PUBLIC WIFI

‘పీఎం-వాణి’: పబ్లిక్ వై-ఫైలో భారత్ పైచేయి

PUBLIC WIFIభారతదేశ పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌ను మరింత క్రమబద్దం చేసేందుకు టెలికమ్యూనికేషన్ల శాఖ 2026 మే 22న ఒక సరికొత్త సర్క్యులర్‌ను జారీ చేసింది. ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించిన గణాంకాల ప్రకారం, ‘ప్రధాన మంత్రి వై-ఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్’ (PM-WANI) కింద క్రియాశీలంగా ఉన్న హాట్‌స్పాట్‌ల సంఖ్య 2025 నవంబర్ 26 నాటికి 3,91,599 కి చేరింది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 2.45 కోట్ల మంది వినియోగదారులు సుమారు 58.64 పెటాబైట్ల డేటాను వినియోగించుకున్నారు. అయితే, ఈ సంఖ్యల కంటే కూడా ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న ఉద్దేశం అత్యంత విశిష్టమైనది. పీఎం-వాణి ద్వారా ఎలాంటి లైసెన్స్, ఫీజు లేదా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అవసరం లేకుండానే ఒక సాధారణ టీకొట్టు యజమాని, కిరాణా వ్యాపారి లేదా చిన్న తరహా వ్యాపారాలు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌గా మారవచ్చు. వికేంద్రీకృత, పరస్పర అనుసంధాన (ఇంటర్-ఆపరబుల్) పబ్లిక్ మౌలిక సదుపాయాల విధానంతో కూడిన ఈ నమూనా.. అమెరికాకు చెందిన భారీ సబ్సిడీల మార్కెట్ మోడల్‌కు, చైనాకు చెందిన కఠినమైన ప్రభుత్వ నియంత్రణ, గుర్తింపు ఆధారిత వ్యవస్థకు పూర్తిగా భిన్నంగా నిలుస్తుంది.

పీఎం-వాణి ప్రజోపయోగ వస్తువులను/సేవలను అందించడంలో విశిష్టమైన భారతీయ శైలికి నిదర్శనం. గతంలో యూపీఐ, ఆధార్ వంటి విప్లవాత్మక వ్యవస్థలను అందించిన నమూనానే ఇక్కడా కనిపిస్తుంది. ఇందులో ప్రభుత్వం ఒక సన్నని, బహిరంగ వ్యవస్థను మాత్రమే నిర్మించి, ఆపై కోట్లకొద్దీ ప్రైవేట్ భాగస్వాములు అందులో సేవలందించేందుకు వీలుగా వెనక్కి తప్పుకుంటుంది. పీఎం-వాణి పథకానికి కేంద్ర మంత్రివర్గం 2020 డిసెంబర్ 9న ఆమోదం తెలిపింది. దీని నిర్మాణం ప్రధానంగా నాలుగు పరస్పర అనుసంధాన పాత్రలపై ఆధారపడి ఉంటుంది:

పబ్లిక్ డేటా ఆఫీస్ (PDO): ఇది స్థానికంగా ఉండే ఒక దుకాణం, కియోస్క్ లేదా చిన్న వ్యాపార సంస్థ. ఇది భౌతికంగా వై-ఫై యాక్సెస్ పాయింట్‌ను నిర్వహిస్తూ వినియోగదారులకు బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తుంది.

పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్ (PDOA): ఇది వినియోగదారుల ధ్రువీకరణ, అకౌంటింగ్, బహుళ పిడిఓలను ఒకచోటికి చేర్చే పనులను చూసుకుంటుంది.

యాప్ ప్రొవైడర్స్: వినియోగదారులు తమకు సమీపంలో అందుబాటులో ఉన్న వై-ఫై హాట్‌స్పాట్‌లను కనుగొని, వాటికి కనెక్ట్ అవ్వడానికి అవసరమైన మొబైల్ అప్లికేషన్లను వీరు రూపొందిస్తారు.

సెంట్రల్ రిజిస్ట్రీ: 1984లో టెలికాం శాఖ పరిధిలో ఏర్పాటైన స్వయంప్రతిపత్తి పరిశోధనా సంస్థ ‘సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్’ (C-DoT) దీనిని నిర్వహిస్తుంది. ఇది భాగస్వాములందరి రికార్డులను భద్రపరుస్తుంది.

ఈ పథకాన్ని ప్రకటించిన సమయంలో, అప్పటి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పిడిఓలకు ఎటువంటి లైసెన్స్, ప్రవేశ రుసుము లేదా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అవసరం లేదని, అలాగే అగ్రిగేటర్ల రిజిస్ట్రేషన్ దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లోనే పూర్తవుతుందని తెలిపారు. టెలికాం రంగం అంటేనే భారీ లైసెన్సులు, భారీ పెట్టుబడులతో కూడుకున్నదనే భావన ఉన్న తరుణంలో ఒక సాధారణ కిరాణా దుకాణం తన వద్ద మిగిలి ఉన్న బ్యాండ్‌విడ్త్‌ను ఇతరులకు విక్రయించుకునేలా అనుమతించడం ఒక విప్లవాత్మక మార్పు. ఇప్పుడు అదనపు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉన్న ఏ ఇల్లైనా లేదా వ్యాపారమైనా హాట్‌స్పాట్‌గా మారి, వచ్చేపోయే వినియోగదారుల ద్వారా ఆదాయాన్ని ఆర్జించవచ్చు. తద్వారా వృధాగా ఉన్న మౌలిక వసతులు ఆదాయ వనరుగా మారుతున్నాయి.

వృద్ధికి బాటలు‌ వేసిన సంస్కరణలు

2018 నాటి జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్ల విధానం 2020 నాటికి 50 లక్షలు, 2022 నాటికి ఒక కోటి పబ్లిక్ వై-ఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత ‘భారత్ 6జి విజన్’, 2030 నాటికి ఐదు కోట్ల హాట్‌స్పాట్‌ల లక్ష్యాన్ని పునరుద్ఘాటించింది. అయితే, ఈ లక్ష్యాలతో పోలిస్తే మొదట్లో విస్తరణ చాలా తక్కువగా ఉంది. 2024 మధ్య నాటికి దాదాపు 2.07 లక్షల హాట్‌స్పాట్‌లు మాత్రమే ఏర్పాటయ్యాయి. టెలికాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు వసూలు చేసే అధిక ‘బ్యాక్‌హాల్ కనెక్టివిటీ’ ఖర్చులే ఈ మందగమనానికి ప్రధాన కారణమని గుర్తిస్తూ, విస్తరణ లక్ష్యాల కంటే చాలా వెనుకబడి ఉందని టెలికాం శాఖ స్వయంగా అంగీకరించింది. ఈ పరిస్థితిని మార్చడానికి వరుసగా తీసుకువచ్చిన సంస్కరణలు పథకానికి కొత్త ఊపునిచ్చాయి. 2024 సెప్టెంబర్ 16న టెలికాం శాఖ చేసిన మార్పుల ద్వారా పిడిఓలు సాధారణ ఎఫ్టిటిహెచ్ (ఫైబర్ టు హోమ్) కనెక్షన్‌ను ఉపయోగించుకోవడానికి అనుమతి లభించింది. ఇది మౌలిక సదుపాయాల ఖర్చులను తగ్గించడమే కాకుండా, ప్రస్తుతం ఇళ్లు, వాణిజ్య సంస్థలలో ఉన్న వై-ఫై సెటప్‌లను ఈ విస్తృత నెట్‌వర్క్‌లో విలీనం చేయడానికి వీలు కల్పించింది. ఇది వివిధ అగ్రిగేటర్ల మధ్య రోమింగ్‌ను కూడా అనుమతిస్తుంది; అంటే ఒక యాప్‌లో నమోదైన వినియోగదారుడు మరొక అగ్రిగేటర్ నిర్వహించే హాట్‌స్పాట్‌కు సాఫీగా కనెక్ట్ అవ్వవచ్చు.

భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) 2025 జూన్ 16 న ఒక ఉత్తర్వు ద్వారా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు పీఎం-వాణి ఆపరేటర్ల నుంచి వసూలు చేసే ధరలపై గరిష్ట పరిమితిని విధించింది. 200 ఎంబిపిఎస్ వరకు ఉన్న రిటైల్ ఎఫ్టిటిహెచ్ ప్లాన్‌ల కోసం, ప్రొవైడర్లు సాధారణ వినియోగదారుల బ్రాడ్‌బ్యాండ్ ధర కంటే రెండు రెట్లకు మించి పబ్లిక్ డేటా ఆఫీస్ నుంచి వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. టెలికామ్ శాఖ గతంలో గుర్తించిన వాణిజ్యపరమైన అడ్డంకిని ఇది తొలగించింది. ఈ పరిమితి లేకపోతే ఐఎస్పి (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు) సాధారణ గృహ వినియోగదారుల కంటే హాట్‌స్పాట్ ఆపరేటర్ల నుంచి చాలా ఎక్కువ వసూలు చేసే అవకాశం ఉండేది. ఈ సంస్కరణల ఫలితంగానే 2024 మధ్యలో సుమారు 2.07 లక్షలుగా ఉన్న హాట్‌స్పాట్‌లు 2025 చివరి నాటికి దాదాపు 3.92 లక్షలకు చేరాయి. ఇందులో ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. మే 2026 నాటి తాజా సర్క్యులర్లు పీఎం-వాణి హాట్‌స్పాట్ పేర్లను ప్రామాణీకరించాయి, తద్వారా వినియోగదారులు అసలైన, సురక్షితమైన నెట్‌వర్క్‌లను సులభంగా గుర్తించగలరు. అలాగే క్యూఆర్ -ఆధారిత లాగిన్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. దీనివల్ల ఫోన్‌లోని కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లాప్‌టాప్‌ను సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. తక్కువ సమయం కనెక్టివిటీ అవసరమయ్యే వినియోగదారుల కోసం 15, 30 మరియు 60 నిమిషాల స్వల్పకాలిక ప్లాన్‌లను అందించాలని ఆపరేటర్లకు సూచించారు. 

‌చైనా నమూనాకు భిన్నమైన భారత్ విధానం 

అనుసంధానత విషయంలో చైనా విజయాలను తరచుగా ఒక ఉదాహరణగా పేర్కొంటారు. అక్కడ విస్తృతమైన పబ్లిక్ వై-ఫై వ్యవస్థ ఉన్న మాట వాస్తవమే. 2011 నుంచి బీజింగ్, షాంఘై, షెంజెన్, హాంగ్‌జౌ, గ్వాంగ్‌జౌ వంటి నగరాలు పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ భవనాలు, వాణిజ్య ప్రాంతాలు, పార్కులు, ఆసుపత్రులు, రవాణా కేంద్రాలలో ఉచిత పబ్లిక్ వై-ఫైని ప్రోత్సహించాయి. కానీ, కేవలం నెట్‌వర్క్ విస్తృతికి మాత్రమే ఈ పోలిక పరిమితం. చైనా నమూనా పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది; ఇది భారీ నిధులు కలిగిన ప్రభుత్వ సంస్థల ద్వారా నడుస్తుంది. చైనా టెలికాం, చైనా యూనికానిమ్, చైనా మొబైల్ వంటి మూడు ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజాలే దీనిని నియంత్రిస్తాయి, ఇక్కడ భారత్‌లా వికేంద్రీకృత ప్రైవేట్ మైక్రో-ప్రొవైడర్లు లేరు. మరీ ముఖ్యంగా, చైనాలో ఇంటర్నెట్ అందుబాటు ఒకరి గుర్తింపుతో ముడిపడి ఉంటుంది. చైనా సైబర్ సెక్యూరిటీ చట్టం ప్రకారం, ఇంటర్నెట్ వినియోగానికి నిజమైన పేరుతో గుర్తింపు (రియల్-నేమ్ ఐడెంటిఫికేషన్) తప్పనిసరి. దీని అర్థం ఏమిటంటే, అక్కడ పబ్లిక్ వై-ఫై లాగిన్ అవ్వడానికి చైనా సెల్‌ఫోన్ నంబర్, ఎస్ ఎంఎస్ వెరిఫికేషన్ అవసరమవుతాయి. ఈ మొత్తం వ్యవస్థ వారి ‘గ్రేట్ ఫైర్‌వాల్’ వెనుక ఉండి, సెన్సార్‌షిప్, నిఘా నీడలో పనిచేస్తుంది. ఇది అనేక విదేశీ వెబ్‌సైట్లు, అప్లికేషన్‌ల వినియోగాన్ని అడ్డుకుంటుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే, చైనా విస్తృత పరిధితో ప్రభుత్వ నిఘా సాధనంగా పబ్లిక్ కనెక్టివిటీని అందిస్తుంది. ఇది నియంత్రణ, ట్రాకింగ్‌పై ఆధారపడి ఉంటుంది తప్ప, పౌరుల నేతృత్వంలోని స్వేచ్ఛా వ్యవస్థ కాదు. పీఎం-వాణి దీనికి పూర్తి విరుద్ధం; ఇది ఇంటర్నెట్ అందించే బాధ్యతను ప్రైవేట్ పౌరులకు ఇచ్చి, వ్యవస్థను పూర్తిగా పారదర్శకంగా, స్వేచ్ఛగా ఉంచుతుంది.

‌అమెరికా నమూనా వైఫల్యం

అమెరికాలో దీనికి పూర్తి భిన్నమైన సమస్య ఉంది. అక్కడ అసలు పీఎం-వాణి వంటి జాతీయ పబ్లిక్ వై-ఫై సౌకర్యం ఏదీ లేదు. అక్కడ 2021 మౌలిక సదుపాయాల చట్టం కింద రూపొందించిన 42 బిలిన్ డాలర్ల ‘బ్రాడ్‌బ్యాండ్ ఈక్విటీ, యాక్సెస్ అండ్ డిప్లాయ్‌మెంట్’ (బిఇఏడి) కార్యక్రమం ఒక ప్రతిష్టాత్మక ప్రయత్నం. కానీ బిఇఏడి నిధుల ద్వారా నిర్మించే నెట్‌వర్క్ ఉమ్మడి పబ్లిక్-యాక్సెస్ సదుపాయం కాదు; ఒక చిన్న దుకాణాన్ని కనెక్టివిటీ కేంద్రంగా మార్చడానికి లైసెన్స్ లేని ఎటువంటి PDO వంటి వ్యవస్థ అక్కడ లేదు. ట్రంప్ హయాంలో ఈ కార్యక్రమం అనేక ఒడిదుడుకులకు లోనైంది, దీనివల్ల లక్షలాది ప్రాంతాలు అర్హత కోల్పోయాయి. నిధులలో ఎక్కువ భాగం స్టార్‌లింక్ వంటి శాటిలైట్ ప్రొవైడర్ల వైపు మళ్లాయి. అదే సమయంలో ప్రజలకు ఇంటర్నెట్‌ను చౌకగా అందించే ‘చౌకైన అనుసంధానత కార్యక్రమం’ గడువు ముగిసింది. అమెరికాలో బ్రాడ్‌బ్యాండ్ ప్రాథమికంగా ప్రైవేట్ రంగం ద్వారా పూర్తిగా వాణిజ్య ప్రాతిపదికన మాత్రమే విస్తరించబడుతోంది. అక్కడ కనెక్టివిటీని సబ్సిడీ ఇవ్వాల్సిన ఒక మార్కెట్‌గా చూస్తారు తప్ప, నిర్వహించాల్సిన ‘డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయం’గా పరిగణించరు.

‌‌భారతీయ కోణం

ఈ మూడు నమూనాలను పక్కపక్కనే పెట్టి చూస్తే భారతదేశ ఆధిపత్యం స్పష్టమవుతుంది. చైనా ప్రభుత్వ యాజమాన్యంలో, అసలు పేరు నిఘా ద్వారా పబ్లిక్ వై-ఫై అందిస్తోంది. అమెరికా ఒక ఏకీకృత పబ్లిక్ సదుపాయం లేకుండా, అస్తవ్యస్తంగా ఉన్న ప్రైవేట్ మార్కెట్‌లోకి కోట్ల డాలర్లను కుమ్మరిస్తోంది. కానీ, పీఎం-వాణి పరస్పర అనుసంధానాన్ని, కేంద్రీకృత రిజిస్ట్రీని నిర్వచించే ప్రభుత్వానికి చెందిన ఒక సరళమైన ప్రోటోకాల్ (వ్యవస్థ). దీని కింద అతి చిన్న దుకాణదారుడితో సహా వికేంద్రీకృత ప్రైవేట్ భాగస్వాములు లైసెన్స్ లేకుండా, నిర్ణీత సరసమైన ధరలకే పోటీ పడుతూ నెట్‌వర్క్‌ను నిర్మిస్తున్నారు. యూపీఐ, ఆధార్ ద్వారా ప్రపంచ సాంకేతిక-విధాన రంగాలలో భారతదేశాన్ని ఆదర్శప్రాయంగా నిలిపిన డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాల విధానమే ఇక్కడా పని చేస్తోంది. ఇక్కడ ప్రభుత్వం నెట్‌వర్క్‌ను సొంతంగా కలిగి ఉండదు లేదా హాట్‌స్పాట్‌లను నడపదు; ఇది కేవలం పరస్పర అనుసంధాన నియమాలను నిర్దేశించి, పక్కకు తప్పుకుంటుంది. దీనివల్ల ప్రయోజనాలు రెండు విధాలుగా ఉన్నాయి: హాట్‌స్పాట్‌లను హోస్ట్ చేసే కోట్లమంది మంది సూక్ష్మ-వ్యవస్థాపకులకు అదనపు ఆదాయం, సామాన్య ప్రజలకు సరసమైన, సురక్షితమైన ఇంటర్నెట్ సదుపాయం లభిస్తాయి. డిజిటల్ అంతరాన్ని ఎలా పూడ్చాలనే దానిపై ప్రపంచ దేశాలు మల్లగుల్లాలు పడుతున్న తరుణంలో భారతదేశం ఏకఛత్రాధిపత్యం లేదా సంపూర్ణ స్వేచ్ఛా మార్కెట్ కాకుండా ఒక సరికొత్త నమూనాను ప్రదర్శిస్తోంది; ఇది ఇంటర్నెట్ సదుపాయాన్ని బహిరంగంగా, పోటీతత్వంతో వికేంద్రీకృత మార్గాల ద్వారా అందించే ఒక ప్రజోపయోగ వస్తువుగా పరిగణిస్తుంది. చైనా నియంత్రణ లేదా అమెరికా గందరగోళ విధానాలకు భిన్నంగా పీఎం-వాణి ఒక మెరుగైన మూడవ ప్రత్యామ్నాయాన్ని ప్రపంచానికి అందిస్తోంది.

వివేక్ కుమార్