Kiren Rijiju

బడ్జెట్ చర్చను రాజకీయం చేస్తున్న విపక్షం

kiren rijijuబడ్జెట్‌ అంశాలు చర్చించకుండా ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని, ప్రధానిని దూషిస్తున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తోందని అన్నారు. బడ్జెట్ అమలుకు సహకారాత్మక సమాఖ్యవాద స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సహకారం చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. మిత్రపక్షాలకు ఎక్కువ నిధులు కేటాయించారనేది నిజం కాదని, దేశవ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులకు కేటాయింపులు చేసినా బడ్జెట్ ప్రసంగంలో కొన్నిటిని మాత్రమే ప్రస్తావించగలరని తెలిపారు. ఒక ఆంగ్ల వార్తాపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన రిజిజు ఇటీవలి పార్లమెంటు సమావేశాలతో పాటు పలు అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. ఇంటర్వ్యూ లోని ముఖ్యాంశాలు:

ప్ర: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పార్లమెంటు కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపాయి?

జ: ఈ బడ్జెట్ సమావేశం ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసేందుకు తీసుకుంటున్న ప్రగతిశీల చర్యలను ప్రజలకు అందించాల్సిన సందర్భమిది. ప్రభుత్వం చేస్తున్న పనుల వల్ల పౌరులు ఎలా ప్రయోజనం పొందుతారో తెలుసుకునే అవకాశం కూడా. భారతదేశం ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశలో పయనిస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రధాని మోదీ బలమైన పునాది వేస్తున్నారు. అందువల్ల, పౌరుల సంక్షేమం కోసం మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి, అవకాశాలను సృష్టించడానికి, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి తీసుకుంటున్న వివిధ చర్యలపై చర్చ అవసరం. అయితే ప్రతిపక్షాలు మాత్రం బడ్జెట్‌పై వ్యాఖ్యానించకుండా రాజకీయ భాష మాట్లాడుతున్నాయి. వారు బడ్జెట్ అమలుకు ఏదైనా గణనీయమైన సహకారం అందించాలనుకుంటే, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన కోసం కేటాయించిన రూ 11,11,000 కోట్లు లేదా యువతకు ఉద్యోగాల కల్పన, మహిళలు, పిల్లలు, రైతుల అభివృద్ధికి, వివిధ రంగాలకు సంబంధించిన ఇతర నిర్దిష్ట ప్రతిపాదనల గురించి చర్చించాలి. ఆరోగ్యం, విద్య, శిక్షణ లేదా వెనుకబడిన, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కేటాయింపులు జరిగాయి. ఈ నిర్ణయాలను అమలు చేయడంలో మాకు సహాయపడటానికి ప్రతిపక్షాలకు ఇది అవకాశం. అట్టడుగు స్థాయిలో ఉద్యోగాల కల్పన, స్థానిక వ్యవస్థాపకత, సూక్ష్మ పరిశ్రమలకు మద్దతు కోసం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, రొయ్యల ఎగుమతులు, ఉత్పత్తిని మెరుగుపరచడం, వివిధ రంగాలకు అనేక ఇతర గణనీయమైన బడ్జెట్ కేటాయింపులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ఇవి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు అద్దం పడుతున్నాయి. సానుకూల చర్చల ద్వారా వీటిని ఎలా మెరుగ్గా అమలు చేయాలనేదానిపై సూచనలు, సలహాలతో ప్రతిపక్షం వీటి అమలులో కీలక పాత్ర పోషించవచ్చు.

ప్ర: బడ్జెట్ ప్రతిపాదనల అమలులో ప్రతిపక్ష పాత్ర ఎంత ముఖ్యమైనది?

జ: బడ్జెట్‌ను విజయవంతంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలదే కీలకపాత్ర. అందువల్ల, బడ్జెట్ సజావుగా అమలు జరగడానికి సహకారాత్మక సమాఖ్యవాద స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సహకారం చాలా ముఖ్యమైనది. దేశ అభివృద్ధి కోసం రూపొందిస్తున్న వివిధ చర్యలను గరిష్ట స్థాయిలో ఉపయోగించుకోడానికి, ప్రయోజనం పొందడానికి ప్రతి రాష్ట్రం పోటీతత్వంతో పనిచేయాలని కేంద్రం ఆశిస్తోంది. రాష్ట్రాలు పురోగమిస్తే దేశం పురోగమిస్తుంది, అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులను ఉత్పాదకంగా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించాలన్నదే కేంద్రం ప్రయత్నం. కనుక ప్రతిపక్ష నాయకుల పాత్ర ఈ ప్రయత్నాలను ప్రతిబింబించాలి, కేంద్రం చేస్తున్న పనిని సులభతరం చేయాలి.

ప్ర: కీలకమైన బిజెపి మిత్రపక్షాల పాలనలోని బీహార్, ఆంధ్రప్రదేశ్‌లకు బడ్జెట్ లో ఎక్కువ నిధులు ఇచ్చారని, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి?

జ: మిత్రపక్షాలకే ప్రత్యేక నిధులు కేటాయించారనే మాట నిజం కాదు. ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులకు కేటాయింపులు చేస్తారు కాబట్టి బడ్జెట్ ప్రసంగంలో కొన్నిటిని మాత్రమే ప్రస్తావించగలరు. అందువల్ల పేర్లు ప్రస్తావించిన రాష్ట్రాలే ప్రతిపక్షాల దృష్టికి వచ్చాయి. కానీ మీరు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మూడు కోట్ల ఇళ్లను నిర్మించాలనే ప్రతిపాదన లేదా రూ 11,11,000 కోట్ల మూలధన వ్యయం, మౌలిక సదుపాయాలకు పెద్దమొత్తంలో చేసిన కేటాయింపులు చూస్తే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు న్యాయం జరిగిన విషయం అర్థమవుతుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలకు ఇవి ఉదాహరణగా నిలుస్తాయి. పశ్చిమ, ఉత్తర రాష్ట్రాల కంటే మౌలిక సదుపాయాలు, సౌకర్యాలలో కొంచెం వెనుకబడిన పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ప్రధాన మంత్రి ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే తూర్పు, ఈశాన్య ప్రాంతాలపై ఈసారి ప్రత్యేక దృష్టి సారించారు. తూర్పు, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి, దక్షిణ, పశ్చిమ, ఉత్తరాది రాష్ట్రాలతో సమానంగా వాటిని అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపించడంపై ప్రతిపక్షాలకు అభ్యంతరం ఎందుకు? విపక్షాలతో ప్రధాన సమస్య ఏమిటంటే.. బడ్జెట్‌లోని అంశాల గురించి చర్చించకుండా అవి రాజకీయాలు చేస్తున్నాయి, ప్రధానిని దూషిస్తున్నాయి. బడ్జెట్‌పై మాట్లాడాలని, రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంటును దుర్వినియోగం చేయవద్దని ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను.

ప్ర: రాష్ట్రాల సహకారం అవసరమన్న అవగాహన కేంద్రానికి ఉందా?

జ: గత 10 సంవత్సరాలలో బిజెపి సహకారాత్మక సమాఖ్యవాదం గురించి మాట్లాడుతోంది. కానీ ప్రతిపక్ష పార్టీల ప్రవర్తన నిరాశాజనకంగా ఉంది. ఎందుకంటే వారు నిధుల సద్వినియోగం కోసం ఎటువంటి సూచనలు చేయలేదు. అలా కాకుండా పార్లమెంట్‌లో వివిధ పార్టీలకు కేటాయించిన సమయాన్ని రాజకీయ చర్చకు ఉపయోగించుకుంటున్నారు. దేశానికి ఎక్కువ సమయం కేటాయించాలని కూడా ప్రధాని విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు రాజకీయాలు మాట్లాడటానికి సరిపడినంత అవకాశం లభించిందని, పార్లమెంట్‌లో మాత్రం తమ సమయాన్ని పార్టీ కోసం కాకుండా దేశం కోసం వినియోగించుకోవాలని ఆయన అన్నారు.

ప్ర: బిజెపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్లమెంటు పనితీరు ఎలా ఉండేది?

జ: యూపీఏ హయాంలో ఏటా బడ్జెట్‌ను మేం కూలంకషంగా పరిశీలించి సూచనలు చేసేవాళ్ళం. మాకు ఇచ్చిన సమయాన్ని నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొనేందుకు వినియోగించుకున్నాం. గతంలో పార్లమెంటు సజావుగా సాగడం గురించి, ఒకోసారి అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగడం గురించి నేడు ప్రతిపక్షాలు గుర్తుచేసుకుంటున్నాయంటే దానికి కారణం బిజెపి సభను నిర్వహించడానికి సహకరించడమే కాకుండా అన్ని పార్లమెంటరీ కార్యక్రమాలలో నిర్మాణాత్మకంగా నిమగ్నమై పని చేయడమే. ప్రతిపక్ష పార్టీగా బిజెపి ప్రతిపక్ష పార్టీలకు ఉన్నత ప్రమాణాలను నిర్దేశించింది.

ప్ర: మీరు పార్లమెంటు సమావేశాలకు ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ఇతర ప్రతిపక్ష నాయకులను కలిశారు. వారితో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి?

జ: నేను ప్రతిపక్ష నేతలతో ముఖాముఖి సమావేశాలు జరిపినప్పుడల్లా, అది ఖర్గే జీ అయినా లేక మరే ఇతర నాయకుడైనా, ఎప్పుడూ స్నేహపూర్వకంగానే ఉంటుంది. నిజానికి ఈ వ్యక్తిగత సమావేశాలు ఫలవంతమైనవిగా ఉంటాయి. రాజకీయ ఒత్తిడుల వల్లే చాలా మంది సభలో సమస్యలపై చర్చించేటప్పుడు రాజకీయాల్లోకి వెళతారు. వ్యక్తిగత సమావేశాలలో చూపిన సహృదయత, సహకార స్ఫూర్తి సభలో కూడా ప్రతిబింబిస్తుందని నేను ఆశిస్తున్నాను. తద్వారా పార్లమెంటులో చర్చల నాణ్యత మెరుగుపడుతుంది. ఫలితం మరింత సానుకూలంగా ఉంటుంది.

నాగార్జున