Nagarkarnool Modi Sabha

గ్యారంటీ అంటే… మోదీ గ్యారంటీనే

Modi in Nagarkarnool Sabhaగత పదేళ్లుగా తెలంగాణను బీఆర్ఎస్ మహా దోపిడీ చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి అత్యంత అవినీతిపరులతో భాగస్వామ్యం పెట్టుకున్నారని విమర్శించారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ గుప్పిట్లో చిక్కుకుందని చెప్పారు. రాష్ట్రాన్ని లూటీ చేసేందుకు ఐదేళ్ల సమయం సరిపోతుందని ఆ పార్టీ భావిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌ తీరుతో రాష్ట్రం పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారిందన్నారు. దేశంలో మార్పు కోసం ఒక్కటే గ్యారంటీ ఉందని.. అది మోదీ గ్యారంటీ అని తెలిపారు. ఇచ్చిన మాటను తప్పక నెరువేరుస్తామని.. దీన్ని ఇప్పటికే చేసి చూపించామని పేర్కొన్నారు.. మార్చ్ 16న నాగర్‌కర్నూల్‌లో జరిగిన బిజెపి విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కుటుంబ పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్ఎస్ లు.. అవినీతిలో భాగస్వాములని, కాంగ్రెస్‌ 2జీ కుంభకోణానికి, బీఆర్ఎస్ నీటి కుంభకోణానికి పాల్పడ్డాయని.. రెండు పార్టీలూ భూమాఫియాకు అండగా ఉన్నాయని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన వారెవర్నీ వదలబోమని స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో తమకు తెలంగాణ ఆశీర్వాదం కావాలని కోరారు. గత పదేళ్లుగా కాంగ్రెస్‌, బీఆర్ఎస్ లు తెలంగాణ అభివృద్ధి కలల్ని దూరం చేశాయన్నారు. ఈ రెండు పార్టీల నడుమ తెలంగాణ నలిగిపోయిందని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓట్ల సంఖ్యను ప్రజలు రెండింతలు చేశారని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రెండంకెల సీట్లు ఇస్తారన్న నమ్మకముందని పేర్కొన్నారు. దేశంలో ఎన్నికల షెడ్యూలు వెలువడిందని.. దీనికి ముందే ‘ఈసారీ మోదీ సర్కారు’ అని ప్రజలు ఫలితాల్ని ప్రకటించేశారని చెప్పారు.

‘‘బిజెపి ప్రభుత్వ హయాంలో చేపట్టిన పథకాలతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు, రైతులకు లబ్ధి చేకూరింది. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ లు ఈ పథకాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. గతంలో అంబేడ్కర్‌ను ఓడించేందుకు, ఆదివాసీ వర్గానికి చెందిన ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి కాకుండా ఓడించేందుకు ప్రయత్నాలు చేశాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంక్షేమం పేరు చెప్పి ఈ రెండు పార్టీలు రాజకీయ రొట్టెలు కాల్చుకుతిన్నాయి. తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం డిప్యూటీ సీఎంను ఎలా అవమానించిందో ప్రజలు ఫొటోల్లో చూశారు. ఎస్సీ వర్గానికి చెందిన నాయకుడ్ని నేలపై కూర్చోబెట్టారు. బీఆర్ఎస్.. కాంగ్రెస్‌ అడుగుజాడల్లో నడిచే పార్టీ. దేశానికి కొత్త రాజ్యాంగం కావాలనడం.. అంబేడ్కర్‌ను అవమానించడమే. దళితబంధు పేరిట దళితుల్ని మోసం చేసి వారి కళ్లలో మట్టి కొట్టింది. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి పదవిని దళితులకు ఇస్తామన్న బీఆర్ఎస్(అప్పటి తెరాస) ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదు. రాష్ట్రంలో మాదిగ సామాజికవర్గాన్ని బలోపేతం చేసేందుకు మేము ప్రారంభించిన ప్రయత్నాలు కొనసాగుతాయి. ఇది మోదీ గ్యారంటీ.

తెలంగాణ.. దక్షిణ భారతదేశానికి ముఖద్వారం. గత పదేళ్లుగా తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా పని చేశాను. తెలంగాణ ప్రజల మనసులోని మాటను ఇక్కడ హాజరైన నాగర్‌కర్నూల్‌ ప్రజలు చెబుతున్నారు. మార్చ్ 15న మల్కాజిగిరిలో నిర్వహించిన రోడ్‌ షోలో ప్రజల అద్భుత ఆదరాభిమానాలు లభించాయి. పిల్లలు, పెద్దలు, మహిళలు సహా పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి బిజెపిని, అభ్యర్థులను ఆశీర్వదించారు. తెలంగాణ మనసులోని మాట దిల్లీకి చేరాలంటే వచ్చే ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులందరూ గెలవాలి. బిజెపి ఎంపీలుంటే.. మీ కష్టసుఖాలు, ఆకాంక్షలు వేగంగా మాకు చేరుతాయి. తద్వారా మీకు మరింత సేవ చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఆ హామీ నేను ఇస్తున్నా. అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో తెలంగాణ యువత, మహిళలు, కార్మికుల ఆశీర్వాదం కావాలి. అవినీతిపరులకు శిక్ష పడటంలో తెలంగాణ ప్రజల సహకారం కావాలి. నా ప్రసంగాలను తెలుగులో వినాలంటే ఏఐ సహకారంతో సామాజిక మాధ్యమాల్లో ‘నమోఇన్‌తెలుగు’లో లభిస్తాయి.

కాంగ్రెస్‌ ఏడు దశాబ్దాలుగా దేశ ప్రజలకు అబద్ధాలు చెప్పడం, దోపిడీ చేయడం తప్ప ఏమీ చేయలేదు. తెలంగాణను ఎప్పుడూ అభివృద్ధి చేయలేదు. దశాబ్దాలుగా పేదరిక నిర్మూలన (గరీబీ హఠావో) నినాదం ఇస్తోంది. కానీ పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలను ఓటు బ్యాంకుగా వినియోగించుకుంది. దేశ ప్రజలు మోదీని ఆశీర్వదించిన తరువాత ఈ వర్గాల్లో మార్పు వచ్చింది. తొలిసారిగా కోట్ల మంది పేదలకు బ్యాంకు ఖాతాలు, పక్కా ఇళ్లు, మరుగుదొడ్లు, నల్లాల ద్వారా మంచినీరు, ఉచిత వ్యాక్సిన్‌ పేదల దరికి వచ్చాయి. లక్షల గ్రామాల్లో తొలిసారి రాత్రిపూట వెలుగులు(విద్యుత్తు కనెక్షన్లు) వచ్చాయి. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. గత పదేళ్లలో ఈ మార్పు వచ్చింది. ఈ తరహా మార్పు తెలంగాణలోనూ రావాలి. బిజెపి పథకాల లబ్ధి రాష్ట్ర ప్రజలను చేరాలి. గత పదేళ్లలో తెలంగాణ పేదల కోసం కోటి బ్యాంకు ఖాతాలు తెరిచాం. కోటీ 50 వేల మందికి టీ కన్నా తక్కువ ధరకు రూ.20 ప్రీమియంతో బీమా సదుపాయం కల్పించాం. 67 లక్షల మంది చిన్నవ్యాపారులకు ముద్రా రుణాలు, 80 లక్షల మందికి ఆయుష్మాన్‌ భారత్‌ కింద వైద్యసేవల సదుపాయం కల్పించాం.

కుటుంబ సభ్యులకు కుర్చీలు, బ్యాంకు బ్యాలెన్సుల కోసం పని చేయాల్సిన అవసరం మోదీకి లేదు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు నా కుటుంబ సభ్యులే. గత 23 ఏళ్లుగా సీఎంగా, ప్రధానిగా సేవ చేసేందుకు ప్రజలు అవకాశమిచ్చారు. వాటిలో ఒక్కరోజూ నా సొంతం కోసం ఉపయోగించుకోలేదు. ఏం చేసినా.. 140 కోట్ల మంది సొంత కుటుంబ సభ్యుల కోసమే. మోదీ చెబితే ఆర్టికల్‌ 370 రద్దు అవుతుంది. రాముడు తన సొంతింటికి వస్తారంటే.. నిజమవుతుంది. ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందంటే.. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థ మనదవుతుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్ ను నిలదీయాలి

Nagarkarnool Vijaya Sankalpa Sabhaరాష్ట్రంలో దొంగల పాలన పోవాలని కోరుకున్నామని.. కానీ గజదొంగల పాలన వచ్చిందని బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను ఉద్దేశించి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నాగర్‌కర్నూల్‌ విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్‌ కుటుంబం తెలంగాణను దోపిడీ చేసిందని.. సాగునీటి ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, మద్యం, స్థిరాస్తి, గ్రానైట్‌, ఇసుక వ్యాపారాలతో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నేతలు పూర్తిగా దోచుకున్నారని ఆరోపించారు. దిల్లీ మద్యం వ్యాపారంలో అవినీతికి పాల్పడిన చరిత్ర కూడా కేసీఆర్‌ కుటుంబానిదని విమర్శించారు. నిరుద్యోగ భృతి, రైతుబంధు, రుణమాఫీ, మహిళలకు రూ.2,500 వంటి హామీల పథకాల అమలు ఏమైందని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్‌ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు. వాటిని అమలు చేయడం లేదని ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్‌ని ప్రజలు నిలదీయాలన్నారు. ప్రధాని మోదీ విశ్వనేతగా నీతిమంతమైన, సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తున్నారని తెలిపారు. దేశంలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించారన్నారు. ప్రపంచమంతా భారతదేశం వైపు, మోదీ వైపు చూస్తోందన్నారు. ఈ పదేళ్లలో అన్ని వర్గాలకు మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించిందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ దేశంలో ప్రధానిగా మోదీని తప్ప ఇతరులను ఊహించుకునే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. ప్రతిపక్ష పార్టీలు తమ ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ ఎంపీ అభ్యర్థులు భరత్‌ ప్రసాద్‌, డీకే అరుణ, సైదిరెడ్డిలను ప్రజలకు మోదీ పరిచయం చేశారు. కార్యక్రమంలో ఎంపీ పి.రాములు తదితరులు పాల్గొన్నారు.

Nagarkarnool Crowd

Nagarkarnool Crowd