భారత పారిశ్రామిక సామర్థ్యానికి ప్రతీక
రతన్ టాటా మనకు దూరమై నెలరోజులైంది. ఆయన ఇక మన మధ్య ఉండరనే భావన మహా నగరాలు మొదలుకొని చిన్న పట్టణాలు, గ్రామాల వరకు, పేదల నుంచి ధనిక వర్గాల వరకు అందర్నీ కలచివేసింది. కాకలు తీరిన పారిశ్రామికవేత్తలు, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వ్యవస్థాపకులు, కష్టించి పని చేసే వృత్తి నిపుణులు… ఇలా ప్రతి ఒక్కరూ రతన్‌జీ మరణాన్ని తలచుకుని తల్లడిల్లుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు ఉద్యమిస్తున్న వారినీ, ప్రజా శ్రేయస్సుకు అంకితమైన వితరణశీలురనూ విషాదం కమ్ముకుంది.
భారతీయుల పారిశ్రామిక సామర్థ్యానికి రతన్‌జీ విశిష్ట ప్రతీక. నిజాయతీ, సేవాభావం, ఉత్కృష్టతా సాధనకు ఆయన జీవితాంతం కట్టుబడే ఉన్నారు. ఆయన సారథ్యంలో టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించింది. విశ్వసనీయతను సాధించుకుంది. ఉన్నత శిఖరాలను అధిరోహించి గౌరవమన్ననలు పొందింది. స్వదేశంతోపాటు విదేశాల్లోనూ విజేతగా నిలిచినా అణకువగానే మెలగడం రతన్‌జీ గొప్పతనం. దయాగుణం తన స్వభావమని నిరూపించుకున్నారు. అది ఆయన వ్యక్తిత్వానికి అపూర్వ శోభా సౌరభాలు అద్దింది.
తన స్వప్నాలను నిజం చేసుకోవడమే కాదు, ఇతరుల కలల సాకారానికి చేయూతనివ్వడమూ రతన్ టాటా విలక్షణ స్వభావం. అందుకే ఇటీవలి సంవత్సరాల్లో ఆయన పలు అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది యువతరమేనని గ్రహించి ప్రజ్ఞావంతులైన యువ వ్యవస్థాపకుల ఆశలు, ఆకాంక్షలు నెరవేరడానికి తోడ్పడ్డారు. యువ స్వాప్నికులు వైఫల్య భయం లేకుండా సాహసోపేతంగా ముందుకు కదలి తమ లక్ష్యాలను సాధించేలా ప్రేరణ ఇచ్చారు. యువతీ యువకుల్లో నవీకరణ ప్రవృత్తిని ప్రోత్సహించారు. అన్ని అడ్డంకులనూ ఛేదించి గమ్యం వైపు దూసుకుపోయే తత్వాన్ని పాదుగొల్పారు. ఈ గుణాలు ఉన్నవారిని వెన్నుతట్టి ముందుకు నడిపారు. భావి భారత నిర్మాణంలో యువత సృజనాత్మక, క్రియాశీల పాత్ర పోషించేలా అండదండలు అందించారు. నాణ్యమైన వస్తుసేవలను అందించడం ద్వారానే మన పరిశ్రమలు ప్రపంచ మార్కెట్లను కైవసం చేసుకోగలవనేది ఆయన దృక్పథం. ఈ దార్శనికతను భావి వ్యవస్థాపకులు పుణికిపుచ్చుకుని దేశాన్ని ఉన్నత శిఖరంపై అధిష్టింపజేస్తారని ఆశిస్తున్నా.
రతన్‌జీ గొప్పదనం కంపెనీ డైరెక్టర్ల బోర్డుకూ, సాటి మానవులకు చేయూతనివ్వడానికే పరిమితం కాలేదు. ఆయన ప్రేమాభిమానాలు సమస్త ప్రాణులపై వర్షించాయి. జంతువుల పట్ల రతన్‌జీ కారుణ్యం జగద్విదితం. జంతు సంక్షేమానికి సర్వవిధాల సహాయ సహకారాలు అందించారాయన. పెంపుడు శునకాలతో దిగిన ఫొటోలను తరచూ ఇతరులతో పంచుకునేవారు. రతన్‌జీ తన వ్యాపారాల్లోనూ, జీవితంలోనూ జంతువులకు ప్రత్యేక స్థానమిచ్చారు. నిజమైన నాయకత్వానికి విజయాలు మాత్రమే కొలమానం కాదనీ, దుర్బల జీవుల బాధ్యత తీసుకోవడమూ ముఖ్యమని ఆయన జీవితం చాటిచెబుతోంది. సంక్షోభ సమయాల్లో రతన్ టాటా నిరుపమాన దేశభక్తిని ప్రదర్శించారు. అది కోట్ల మంది భారతీయులకు దారిదీపంగా భాసించింది. ముంబయిలో ఉగ్రదాడి జరిగిన కొద్ది రోజుల్లోనే తాజ్ హోటళ్లను పునఃప్రారంభించడం రతన్‌జీ మొక్కవోని స్థైర్యానికి గొప్ప ప్రతీక. అది ఉగ్రవాదాన్ని సమైక్యంగా ఎదుర్కొనేలా దేశ ప్రజలను కార్యోన్ముఖుల్ని చేసింది.
రతన్ టాటాతో నాకు చాలాకాలం నుంచీ సాన్నిహిత్యం ఉంది. గుజరాత్‌లో పలు కీలకమైన ప్రాజెక్టుల్లో ఆయన విరివిగా పెట్టుబడులు పెట్టారు. వాటిలో సీ-295 ఎయిర్ బస్ రవాణా విమానాల కూర్పునకు వడోదరలో నిర్మించిన ‘టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్’ కర్మాగారం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇటీవల స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్‌తో కలసి ఆ కర్మాగారాన్ని ప్రారంభించాను. అసలు దాన్ని నెలకొల్పాలనే ప్రతిపాదనను తెచ్చింది రతన్ టాటానే. ఆయన మన మధ్య లేకపోవడం తీరని లోటు. రతన్‌జీ పలు ముఖ్యమైన అంశాలపై నాకు తరచూ లేఖలు రాసేవారు. పాలన గురించి ప్రస్తావించడానికీ, తమ ప్రాజెక్టులకు ప్రభుత్వం మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలపడానికీ, ఎన్నికల్లో విజయాలు సాధించినప్పుడు అభినందించడానికీ లేఖలు రాసేవారు. నేను గుజరాత్ నుంచి దిల్లీకి మారిన తరవాత కూడా ఆయన అనేక జాతి నిర్మాణ కార్యక్రమాల్లో భాగస్వామిగా నిలిచారు. ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమానికి రతన్‌జీ అందించిన సహకారం ఎంతో సంతృప్తికరం. శుభ్రత, పారిశుద్ధ్యాలు దేశ ప్రగతికి ఎంతో అవసరమని ఆయన ఉద్ఘాటించారు. గత అక్టోబరు ఆరంభంలో ‘స్వచ్ఛ భారత్’ పదో వార్షికోత్సవం సందర్భంగా ఆ కార్యక్రమానికి హృదయపూర్వక మద్దతు ప్రకటిస్తూ రతన్‌జీ విడుదల చేసిన వీడియో మరువలేనిది. అస్తమించడానికి ముందు ఆయన పాల్గొన్న అతికొద్ది కార్యక్రమాల్లో ఇది ఒకటి.
రతన్ టాటా ఆరోగ్య సంరక్షణకు, ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. రెండేళ్ల క్రితం అస్సాంలో పలు చోట్ల మేమిద్దరం కలసి క్యాన్సర్ ఆస్పత్రులను ప్రారంభించాం. తన జీవిత చరమాంకాన్ని ఆరోగ్య సంరక్షణకు అంకితం చేస్తానని అప్పట్లో ఆయన ప్రకటించారు. ఆరోగ్య సేవలు, క్యాన్సర్ చికిత్సను తక్కువ రుసుముకే అందజేయడం ద్వారా రోగులను, పేదలను ఆదుకోవాలని ఆయన లక్షించారు. బలహీనులను ఆదుకునే సమాజమే న్యాయమైన సమాజమని రతన్‌జీ విశ్వసించారు. ఆయన ఆశించిన ఆదర్శ సమాజంలో వ్యాపారాలు ప్రజాహితానికి తోడ్పడతాయి. ప్రతి వ్యక్తి శక్తిసామర్థ్యాలను గుర్తించి, విలువనిచ్చి దేశాభివృద్ధికి నియోగిస్తారు. అభివృద్ధికి ఆర్థికాన్ని మాత్రమే కొలమానంగా తీసుకోకుండా, అందరూ సంతోషంగా జీవించే సమాజాన్ని సృష్టించడానికి శ్రమిస్తారు. ఆయన ఔదార్య హస్తం స్పృశించిన జీవితాల్లో, కలల సాకారానికి ఆయన చేయూతనిచ్చిన జీవితాల్లో… రతన్ టాటా శాశ్వతంగా నిలిచిపోతారు. భారతదేశాన్ని కారుణ్యం, ఆశాభావానికి నెలవుగా తీర్చిదిద్దిన రతన్‌జీకి భావితరాలూ కృతజ్ఞులై ఉంటాయి.
నరేంద్ర మోదీ,
భారత ప్రధాని