BJP Stapana Diwas

బిజెపితోనే తెలంగాణకు రక్ష

BJP Stapana Diwasకాంగ్రెస్ అవినీతి, అహంకారపూరిత పాలన నుంచి, మజ్లిస్ పార్టీ అధికార దాహం నుంచి, కేసీఆర్ కుటుంబ రాజకీయాల నుంచి తెలంగాణను రక్షించుకోవాలని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనను చూశారు, ఈసారి బిజెపికి అధికారం ఇవ్వండి, ఖచ్చితంగా సమస్యల నుండి గట్టెక్కిస్తుందని ప్రజలకు హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 6న రాష్ట్ర కార్యాలయంలో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు డా.కె. లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీలు బీబీ పాటిల్, బూర నర్సయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ తివారీ, డా. కాసం వెంకటేశ్వర్లు, బంగారు శృతి, నాయకులు మర్రి శశిధర్ రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘నైతిక విలువలతో పనిచేసే పార్టీ బిజెపి. పార్లమెంటులో ఒక్క ఓటు తగ్గితే, వేరే పార్టీలకు చెందిన నాయకులు, పార్లమెంటు సభ్యులు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా, ఆ మద్దతును నిరాకరిస్తూ ఒక్క ఓటుతో ప్రధానమంత్రి పదవిని, కేంద్ర ప్రభుత్వాన్ని వదులుకున్న చరిత్ర భారతీయ జనతా పార్టీది. గతంలో దేశంలో నెహ్రూ కుటుంబానికి మాత్రమే దేశాన్ని పరిపాలించే శక్తి ఉన్నదంటూ ప్రచారం చేసుకున్నారు. సాధారణ బిజెపి కార్యకర్త కూడా దేశాన్ని సమర్థవంతంగా పరిపాలించగలరని నిరూపించాం. రైల్వేస్టేషన్‌లో టీ అమ్ముకునే సాధారణ వ్యక్తి కుమారుడు ఈ రోజు దేశాన్ని సమర్థంగా పరిపాలిస్తున్నారు. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత అత్యధిక సమయం దేశాన్ని పరిపాలించిన ఘనత నరేంద్ర మోదీదే. నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. పేదల ఇంట్లో మరుగుదొడ్ల నుంచి చంద్రయాన్ వరకు దేశం ఎదుగుతోంది. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక సంస్కరణలు, విదేశీ దౌత్యనీతి.. ఇలా అనేక రకాలుగా నభూ తో న భవిష్యత్ అనే విధంగా నరేంద్ర మోదీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

గతంలో టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణను పరిపాలించాయి. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలిస్తోంది. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో, న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడంలో ఆ పార్టీలన్నీ విఫలమయ్యాయి. అందుకే, తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో 77 లక్షల మంది బిజెపికి అండగా నిలబడ్డారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్లో బిజెపి విజయం సాధించింది. రానున్న రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బిజెపిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్‌కు పదేళ్లలో ప్రజా వ్యతిరేకత వస్తే, పది నెలల్లోనే కాంగ్రెస్ అంతకంటే ఎక్కువ వ్యతిరేకతను మూటగట్టుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంను పెంచిపోషిస్తున్నాయి. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ మూడు పార్టీలు ఓటేశాయి. కాంగ్రెస్ హయాంలో మర్రి చెన్నారెడ్డిని సీఎం పదవి నుంచి దించేందుకు మజ్లిస్ మత కల్లోలాలు సృష్టించిందని చెన్నారెడ్డి వెల్లడించారు. తీగలగుట్టలాంటి ప్రాంతంలో 400 మంది దళితులను, హిందువులను హత్యాకాండ చేసిన పార్టీ మజ్లిస్. మజ్లిస్ దౌర్జన్యాల వల్ల పాతపట్నంలో హిందువులు బస్తీలను విడిచిపెట్టిన దుస్థితి ఏర్పడింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మజ్లిస్‌ను గెలిపించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీపడి రాజకీయ కుట్రలు చేస్తున్నాయి. ఈ కుట్రలను బద్ధలు కొట్టాలి.’’ అని అన్నారు.