Nitin Nabin NRR

ప్రజా సమస్యలపై పోరాటమే బిజెపి రోడ్ మ్యాప్

Nitin Nabin Meetingప్రజా సమస్యలపై నిరంతరం ప్రజా పోరాటాలు చేయడమే బిజెపికి నిజమైన రోడ్ మ్యాప్ అని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పని చేయాలని ఆయన రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్ని మండలాల్లో, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం దిశగా విస్తృతంగా పని చేయాలని సూచించారు. ఆగస్ట్ 7న దిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన అత్యంత స్నేహపూర్వక వాతావరణంలో తెలంగాణ ప్రాంత నాయకులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణలో పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి పటిష్టత, రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడానికి అనుసరించాల్సిన రాజకీయ కార్యాచరణపై ఆయన రాష్ట్ర నాయకత్వానికి ఆయన మార్గనిర్దేశం చేశారు. సెప్టెంబర్ నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న గ్రాడ్యుయేట్ ఎన్నికలపైనా చర్చించారు. ఈ భేటీలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్రమంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్, రాష్ట్ర ఇంఛార్జ్ అభయ్ పాటిల్, బిజెపి రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, పార్టీ ఎంపీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 

సమావేశం అనంతరం ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ సంస్థాగత బలంతోనే రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించి, తెలంగాణలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసి మెరుగైన ఓటుబ్యాంకు సాధించామని, పార్లమెంటు ఎన్నికల్లోనూ ప్రజలు బిజెపిని ఆదరించారని గుర్తుచేశారు. ఎన్నికలకు ఇంకా వ్యవధి ఉన్నందున పలు పార్టీల నుంచి నాయకులు బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, సరైన సమయం చూసుకుని వారంతా పార్టీలోకి వస్తారని స్పష్టం చేశారు. రాబోయే డీలిమిటేషన్ తర్వాత స్థానాలు పెరిగినా, తెలంగాణలో బిజెపి మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2014 తర్వాత బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో తొలిసారి అధికారం సాధించి, బలమైన శక్తిగా ఎదిగామన్నారు. ఆ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో సంస్థాగతంగా బిజెపి చాలా బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 

వరంగల్-ఖమ్మం-నల్గొండ, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) నియోజకవర్గాల స్థానాలను బిజెపి కైవసం చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బిజెపి ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. జనసేన వంటి పార్టీలు జాతీయ స్థాయిలో ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నందున జాతీయ స్థాయి నాయకత్వం నిర్ణయిస్తుందని, తెలంగాణలో మాత్రం ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తేల్చిచెప్పారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులు పార్లమెంటులో ఖచ్చితంగా ఆమోదం పొందుతాయని, కాంగ్రెస్ లో ఉన్న డీలిమిటేషన్ మద్దతుదారులు కూడా వీటికి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉందన్నారు. బిజెపి ఏ మంచి నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. బిజెపి నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటే కూర్చొని చర్చించుకుని పరిష్కరించుకుంటామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. బిజెపిలో ‘పాత-కొత్త’ అనే భేదం లేదని, పార్టీలో చేరిన మరుసటి క్షణం నుంచే ప్రతి ఒక్కరూ కార్యకర్తగా, నాయకుడిగా పని చేస్తారని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. వివిధ రంగాల్లో జరుగుతున్న అవినీతిని ఎండగట్టడమే బిజెపి ముఖ్య ఎజెండా అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కోర్ కమిటీ సభ్యులతో చర్చించి పాదయాత్రలు, బస్సు యాత్రలు వంటి ప్రజా చైతన్య కార్యక్రమాలను రూపొందించి ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్తామని రాంచందర్ రావు వెల్లడించారు.

తెలంగాణపై హైకమాండ్‌ స్పెషల్ ఫోకస్‌

తెలంగాణ రాజకీయాల్లో బిజెపి జాతీయ నాయకత్వం కదలికలు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ వరుసగా తెలంగాణపై దృష్టి పెట్టడం, జూన్‌ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించడం, ఆ తర్వాత కూడా రాష్ట్ర నేతలతో దిల్లీలో సమీక్షలు నిర్వహించడం.. ఇవన్నీ కలిపి చూస్తే తెలంగాణను బిజెపి అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంటోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. జూన్‌ చివర్లో నితిన్‌ నబీన్‌ మూడు రోజుల తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు కేవలం బహిరంగ సభలకే పరిమితం కాలేదు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నేతలతో సమావేశాలు నిర్వహించారు. బూత్‌ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజా సమస్యల ఆధారంగా పోరాటాన్ని విస్తరించడం వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు.

ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పర్యటనలతో పాటు జాతీయ అధ్యక్షుడు నబీన్‌ రాష్ట్ర పర్యటన చూస్తే జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని స్పష్టమవుతుంది. ‘మిషన్‌ తెలంగాణ’లో భాగంగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సంస్థాగతంగా పార్టీని సిద్ధం చేసే దిశగా జాతీయ నాయకత్వం అడుగులు పడుతున్నాయి. తెలంగాణపై పర్యవేక్షణ కొనసాగిస్తూ నేతల మధ్య సమన్వయం పెంచే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో తాజా సమీక్షా సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం పెరిగింది. జాతీయ అధ్యక్షుడి స్థాయిలో వరుసగా ఫాలోఅప్‌ సమావేశాలు జరగడం, తెలంగాణపై సంస్థాగత అంశాలను దిల్లీ నుంచి పర్యవేక్షించడం చూస్తే, పార్టీ హైకమాండ్‌ తెలంగాణను దీర్ఘకాలిక రాజకీయ లక్ష్యంగా చూస్తోందనే సంకేతం స్పష్టంగా కనిపిస్తోంది.

బిజెపికి తెలంగాణలో ఇప్పటికే లోక్‌సభ స్థాయిలో గణనీయమైన ఓటు బేస్‌ ఉంది. హైదరాబాద్‌, ఉత్తర తెలంగాణతో పాటు పలు ప్రాంతాల్లో పార్టీ ప్రభావం పెరిగింది. అయితే ఆ బలాన్ని అసెంబ్లీ స్థాయి విజయంగా మార్చాలంటే స్థానిక నాయకత్వం మధ్య సమన్వయం, బూత్‌ స్థాయి నిర్మాణం, సామాజిక వర్గాల విస్తరణ, పట్టణ-గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర రాజకీయ కార్యక్రమాలు అవసరమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.