Indian Defence

హై-టెక్ ఆయుధాలు.. మేడిన్ ఇండియా

2026 మే 28న జరిగిన ఆర్మీనియా రిపబ్లిక్ డే సైనిక పరేడ్‌లో భారతదేశంలో తయారైన ఆయుధ వ్యవస్థలు అందరి దృష్టినీ ఆకర్షించాయి.  భారత్ లో తయారైన ఆయుధాలను కొనుగోలు చేసిన  దాదాపు 80 దేశాలలో ఆర్మేనియా ఒకటి కావడం ‘మేక్ ఇన్ ఇండియా’ సైనిక సాంకేతికతపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నమ్మకాన్ని సూచిస్తోంది. ఆర్మీనియా భారత్ నుంచి కొనుగోలు చేసిన ఈ ప్రతిష్టాత్మక ఆయుధ వ్యవస్థలలో – వేగవంతమైన, సుదూర లక్ష్యాలపై భారీ దాడులకు వాడే ‘పినాకా’ మల్టీ-బ్యారెల్ రాకెట్ లాంచర్లు,  అత్యంత చలనశీలత కలిగిన రెండు రకాల 155 మిమీ శతఘ్నులు, శత్రు విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులను అడ్డుకునేందుకు రూపొందించిన ‘ఆకాష్’ మధ్యశ్రేణి ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థలు, అత్యంత కచ్చితత్వంతో పనిచేసే ‘స్వాతి’  రాడార్లు ఉన్నాయి. ఇటీవలి కాలంలో సైనిక ఆయుధాల పరంగా భారతదేశానికి అతిపెద్ద, ప్రధాన ఎగుమతి మార్కెట్‌గా ఆర్మీనియా అవతరించింది.

మే 2025లో ప్రారంభమైన ‘ఆపరేషన్ సిందూర్’, భారత సాయుధ దళాలకు స్వదేశీ, అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను అందించడంలో దేశం సాధించిన అపారమైన పురోగతిని నిరూపించింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO)తో పాటు మరికొన్ని భారతీయ పారిశ్రామిక సంస్థలు దేశవ్యాప్త రక్షణ కోసం వ్యూహాత్మక, వైమానిక రక్షణ, వైమానిక నిఘా, సమగ్ర కమాండ్ అండ్ కంట్రోల్ విభాగాలు వినియోగించే  ఆధునిక ఆయుధ వ్యవస్థలను నిర్మించే సామర్థ్యాన్ని చాటుకున్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో నిర్ణయాత్మక పాత్ర పోషించిన డీఆర్డీవో  అభివృద్ధి చేసిన కీలకమైన స్వదేశీ వ్యవస్థలు ఇవే.

  • ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు: ఇందులో 96 శాతానికి పైగా భారతీయ భాగాలతో కూడిన ఆకాష్ క్షిపణి వ్యవస్థతో పాటు  మధ్య శ్రేణి క్షిపణులు ఉన్నాయి.
  • ఆకాష్‌తీర్ వ్యవస్థ: ఇది ఆటోమేటెడ్ గగనతల రక్షణ నియంత్రణ, రిపోర్టింగ్ వ్యవస్థ. వివిధ సెన్సార్లను, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను ఒకే మొబైల్ నెట్‌వర్క్‌గా అనుసంధానిస్తూ ఇది అసాధారణ  రీతిలో పని చేసింది.
  • సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులు: బ్రహ్మోస్ ఉత్పత్తి చేసిన ఈ క్షిపణులు, దాడుల సమయంలో శత్రువుల లక్ష్యాలను అత్యంత నిర్దుష్టంగా ఛేదించాయి.
  • కౌంటర్-డ్రోన్ టెక్నాలజీ: ఇందులో మ్యాన్-పోర్టబుల్ కౌంటర్-డ్రోన్ వ్యవస్థలు (మనుషులు స్వయంగా మోసుకెళ్తూ ప్రయోగించేవి.  డి4 యాంటీ-డ్రోన్ వ్యవస్థ ఉన్నాయి. శత్రువుల మానవరహిత వైమానిక వాహనాలను  జామ్ చేయడానికి, వాటిని నిర్వీర్యం చేయడానికి వీటిని విజయవంతంగా ఉపయోగించారు.

మాజీ డీఆర్డీవో నిపుణులు, ఉన్నతాధికారులు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం పనితీరును ప్రశంసించారు, ఈ సంఘర్షణలో సాధించిన విజయం సంస్థపై గతంలో వచ్చిన విమర్శలను పటాపంచలు చేసిందని వారు అన్నారు. ‘సిందూర్’ తర్వాత, డీఆర్డీవోకి చెందిన ఉత్పత్తులలో ఈ కిందివి ఉన్నాయి. 

భారతదేశ సుదర్శన చక్ర

ఇది 5,000 కిలోమీటర్ల పరిధిలోని బాలిస్టిక్ క్షిపణులను నిర్వీర్యం చేయగల సామర్థ్యం ఉన్న నెట్‌వర్క్-కేంద్రిత స్వదేశీ ఐరన్ డోమ్ రక్షణ కవచం. ఇది ‘మిషన్ సుదర్శన చక్ర’ లో ఒక పెద్ద ముందడుగు. బహుళ స్థాయి, సమగ్ర వైమానిక, క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మించడానికి భారత్ చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇది. ఇజ్రాయెల్  ఐరన్ డోమ్, అమెరికా  థాడ్  వ్యవస్థ తరహా లక్షణాలతో స్వదేశీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం దీని లక్ష్యం. దీని ద్వారా స్వల్ప శ్రేణి రాకెట్లు, డ్రోన్ల నుంచి దూరం ప్రయాణించే బాలిస్టిక్ క్షిపణి ముప్పుల వరకు అన్నింటినీ భారతదేశం ఎదుర్కోగలదు.

ప్రాజెక్ట్ కుశా

ఈ ప్రాజెక్ట్ కింద డీఆర్డీవో వివిధ దూరాల నుంచి వచ్చే ముప్పులను అడ్డుకోవడానికి  సుదూర ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ వంటి విస్తృత రక్షణ కవచాలపై కూడా పనిచేస్తోంది.

MIRV- అగ్ని 5

MIRV (మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్) ఒకే క్షిపణి వివిధ లక్ష్యాలపై బహుళ అణు బాంబులను మోసుకెళ్లి ప్రయోగించేలా చేసే ఒక అధునాతన బాలిస్టిక్ క్షిపణి సాంకేతికత. డిఆర్డిఓ అభివృద్ధి చేసిన అగ్ని-5 లో దీనిని చేర్చడం వల్ల భారత్ వ్యూహాత్మక క్షిపణి నిరోధక సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ‘మిషన్ దివ్యాస్త్ర’ కింద దీన్ని విజయవంతంగా పరీక్షించారు.  5,000-8,000 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉండే ఈ MIRV సామర్థ్యం గల అగ్ని-5, వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన తర్వాత విడి వార్‌హెడ్‌ (బాంబు) లను విడుదల చేస్తుంది. ఇది శత్రువుల క్షిపణి రక్షణ వ్యవస్థలను గందరగోళానికి గురిచేస్తూ, ఒకే సమయంలో అనేక లక్ష్యాలపై ఏకకాలంలో దాడులకు వీలు కల్పిస్తుంది.

శేషనాగ్ 150

శేషనాగ్-150 (నాగరాజ అని కూడా పిలుస్తారు) బెంగళూరుకు చెందిన న్యూస్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ (NRT)  అభివృద్ధి చేసిన స్వదేశీ, ఏఐ-ఆధారిత దూరశ్రేణి డ్రోన్. తక్కువ ఖర్చుతో కూడిన, అధిక ప్రభావం చూపే  దాడులను నిర్వహించేలా దీన్ని రూపొందించారు. ఇది 1,000 కిలోమీటర్లకు పైగా పరిధిని కలిగి ఉండి, 25-40 కేజీల బాంబును మోసుకెళ్లగలదు. ఐదు గంటల కంటే ఎక్కువ సమయం ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది. శత్రువుల రక్షణ వ్యవస్థలను ఉక్కిరిబిక్కిరి చేయడానికి దీన్ని గుంపుగా (స్వార్మ్స్) ఉపయోగిస్తారు. అధునాతన విజువల్ నావిగేషన్ సిస్టమ్‌లను ఉపయోగించి జిపిఎస్ లేని పరిసరాలలో కూడా పనిచేసేలా దీన్ని తయారుచేశారు.  దీనిని మార్పులు చేసిన టొయోటా హైలక్స్ పికప్ ట్రక్ వంటి మొబైల్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ప్రయోగించవచ్చు. తక్కువ ఖర్చుతో, సుదూరమైన, అత్యంత కచ్చితమైన దాడులను నిర్వహించడానికి ఈ డ్రోన్ ఉద్దేశించినది.

తార (TARA)  

2026 మే 7న డీఆర్డీవో, భారత వైమానిక దళం  కలిసి భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ గ్లైడ్ ఆయుధ వ్యవస్థ అయిన ‘తార’ (టాక్టికల్ అడ్వాన్స్‌డ్ రేంజ్ ఆగ్మెంటేషన్)  మొదటి పరీక్షను విజయవంతంగా నిర్వహించాయి. గైడెన్స్ లేని సాధారణ బాంబులను కచ్చితమైన గైడెడ్ మందుగుండు (PGMలు) గా మార్చడానికి దీనిని రూపొందించారు. ఆర్సీఐ (రిసెర్చ్ సెంటర్ ఇమారత్), ఇతర డీఆర్డీవో ల్యాబ్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ, ఇప్పుడు పారిశ్రామిక భాగస్వాములతో కలిసి ఉత్పత్తి దశలో ఉంది. ఐదు  కిలోమీటర్ల ఎత్తు నుంచి వదిలినప్పుడు, ఇది బాంబు పరిధిని 150 నుండి 180 కిలోమీటర్ల వరకు పెంచుతుంది. ఈ వ్యవస్థను ప్రయోగించిన తర్వాత రెక్కలు, తోక భాగాలు తెరుచుకుంటాయి.  

క్యాడెట్ (CADAT) కామికాజే డ్రోన్లు

భారత సైన్యం అభివృద్ధి చేసిన అధునాతన, మొబైల్, సాయుధ గగనతల రక్షణ  ప్లాట్‌ఫారమ్ అయిన ‘క్యాడెట్’ (కారియర్ ఎయిర్ డిఫెన్స్ ట్రాక్డ్) వ్యవస్థ ద్వారా భారత్ తన అసమాన యుద్ధ సామర్థ్యాలను వేగంగా పెంచుకుంటోంది. ముందుకు సాగుతున్న ట్యాంకు, శతఘ్ని దళాల రక్షణకు ఒక చోటే ఉండి  రక్షణ చర్యలు తీసుకునే స్థాయి నుంచి చురుగ్గా కదులుతూ గగనతలాన్ని రక్షించుకునే వ్యూహానికి మారడాన్ని సూచిస్తుంది. ఈ కామికాజే (ఆత్మాహుతి) డ్రోన్లలో 180 కిలోమీటర్ల పరిధి, గంటకు 450 కిలోమీటర్ల వేగం, ఐదు మీటర్ల కంటే తక్కువ టార్గెటింగ్ నిర్దుష్టత లేదా కచ్చితత్వం కలిగిన ‘పీస్‌కీపర్ డ్రోన్’ ఉంది. అలాగే సీఎస్ఐఆర్-ఎన్ఏఎల్ హెవీ డ్రోన్ 25 కేజీల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. ఇది తొమ్మిది గంటల ప్రయాణ సామర్థ్యాన్ని, 1,000 కిలోమీటర్ల గరిష్ట పరిధిని కలిగి ఉంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)  అభివృద్ధి చేసిన స్వదేశీ ‘నావిక్’ (నావిక్)  ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థను ఉపయోగించడం వల్ల ఈ డ్రోన్లు జామింగ్, స్పూఫింగ్‌లను సమర్థంగా ఎదుర్కోగలవు. 2022-2026 మధ్య కాలంలో భారత్ హై-టెక్ సైనిక ఆయుధ వ్యవస్థల ఎగుమతులు వేగంగా పెరిగాయి. మొత్తం రక్షణ ఎగుమతులు ఆర్థిక సంవత్సరం 2013-14లో రూ.686 కోట్ల నుంచి ఆర్థిక సంవత్సరం 2025-26 నాటికి రికార్డు స్థాయిలో రూ.38,424 కోట్లకు పెరిగాయి.  ప్రస్తుతం భారతదేశం 80కి పైగా  దేశాలకు ఆయుధాలను సరఫరా చేస్తోంది.

కర్నల్ అనిల్ భట్,
వీఎస్‌ఎమ్ (రిటైర్డ్), వ్యూహాత్మక వ్యవహారాల విశ్లేషకుడు, రక్షణ మంత్రిత్వ శాఖ, భారత సైన్యం మాజీ ప్రతినిధి