిగ్రీలు ఉన్నవారిగా కాకుండా బాధ్యతాయుతమైన, నైతిక విలువలు గల వ్యక్తులుగా దేశ భవిష్యత్తును నిర్మించడానికి సిద్ధంగా ఉంటారు.

రామ శంకర్ దూబే,
న్యూఢిల్లీ లోని జాతీయ విద్యా ప్రణాళిక నిర్వహణ సంస్థ ఛాన్సలర్