Budget 2024

దేశాభివృద్ధికి ‘నవ’ పథం

Budgetవికసిత్ భారత్ కు పునాది వేసేలా మోదీ 3.0 తొలి బడ్జెట్ ప్రకటించింది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ను నిలిపే లక్ష్యంగా 2024-25 కేంద్ర బడ్జెట్ ను రూపొందించింది. ఇందుకు తొమ్మిది ప్రాథమ్యాలను నిర్దేశించింది. ఈ బడ్జెట్ ఉపాధి కల్పనకు పెద్దపీట వేసింది. ఉత్పత్తి, నిర్మాణ రంగాల్లో యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టింది. ఇందుకు ఉపాధి కల్పించే సంస్థలకు ప్రోత్సహకాలు ఇవ్వనుంది. సంఘటిత రంగంలో ఉద్యోగంలో చేరేవారికి తొలి వేతనాన్ని ప్రభుత్వమే ఇచ్చేందుకు నిర్ణయించింది. దేశీయంగా ఉన్నత విద్యకూ రుణ భరోసా కల్పించింది. వేతన జీవులకు ఆదాయ పన్ను ఊరటనిచ్చింది. జూలై 23న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలన్న మోదీ ప్రభుత్వ నిబద్ధతకు అద్దం పట్టింది. 48లక్షల కోట్ల పైచిలుకు బడ్జెట్ లో వ్యవసాయానికి రూ.1.52 లక్షల కోట్లు, మహిళా సంక్షేమానికి రూ.3 లక్షల కోట్లు, రైల్వేలకు రూ.2.62 లక్షల కోట్లు, గ్రామాణాభివృద్ధికి రూ.1.77 లక్షల కోట్లు, రక్షణ రంగానికి రూ.6.22 లక్షల కోట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.11.11 లక్షల కోట్లు దక్కాయి.

2024-25 బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2047 నాటికి వికసిత భారత్‌ సాకారమే లక్ష్యంగా ‘వ్యవసాయ రంగంలో మరింత ఉత్పాదకత, ఉపాధి–నైపుణ్యాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి–సామాజిక న్యాయం, నిర్మాణ–సేవా రంగాలు, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, ఇన్నోవేషన్‌–రీసెర్చ్, సంస్కరణ’ల పేరిట ఎన్డీఏ ప్రభుత్వ ‘తొమ్మిది ప్రాథమ్యాల’కు తెరతీశారు. దీన్ని రానున్న బడ్జెట్లలో మరింత ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. 4.1 కోట్ల పైచిలుకు యువతీయువకులకు వచ్చే ఐదేళ్లలో ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన నిమిత్తం 5 పథకాలతో కూడిన ‘ప్రధానమంత్రి ప్యాకేజీ’ని ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉపాధి నైపుణ్యాలు, కోటి మందికి టాప్‌–500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ అవకాశం, ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల దాకా రుణాలు వంటివి ప్రకటించారు.

సాగులో ఉత్పాదకతను పెంచేలా ప్రభుత్వం పరిశోధనలకు పెద్దపీట వేయనుంది. అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే 100కు పైగా వంగడాలను రైతులకు అందుబాటులోకి తీసుకురానుంది. కోటి మందికి పైగా రైతులను సేంద్రియ సాగు వైపు ప్రోత్సహించనుంది. నగరాల సమగ్రాభివృద్ధికి రాష్ట్రాల సమన్వయంతో కృషి చేస్తామని నిర్మల పేర్కొన్నారు. శివారు ప్రాంతాల అభివృద్ధి ద్వారా వాటిని గ్రోత్‌ హబ్‌లుగా తీర్చిదిద్దుతామన్నారు. పీఎం ఆవాస్‌ యోజన కింద మరో 3 కోట్ల ఇళ్లు కట్టించనున్నారు. మహిళలు, బాలికల ప్రగతి, సంక్షేమానికి ఈసారి ఏకంగా రూ.3 లక్షల కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది గిరిజనులకు లబ్ధి కలిగేలా పథకాన్ని ప్రతిపాదించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను మరింతగా ప్రోత్సహించేందుకు ముద్రా రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచారు. పీఎం విశ్వకర్మ, స్వానిధి, స్టాండప్‌ ఇండియా తదితరాలతో చేతి వృత్తుల వారు, స్వయంసహాయక బృందాలు మొదలుకుని ఎస్సీ, ఎస్టీల దాకా అన్ని వర్గాల సంక్షేమానికి భరోసా కల్పించారు.

‘పూర్వోదయ’ పథకం తూర్పు భారతదేశ ప్రగతిని పరుగులు పెట్టించనుంది. ఈశాన్య రాష్ట్రాలకూ పలు కేటాయింపులు చేశారు. పర్యాటకాభివృద్ధికి పలు చర్యలను ప్రతిపాదించారు. ఏంజెల్‌ ట్యాక్స్‌ రద్దు ద్వారా స్టార్టప్‌లకు మరింత ఊపునిచ్చేందుకు ప్రయత్నించారు. విదేశీ కంపెనీలపై ఆదాయ పన్ను భారాన్ని 40 నుంచి 35 శాతానికి తగ్గించారు. అన్ని రంగాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పరిశోధనల కోసం అనుసంధాన్‌ నేషనల్‌ రీసెర్చ్‌ ఫండ్‌ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. పట్టణ భూ రికార్డులను పూర్తిగా డిజిటైజ్‌ చేయనున్నట్టు తెలిపారు.

మౌలికానికి అధిక ప్రాధాన్యం

దేశంలో రానున్న ఐదేళ్లలో మౌలిక రంగం పురోగతికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. 2024- 25 సంవత్సరానికి మూలధన (క్యాపెక్స్) వ్యయం కోసం ప్రభు త్వం రూ.11,11,111 కోట్లను అందజేస్తుందని తెలిపారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 3.4 శాతానికి సమానం. మౌలిక సదుపాయాలలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి తగిన విధానాలు, నిబంధనలను అమల్లోకి తీసుకురావడం సహా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ను (వీజీఎఫ్) ప్రవేశపెడుతుందని ఈ విషయంలో రాష్ట్రాలను సైతం ఇదే స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి చెప్పారు. రాష్ట్రాలకు వనరుల కేటాయింపులో మద్దతుగా నిలిచేందుకు ఈ ఏడాది కూడా దీర్ఘకాలిక వడ్డీ రహిత రుణాల కోసం రూ.1.5 లక్షల కోట్ల కేటాయింపు జరిగిందని పేర్కొన్నారు.

రైల్వే శాఖకు రూ. 2,62,200 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపుల్లో పాత ట్రాక్ల మార్పునకు, సిగ్నలింగ్ సిస్టమ్ మెరుగుపరచడానికి, ఫ్లైఓవర్లు, అండర్పాస్ ల నిర్మాణానికి, కవచ్ ఇన్స్టాలేషన్ వంటి భద్రతా చర్యలకు రూ.1,08,795 కోట్లు వెచ్చించనున్నారు. హైవేల బాధ్యతలు చూసుకునే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఎ)కు రూ.1.68 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించింది. జాతీయరహదారుల కోసం 2024-25 బడ్జెట్లో రూ.2.78 లక్షల కోట్లు ఖర్చుచేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. పౌరవిమానయాన శాఖకు రూ.2,357.14 కోట్లు కేటాయించింది. ప్రాంతీయ విమానయాన అనుసంధాన పథకానికి రూ.502 కోట్లు కేటాయించింది. డ్రోన్లు, డ్రోన్ల పరికరాలకు సంబంధించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహక (పీఎస్ఐ) పథకానికి రూ.57 కోట్ల మేర కేటాయింపులు చేసింది. ఇక డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు రూ.302.64 కోట్లు, బ్యోరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్)కు రూ.89 కోట్లు, ఎయిర్ ఇండియా రిటైర్డ్ ఉద్యోగుల వైద్య ఖర్చుల చెల్లింపులకు రూ.85 కోట్లు, హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు రూ.57.14 కోట్ల మేర కేంద్రం కేటాయించింది. 

వివిధ రాష్ట్రాల్లో వరద నియంత్రణ చర్యలకు, నీటిపారుదల ప్రాజెక్టులకు సమగ్ర ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. వివిధ కార్యక్రమాల కింద వేగవంతమైన ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్, ఇతర కార్యక్రమాలకు రూ.11,500 కోట్లు అందిస్తామని తెలిపారు. మొబైల్ ఫోన్ల వినియోగం అధికమవుతూ, ప్రపంచ వ్యాప్తంగా టెలికాం సేవలు మెరుగుపడటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికోసం 25 లక్షల కొత్త మొబైల్ టవర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే 5జీ సర్వీసులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా పెంచనున్నారు.

అవసరార్థులకు ఆపన్న హస్తం

దేశంలోని గిరిజనుల సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకాన్ని ప్రకటించింది. అలాగే సంబంధిత శాఖకు బడ్జెట్లో గత ఏడాదికన్నా 70 శాతం నిధులను పెంచింది. ఈ పథకంతో దేశం లోని 63వేల గిరిజన గ్రామాల్లోని 5 కోట్ల జనాభాకు ప్రయోజనం చేకూరనుంది. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఈసారి బడ్జెట్లో రూ.13,000 కోట్లకు కేటాయింపులు పెంచడం విశేషం. ఇందులో రూ.6,399 కోట్లను మారుమూల గ్రామాల్లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో మెరుగైన వసతులను కల్పించేందుకు కేటాయించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాలు, మైనారిటీలకు ఈసారి రూ.6,611.69 కోట్లు కేటాయించడం విశే షం.

సామాజిక న్యాయం, సాధికారతకు బడ్జెట్లో రూ.13,539 కోట్లు కేటాయించారు. ఈ నిధుల నుంచి వివిధ పథకాల ద్వారా ఎస్సీల అభివృద్దికి రూ.9,549.98 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇతర నిరుపేద వర్గాల అభ్యున్నతికి వివిధ పథకాల కోసం ఈ శాఖకు రూ.2,150 కోట్లు కేటాయించారు. మాదకద్రవ్యాల నిరోధానికి జాతీయ యాక్షన్ ప్లాన్ కోసం రూ.314 కోట్లు, కేంద్ర కార్యనిర్వహణ స్థాపక ఖర్చులకు రూ.145.80 కోట్లు, ఎస్సీ జాతీయ కమిషన్కు రూ.38 కోట్లు, బీసీ జాతీయ కమిషన్కు రూ.21 కోట్లు కేటాయించారు. ఇక గుర్తింపులేని, సంచార జాతులు, పాక్షిక సంచార జాతుల అభివృద్ధికి రూ.5 కోట్లు కేటాయించారు. షెడ్యూల్ కులాలకు సంబంధించి యంగ్ అచీవర్స్ స్కీమ్ కింద ఉన్నత విద్య కోసం రూ.428 కోట్లు, అలాగే ఎస్సీల రెసిడెన్షియల్ హైస్కూల్ ఎడ్యుకేషన్ పథకానికి రూ.133.07 కోట్లు కేటాయించారు. ప్రధాన మంత్రి దక్షత ఔర్ కుశలత సంపన్న హితగ్రాహి యోజన పథకం ద్వారా నైపుణ్య శిక్షణ కోసం రూ.130 కోట్లు కేటాయించారు.

మైనార్టీ వ్యవహారాల శాఖకు రూ.3,183.24 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.1,575.72 కోట్లను మైనార్టీల విద్యా సాధికారతకు ఖర్చు చేయనున్నారు. ప్రి-మెట్రిక్ స్కాలర్షిప్లకు రూ.326.16 కోట్లు, పోస్టు-మెట్రిక్ స్కాలర్షిప్లకు రూ.1,145.38 కోట్లు వెచ్చిస్తారు. మైనార్టీ వ్యవహారాల శాఖలో పలు పథకాలు, ప్రాజెక్టుల అమలుకు 2,120.72 కోట్లు ప్రత్యేకించారు. ఇదే శాఖలో ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమానికి రూ.910.90 కోట్లు ఖర్చు చేయనున్నారు. నేషనల్ మైనార్టీస్ డెవలప్మెంట్, ఫైనాన్స్ కార్పొరేషన్కు రూ.800 కోట్లు కేటాయించారు.

దివ్యాంగుల సంక్షేమానికి రూ.1,225.27 కోట్లు కేటాయించింది. దివ్యాంగుల సంక్షేమానికి కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాల కింద ఈ నిధులను వినియోగిస్తారు. దివ్యాంగులకు అవసరమయ్యే వివిధ పరికరాల కొనుగోలుకు ఈ నిధుల నుంచి రూ.315 కోట్లు ఖర్చు చేస్తారు. దీనదయాళ్ దివ్యాంగుల పునరావాస పథకానికి రూ.165 కోట్లు కేటాయించారు.

ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద ఇచ్చే రుణాల పరిమితిని రూ.10 లక్షల నుండి రూ.20 లక్షలకు పెంచారు. ముద్ర యోజన కింద మూడు రకాల రుణాలు లభిస్తాయి. అవి:

  • శిశు: రూ.50,000 వరకు
  • కిశోర్: రూ.50,000 నుండి రూ.5 లక్షల వరకు
  • తరుణ్: రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు

ప్రస్తుతం తరుణ్ విభాగం కింద రుణాలు తీసుకున్న వారు మళ్ళీ రూ.10 లక్షల వరకు అదనపు రుణం పొందే అవకాశం ఉంది. ఈ మొత్తం మొత్తం రూ.20 లక్షలు అవుతుంది.

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) తోడ్పాటు అందించే దిశగా యంత్ర పరికరాల కొనుగోలు కోసం ఎటువంటి కొలేటరల్‌ లేదా థర్డ్‌ పార్టీ గ్యారంటీ లేకుండా టర్మ్‌ లోన్స్‌ తీసుకునే వెసులుబాటు లభించేలా రుణ హామీ పథకాన్ని ప్రకటించారు. దీనికోసం విడిగా సెల్ఫ్‌–ఫైనాన్సింగ్‌ గ్యారంటీ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇది ఒక్కో దరఖాస్తుదారుకు రూ. 100 కోట్ల వరకు రుణాలకు (తీసుకున్న రుణ మొత్తం ఎంతైనా సరే) హామీ ఇస్తుంది.

ఇంధన సమృద్ధి కోసం

దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్ల ద్వారా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ఉద్దేశించిన పీఎం సూర్యఘర్ బిజిలీ యోజనకు అద్భుతమైన స్పందన లభిస్తోందని కేంద్రమంత్రి అన్నారు. ఇప్పటిదాకా 1.28 కోట్లకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగాయని, 14 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలియజేశారు. విద్యుత్ రంగంలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు మరింత ప్రోత్సాహం ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు. విద్యుత్ నిల్వ, సరఫరాకు ఈ ప్రాజెక్టు దోహదపడతాయన్నారు. అలాగే వికసిత్ భారత్ దిశగా విద్యుత్ రంగంలో అణు ఇంధనం పాత్ర కీలకమని మంత్రి వివరించారు. ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో భారత్ స్మాల్ రియాక్టర్లు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ భారత్ స్మాల్ రియాక్టర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూయర్ టెక్నాలజీస్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీని నెలకొల్పనున్నట్లు ప్రకటించారు. అణు ఇంధన రంగంలో పరిశోధన, అభివృద్ధికి ఇతోధికంగా నిధులు ఇస్తామన్నారు.

అంతరిక్ష సాంకేతికతను ప్రోత్సహిస్తూ రూ.1,000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండు ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. వచ్చే పదేళ్లలో అంతరిక్ష మార్కెట్ను ఐదు రెట్లు పెంచాలన్న తమ లక్ష్యంలో భాగంగా దీన్ని ప్రతిపాదిస్తున్నట్టు చెప్పారు. అంతరిక్ష రంగానికి బడ్జెట్లో 18 శాతం అధికంగా ఈసారి రూ.13,042 కోట్లను కేటాయించడం గమనార్హం. ఇందులో సింహభాగం రూ.10,087 కోట్లు ఇస్రో ఆధ్వర్యంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్, ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్, యూఆర్ రావు శాటిలైట్ సెంటర్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ తదితర సంస్థలకు వెళుతుంది.

భారత ప్రభుత్వం కీలక ఖనిజాలను దేశీయంగా ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ కీలక ఖనిజాలలో బెరీలియం, కాండియం, కోబాల్ట్, కాపర్, గ్రాఫైట్, ఇండియం, లిథియం, మాలిబ్డినం, నికెల్ వంటివి ఉన్నాయి. ఈ ఖనిజాలను దేశీయంగా ఉత్పత్తి చేయడానికి, విదేశాల నుండి సేకరించడానికి ప్రభుత్వం క్రిటికల్ మినరల్ మిషన్ అనే ప్రణాళికను ప్రవేశపెట్టింది. ఈ మిషన్ ద్వారా టెక్నాలజీ అభివృద్ధి, నైపుణ్య శిక్షణ కూడా అందిస్తుంది. ప్రభుత్వం సముద్రాలలోని ఖనిజాలను తవ్వడానికి కూడా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ప్రణాళికలలో భాగంగా, ప్రభుత్వం ఖనిజాలను తవ్వడానికి వేలం వేయాలని నిర్ణయించింది.

జలవనరుల శాఖకు, నదుల అభివృద్ధికి, గంగా పునరుజ్జీవానికి ఈ బడ్జెట్లో రూ.30,233.83 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అటల్ భూజల్ యోజన కార్యక్రమానికి రూ.1,778 కోట్లు, ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన పథకానికి రూ. 9,339.37 కోట్లు, నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్కు రూ.592.11 కోట్లు కేటాయించారు.

హోంకు రూ.2.19 లక్షల కోట్లు

బడ్జెట్ లో కేంద్ర హోం శాఖకు రూ.2.19 లక్షల కోట్ల కేటాయింపులు దక్కాయి. ఇందులో సింహభాగం సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ వంటి కేంద్రసాయుధ బలగాలకు కోసం ఖర్చుచేయనున్నారు. పారా మిలటరీ విభాగాలకు కేటాయించిన పద్దు ఏకంగా రూ.1.43,275.90 కోట్లు. దేశ రాజధాని దిల్లీకి రూ.42,277.74 కోట్లు ఇచ్చారు. కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవుల కోసం రూ.5,985.82 కోట్లు, పుదుచ్చేరికి రూ.5,862.62 కోట్లు, లద్దాఫ్ కోసం రూ.5,958 కోట్లు, దాద్రానగర్ హవేలీ, డయ్యూడామన్ కోసం రూ.2,648.97 కోట్లు, లక్షద్వీప్ కోసం రూ.1,490.10 కోట్లు కేటాయింపులు జరిగాయి. జనగణన కోసం రూ.1,309.46 కోట్లు కేటాయించారు. జాతీయ విపత్తు స్పందన దళం కోసం రూ.1606 కోట్లు, సీఆర్పీఎఫ్ కు రూ.31,543.20 కోట్లు, బీఎస్ఎఫ్ కు రూ.25,472.44 కోట్లు కేటాయించారు.

దిల్లీ పోలీస్ విభాగానికి రూ.11,400.81 కోట్లు, ప్రధాని వంటి వీవీఐపీలను కంటికి రెప్పలా కాపాడే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ)కి రూ.506.32 కోట్లు కేటాయించారు. మంత్రి మండలి, ప్రధాని కార్యాలయం, అతిథులు ఆతిథ్యానికి, జాతీయ భద్రతా మండలికి రూ.1,248.91 కోట్లు కేటాయించారు. మంత్రి మండలికి ఖర్చుల కోసం మొత్తం రూ.828.36 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. వీటిని కేబినెట్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మాజీ ప్రధానుల వేతనాలు, ఇతర అలవెన్సులు, వారి ప్రయాణాలకు ఉపయోగిస్తారు. విదేశీ నేతలు, విశిష్ట అతిథుల ప్రయాణాల విమాన సర్వీసులు, సదుపాయాలు, రాష్ట్రపతి భవన్ వద్ద ఆహ్వాన ఏర్పాట్ల కోసం ఈ నిధులను వినియోగిస్తారు. జాతీయ భద్రతా మండలి సచివాలయం నిర్వహణ కోసం ఈసారి రూ.202.10కోట్లు కేటాయించారు. 

పొరుగుకు చేయూత

భారత పొరుగుదేశమైన భూటాన్‌కు ‘నైబర్‌హుడ్‌ ఫస్ట్‌’ పాలసీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా రూ.2068 కోట్లను అభివృద్ధి ఎయిడ్‌ కింద కేటాయించింది. మాల్దీవులకు మాత్రం గత ఏడాదితో పోలిస్తే నిధుల్లో కోత విధించింది. మాల్దీవులకు గత ఏడాది రూ.770 కోట్లు కేటాయించగా, ఈసారి బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించింది. భూటాన్‌ తర్వాత నేపాల్‌కు అధికంగా నిధులు (రూ.700 కోట్లు) కేటాయించారు. అఫ్గానిస్తాన్‌కు రూ.200 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ.120 కోట్లు, మయన్మార్‌కు రూ.250 కోట్లు, మారిషస్‌కు రూ.370 కోట్లు, ఆఫ్రికా దేశాలకు రూ.200 కోట్లు కేటాయించారు. లాటిన్‌ అమెరికా, యురేసియా దేశాలకు అభివృద్ధి సాయం కింద రూ. 4883 కోట్లు కేటాయించారు. ఈసారి విదేశాంగ శాఖకు రూ.22,154 కోట్లు కేటాయించారు.

కేంద్ర మంత్రుల జీతాలతోపాటు కేంద్ర సచివాలయం, ప్రధాని కార్యాలయ నిర్వహణ వ్యయం, దేశానికి విచ్చేసే అతిథుల బస, వినోద ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.1,248.91 కోట్లు కేటాయించింది. దేశంలోని దిగువ కోర్టుల్లో రికార్డుల డిజిటైజేషన్కు ఉద్దేశించిన ఈ-కోర్టు ప్రాజెక్టు మూడో దశ అమలుకు 2024-25 బడ్జెట్లో కేంద్రం రూ.1,500 కోట్లు కేటాయించింది. నాలుగేళ్లలో ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది.

క్రూజ్‌ పర్యాటకానికి ప్రోత్సాహం

పర్యాటక అభివృద్ధికి రూ.2,479.62 కోట్లు కేటాయించారు. బిహార్లోని విష్ణుపాద, మహాబోధి ఆలయాలను ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)కు రూ.1,273.91 కోట్లు ఇచ్చారు. ప్రస్తుతం ఏఎస్ఐ పరిధిలో 3,697 ప్రాచీన, వారసత్వ కట్టడాలు, ప్రాంతాలు ఉన్నాయి. దేశీ క్రూజ్‌ విభాగంలో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ షిప్పింగ్‌ కంపెనీలకు సులభతర పన్నుల విధానాన్ని నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. క్రూజ్‌ పర్యాటకంలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఈ చర్య తీసుకున్నారు. సముద్ర జలాలపై నడిచే పర్యాటక ఓడలను క్రూజ్‌లుగా చెబుతారు. ఈ విభాగంలో భారత షిప్పింగ్‌ పరిశ్రమ వాటాను పెంచేందుకు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు యాజమాన్యం, లీజింగ్‌ పరంగా సంస్కరణలు తీసుకొస్తామని ప్రకటించారు. క్రూజ్‌ పర్యాటకానికి భారత్‌ను ఆర్షణీయ కేంద్రంగా మారుస్తామని, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తామని చెప్పారు.

ఈకామర్స్‌ హబ్‌లకు ప్రతిపాదనలు

ఈకామర్స్‌ రంగం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో హబ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఇందుకు ప్రభుత్వ, ప్రయివేట్‌ విధానం(పీపీపీ)లో వీలు కల్పించనుంది. అవాంతరాలులేని నియంత్రణ, లాజిస్టిక్‌ మార్గదర్శకాల ద్వారా ఒకే గొడుగు కింద వాణిజ్యం, ఎగుమతి సంబంధ సర్వీసులకు ఇవి తెరతీయనున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎంఎస్‌ఎంఈలు), సంప్రదాయ చేనేత, హస్తకళలు తదితర శ్రామికులు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించేందుకు వీలు చిక్కనుంది. హబ్‌ల ద్వారా తొలుత చిన్న తయారీదారులు ఈకామర్స్‌ సంస్థలు(అగ్రిగేటర్ల)కు ఉత్పత్తులను విక్రయిస్తారు. తదుపరి ఇతర మార్కెట్లలో అగ్రిగేటర్లు వీటిని విక్రయిస్తాయి. ప్రధానంగా ఆభరణాలు(జ్యువెలరీ), దుస్తులు, హస్తకళలు తదితరాలకు భారీ అవకాశాలున్నాయి. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునే బాటలో ఆర్‌బీఐ సహా సంబంధిత శాఖలతో వాణిజ్య శాఖ విభాగం డీజీఎఫ్‌టీ కలసి పని చేస్తోంది. ఫలితంగా ఈ హబ్‌లకు ఎగుమతులు క్లియరెన్స్‌లను కల్పిస్తారు. అంతేకాకుండా వేర్‌హౌసింగ్, కస్టమ్స్‌ క్లియరెన్స్, రిటర్నుల ప్రాసెసింగ్, లేబిలింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్‌లను వీటికి జత చేస్తారు.

కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కు రూ.425.71 కోట్ల మేర కేటాయింపులు చేసింది. అందులో రూ.216.72 కోట్లను వివిధ పరీక్షల నిర్వహణకు కేటాయించగా రూ. 208.99 కోట్లను యూపీఎస్సీ సిబ్బంది జీతాలు, పరిపాలనా ఖర్చులు, చైర్మన్ సహా ఇతర సభ్యుల అలవెన్సులు తదితరాల కోసం కేటాయించింది. అవినీతి వ్యతిరేక అంబుడ్స్ మన్ లోక్పాల్ కు ఈ బడ్జెట్లో రూ.33.32 కోట్లు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కు రూ. 51.31 కోట్ల మేర కేటాయింపులు చేసింది.

న్యాయ శాఖకు రూ.1,000 కోట్లను బడ్జెట్లో ప్రత్యేకించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రాలు చేసిన ఖర్చును కేంద్రం రీయింబర్స్మెంట్ చేసేందుకు ప్రత్యేకంగా బడ్జెట్ను కేటాయించారు. కొత్త ఓటర్ ఫొటో గుర్తింపు కార్డుల జారీకి రూ.404 కోట్లు రీయింబర్స్ చేయనున్నారు. కొత్త ఈవీఎంల కొనుగోలు కోసం న్యాయశాఖకు రూ.34 కోట్లు కేటా యించారు. పాత ఈవీఎంలను ప్రోటోకాల్ ప్రకారం ధ్వంసం చేయడానికీ బడ్జెట్ను విడిగా కేటాయించారు. 

ఎన్‌పీఎస్‌పై మరింత పన్ను ప్రయోజనం

నూతన పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చే దిశగా కేంద్ర సర్కారు జాతీయ పింఛను పథకంలో (ఎన్‌పీఎస్‌) పెట్టుబడులకు ప్రోత్సాహకాన్ని పెంచింది. ఉద్యోగి తరఫున ప్రైవేటు సంస్థలు జమ చేసే ఎన్‌పీఎస్‌ వాటాపై పన్ను మినహాయింపు పరిమితిని 14 శాతం చేసింది. ఉద్యోగి మూల వేతనం, కరువు భత్యంలో (గరిష్ట పరిమితి రూ.లక్ష) 10 శాతం జమలపైనే ప్రస్తుతం పన్ను మినహాయింపు ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఇది 14 శాతంగానే ఉండగా.. ప్రైవేటు రంగ ఉద్యోగులకు సైతం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాన్ని పెంచారు. ఆదాయపన్ను చట్టంలోని పాత పన్ను వ్యవస్థలో ఉద్యోగి తరఫున సంస్థలు చేసే ఎన్‌పీఎస్‌ జమలపై పన్ను మినహాయింపు 10 శాతంగానే కొనసాగుతుంది. 

ఎగవేసిన పన్ను ఆదాయం రూ.50 లక్షలకు మించి ఉన్నప్పుడే.. అసెస్‌మెంట్‌ సంవత్సరం ముగిసిన మూడు నుంచి ఐదేళ్లలోపు తిరిగి మదింపు చేయవచ్చని ప్రకటించారు. సోదాలకు సంబంధించి కూడా ప్రస్తుతం అసెస్‌మెంట్‌ సంవత్సరం ముగిసిన పదేళ్ల వరకు అవకాశం ఉండగా, దీన్ని ఆరేళ్లకు తగ్గించారు. పన్ను వివాదాల పరిష్కారానికి వీలుగా ‘వివాద్‌ సే విశ్వాస్‌ పథకం 2.0’ను తీసుకురానున్నారు.

దివాలా స్మృతి పక్రియను మరింత మెరుగుపరచడంపై బడ్జెట్‌ దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి స్థిరత్వం, పారదర్శకత, సమయానుకూల ప్రాసెసింగ్, వాటాదారులకు సంబంధించి మెరుగైన పర్యవేక్షణ సాధన లక్ష్యంగా ‘ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌’ను ఆవిష్కరిస్తున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. 2016 నుంచి అమల్లోకి వచ్చిన దివాలా కోడ్‌ పటిష్టత కోసం తగిన మార్పులను తీసుకురావడం జరుగుతుందని మంత్రి తెలిపారు. దివాలా స్మృతి 1,000 కంటే ఎక్కువ కంపెనీల దివాల అంశాలను పరిష్కరించిందని, ఫలితంగా రుణదాతలకు నేరుగా రూ.3.3 లక్షల కోట్ల రికవరీ జరిగింది.

దేశీయంగా టెలికం గేర్‌ తయారీకి దన్నుగా దిగుమతి సుంకాలు పెంచారు. ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డు(పీసీబీఏ)లుగా వ్యవహరించే మదర్‌బోర్డులపై 5 శాతం పెంపును ప్రతిపాదించారు. వెరసి టెలికం పీసీబీఏలపై బేసిక్‌ కస్టమ్‌ డ్యూటీ ప్రస్తుత 10 శాతం నుంచి 15 శాతానికి పెరగనుంది. అయితే కమ్యూనికేషన్‌ పరికరాల తయారీలో వినియోగించే కీలక 25 మినరల్స్‌పై డ్యూటీని పూర్తిస్థాయిలో మినహాయించింది. వీటిలో అణువిద్యుత్, పునరుత్పాదక ఇంధనం, రక్షణ, టెలికం రంగాలలో వినియోగించే లిథియం, కాపర్, కోబాల్ట్‌ తదితరాలున్నాయి.

బడ్జెట్‌లో వివిధ ఆస్తుల(సెక్యూరిటీలు, స్థిరాస్తులు) హోల్డింగ్‌ కాలావధి ఆధారంగా క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌లను క్రమబద్ధీకరించారు. ఏడాదికి మించి లిస్టెడ్‌ ఫైనాన్షియల్‌ ఆస్తుల హోల్డింగ్‌తో పాటు.. రెండేళ్లకు మించి ఆర్థికేతర ఆస్తులు, అన్‌లిస్టెడ్‌ ఆస్తుల హోల్డింగ్స్‌ దీర్ఘకాలిక క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ (ఎల్‌టీసీజీ) జాబితాలో చేరనున్నాయి. అన్‌లిస్టెడ్‌ బాండ్లు, డిబెంచర్లను మినహాయించి (వీటికి సంబంధిత స్లాబ్‌లు వర్తిస్తాయి) వివిధ ఆస్తులపై దీర్ఘకాలిక లాభాల పన్ను సగటున 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచారు. ఇక స్వల్పకాలిక క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ను 15 శాతం నుంచి 20 శాతానికి పెంచారు. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్స్, బిజినెస్‌ ట్రస్ట్‌ యూనిట్లు వీటిలోకి వస్తాయి. అయితే ఆర్థికేతర ఆస్తులపై 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించారు. ఎల్‌టీసీజీ పన్ను మినహాయింపు పరిమితి రూ.లక్ష నుంచి రూ. 1.25 లక్షలకు పెంచారు. డివిడెండ్‌ తరహాలో బైబ్యాక్‌ చేసే షేర్లపై వాటాదారులు పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌(డెరివేటివ్స్‌) లావాదేవీలపై పన్నును పెంచేందుకు ప్రతిపాదించారు. ఇందుకు అనుగుణంగా ఎఫ్‌అండ్‌వో సెక్యూరిటీస్‌లో ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌(ఎస్‌టీటీ)ను పెంచారు. 

బంగారం, వెండిపై కస్టమ్స్‌ సుంకాలు ప్రస్తుతం 15 శాతంకాగా, ఈ రేటును 6 శాతానికి తగ్గిస్తున్నట్లు  ప్రకటించారు. ఇందులో ప్రాథమిక కస్టమ్స్‌ సుంకం (బీసీడీ) 10 నుంచి 5 శాతానికి తగ్గగా, అగ్రికల్చరల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌ (ఏఐడీసీ) 5 శాతం నుంచి 1 శాతానికి చేరింది. ప్లాటినం, పల్లాడియం, ఓస్మియం, రుథేనియం, ఇరిడియంలపై లెవీని కూడా 15.4 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించారు.

దేశీయంగా సెమీ కండక్టర్ల పరిశ్రమ విస్తరణే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం రూ.6,903 కోట్లను కేటాయించింది. దీంతోపాటే దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీని పెంచే లక్ష్యంతో వాటి ముడిసరుకులపై సుంకాన్ని తగ్గించారు. సెమీకండక్టర్ల తయారీ, అసెంబ్లీ యూనిట్ల ఏర్పాటు కోసం రూ.4,203 కోట్లను కేటాయిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఎలక్ట్రానిక్ చిప్ ప్లాంట్ల కోసం రూ.1,500 కోట్లు, ఎలక్ట్రానిక్ డిస్ ప్లే ప్లాంట్ల కోసం రూ.100 కోట్లు, మొహాలీలో సెమీకండక్టర్ లేబొరేటరీ కోసం రూ.900 కోట్లు కేటాయించారు. భారత్ లో తయారయ్యే సెమీకండక్టర్ యంత్రాలు, ఈ-సైకిళ్లు, ప్రింటర్ క్యాట్రిడ్జ్ల తదితరాల కోసం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలయ్యేలా కొత్త టారీఫ్ ను తయారు చేసేందుకు కస్టమ్స్ టారీఫ్ చట్టం,1975 మొదటి షెడ్యూల్లో సవరణలు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ ఖర్చులు తగ్గించే ఉద్దేశంతో వాటిల్లో వాడే ఎలక్ట్రానిక్ విడిభాగాలపై పన్నును తగ్గించారు. రెసిస్టర్ తయారీలో వాడే ఆక్సీజన్రహిత కాపర్ వంటి తదితర విడిభాగాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు. మరోవైపు మొబైల్ ఫోన్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కోసం రూ.6,125 కోట్లు, ఐటీ హార్డ్వేర్ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కోసం రూ.75 కోట్లు కేటాయించారు.

ద్రవ్యలోటు కట్టడి

ద్రవ్యలోటు కట్టడికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో లోటు 4.9 శాతానికి పరిమితం చేయాలని పూర్తిస్థాయి బడ్జెట్‌ నిర్దేశించుకుంది. రుణాలు మినహా ఆదాయాలు రూ.32.07 లక్షల కోట్లుగా ఉంటుందని తాజా బడ్జెట్‌ అంచనావేసింది. వ్యయాలు రూ.48.21 లక్షల కోట్లుగా పేర్కొంది. ఆదాయ విషయంలో నికర పన్ను వసూళ్ల లక్ష్యం రూ.25.83 లక్షల కోట్లుగా బడ్జెట్‌ అంచనా. వెరసి ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం రూ.16.14 లక్షల కోట్లుగా ఉంటుందని బడ్జెట్‌ అంచనా వేసింది. అంటే జీడీపీ అంంచనాల్లో ఇది 4.9 శాతమన్నమాట.

ప్రభుత్వ సంస్థలలో వాటాల విక్రయం(డిజిన్వెస్ట్‌మెంట్‌) ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రూ. 50,000 కోట్లు సమీకరించవచ్చని తాజా బడ్జెట్‌ అంచనా వేసింది. ఇక కేంద్ర ప్రభుత్వ కంపెనీల(సీపీఎస్‌ఈలు) నుంచి రూ. 56,260 కోట్ల డివిడెండ్‌ లభించవచ్చని భావిస్తోంది.