digital India rural

గ్రామీణ భారతంలో డిజిటల్ విప్లవం

దేశంలో కొనసాగుతున్న అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో పాటు బిజెపి పాలిత రాష్ట్రాలు, ఎన్డీఏ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. మన దేశంలో 6 లక్షల గ్రామాలు ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో పల్లెల సామాజిక, ఆర్థిక అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. కాంగ్రెస్ పాలనలో సాంకేతిక అభివృద్ధి విషయంలో కూడా గ్రామాలు వెనకబడిపోయాయి. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ గ్రామాల అభివృద్ధికి కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా గ్రామీణ యువతను డిజిటల్ ప్రపంచానికి చేరువ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. యువత ఉత్సాహం, సృజనాత్మకతతోనే అమృత కాల్ స్వప్నాలు సాకారం అవుతాయి. భారత్ నేడు డిజిటల్ విప్లవాన్ని వీక్షిస్తున్న తరుణంలో గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ విస్తరణ వివిధ రంగాల్లో సమర్ధతను పెంచడమే కాకుండా వ్యక్తులను సాధికారీకరించేందుకు, వారి జీవితాలను మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది.

డిజిటలీకరణ కొత్త అవకాశాలకు ద్వారాలు తెలిసింది. కోట్ల మంది అంతకుముందు అసాధ్యం అనుకున్న అవకాశాలను అందిపుచ్చుకునే పరిస్థితులను సృష్టించింది. గ్రామీణ ప్రాంతాల్లో యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా అందిపుచ్చుకుంటున్నదీ,  డిజిటల్ సాధనాలను నిత్యజీవితంలో ఎలా ఉపయోగిస్తున్నదీ, వివిధ రంగాల మధ్య అంతరాలను ఏ విధంగా తొలగిస్తున్నదీ ఈ ఏడాది విడుదల చేసిన సంపూర్ణ మాడ్యులర్ సర్వే జూలై (2022 జూన్ 20 23) సవివరంగా తెలియజేసింది.

పల్లెల్లో డిజిటల్ విప్లవం

అంతకంతకు అధిక సంఖ్యలో యువతీయువకులు సాంకేతికతను వినియోగిస్తూ డిజిటల్ ప్రపంచంతో అనుసంధానం కావడంతో గ్రామీణ భారతంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. మొబైల్ సాంకేతిక పరిజ్ఞాన వినియోగం గణనీయంగా పెరుగుతోంది. గ్రామీణ యువత నిత్యజీవితంలో డిజిటల్ సాధనాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 15 నుంచి 24 సంవత్సరాల లోపు యువతీయువకుల్లో 97 శాతం మంది మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో 95.7 శాతం మంది మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. గ్రామీణ జనాభాలో 99.5 శాతానికి 4జి మొబైల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. పల్లెల్లో 15-24 సంవత్సరాల వయసు గల వారిలో 82.1 శాతం మంది ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఉన్నారు. ఈ తరం యువతలో అత్యధిక భాగం ఇంటర్నెట్ తో అనుసంధానమై ఉన్నట్టు ఈ వివరాలు వెల్లడిస్తున్నాయి.

ఈ వయసు వారికి సంబంధించి మహా నగరాల్లో 91.8 శాతం మందికి ఇంటర్నెట్ సదుపాయం ఉన్నప్పటికీ పల్లెకు, పట్టణానికి ఈ మధ్య ఇంటర్నెట్ అనుసంధానత విషయంలో అంతరం నానాటికి తగ్గిపోతోంది. సర్వే నిర్వహించడానికి ముందు మూడు నెలల్లో 15-24 సంవత్సరాల వయసు గల గ్రామీణ యువతలో 80.4 శాతం మంది ఇంటర్నెట్ ను ఉపయోగించినట్టు ఒక సమగ్ర వార్షిక మాడ్యులర్ సర్వే వెల్లడించింది. గ్రామీణ భారతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఇంటర్నెట్ వినియోగం నమోదు కాలేదు. అదే మహా నగరాల విషయానికి వస్తే దీని కంటే కొద్దిగా ఎక్కువగా (15-29 సంవత్సరాల వయసులోపు వారిలో 91 శాతం) నమోదయింది. గ్రామీణ ప్రాంతాల్లో విస్తరిస్తున్న డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం, వినియోగాలు దేశంలోని లోతట్టు ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న సాంకేతిక పరివర్తనకు, డిజిటల్ సమ్మిళితత్వానికి, సాధికారికరణకు నిదర్శనం.

కొత్త సాంకేతిక సామర్థ్యాలు

గ్రామీణ భారతం డిజిటల్ పథంలో ప్రయాణిస్తుండగా యువత స్థిరంగా కొత్త సాంకేతిక సామర్థ్యాలను సంతరించుకుంటున్నారు. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోలేకపోయినా అనేకమంది ఎప్పటికప్పుడు మారుతున్న ఈ సాంకేతికతను సమర్థంగా వాడుకుంటున్నారు. సమాచారం కోసం ఇంటర్నెట్ వినియోగం కూడా పెరుగుతోంది. 15-24 సంవత్సరాల వయసు లోపు వారిలో 60.4 శాతం మంది ఆన్లైన్లో సమాచారం కోసం వెతుకుతున్నారు. ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగం అంతకంతకు పెరుగుతోంది. గ్రామీణ యువతలో డిజిటల్ నైపుణ్యాలు పెరగడంతో గ్రామాల్లో అనుసంధానత, సాధికారీకరణ కూడా పెరుగుతున్నాయి సాంకేతిక పరిజ్ఞానం కొత్త అవకాశాలకు, అభివృద్ధికి బాటలు వేస్తోంది.

ప్రభుత్వ ప్రోత్సాహం

డిజిటలీకరణను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు భారత్ లో అనుసంధానతను గణనీయంగా పెంచాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అనేక వినూత్న పథకాలను అమలు చేసింది. వీటిలో టెక్నాలజీ ఇంక్యుబేషన్ డెవలప్మెంట్ ఎంటర్ ప్రైజెస్ (టైడ్-2) నవ కల్పనాత్మక స్టార్టప్ లకు మద్దతు (జెనెసిస్), నిర్దిష్ట డొమైన్ లకు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, నెక్స్ట్ జనరేషన్ ఇంక్యూబేషన్ పథకం వంటి వి ఉన్నాయి. వీటికి తోడు గ్రామాల్లో ఆప్టికల్ ఫైబర్ లైన్ లతో ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించడానికి భారత్ నెట్ ప్రాజెక్టు, మారుమూల ప్రాంతాలకు 4జి టెలికాం సేవలు అందించేందుకు యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ ప్రణాళిక లను అమలు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించింది. అలాగే భారత బీపీఓ ప్రోత్సాహక పథకం, ఈశాన్య బిపిఓ ప్రోత్సాహక పథకాలు మారుమూల ప్రాంతాల్లో సైతం ఐటి, ఐటి అనుబంధ సర్వీసుల వృద్ధికి దోహదం చేసి ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు తోడ్పడ్డాయి. ప్రభుత్వం దేశవ్యాప్తంగా బహిరంగ వైఫై హాట్ స్పాట్లను సృష్టించేందుకు పీఎం-వాణి కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టులన్నీ కలిసి దేశంలో డిజిటల్ అంతరాలను తొలగించి భారత డిజిటల్ విప్లవానికి చోదక శక్తులుగా పనిచేస్తున్నాయి.

గ్రామీణ భారతంలో డిజిటల్ సాధనాల వినియోగం యువత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకునేటట్లు చేసి వారి నిత్యజీవితంలో సానుకూలమైన మార్పులు తెస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరాన్ని తగ్గిస్తుంది. తక్కువ ఖర్చుతో కూడిన, వేగవంతమైన ఇంటర్నెట్ వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు అందుబాటులో ఉండటంతో గ్రామీణ యువత సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం కోసం కొత్త అంకుర సంస్థలను స్థాపించడానికి, విద్యాభ్యాసానికి, ఆదాయాలను పెంచుకోవడానికి, ఆర్థిక అభివృద్ధికి డిజిటల్ సాధనాలను అంతకంతకు అధికంగా వినియోగించుకుంటున్నారు. డిజిటల్ అక్షరాస్యత, మౌలిక సదుపాయాలు మెరుగుపడే కొద్ది గ్రామీణ యువత భవిష్యత్తులో దేశంలో అనుసంధానతను పెంచడంలో, ఆర్థిక వృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు అందేటట్లు చూడటంలోనూ మరింత కీలక పాత్ర వహిస్తారు.

పంకజ్ జగన్నాథ్ జైస్వాల్