finance

భారత్‌కు వరంగా మారిన కొత్త ఆర్థిక చట్టాలు

భారతదేశంలో ఆర్థిక నేరాలపై పోరాటం మొదటి నుంచి ఒక పెను సవాలుగా నిలిచింది. మనీ లాండరింగ్ (నల్లధనాన్ని తెల్ల ధనంగా మార్చడం), మోసపూరితమైన దివాళా ప్రక్రియలు, బినామీ లావాదేవీలు దేశ ఆర్థికవృద్ధికి అవరోధాలుగా మారుతున్నాయి. ఈ అక్రమ పద్ధతులు మార్కెట్ యంత్రాంగాన్ని వక్రీకరిస్తాయి. ప్రభుత్వానికి రావలసిన ఆదాయాన్ని రాకుండా చేస్తాయి. విస్తృతంగా వ్యాపిస్తున్న అవినీతికి అండగా నిలుస్తాయి. ఈ అక్రమాలపై పోరాడేందుకు భారత ప్రభుత్వం అనేక కీలక చట్టాలను చేసింది. వీటిలో అక్రమ నగదు నివారణ చట్టం (పీఎంఎల్ఏ), దివాళా స్మృతి, బినామీ ఆస్తి లావాదేవీల నిషేధ చట్టం (దీన్ని వాడుక భాషలో బినామీ చట్టంగా పిలుస్తారు) మొదలైనవి ఉన్నాయి. ఈ చట్టాల ప్రవేశం, వాటిలో కాలక్రమంలో వచ్చిన మార్పులు ఆర్థిక అక్రమాలపై భారత్ చేసే పోరాటానికి బలం చేకూర్చాయి. ఆర్థిక వ్యవస్థలో మరింత పారదర్శకతకు, జవాబుదారీతనానికి, ఆర్థిక క్రమశిక్షణకు ఈ చట్టాలు దోహదం చేశాయి. ఈ చట్టాలు సంక్లిష్టమైన ఆర్థిక నేరాలతో వ్యవహరించే సమర్థమైన యంత్రాంగాన్ని ప్రభుత్వ శాఖలకు అందించడమే కాకుండా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో అక్రమాలను అదుపు చేసే విషయంలో ప్రభుత్వానికి గల నిబద్ధతను కూడా వెల్లడిస్తాయి.

 కాలక్రమంలో ఈ చట్టాల్లో చేసిన మార్పులు ఆర్థిక నేరాలను ఎదుర్కోవడంలోనూ, నివారించడంలోనూ వాటిని మరింత పకడ్బందీగా చేశాయి. ఈ చట్టాలన్నీ కలిసి ఆర్థిక నేరాలను ప్రభుత్వం ఇక ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోలేని పరిస్థితిని, నేరస్తులు నిర్భయంగా నేరాలకు పాల్పడలేని వాతావరణాన్ని సృష్టించాయి. ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం తెచ్చిన చట్టాల్లో అత్యంత ముఖ్యమైనది మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ). 2002లో దీన్ని తీసుకువచ్చారు. పీఎంఎల్ఏ ప్రధాన లక్ష్యం నల్లధనాన్ని చట్టబద్ధమైన డబ్బుగా మార్చకుండా నిరోధించడం. చాలా కాలంగా మత్తు పదార్థాల అక్రమ రవాణా, ఉగ్రవాదం, అవినీతి, పన్నుల ఎగవేత, అటువంటి ఇతర నేరాల నుంచి నల్లధనం వస్తుంది. ఈ నేరాల ఆర్థిక కోణాలపై దృష్టి పెట్టడం ద్వారా పీఎంఎల్ఏ అక్రమ ధనం చట్టబద్ధమైన ఆర్థిక వ్యవస్థలో ప్రవేశించకుండా నిరోధిస్తుంది. నల్లధనం, అవినీతిపై భారత్ చేసే పోరాటంలో పీఎంఎల్ఏ ఒక ప్రధాన ఆయుధంగా మారింది. మనీ లాండరింగ్ ద్వారా నిందితులు సమకూర్చుకున్న ఆస్తులను జప్తు చేయడం, స్వాధీనం చేసుకోవడంతో సహా అనేక అధికారాలను పీఎంఎల్ఏ చట్టాన్ని అమలు పరిచే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి సంస్థలకు కల్పిస్తుంది. ఇలా చేయడం వల్ల అక్రమార్జన ద్వారా ఆస్తులు కూడగట్టిన వారు ఒక పక్క దర్యాప్తు జరుగుతుండగానే మరోవైపు అక్రమ ఆస్తులను సొమ్ము చేసుకునే అవకాశం ఉండదు. భారీ మొత్తంలో ప్రజాధనాన్ని స్వాహా చేసిన వ్యక్తుల ఆటలు సాగకుండా ఎలా నిరోధించవచ్చో ఈ చట్టం విజయ్ మాల్య, నీరవ్ మోదీ వంటి పేరు మోసిన వ్యక్తుల కేసుల్లో నిరూపించింది. ఆ నిందితులు తమ అక్రమాస్తులను సొమ్ము చేసుకోకుండా నిరోధించడం ద్వారా పీఎంఎల్ఏ ఆర్థిక వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసాన్ని పెంపొందించింది. అదేవిధంగా ఆర్థిక నేరస్తులు అక్రమ కార్యకలాపాలను కొనసాగనివ్వకుండా అడ్డుకోగలిగింది.

ఆర్థిక నేరాలను నిరోధించడానికి ప్రభుత్వం తీసుకువచ్చిన మరొక కీలకమైన సంస్కరణ దివాళా స్మృతి (ఐబీసీ). 2016లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. దేశంలో దివాళా కేసులను పరిష్కరించే విధానాల్లో ఐబీసీ విప్లవాత్మమైన మార్పులు తీసుకువచ్చింది. ఈ చట్టం రాకముందు దివాళా ప్రక్రియ దీర్ఘకాలం కొనసాగేది. ఈ అసమర్థమైన ప్రక్రియ వల్ల తరచుగా అటు రుణదాతలు, ఇటు వ్యాపారులు కూడా నష్టపోయేవారు. దీనికి భిన్నంగా ఐబీసీ దివాళా ప్రక్రియను పరిష్కరించడానికి కాల పరిమితులను నిర్దేశించింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కంపెనీలు ఏదైనా పరిష్కారమైనా సాధించాలి లేదా గడువు లోపల వాటిని (కంపెనీలను) రద్దయినా చేయాలి. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వం బ్యాంకులపై మొండిబాకీల భారాన్ని తగ్గించింది. ఈ మొండి బాకీలు దేశ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలంగా దుష్ప్రభావాన్ని చూపాయి. రుణదాతలను సాధికారీకరించడం ఐబీసీ తెచ్చిన ఒక కీలకమైన మార్పు. ఈ చట్టం దివాళా ప్రక్రియలో రుణదాతలకు మరిన్ని అధికారాలు కల్పిస్తుంది. ఐబీసీ కింద రుణాలు ఎగవేసిన కంపెనీలపై రుణదాతలు దివాలా ప్రక్రియను చేపట్టవచ్చు. ఇది కంపెనీలు తమ ఆర్థికపరమైన బాధ్యతల విషయంలో జవాబుదారీగా ఉండేటట్లు చేస్తుంది. దీని ఫలితంగా కార్పొరేట్ సంస్థల్లో ఆర్థిక క్రమశిక్షణ మెరుగుపడటమే కాకుండా రుణదాతలకు, ముఖ్యంగా బ్యాంకులకు భారీ ఊరట లభించింది. అవి ఇప్పుడు తమ రుణాలను మరింత సమర్థంగా వసూలు చేసుకోవచ్చు. ఎస్సార్ స్టీల్ కేసు వంటి భారీ మొత్తంలో కూడుకున్న కేసులను విజయవంతంగా పరిష్కరించిన తీరు ఐబీసీ సమర్థతకు నిదర్శనం. ఈ కేసులో రుణదాతలు తాము ఇచ్చిన బాకీల్లో చాలావరకు తిరిగి వసూలు చేసుకోగలిగారు. దివాళా ప్రక్రియకు న్యాయమైన, పారదర్శకమైన విధివిధానాలను నిర్దేశించడం ద్వారా ఐబీసీ దేశంలో వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచి, దేశ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వానికి దోహదం చేసింది. 

భారత్ లో ఆర్థిక నేరాలను లక్ష్యంగా చేసుకునే మరొక కీలకమైన చట్టం బినామీ ఆస్తి లావాదేవీల చట్టం. దీన్ని బినామీ చట్టం అని కూడా పిలుస్తారు. అసలు యజమానులు కాకుండా వేరే వ్యక్తులు పేర ఆస్తులు కొనే పద్ధతి ఎప్పటి నుంచో ఉంది. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడం కోసం, పన్నులు ఎగవేయడం కోసం ఈ పద్ధతిని అనుసరిస్తారు. ముఖ్యంగా ఇళ్ళు, స్థలాల విషయంలో ఇది కనిపిస్తుంది. 1988లో తెచ్చిన మొదటి బినామీ చట్టం అమలు పరిచే యంత్రాంగం లేక పెద్దగా ఉపయోగపడలేదు. అయితే 2016లో నరేంద్ర మోదీ ప్రభుత్వం దీనికి సవరణలు చేసింది. ఈ సవరణల ఫలితంగా దేశంలో బినామీ లావాదేవీలను, తద్వారా రియల్ ఎస్టేట్ రంగంలోకి నల్లధనం ప్రవాహాన్ని తగ్గించడానికి ఈ చట్టం ఒక శక్తిమంతమైన ఆయుధంగా మారింది. ఈ సవరించిన బినామీ చట్టం ఇటువంటి అక్రమ లావాదేవీలకు పాల్పడే వ్యక్తులపై భారీ జరిమానాలు, జైలు శిక్షలతో సహా కఠినమైన శిక్షలను విధిస్తుంది. అంతేగాక ఈ బినామీ ఆస్తులను వేరే వారికి బదిలీ చేయకుండా, రహస్యంగా ఉంచడానికి వీలు లేకుండా వీటిని అధికారులు ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా స్వాధీనం చేసుకునేందుకు చట్టం అనుమతిస్తుంది. అక్రమ ఆస్తులను వేగంగా స్వాధీనం చేసుకునేందుకు అవకాశం కల్పించడం ద్వారా బినామీ లావాదేవీలకు పాల్పడిన వారు తప్పించుకోలేని పరిస్థితులను కల్పిస్తుంది. మొదటి నుంచి అక్రమాలకు, నల్లధనానికి నిలయమైన రియల్ ఎస్టేట్ రంగంలో ఈ చట్టం పారదర్శకతను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది. 

పీఎంఎల్ఏ, ఐబీసీ, బినామీ చట్టం– ఈ మూడూ దేశంలో ఆర్థిక నేరాలను నిరోధానికి ఒక పటిష్టమైన శాసన చట్రాన్ని నిర్మించాయి. ఈ శాసనాలు సంక్లిష్టమైన ఆర్థిక నేరాలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి సమర్థమైన సాధనాలను సమకూర్చడమే కాకుండా అటువంటి నేరాలతో వ్యవహరించడానికి శాసన, సంస్థాగత యంత్రాంగాన్ని బలోపేతం చేశాయి. పీఎంఎల్ఏ కింద ఆస్తులు జప్తు చేయడం, దివాళా ప్రక్రియను ఒక గడువు లోపల పూర్తి చేయడం లేదా బినామీ ఆస్తులను వేగంగా స్వాధీనం చేసుకోవడం వంటి ముందస్తు చర్యలకు వీలు కల్పించడం ద్వారా ఈ చట్టాలు ఆర్థిక నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదన్న ప్రభుత్వ కృతనిశ్చయాన్ని సూచిస్తున్నాయి. ఈ చట్టాల సమర్థత ఫలితంగా ఆర్థిక వ్యవస్థలో అవినీతి, నల్లధనం, ఆర్థిక దుష్ప్రవర్తన తగ్గాయి. ఆర్థిక నేరస్తులను జవాబుదారీ చేయడం, వారి అక్రమార్జనను స్వాధీనం చేసుకోవడానికి వీలు కల్పించడం ద్వారా ఈ శాసనాలు భారత దేశ ఆర్థిక, వ్యాపార రంగాలను ప్రక్షాళన చేయడానికి ఉపయోగపడ్డాయి. అంతేగాక పారదర్శకతకు, చట్ట పరిపాలనకు, ఆర్థిక సచ్ఛీలతకు విలువనిచ్చే దేశంగా భారత్ ప్రతిష్టను పెంచాయి. భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో కీలకపాత్ర వహిస్తున్న తరుణంలో ఈ చట్టాలు దేశంలో ఆర్థిక సుస్థిరతను కాపాడేందుకు, అక్రమాల నిరోధించేందుకు కీలకంగా మారాయి.

వికాస్ పాఠక్