యుద్ధం ఎప్పుడు ఆపాలో తెలియడమూ ముఖ్యమే
మే 31న పదవీ విరమణ చేసిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ ఒక ఆంగ్ల వారపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ‘ఆపరేషన్ సిందూర్’ నేర్పిన పాఠాలు, భవిష్యత్తు యుద్ధ వ్యూహాలు, ప్రస్తుతం సాగుతున్న త్రివిధ దళాల ఏకీకరణ ప్రయత్నాలతో సహా పలు కీలక అంశాలపై మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:
ప్ర: ఆపరేషన్ సిందూర్ ముగిసిన ఏడాది గడిచిన నేపథ్యంలో అది నేర్పిన ప్రధాన పాఠాలు ఏమిటి?
జ: మనం ఇప్పటివరకు చేసిన అన్ని యుద్ధాల కంటే ‘సిందూర్’ భిన్నమైనది. ఇది కేవలం 88 గంటలు-అంటే దాదాపు నాలుగు రోజులు మాత్రమే సాగింది. వ్యూహాత్మక స్థాయిలో అత్యంత ముఖ్యమైన పాఠం ఏమిటంటే ‘ఎగ్జిట్ మేనేజ్మెంట్’ (యుద్ధం నుండి ఎప్పుడు తప్పుకోవాలి), అంటే ఒక ఘర్షణను ఎప్పుడు ఆపాలో తెలియడం. అలా లేకపోతే, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల్లో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది.
ఇక యుద్ధ నిర్వహణ స్థాయిలో నేర్చుకున్న ప్రధాన పాఠం సమన్వయం. ఇది క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది, శత్రువు ఏం చేస్తున్నాడు అనే విషయాలపై పరిస్థితులపై స్పష్టత ఇస్తుంది. ఇది ఉద్రిక్తతలను నియంత్రించడానికి, సరైన సమయంలో యుద్ధాన్ని ఆపడానికి నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుంది.
ప్ర: ఆపరేషన్ సిందూర్ మొదటి రోజున కొన్ని తప్పులు జరిగాయని మీరు పేర్కొన్నారు. దీనిని కాస్త వివరిస్తారా?
జ తప్పులు జరగని యుద్ధం అంటూ ఏదీ ఉండదు. వాటిని మనం మళ్లీ పునరావృతం చేయకుండా ఉండటమే ముఖ్యం. ఎవరైతే వేగంగా పరిస్థితులకు అనుగుణంగా మారుతారో వారే ఎప్పుడూ విజయం సాధిస్తారు. ఏం జరిగిందో చూసి, దానిని అర్థం చేసుకుని, తప్పులను సరిదిద్దుకుని మళ్లీ బరిలోకి దిగాలి. ఏదీ కూడా మీ దాడి చేసే స్ఫూర్తిని అడ్డుకోకూడదు. నైతిక స్థైర్యం దెబ్బతినకూడదు. ప్రమాదాలను ఎదుర్కొనే సామర్థ్యం, శత్రువును మళ్లీ వేటాడే గుణం—ఇవే ముఖ్యమైనవి.
నియంత్రణ ఎల్లప్పుడూ మన చేతుల్లోనే ఉండాలి, ఇది కూడా క్షేత్రస్థాయి పరిస్థితుల అవగాహనపైనే ఆధారపడి ఉంటుంది. మనం దాడులు చేసిన కొద్ది నిమిషాల్లోనే ఏ లక్ష్యాలను ఛేదించామో మనకు తెలుసు. కానీ, దీనికి విరుద్ధంగా శత్రువుకు మే 14 లేదా 15 వరకు తమ వైపు ఏం జరిగిందో కూడా తెలియదు. అందుకే, ఘర్షణ తీవ్రత పెరిగిన ప్రతి దశలోనూ సరైన సమాచారం ఉండటం వల్ల మనం పైచేయి సాధించాం, ఇది పరిస్థితులను అదుపు చేయడంలో మాకు సహాయపడింది.
ప్ర: ఈ ఆపరేషన్‌ను అత్యంత రహస్యంగా నిర్వహించడం విశేషం. ఇది ఎలా సాధ్యమైంది? దీని గురించి తెలిసిన వారికి ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు?
జ: సైన్యంలో విధి నిర్వహణకు సంబంధించి ఒక నియమావళి ఉంది—ఏదైనా ఒక విషయం రహస్యం అని చెబితే, అది రహస్యంగానే ఉంటుంది. కానీ దానికి మించి, మేము ఏప్రిల్ 22 (పహల్గామ్ దాడి), మే 7 మధ్య అనేక నిర్దిష్ట చర్యలు తీసుకున్నాం.
మేము పాక్షికంగా బలగాల సమీకరణ చేయాల్సి వచ్చింది; దానిని అత్యంత రహస్యంగా ఉంచాల్సి వచ్చింది. మా వాయు రక్షణ వనరులను సరైన స్థానాల్లో ఉంచాల్సి వచ్చింది. నౌకాదళం, సైన్యం, వైమానిక దళ సంపత్తిని, అన్నింటినీ ఎంతో రహస్యంగా తరలించాల్సి వచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా, మేము కేవలం లక్ష్యాల గురించే కాకుండా, ఆపరేషన్ సమయం, తేదీని కూడా అత్యంత రహస్యంగా ఉంచాం.
చివరికి అధికారులు ప్రయాణించిన విధానాలు (లాజిస్టిక్స్) కూడా దీనిని ప్రతిబింబిస్తాయి—సౌత్ బ్లాక్‌లో సమావేశాలకు హాజరు కావాల్సిన అధికారులు తమ అధికారిక కార్లను ఉపయోగించలేదు. మేము వేర్వేరు మార్గాలను, వేర్వేరు వాహనాలను ఉపయోగించాము, చివరికి మా సొంత కుటుంబాలకు కూడా తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నాము. రహస్యం అనేది అనేక స్థాయిలలో అమలు జరుగుతుంది: ఆపరేషన్ సమయం, తేదీ, బలగాల కదలికలు, అధికారుల దినచర్యలు వంటి అన్ని విషయాలలో దీనిని పాటించాము.
ప్ర: నౌకాదళం పోషించిన పాత్ర గురించి వివరిస్తారా? నౌకాదళ బలగాలు కేవలం 15 నిమిషాల్లో రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాయని వార్తలు వచ్చాయి కదా?
జ: ఆపరేషన్ సిందూర్ లో నౌకాదళం చాలా కీలకమైన పాత్ర పోషించింది. సముద్ర రంగంలో భారత్, పాకిస్తాన్ల మధ్య అసమతుల్యత చాలా ఎక్కువ (భారత్ చాలా బలమైంది). మనం అప్పుడే ‘ట్రోపెక్స్’ సముద్ర విన్యాసాలు ముగించాం, అంటే నౌకాదళం 100 శాతం పూర్తి సంసిద్ధతతో ఉంది. నౌకలు తిరిగి రేవుకు చేరుకుని, నిజమైన మందుగుండు సామగ్రిని నింపుకొని సముద్రంలోకి వెళ్లాయి. మేము పెద్ద సంఖ్యలో ఉపరితల, జలాంతర్గామి యుద్ధ నౌకలను మోహరించగలిగాము. పాకిస్తాన్‌కు కేవలం నాలుగు లేదా ఐదు ఉపరితల యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామి మాత్రమే ఉన్నాయని నేను భావిస్తున్నాను, వాటిని కూడా వారు తమ తీరానికి దగ్గరగానే ఉంచుకున్నారు.
నౌకాదళం సముద్రంపై సాధించిన ఆధిపత్యం, శత్రువును అడ్డుకున్న తీరు నిర్ణయాత్మకమైనవి. ఈ ఆపరేషన్ మరికొంత కాలం కొనసాగుతుందని మేము ఊహించాము. కానీ వారు ఎనిమిది గంటల్లోనే వెనక్కి తగ్గారు. కాబట్టి ఒక రకంగా నౌకాదళానికి నేరుగా తలపడే అవకాశం లభించలేదు. ఒకవేళ ఇది ఎక్కువ కాలం కొనసాగి ఉంటే, వారు కచ్చితంగా నౌకాదళం చేతిలో చావుదెబ్బ తిని ఉండేవారు.
ప్ర: పాకిస్తాన్ సరిగ్గా ఎప్పుడు చర్చల కోసం అడిగింది? ఇందులో అమెరికా పాత్ర ఏమిటి?
జ: మే 10వ తేదీన పాకిస్తాన్ టైమ్ ప్రకారం తెల్లవారుజామున దాదాపు 1 గంటకు కూడా, తాము మరో 48 గంటల పాటు యుద్ధాన్ని కొనసాగిస్తామని, భారతదేశాన్ని మోకరిల్లేలా చేస్తామని వారు ప్రగల్భాలు పలికారు. కానీ ఉదయం 9.15 గంటల కల్లా వారు వెనక్కి తగ్గారు; తాము మాట్లాడాలని ఫోన్ చేశారు. అధికారికంగా చర్చలు మధ్యాహ్నం 3 గంటలకు జరిగాయి. అంతకుముందే నిర్ణయించిన కొన్ని ఆపరేషన్లను మేము మధ్యాహ్నం 12.30 వరకు కొనసాగించాము, ఆ తర్వాతే చర్చలు ప్రారంభమయ్యాయి.
అమెరికా పాత్రపై వ్యాఖ్యానించడం కష్టం, ఎందుకంటే అది పూర్తిగా వేరే విషయం. సైనిక పరంగా నేను చెప్పగలిగేది ఏమిటంటే, మన వైపు నుంచి ఎవరూ ఈ కాల్పుల విరమణను కోరి ఉండరు. ఏం జరిగినా అది పాకిస్తాన్ వైపు నుంచి జరిగి ఉండాలి, ఎందుకంటే మున్ముందు తమకు ఎలాంటి ముప్పు పొంచి ఉందో వారికి తెలుసు. అది వారికి ఎలా తెలిసిందో నేను చెప్పలేను.
ప్ర: పాకిస్తాన్ వ్యూహాత్మక అణ్వస్త్రాలను ప్రయోగిస్తుందనే నిజమైన ఆందోళన ఉందా? ఒకవేళ వారు అలా చేసి ఉంటే భారత్ కూడా అణు లక్ష్మణ రేఖను దాటి ఉండేదా?
జ: ఇది పూర్తిగా ఊహాజనితమైన ప్రశ్న. అణు ఆయుధాలు ఆటబొమ్మలు కావు. యుద్ధంలో వాటిని చివరిసారిగా ఉపయోగించింది 1945 ఆగస్టులో. దానికి నిర్దిష్ట కారణాలు ఉన్నాయి. సంప్రదాయబద్ధమైన సైనిక చర్యలు ప్రారంభమైన కొన్ని గంటల్లోనే అద్వాయుధాన్ని ఉపయోగించలేరు. ‘నో-ఫస్ట్-యూజ్’ (మేం మొదట అణ్వాయుధాలను ప్రయోగించం) అనే స్పష్టమైన విధానం మాకుంది, అలాగే శత్రువు ప్రయోగిస్తే ‘భారీ ప్రతీకారం’ తీర్చుకుంటామనే విధానం కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల వినియోగానికి సంబంధించి ఎక్కువ పరిమితులే ఉన్నాయి. ఎన్నో సంప్రదాయ సైనిక చర్యలు, వ్యూహాల తర్వాత గాని దేశాలు అణ్వాయుధాలను ఆశ్రయించవు.
ప్రశ్న: ఉక్రెయిన్, గాజా, ఇరాన్ యుద్దాలు భారత సైనిక ఆలోచనా విధానాన్ని ఎలా ప్రభావితం చేశాయి?
జ: ప్రతి యుద్ధం మనకు ఏదో ఒకటి నేర్పుతుంది. మనం అధ్యయనం చేసే ఏకైక ఘర్షణ ‘సిందూర్’ మాత్రమే కాదు. ఉక్రెయిన్ యుద్ధం డ్రోన్లను ఒక నిజమైన ‘బలాన్ని అనేక రెట్లు పెంచే అంశం’గా చూపించింది. భూమ్మీద, గగనతలంలో, జలాల్లో కూడా వీటి పాత్ర నిరూపితమైంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత డ్రోన్ల విస్తరణ అసాధారణంగా పెరిగింది; చిన్న, పెద్ద అని లేకుండా ప్రతి దేశం వాటిని అభివృద్ధి చేయడం ప్రారంభించింది.
ఇక ఇరాన్ పరిణామం మరొక కొత్త పాఠాన్ని నేర్పింది: అదే క్షిపణులు. పరిమితమైన నౌకాదళం, వైమానిక దళం, సైన్యం ఉన్నప్పటికీ, ఇరాన్ కేవలం బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, సుదూర శ్రేణి డ్రోన్లను ఉపయోగించి ఒక అగ్రరాజ్యానికి సమాధానం ఇవ్వగలిగింది. దీని ద్వారా ప్రతి చిన్న దేశం నేర్చుకున్న పాఠం ఏమిటంటే క్షిపణులు ప్రభావవంతమైనవి. మూడవ ప్రపంచ దేశాలలో క్షిపణి సామర్థ్యాల విస్తరణ ఇప్పుడు అనివార్యం. బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో నిండిపోయే భవిష్యత్ సైనిక వాతావరణానికి మనం సిద్ధం కావాలి. భవిష్యత్తు యుద్ధాలలో వాయు రక్షణ కేంద్ర బిందువు కావడం ఖాయం.
ప్ర: దీని అర్థం వైమానిక దళం ప్రాముఖ్యం పెరుగుతోందనా?
జ: వైమానిక దళం ఎల్లప్పుడూ వివిధ రకాలుగా కీలకపాత్ర వహిస్తుంది. ఇది సైన్యం, నౌకా దళాలకు మద్దతు ఇవ్వగలదు, అలాగే తన సొంత ఆపరేషన్లను కూడా నిర్వహించగలదు. కానీ మనం దీనిని ఎలా చూస్తున్నామనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొత్త రంగం తెరుచుకున్నప్పుడు, ఆ రంగంలో అసమతుల్యతలను సృష్టించడం సులభం. యుద్ధం పాత రంగాలకు మారడానికి ముందే మొదట ఆ కొత్త రంగంలోనే ఫలితం తేలిపోతుంది. గల్ఫ్ యుద్ధంలో గగనతలం (air) విషయంలో ఇది చూశాము, ఇప్పుడు సైబర్, అంతరిక్ష రంగాలలో దీనిని చూస్తాం.
వాయుశక్తి ప్రాముఖ్యం పెరుగుతోంది అంటే కేవలం విమానాలు మాత్రమే కాదు. డ్రోన్లు, రాకెట్లు, క్రూయిజ్ క్షిపణులు, హైపర్సోనిక్ (ధ్వని కంటే ఎక్కువ వేగంగా ప్రయాణించే) క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, మానవ సహిత, మానవరహిత వ్యవస్థలతో కూడిన మొత్తం ఆయుధాల్ని అర్థం. ఆ మొత్తం రంగం విస్తరిస్తోంది. యుద్ధంలో గగనతలం నిర్ణయాత్మకంగా మారుతోంది. ఈ వ్యత్యాసం చాలా ముఖ్యం.
ప్ర: ‘అగ్నిపథ్’ పథకం నిరంతరం విమర్శలను ఎదుర్కొంటూనే ఉంది. దీనిని సవరించే ఆలోచన ఏమైనా ఉందా?
జ: నియామకాలకు సంబంధించి ‘అగ్నిపథ్’ విధానం అత్యంత పారదర్శకమైనది, నిష్పక్షపాతమైనది. అంతకుముందు సైన్యంలోనే మేము వందల మంది అభ్యర్థులు పాల్గొనే భౌతిక ర్యాలీల ద్వారా రిక్రూట్ చేసేవాళ్ళం. మొదట అభ్యర్థులు శారీరక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి, ఆ తర్వాత రాత, వైద్య పరీక్షలు నిర్వహించేవారు. అగ్నిపథ్‌తో నియామకం పూర్తిగా ఆన్లైన్లో జరుగుతుంది. మీ పత్రాలు వెరిఫై అయితే, మీకు అవకాశం లభిస్తుంది. మీరు ఎలాంటి మానవ ప్రమేయం లేని ఆన్లైన్ పరీక్షకు హాజరవుతారు. ప్రతిభను నిష్పక్షపాతంగా నిర్ణయిస్తారు. మానవ ప్రమేయం తగ్గిన ఒక ముఖ్యమైన మార్పు ఇది.
శిక్షణ పొందిన సైనికులు నాలుగేళ్ల తర్వాత ఏ పనీ లేకుండా పౌర జీవితంలోకి తిరిగి వస్తారనే ఆందోళనపై నేను ఒక ప్రశ్న అడుగుతాను: పాత పద్ధతి నుంచి వచ్చిన మాజీ సైనికులలో ఎంతమంది సమాజానికి ముప్పుగా మారారు? మనుషులు 16, 17 సంవత్సరాల వయస్సులోనే సైనిక శిక్షణ పూర్తి చేసుకుని బయటకు వచ్చి మెరుగైన పౌరులుగా మారుతున్నారు. ఎన్సిసి క్యాడెట్లలో ఎంతమంది చెడ్డవారని తేలారు? వారు క్రమశిక్షణ, యూనిఫాం, జీవన విధానం కారణంగానే మెరుగైన పౌరులుగా మారుతున్నారు. అగ్నిపథ్‌కు కూడా ఇదే వర్తిస్తుంది. చాలా మందిని కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో, రాష్ట్ర పోలీసు దళాలు తీసుకుంటాయి. చాలా రాష్ట్రాలు ఇప్పటికే వారి కోసం సీట్లను రిజర్వ్ చేశాయి. సాంకేతిక నైపుణ్యం ఉన్నవారికి పరిశ్రమలలో, స్వయం ఉపాధిలో అవకాశాలు లభిస్తాయి. ప్రతి నాలుగు, ఐదు సంవత్సరాలకు నైపుణ్యాలు మారే సాంకేతిక-ఎక్కువగా ఉండే సైన్యానికి ఈ పథకం నిజానికి బాగా సరిపోతుంది.
ప్ర: సిందూర్ సమయంలో నిర్ణయాత్మకమైన వ్యత్యాసాన్ని చూపిన ఒక ఆయుధ వ్యవస్థను మీరు పేర్కొనవలసి వస్తే అది ఏది అవుతుంది?
జ: ఒకే ఒక్క ఆయుధ వ్యవస్థ పేరు చెప్పడం వల్ల అసలైన పాఠాలను విస్మరించినట్లు అవుతుంది. ఈ రోజుల్లో ప్లాట్‌ఫారమ్‌లు (ఆయుధాలు/వాహనాలు) అంతగా ముఖ్యం కాదు, ‘నెట్‌వర్క్‌లు’ ముఖ్యం. మనం ఎస్-400, ఆకాశ్, భుజంపై నుండి పేల్చే ఆయుధాలను నెట్వర్క్ చేయగలిగితే, వాయు రక్షణ అత్యంత బలీయంగా మారుతుంది.
దాడి ఆపరేషన్లకు కూడా ఇదే వర్తిస్తుంది. అందుకే నేను సమన్వయం, నెట్‌వర్కింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. దూరంగా ఉన్న లక్ష్యాలపై గురిచూసి చేసే దాడులు కచ్చితంగా అవసరమైనవి, వీటి విషయంలో బాగా ఆరితేరాం. కానీ మనకు సమాచారం, క్షేత్రస్థాయి అవగాహన ఎలా వచ్చింది? ఇది ఐఎస్ఆర్ (ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్, రికనైసెన్స్-నిఘా) వనరుల సమన్వయం, నెట్వర్కింగ్, ఐఎస్ఆర్ సదుపాయాల సామర్థ్యం ద్వారా సాధ్యమైంది. ప్లాట్‌ఫారమ్‌లు అవసరమే, కానీ సమన్వయం , నెట్వర్కింగ్ యుద్ధంలో గెలిపించే అంశాలు, ఏ ఒక్క వ్యవస్థ విడిగా దీన్ని సాధించలేదు.
ప్ర: ఆధునికీకరణకు సాంకేతిక నైపుణ్యంగల సైనికులు ఎక్కువగా అవసరమవుతారు. అటువంటి వారిని నియమించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
జ: ప్రతి సాయుధ దళ విభాగం ఇప్పటికే తన నియామక ప్రమాణాలలో సాంకేతిక విద్యార్హతలను పొందుపరిచింది. అగ్నిపథ్ కోసం, ఐటిఐ (పారిశ్రామిక శిక్షణ సంస్థలు) అర్హత కలిగిన అభ్యర్థులకు-అంటే వృత్తిపరమైన సాంకేతిక శిక్షణ ఉన్నవారికి-దరఖాస్తు చేసుకోవడానికి తగినంత సమయం కల్పించడం కోసం వయోపరిమితిని ప్రత్యేకంగా పొడిగించడం జరిగింది.
ఈ నాలుగేళ్ల వలయం నిజానికి ఇక్కడ ఒక సానుకూల అంశం. సాంకేతికత ప్రతి నాలుగు-ఐదు సంవత్సరాలకు, కొన్నిసార్లు అంతకంటే వేగంగా మారుతూ ఉంటుంది. ఈ రోజు రిక్రూట్ అయిన సైనికుడు నేటి ఆయుధ వ్యవస్థలపై శిక్షణ పొందుతాడు. నాలుగేళ్ల తర్వాత అతని తర్వాత వచ్చే వ్యక్తి అప్పటికే మారిన సాంకేతికతతో పరిచయం ఉన్నవాడై ఉంటాడు. అగ్నిపథ్ ఈ విషయంలో చాలా ఉపయోగపడుతుంది.

