semiconductor

భారత్ ఆర్థిక వ్యవస్థకు మరో చోదక శక్తి సెమీ కండక్టర్లు

semiconductorభారత్, అమెరికాల మధ్య సెక్యూరిటీ సెమీ కండక్టర్ల తయారీకి కుదిరిన ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఒప్పందం కింద భారత్ నిర్మించే మొట్టమొదటి సెక్యూరిటీ సెమీ కండక్టర్ల అభివృద్ధి తయారీ కర్మాగారం అత్యధిక సెన్సింగ్ కమ్యూనికేషన్, అధిక వోల్టేజ్ విద్యుత్ సామర్థ్యం గల ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో భారత్ ను ఒక అగ్ర దేశంగా చేస్తుంది. ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను యుద్ధరంగంలో ఉపయోగించే ఆయుధాలు, ఇతర సామగ్రిలో ఉపయోగిస్తారు. బహుళ పదార్థాలతో కూడిన ఈ ఎలక్ట్రానిక్స్ చిప్ తయారీ ప్లాంట్ భవిష్యత్తులో చైనా, పాకిస్థాన్ లతో సహా దక్షిణ, ఆగ్నేయాసియాలో తన ప్రత్యర్థులతో యుద్ధం చేయాల్సి వస్తే భారత్ కు అదనపు భద్రతను కల్పిస్తుంది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విల్మింగ్టన్ ఒప్పందం శత్రు దేశాలకు భారత్ ఒక గట్టి సందేశాన్ని పంపించింది. ఈ ఒప్పందాన్ని విమర్శిస్తూ బీజింగ్ చేసిన విమర్శలే దీని పట్ల చైనా కమ్యూనిస్టు పార్టీ, చైనా అధ్యక్షుడు ఎంతగా కలవర పడుతున్నది వెల్లడిస్తున్నాయి. 

భారత్ సెమీ కండక్టర్ల కార్యక్రమం అమెరికా అంతరిక్ష దళాలు, అణ్వస్త్ర విభాగాలకు సహకరిస్తుంది. ఇన్ఫ్రా రెడ్, గాలియం నైట్రైడ్, సిలికాన్ కార్బైడ్ సెమీ కండక్టర్ల తయారీ భద్రత విషయంలో భారత్ కు ఎంతగానో తోడ్పడుతుంది. భారత్ భద్రతా వ్యవస్థను మరింత సమున్నతమైన స్థాయికి తీసుకెళ్లిన పౌర అణు విద్యుత్ ఒప్పందంతో కొందరు పరిశీలకులు ఈ సెక్యూరిటీ సెమీ కండక్టర్ల ఒప్పందాన్ని పోలుస్తున్నారు. పౌర అణు విద్యుత్తు ఒప్పందం విషయంలో మాదిరిగానే ఇప్పుడు కూడా దేశం లోపల, వెలుపల ఉన్న వామపక్ష శక్తులు అమెరికాకు భారత్ అమ్ముడుపోయిందని గగ్గోలు చేస్తాయి. ఈ ఒప్పందం కారణంగానే అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వామపక్షాలతో పొత్తు తెగతెంపులు చేసుకొని ఎన్నికలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సెక్యూరిటీ సెమీ కండక్టర్ల ఒప్పందం రక్షణ రంగంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాల్లో కీలకమైనది. దేశంలోనూ, బయటా గల భారత్ శత్రువులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

సాంకేతిక సంపత్తి, ఆవిష్కరణ సామర్థ్యాలు కలిగిన భారత్ విదేశాల నుంచి సెక్యూరిటీ సెమీ కండక్టర్ చిప్ లను కొనడానికి ఏటా ఒక బిలియన్ డాలర్లు (దాదాపు 8 వేల కోట్ల రూపాయలు) ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు అమెరికాతో కుదిరిన ఒప్పందం ప్రకారం కోల్ కతా పవర్ సెంటర్లో అంతర్జాతీయ చిప్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దేశంలో చిప్ ల తయారీ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ఈ ఒప్పందం ఫలితంగా సెమీ కండక్టర్ల తయారీ వ్యవస్థలో, ముఖ్యంగా వాణిజ్య చిప్ ల తయారీలో చైనా మీద ఆధారపడటం కూడా తగ్గిపోతుంది. సెమీ కండక్టర్లపై భారత్ దృష్టి సారించడం వల్ల అంతర్జాతీయ కంపెనీలు పారిశ్రామిక ఇతర అవసరాల కోసం భారత్ లో చిప్ లను తయారు చేసే అవకాశాలు పెరుగుతాయి. భారత్ తెలివిగా అత్యంత నాణ్యమైన చిప్ ల తయారీకి అమెరికా, యూరప్, తైవాన్, సింగపూర్ లోని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రతిరోజు 7 కోట్ల ఎలక్ట్రానిక్ చిప్ ల తయారీకి లక్షన్నర కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. చైనాకు దూరంగా ప్రత్యామ్నాయ ఎలక్ట్రానిక్ పరికరాల సరఫరా వ్యవస్థను నిర్మించే విస్తృత లక్ష్యంతో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్లు తయారు చేసే దేశాల్లో మొదటి ఐదు దేశాల్లో ఒకటిగా అభివృద్ధి చెందేందుకు భారత్ ఇటువంటి ఐదు ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లను నిర్మిస్తోంది. కేమ్స్ సెమీకాన్, సిజి పవర్ అనే కంపెనీలు గుజరాత్ లోని సనంద్ లో రెండు సెమీ కండక్టర్ల ప్లాంట్లు నిర్మిస్తుండగా మిగతా రెండిటిని గుజరాత్ లోని దదేరా, అస్సాంలోని మోరేగాంలలో టాటా ఎలక్ట్రానిక్స్ నిర్మిస్తోంది. కొత్త సెమీ కండక్టర్ల పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశాలపై 2021లోనే భారత్ దృష్టి కేంద్రీకరించింది. సెమీ కండక్టర్ల ఉత్పత్తి, ప్రక్రియ, అభివృద్ధి మొత్తం పర్యావరణ వ్యవస్థ నిర్మాణానికి భారత్ ఉత్పత్తి-ఆధారత ప్రోత్సాహక పథకం (పిఎల్ఐ) ద్వారా రూ.76,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు తయారు చేసింది. భారత్ లో ప్రస్తుతం సెమీ కండక్టర్ల మార్కెట్ 38 మిలియన్ డాలర్లు కాగా 2030 నాటికి ఇది 109 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. 

సెమీ కండక్టర్లు అత్యంత విస్తృత ప్రభావం కలిగిన వ్యాపార కార్యకలాపం. అది దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)కి వేల కోట్ల డాలర్లు విలువను జోడించడమే కాకుండా లక్షల సంఖ్యలో అత్యంత నైపుణ్యం గల ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యం కలిగి ఉంది. దేశంలో చిప్ ల ఉత్పత్తి పెరిగితే దిగుమతులపై ఆధారపడటం తగ్గటమే కాకుండా కాలక్రమంలో భారత్ పారిశ్రామిక అవసరాలు, వాహన పరిశ్రమలు, మొబైల్ వంటి రంగాలకు తానే చిప్ లను ఎగుమతి చేసే దశకు చేరుకుంటుంది. గత కొన్ని నెలల్లో భారత ప్రభుత్వం వివిధ దేశాలతో సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల ఫలితంగా విద్యుత్ సరఫరా, పారిశ్రామిక మండలాలు, బట్వాడా (లాజిస్టిక్స్) సంబంధిత మౌలిక సదుపాయాలు కూడా అభివృద్ధి చెందుతాయి. దేశంలోనే సెమీ కండక్టర్ నిపుణులకు డిమాండ్ పెరగడం వల్ల ప్రత్యేక విద్యా కార్యక్రమాలు, కొత్త నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకుంటాయి. సెమీ కండక్టర్ల సరఫరా స్థిరంగా ఉంటుందన్న భరోసా ఏర్పడితే ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ, టెలికమ్యూనికేషన్ వాహన పరిశ్రమకు అవసరమైన వస్తువుల తయారీ పెరుగుతుంది. భద్రతా పరికరాలలో సెమీ కండక్టర్ల ప్రాముఖ్యం కారణంగా భవిష్యత్తులో చోటుచేసుకునే యుద్ధాలు, సంఘర్షణల దృష్ట్యా అంతర్జాతీయ రాజకీయాలలో భారత్ ప్రాధాన్యం పెరగడం తథ్యం. ఇప్పటికే కొత్త కొత్త ప్రాజెక్టులను నిర్వహించడానికి భారీ స్టార్టప్ వ్యవస్థ సెమీ కండక్టర్ల రంగంలో రూపుదిద్దుకుంది. గత కాలపు వైఫల్యాలను పక్కనపెట్టి భారత్ ఉజ్వల భవిష్యత్తువైపు దూసుకుపోయే సమయం ఆసన్నమైంది. 

కె ఏ బదరీనాథ్