Enterprenuer

ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మిస్తున్న పారిశ్రామికులు

2020లో కోవిడ్-19 మహమ్మారి ప్రజల జీవితాలను, జీవనోపాధిని దెబ్బ తీసినప్పుడు ఆర్థిక పునరుజ్జీవనం కేవలం పెద్ద పరిశ్రమలకే పరిమితం కాకూడదని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించారు. అది చిన్న తరహా ఉత్పత్తిదారులకు, సంస్థలకు, ముఖ్యంగా గ్రామాలు, చిన్న పట్టణాలలో పనిచేసే వారికి కూడా చేరాల్సిన అవసరం ఉందని ఆయన గ్రహించారు. ఈ ఉద్దేశంతోనే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద అదే ఏడాది ‘ప్రధానమంత్రి సూక్ష్మస్థాయి  ఆహార శుద్ధి పరిశ్రమల అధికారికీకరణ పథకం’ (PMFME)ప్రారంభించారు.  అధికారిక ఆర్థిక రుణాలు, సంస్థాగత మద్దతు లేక చాలా కాలంగా దూరంగా ఉండిపోయిన ఆహార ఆర్థిక వ్యవస్థలోని ఒక రంగానికి ఇది ఊతమిచ్చింది. ఇప్పటికే కొంతమందికి ఉపాధి కల్పిస్తూ, ఉత్పత్తి చేస్తూ విక్రయాలు సాగిస్తున్నప్పటికీ వ్యాపారాన్ని విస్తరించడానికి అవసరమైన మూలధనం లేదా మార్గదర్శకత్వం లేని సూక్ష్మస్థాయి ఉత్పత్తిదారులను ఇది లక్ష్యంగా చేసుకుంది. స్వయంగా పరిశ్రమలను నిర్మించుకోవాలనుకునే వ్యక్తుల నుంచే దేశ వృద్ధి ప్రారంభం కావాలనే ప్రధాని మోదీ బలమైన నమ్మకానికి ఈ పథకం అద్దం పడుతోంది.

PMFME  పథకం కింద మంజూరైన రుణాలు  ఇప్పుడు రెండు లక్షల మైలురాయిని దాటాయి. ఈ మైలురాయి ఎంతో కీలకమైనది, ఎందుకంటే దీని వెనుక అధికారిక రుణ వ్యవస్థలోకి ప్రవేశించి, తమ కాళ్ళపై తాము నిలబడేందుకు నిజమైన అవకాశాన్ని దక్కించుకున్న పారిశ్రామికులు  ఉన్నారు. ఇది ఏంటో గర్వించాల్సిన క్షణం.  ఈ అవకాశాన్ని సాధ్యం చేసిన వారిని గౌరవించాల్సిన సందర్భం. వీరిలో మొదటి వ్యక్తి జమ్నాలాల్ పాటీదార్. PMFME కింద మొట్టమొదటి సారిగా రుణం మంజూరైంది ఈయనకే. పదో తరగతి వరకు మాత్రమే చదువుకుని, ఆహార శుద్ధి రంగంలో ఎటువంటి ముందస్తు అనుభవం లేని ఈ పారిశ్రామికుడు 10 లక్షల రూపాయల పెట్టుబడితో ధనియాల శుద్ధి యూనిట్‌ను ప్రారంభించారు. ఈ పథకం అండతో ఆయనకు ఆర్థిక సహాయం, యంత్రాలు, మార్గదర్శకత్వం లభించాయి. ఆయన ఆలోచన ఒక వాస్తవ సంస్థగా రూపాంతరం చెంది నేడు ఐదుగురికి పైగా ఉపాధినిస్తోంది. ఆయన కథ ఒక సరళమైన విషయాన్ని స్పష్టం చేస్తోంది. పారిశ్రామికుడిగా మారడం  కేవలం ఉన్నత కుటుంబాల్లో పుట్టిన వారికో లేదా ఉన్నత చదువులు చదివిన వారికో పరిమితమైన హక్కు కాదు. ఒక ఆలోచన ఉన్న వ్యక్తికి దాన్ని ఆచరణలో పెట్టడానికి అవసరమైన ఆర్థిక సాయం, సాంకేతికత, మద్దతు లభిస్తున్నాయా లేదా అనేదానిపైనే అది ఆధారపడి ఉంటుంది.

సాధారణ భారతీయులు వ్యాపారాలు స్థాపించేలా, ఇతరులకు ఉపాధి కల్పించేలా చేయడం ద్వారా ‘ఉద్యోగాలు కోరే వారిని, ఉద్యోగాలు ఇచ్చే వారిగా మార్చాలి’ అనే ప్రధాని మోదీ ‘దార్శనికతను PMFME ముందుకు తీసుకువెళుతోంది. ప్రత్యేకమైన స్థానిక ఉత్పత్తులను తయారు చేసే కోట్లమంది  నైపుణ్యం కలిగిన సూక్ష్మస్థాయి  ఉత్పత్తిదారులకు భారత్ ఎప్పటినుంచో నిలయంగా ఉంది. కానీ వారిలో చాలామందికి సరసమైన వడ్డీకి రుణాలు, ఆధునిక సాంకేతికత, నాణ్యతా ప్రమాణాల ధృవీకరణ, వ్యవస్థీకృత మార్కెట్లలోకి ప్రవేశించే మార్గాలు లేవు. రుణంతో ముడిపెట్టిన సాయం, సామర్థ్య పెంపు, ఉమ్మడి మౌలిక సదుపాయాలు, బ్రాండింగ్, మార్కెట్ అనుసంధానం ద్వారా ఈ లోపాలను సరిదిద్దడానికి ఈ పథకం రూపుదిద్దుకుంది. అలాగే అనధికారికంగా ఉన్న సూక్ష్మస్థాయి  పరిశ్రమలను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొచ్చి, అవి ఎదిగేందుకు నిజమైన అవకాశాన్ని కల్పించింది. ఈ మార్పుకు నేతృత్వం వహిస్తున్న ప్రధాన శక్తులలో మహిళలు ముందు వరుసలో ఉన్నారు. మంజూరైన రెండు లక్షల రుణాలలో దాదాపు 44 శాతం మహిళల నాయకత్వంలోని పరిశ్రమలకే దక్కాయి.

అంతేకాకుండా నాలుగు లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాల సభ్యులు తమ వ్యాపారాలను బలోపేతం చేసుకోవడానికి, నవీకరించుకోవడానికి  ప్రారంభ మూలధనం (సీడ్ క్యాపిటల్) పొందారు. మొత్తంగా ఈ పథకం రూ.20,300 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించింది, దాదాపు ఆరు లక్షల జీవనోపాధి అవకాశాలను సృష్టించింది. ఉద్యమ్ నమోదు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ, జిఎస్‌టి  నిబంధనలు  పాటించడం ద్వారా 75,000 కి పైగా  యూనిట్లు అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి అడుగుపెట్టాయి. చాలామంది మహిళలకు ఇది ఇంట్లో లేదా సమాజంలో ఉపయోగించిన నైపుణ్యాలను, నిధులు, సాంకేతికత, విస్తృత మార్కెట్ అందుబాటులో ఉండే గుర్తింపు పొందిన పరిశ్రమలుగా మార్చడానికి ఉపయోగపడింది. రాబోయే కాలంలో కూడా మరింత మంది మహిళలు ఈ మార్పును సాధించేలా సాయపడటమే మన ప్రధాన లక్ష్యంగా ఉండాలి. ఈ గణాంకాలలో ప్రతి ఒక్క దాని వెనుక ఒక విస్తృతమైన ప్రయోజనం ఉంది. నడుస్తున్న ఒక చిన్న పరిశ్రమ రైతు పంటను కొనుగోలు చేస్తుంది, కోత అనంతర నష్టాలను తగ్గిస్తుంది, ఆ ఉత్పత్తి విలువ ఎక్కువ భాగం స్థానికంగానే ఉండేలా చూస్తుంది. ఒక స్థానిక పంట బ్రాండెడ్ ఉత్పత్తిగా మారుతుంది. గృహ నైపుణ్యం స్థిరమైన ఉపాధిగా మారుతుంది. కాలక్రమేణా ఒక జిల్లా తను తయారుచేసే ఉత్పత్తి ద్వారా గుర్తింపు పొందుతుంది. ఒక్కో పరిశ్రమ ద్వారా ‘వోకల్ ఫర్ లోకల్’ (స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం) ఆచరణలో కనిపిస్తున్న తీరు ఇది.

PMFME మైలురాయిని రెండు లక్షలకు చేర్చిన ఆ రుణం రాంచీకి చెందిన ఇందర్‌జీత్ సింగ్ కు మంజూరైంది. ఆయనొక బేకరీని నిర్మిస్తున్నారు. తన కేకులు, పేస్ట్రీలు ఏదో ఒక రోజు జార్ఖండ్ అంతటా గుర్తింపు పొందాలని కలలు కంటున్నారు. ఇంతకుముందు చెప్పిన పాటీదార్ లాగే ఈయన కూడా ఒక చిన్న వ్యాపారం, పెద్ద ఆశయంతో ఈ పథకం అండతో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. మొదటి రుణం మంజూరు స్థాయి నుంచి విజయవంతమైన పరిశ్రమ వైపు PMFME నడిపిస్తున్న వేలమంది మొదటి తరం పారిశ్రామికులలో ఈయన ఒకరు. ఈ ప్రయాణం ఎంత దూరం వెళ్తుందో పాటీదార్ చూపిస్తే, ఇది ఇంకా ఎంత వేగం పుంజుకుంటోందో సింగ్ నిరూపిస్తున్నారు. ముందున్న బాట స్వరూపం ఇది. సూక్ష్మస్థాయి ఉత్పత్తిదారులకు అధికారిక రుణాలు అందించడం  మొదటి విడత పని మాత్రమే. కాగా మంజూరైన ప్రతి రుణం  లబ్ధిదారు చేతికి అంది,  నిలదొక్కుకునే వ్యాపారంగా మారేలా చూడటం మరింత కష్టమైన, అంతే సంతృప్తినిచ్చే అసలైన పని. రుణం మంజూరు కావడం తలుపులు తెరుస్తుంది; కానీ ప్రతి పారిశ్రామికుడు/పారిశ్రామికురాలు  ఆ తలుపు దాటి లోపలి వెళ్ళి   శాశ్వతంగా నిలిచిపోయేది ఏదైనా నిర్మించుకునేలా సాయపడటమే మన పని.

PMFME తదుపరి దశను నిర్వచించేది ఈ ప్రక్రియే. మంచి భవిష్యత్తు ఉన్న పరిశ్రమలకు వేగంగా రుణాలు అందిస్తాం, మెరుగైన సాంకేతికత, ప్యాకేజింగ్‌ను అవలంబించడంలో సాయపడతాం, వారి మార్కెట్ పరిధిని విస్తరిస్తాం. అలాగే దేశీయంగా, విదేశాలలో కొనుగోలుదారులను చేరుకోవడానికి మరిన్ని పరిశ్రమలను సిద్ధం చేస్తాం. రుణం మంజూరు కావడానికి ముందే కాకుండా మంజూరైన తర్వాత కూడా మన పారిశ్రామికులకు తోడుగా ఉంటాం. ఆ మొదటి రుణాన్ని శాశ్వత జీవనోపాధిగా మార్చే స్థిరమైన మద్దతును అందిస్తాం. మొత్తంగా చూస్తే ఈ రెండు లక్షల రుణ మంజూర్లు కేవలం ఒక పరిపాలనాపరమైన మైలురాయి మాత్రమే కాదు. నిలదొక్కుకుంటున్న ప్రతి పరిశ్రమా  తన చుట్టూ ఉన్న ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అది సమీపంలోని పొలాల నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది, స్థానికంగా ఆదాయాన్ని సృష్టిస్తుంది, మరింత మంది మహిళలు,  యువత సొంతంగా వ్యాపారాలు నిర్మించుకునే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. పాటీదార్ ధనియాల ప్రాసెసింగ్ యూనిట్‌ను చూసినప్పుడు పాఠం చాలా సరళంగా స్పష్టమవుతుంది. PMFME కింద మొదటి రుణం మంజూరైంది ఎటువంటి పెద్ద ఫ్యాక్టరీ లేదా ప్రత్యేక డిగ్రీ లేని ఒక వ్యక్తికి. ఆయన వద్ద ఉన్నదల్లా ఒక ఆలోచన, కష్టపడాలన్న సంకల్పం మాత్రమే; ఈ పథకం ఆయనకు ఆ అవకాశాన్ని అందించింది. రెండు లక్షల రుణమంజూర్ల తర్వాత ఆ అవకాశం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికులకు చేరింది. ఇప్పుడు మన బాధ్యత ఏమిటంటే వారు నిలదొక్కుకునేలా, ఇతరులకు ఉపాధినిచ్చేలా, వారు ప్రారంభించిన చోటే అందరికీ ప్రయోజనం చేకూర్చేలా పరిశ్రమలను నిర్మించడంలో వారికి సహాయపడటమే.

చిరాగ్ పాశ్వాన్,
కేంద్ర ఆహార శుద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి