కాంగ్రెస్ గ్యారంటీలకు హరియాణాలో చుక్కెదురు … తెలంగాణలో అస్తవ్యస్తం!
ఒకొక్క రాష్ట్రంలో ఎన్నికలలో గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తూ వస్తున్న కాంగ్రెస్ కు హరియాణా ప్రజలు చుక్కలు చూపించారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ అక్కడి ప్రజలు ఆ పార్టీ మోసపు హామీలను తిప్పికొట్టారు. అందుకు ప్రధానంగా గ్యారంటీల పేరుతో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ప్రజలను ఆ ప్రభుత్వం మోసం చేస్తూ, ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తుండటాన్ని గమనించడమే కారణమని చెప్పవచ్చు. అందుకే కాంగ్రెస్ 7 గ్యారంటీలు అంటూ ఎంతగా ప్రచారం చేసినా ప్రజలు విశ్వసించలేదు. 10 గ్యారెంటీలంటూ హిమాచల్‌ను దివాలా తీసేలా చేసి, 5 గ్యారెంటీల పేరిట కర్ణాటకను అధోగతి పాల్జేసి, 6 గ్యారెంటీలంటూ తెలంగాణను అస్తవ్యస్తం చేసిన కాంగ్రెస్ చేష్టలను గమనిస్తూ వచ్చిన హరియాణా ఓటర్లు ఆ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ ఎరుగని విధంగా అనూహ్యమైన తీర్పు ఇచ్చారు.
1966లో హరియాణా రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగితే, ఎప్పుడూ అధికారంలో ఉన్న పార్టీ గెలుపొందలేదు. కానీ, బిజెపి మాత్రమే ఒకసారి కాదు, వరుసగా మూడోసారి గెలిపించి అక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొంది. పైగా, దేశం అంతా బిజెపి ప్రభంజనం వీస్తున్నట్లు భావించిన 2014, 2019లలో కన్నా పెద్ద మెజారిటీ ఇచ్చి ఆదరించారు. 6 గ్యారెంటీల పేరిట తెలంగాణలో నిరుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను అటకెక్కించింది. ఒకటీ, అరా పాక్షికంగా అమలు చేసి చేతులు దులుపుకొన్నది. మహాలక్ష్మి పథకంలో ప్రధానమైన హామీ ప్రతీ మహిళకు నెలకు రూ.2,500 సాయం ఇంకా అమలు కాలేదు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత వంటి హామీలను గాలికొదిలేసింది. రుణమాఫీ అంటూ ప్రకటించి అభాసుపాలైంది. 10 నెలల వ్యవధిలో రూ.73 వేల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసింది. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చెరువుల పరిరక్షణ పేరిట హైడ్రాను తెరపైకి తెచ్చింది. పేదల ఇండ్ల కూల్చివేతే టార్గెట్‌గా హైడ్రా చర్యలు ఉండటంతో ప్రజాక్షేత్రం నుంచి విమర్శలపాలైంది. ఆర్‌ఆర్‌ఆర్ రూట్ మ్యాప్, మూసీ రివర్ ఫ్రంట్‌లో పెద్దయెత్తున అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో రేవంత్ సర్కారుపై దిల్లీలోని అధిష్టానం కూడా ఒకింత ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. చివరకు ఆయన మంత్రులే ఆయన చేష్టలకు నివ్వెరపోతూ అసమ్మతి గళం విప్పుతున్నారు.
అధికారం చేపట్టగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీల వర్షం కురిపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 నెలలు అవుతున్నా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఎన్నికల ముందు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుతో ప్రియాంక గాంధీతో నిర్వహించిన సభ సాక్షిగా తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ప్రియాంక గాంధీతో చెప్పించారు. పైగా, ప్రతి సంవత్సరం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తామని చెప్పారు. అసెంబ్లీ వేదికగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ విడుదల చేశారని తెలిపారు. గ్రూప్-1 నియామకాలను నోటిఫికేషన్ ఏప్రిల్ 2024లో విడుదల చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడమే కాకుండా నిరుద్యోగుల ఓట్ల కోసం జాబ్ క్యాలెండర్ అంటూ యువతను నమ్మించి మోసం చేశారు. కాంగ్రెస్ అభయహస్తం నిరుద్యోగుల పాలిట భస్మాసుర హస్తంగా మారిందని చెప్పవచ్చు. దిల్లీకి మూటలు పంపడంపై రేవంత్ రెడ్డి తీరిక లేకుండా ఉండడంతో నిరుద్యోగులు, యువత గురించి పట్టించుకోలేక పోతున్నారని భావించాల్సి ఉంటుంది. ఇక, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2023 డిసెంబర్ 9న రైతులందరికీ రూ.2లక్షల వరకూ రుణమాఫీ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కానీ, అధికారం చేపట్టి 6 నెలలైనా రుణమాఫీ అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల్లో ఆగ్రహం పెరిగింది. ఇది గ్రహించి 2024 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో 2024 ఆగస్టు 15 కల్లా మాఫీ చేస్తామని కనిపించిన దేవుళ్లందరిపైనా రేవంత్ రెడ్డి ఒట్టు వేశారు. తీరా ఆగస్టు 15 కల్లా పంట రుణాలను సగం మంది రైతులకు మాత్రమే మాఫీ చేశారు. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ అక్టోబర్ 5న మహారాష్ట్రలో జరిగిన ఓ బహిరంగ సభలో తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేదని, మాఫీ కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారంటూ చెబితే రేవంత్ రెడ్డి తట్టుకోలేక ఆయనకు ఓ బహిరంగ లేఖ వ్రాసారు.
రూ.2లక్షల లోపు పంట రుణాలు మాఫీ చేసేందుకు రూ.49,500కోట్లు అవసరం అవుతాయని రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ(ఎస్ఎల్బీసీ) సమావేశంలో చెప్పారు. ఆ తర్వాత పంట రుణమాఫీకి రూ.40వేల కోట్లు ఖర్చవుతాయని 2024 మే 1న గాంధీ భవన్‌లో జరిగిన కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. తర్వాత జరిగిన క్యాబినెట్ సమావేశంలో రుణమాఫీకి రూ.31వేల కోట్లు అవసరమని నిర్ణయించారు. తీరా రాష్ట్ర బడ్జెట్లో రుణమాఫీ పథకానికి మీరు కేటాయించింది కేవలం రూ.26వేల కోట్లు మాత్రమే. 2024 జులై 18 నుంచి ఆగస్టు 15 వరకు కేవలం 22.22లక్షల మంది అన్నదాతలకు రూ.17.869 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. అబద్ధాలతో జనాన్ని ఏవిధంగా మోసం చేస్తున్నారో కాంగ్రెస్ ప్రభుత్వ అంకెలే స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ చూసే హరియాణా ప్రజలు ఆ పార్టీకి శృంగభంగం కలిగించారు.
ప్రవీణ్