Padma Awards

పద్మ అవార్డులను ‘ప్రజా పురస్కారాలు’గా మార్చిన మోదీ

“ప్రతి ఒక్కరూ గొప్పవారు కాగలరు, ఎందుకంటే ఎవరైనా సరే సేవ చేయవచ్చు” అని మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒకప్పుడు చెప్పారు. మహాత్మా గాంధీ కూడా సేవా భావం గురించి విస్తృతంగా మాట్లాడుతూ, “మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఉత్తమమైన మార్గం, ఇతరుల సేవకు మిమ్మల్ని మీరు అంకితం చేసుకోవడమే” అని నొక్కి చెప్పారు. ఒక విజయవంతమైన ప్రజాస్వామ్యం ప్రజా జీవితంలో సేవా నిరతిని ఒక భాగం చేస్తుంది. పద్మ అవార్డులు, ప్రజాసేవను గౌరవించడం ద్వారా ఈ ప్రజాస్వామ్య ఆదర్శాన్ని నెరవేర్చడానికి ఉద్దేశించినవి. అయితే, ఈ పౌర పురస్కార గ్రహీతల పేర్లు ప్రజల్లో ఎంతో ఆసక్తిని, కొన్నిసార్లు వివాదాలను రేకెత్తించినప్పటికీ, ఈ అవార్డుల ఒడిదుడుకుల చరిత్ర, చట్టపరమైన సవాళ్లు, రాజకీయ మార్పులు ప్రజల మనసులపై గాఢమైన ముద్ర వేయలేదు. 

రాజ్యాంగ సభ చర్చలు 

రాజ్యాంగ సభ పద్మ అవార్డుల గురించి ప్రత్యేకంగా చర్చించలేదు. ఈ మౌనానికి కారణం, బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదులను రద్దు చేయాలంటూ సభలో బలంగా వినిపించిన డిమాండు. ప్రాథమిక హక్కుల ఉపసంఘం నివేదిక ప్రకారం, అటువంటి వలసరాజ్యాల నాటి బిరుదులు — అవి వ్యక్తిగతమైనవి కావచ్చు లేదా వారసత్వంగా వచ్చినవి కావచ్చు — పౌరుల మధ్య కృత్రిమ తారతమ్యాలను సృష్టించడమే కాకుండా, వివిధ రకాల అసమానతలను శాశ్వతం చేశాయి. ప్రజా జీవితాన్ని అవినీతిమయం చేయడానికి ఈ బిరుదులు దుర్వినియోగం అవుతున్నాయని సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా వాదించారు. ఈ చర్చలు చివరకు రాజ్యాంగంలోని అధికరణం 18కి దారితీశాయి. ఇది రాష్ట్రాలు/ప్రభుత్వాలు బిరుదులను ప్రదానం చేయడాన్ని నిషేధిస్తుంది. దీనితో, మిగతా వారి కంటే తామే ఎక్కువ సమానమనే ప్రత్యేక వర్గం ఏదీ ఉండబోదని గణతంత్ర రాజ్యానికి భరోసా ఇచ్చింది.

స్వాతంత్ర్యానికి పూర్వపు బిరుదులను కొనసాగించడంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ, రాజ్యాంగ సభ కొంత సడలింపు వైఖరిని ప్రదర్శించింది. మొదటగా, సైనిక, విద్యాసంబంధిత వ్యత్యాసాలకు మినహాయింపులు ప్రతిపాదిస్తూ టి టి కృష్ణమాచారి తెచ్చిన సవరణలను ఆమోదించారు. ఇది సైనిక ర్యాంకులు, శౌర్య పురస్కారాలు, ‘మహామహోపాధ్యాయ’ (హిందూ తత్వశాస్త్రంలో విశిష్ట పండితులకు ఇచ్చేది) వంటి విద్యాసంబంధిత గౌరవ సూచక బిరుదులను ప్రదానం చేయడానికి ప్రభుత్వానికి వీలు కల్పించింది.

ప్రజా జీవితంలో అద్భుత ప్రతిభ, సేవ ద్వారా తమను తాము నిరూపించుకున్న పౌరులను ప్రభుత్వం గౌరవించడానికి ఒక వ్యవస్థ ఉండాల్సిన అవసరాన్ని ఎం ఆర్ మసాని వంటి సభ్యులు వ్యక్తం చేశారు. అందుకే ‘బిరుదులు’ (టైటిల్స్) ‘గౌరవాలు’ (ఆనర్స్) మధ్య ఒక స్పష్టమైన గీత గీశారు. ఒక బిరుదు అనేది ఒకరి పేరుకు ముందు లేదా వెనుక తగిలించుకునేదిగా ఉంటుందని, అయితే ఇతర (బ్రిటిష్ కాని) దేశాలు తమ పౌరులను వారి అద్భుతమైన పనితీరుకు గాను ‘గౌరవిస్తాయని’ శ్రీ ప్రకాశ వివరించారు.

పద్మ అవార్డుల స్థాపన

పాత కులీన వర్గాలు, భావాలకు అతీతంగా వ్యక్తుల సేవాతత్పరతను, సాధించిన విజయాలను గుర్తించాలన్న అభిప్రాయం బలపడి 1954లో ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా పద్మ అవార్డుల స్థాపనకు మార్గం సుగమం చేసింది. ప్రారంభంలో రెండు పౌర పురస్కారాలతో — భారతరత్న (అత్యున్నత పౌర పురస్కారం), మూడు అంచెల పద్మవిభూషణ్‌లతో — ప్రారంభమైన ఈ అవార్డులను ఒక సంవత్సరం తర్వాత పునర్వ్యవస్థీకరించి, నేడు మనకు తెలిసిన మూడు విభిన్న అవార్డులుగా మార్చారు: అవి పద్మ విభూషణ్ (అసాధారణ, విశిష్ట సేవకు), పద్మ భూషణ్ (ఉన్నత స్థాయి విశిష్ట సేవకు), పద్మశ్రీ (విశిష్ట సేవకు). రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలకు అనుగుణంగా, ఈ అవార్డుల పేర్లను లెటర్ హెడ్‌లపై, పోస్టర్లపై లేదా బిరుదులుగా ఉపయోగించడాన్ని నిషేధించారు.

రాజకీయ, చట్టపరమైన సవాళ్లు

అయితే ఈ అవార్డులు ప్రారంభమైన 15 సంవత్సరాల తర్వాత, పద్మ అవార్డులపై కొంత అసంతృప్తి వ్యక్తమైంది. ముఖ్యంగా, 1969లో గతంలో రాజ్యాంగ పరిషత్ ప్రాథమిక హక్కుల ఉపసంఘం అధ్యక్షుడిగా ఉన్న ఆచార్య జె బి కృపలానీ ఈ అవార్డులను రద్దు చేయాలని కోరుతూ ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ అవార్డులను ప్రతిభ ఆధారంగా ఇవ్వడం లేదని వాదిస్తూ, అవార్డుల ముసుగులో బిరుదులను మళ్లీ ప్రవేశపెడుతున్నారని ఆయన ఆరోపించారు. సుదీర్ఘ చర్చ తర్వాత ఆ బిల్లు వీగిపోయినప్పటికీ, అది తర్వాతి కాలంలో ఎదురైన చట్టపరమైన, రాజకీయ సవాళ్లకు బీజం వేసింది.

మొదటగా, కృపలానీ బిల్లు పేర్కొన్న కారణాల ఆధారంగా మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం 1978-79 సంవత్సరాలలో ఈ అవార్డులను నిలిపివేసింది. ఆ తర్వాత 1980లో ఈ అవార్డులను పునరుద్ధరించారు. రెండవది, ఈ అవార్డుల రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ హైకోర్టులలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల కారణంగా 1993-97 కాలంలో అవార్డుల ప్రదానం మళ్లీ నిలిచిపోయింది. చివరకు ‘బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1996)’ కేసులో సుప్రీంకోర్టు ఈ అవార్డులు రాజ్యాంగబద్ధమైనవేనని తీర్పు చెప్పడంతో ఈ వివాదానికి తెరపడింది. ఈ అవార్డులు చట్టపరమైన సవాళ్లను అధిగమించినప్పటికీ, వరుసగా వచ్చిన ప్రభుత్వాలు ఈ అవార్డులను కేవలం ప్రతిభకు కాకుండా, సిఫార్సులు, ప్రాబల్యానికి పరిమితం చేశాయనే భావన ప్రజల్లో పెరుగుతూ వచ్చింది.

పక్షపాతం నుంచి ‘ప్రజా పద్మ’ వైపు…

గత ప్రభుత్వాలు విఫలమైన లేదా పరిష్కరించడానికి రాజకీయ సంకల్పం లేని రంగాలలో సంస్కరణలను తీసుకురావడం నరేంద్ర మోదీ ప్రభుత్వ శైలిగా ఉంటూ వచ్చింది. పద్మ అవార్డుల వారసత్వాన్ని పునరుద్ధరించడం కూడా ఇందుకు నిదర్శనం. ఈ అవార్డులను ‘అత్యున్నత వర్గాల గుత్తాధిపత్యం’ నుంచి వాటి అసలైన సమగ్రత, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే స్ఫూర్తికి అనుగుణంగా ‘ప్రజల అవార్డులు’ గా మార్చడమే ప్రధాన సవాలుగా నిలిచింది.

సాధారణ పౌరుల కోసం పబ్లిక్ నామినేషన్ పోర్టల్‌ను తీసుకురావడం ద్వారా సిఫార్సులు లేదా ‘ద్వారపాలకుల’ సంస్కృతిని నిర్మూలించడం మోది ప్రభుత్వం తెచ్చిన ఒక ముఖ్యమైన సంస్కరణ. 

గతంలో, సిఫార్సులు ప్రభుత్వాలు, అధికారిక వర్గాల ద్వారా మాత్రమే వెళ్లేవి. గుర్తింపు లేకపోవడమే ఒక రకమైన బహిష్కరణగా భావించే సమాజంలో ఈ సంస్కరణ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది, 2014లో కేవలం 2,200 గా ఉన్న నామినేషన్లు 2025 నాటికి 50,000 పైగా పెరిగాయి. 

ఇది ఒక గొలుసుకట్టు ప్రభావాన్ని సృష్టించింది. 2014కి ముందు 16 ఏళ్ల సమాచారాన్ని పరిశీలిస్తే, 63 శాతం మంది అవార్డు గ్రహీతలు కేవలం ఏడు రాష్ట్రాల నుంచే రావడం ద్వారా భౌగోళిక అసమతుల్యత స్పష్టంగా కనిపించింది. ప్రజల భాగస్వామ్యంతో కూడిన ఈ నామినేషన్ ప్రక్రియ ఆ అసమతుల్యతను తొలగించడంలో సహాయపడింది, దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన వ్యక్తులకు తగిన గుర్తింపు లభిస్తోంది.

బిజెపి ప్రభుత్వం ఎంపిక ప్రమాణాలను కేవలం ‘అత్యత్భుత ప్రతిభ’ నుంచి ‘అట్టడుగు స్థాయి లో సేవ’ ను గుర్తించేలా విస్తరించింది. ఈ మార్పు ఇప్పుడు రాష్ట్రపతి భవన్‌లోని పౌర పురస్కారాల ప్రదానోత్సవాలలో కనిపించే ముఖాలలో ప్రతిబింబిస్తోంది-30,000 చెట్లను నాటిన కర్ణాటకలోని హలక్కి తెగకు చెందిన 84 ఏళ్ల నిరక్షరాస్యురాలైన పర్యావరణ ప్రేమికురాలు కానివ్వండి, విదేశీ వంగడాలపై తోటి రైతులకు మార్గదర్శకత్వం వహించిన నాగాలాండ్‌కు చెందిన ఒక సాధారణ పండ్ల రైతు, లేదా దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ అవార్డు గ్రహీతగా నిలిచిన తమిళనాడుకు చెందిన భరతనాట్యం నృత్యకారిణి కావచ్చు.

పరిశ్రమలు, సైన్స్ వంటి ప్రముఖ రంగాలలో రాణించిన వారితో పాటు, సమాజానికి తెరవెనుక మౌనంగా సేవ చేసిన ఈ ‘అనామక, అజ్ఞాత వీరులను’ రాష్టపతి భవన్ అదే ప్రతిష్టాత్మక మందిరాల్లో సత్కరించడం మన ‘భిన్నత్వంలో ఏకత్వాన్ని’ నొక్కిచెప్పే ఒక ప్రత్యేకమైన వేడుక. 2026 నాటి పౌర పురస్కారాల ప్రదానోత్సవం, దేశ నిర్మాణంలో ఒకరితో ఒకరు పోటీ పడటం కాకుండా, ఒకరికొకరు పరిపూరకంగా ఉండే ఈ విశిష్ట రూపానికి మరో నిదర్శనం.

తారిఖ్ మన్సూర్,
అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్,
ఉత్తరప్రదేశ్ శాసనమండలి నామినేటెడ్ సభ్యుడు