indi alliance

ఇండీ కూటమిలో అంతర్గత కల్లోలం

‘ఇండీ’ కూటమిలోని భాగస్వామ్య పార్టీల కపటత్వం, స్వార్థం ఇప్పుడు తేటతెల్లమవుతున్నాయి. నరేంద్ర మోదీ పట్ల వ్యతిరేకత ఒక్కటే తమ ఏకైక సిద్ధాంతమని ఈ పార్టీలు తమ కార్యకలాపాల ద్వారా స్పష్టం చేస్తున్నాయి. తాము బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఎవరికీ వారు ఒంటరిగా మోదీని, బిజెపిని ఎదుర్కోలేమని తెలిసి ఈ పార్టీలు రాజకీయ మనుగడ కోసం జట్టు కట్టాయి. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ కూటమిలో విభేదాలు తీవ్రతరమయ్యాయి. అనేక రాష్ట్రాల్లో కూడా ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇండీ కూటమిలో వచ్చిన ఈ మార్పు ప్రభావం ప్రతిపక్షాలపైనే ఉంటుంది. దీని ప్రభావం ముందుగా పశ్చిమ బెంగాల్ లో మనం చూడవచ్చు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమి ఓటమి తర్వాత మమత ముఖర్జీ దిగాలు పడిపోయారు. మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమిలో కూడా లుకలుకలు మొదలయ్యాయి. శివసేన (యూబీటి) లోని అనేకమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు శివసేనలోకి, బిజెపిలోకి ఫిరాయించడానికి మార్గాలు వెతుకుతున్నారు. శరద్ పవార్ పార్టీ ఎన్సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పార్టీ ఫిరాయించే దిశలో పయనిస్తున్నారు. 

మిగతా రాష్ట్రాల కంటే ఉత్తరప్రదేశ్ లో ఈ మార్పు ఎక్కువగా కనిపిస్తుంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలు కూటమిగా పోటీ చేసి సంతృప్తికరమైన పనితీరును కనబరిచాయి. ఈ రెండు పార్టీలు 43 సీట్లు గెలుచుకున్నాయి. ఆ సమయంలో మమతా బెనర్జీ పార్టీ కూడా యూపీలో ఇండీ కూటమిలో భాగంగా ఉంది. ఆ పార్టీ కూడా భదోహి లోక్ సభ సీటుకు ఇండీ కూటమి తరఫున పోటీ చేసింది. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల లక్ష్యాలు పరిమితంగా ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలవడం వాటి ఉద్దేశంగా ఉంది. అందుకే రెండు పార్టీలు వాటి మధ్య ఉన్న విభేదాలను దిగమింగుకుని రాజీ పడ్డాయి. అమేథీ, రాయబరేలీలో గెలుపొందడం కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం కాగా అఖిలేష్ యాదవ్ కుటుంబాన్ని తిరిగి పార్లమెంటులోకి తీసుకురావడం ఎస్పీ లక్ష్యం. తమ లక్ష్యాలు నెరవేరిన తర్వాత ఈ రెండు పార్టీలు పొత్తుకు దాదాపు చెల్లుచీటీ ఇచ్చాయి. దీన్ని ఇంకా బహిరంగంగా ప్రకటించడం మాత్రమే చేయలేదు. రెండు పార్టీలు ఎవరికి వారు అవతలి వారు కూటమి రద్దు అయినట్టు ప్రకటించాలని చూస్తున్నారు.

ఇండీ కూటమిలోని పార్టీల సయోధ్య నేతిబీర చందం అన్న వాస్తవం దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తేటతెల్లమైంది. కేవలం అస్తిత్వం కోసమే ఈ పార్టీలు చేతులు కలిపాయని ప్రజలకు తెలిసిపోయింది. ప్రజలకు మేలు చేసే విషయంలో వాటి మధ్య ఏ ఒక్క విషయం మీదా ఏకాభిప్రాయం లేదు. అయితే భవిష్యత్తులో కూడా ఈ పార్టీలు మనుగడ కోసమే మళ్లీ ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటాయని మనం భావించవచ్చు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమి పార్టీలైన ఆప్, కాంగ్రెస్ లు కనీసం సీట్ల సర్దుబాటు గురించి చర్చించడానికి కూడా సుముఖత చూపలేదు. లోక్ సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని దిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలో బిజెపి మెజారిటీలను తగ్గించడంలో విజయవంతమయ్యాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో దిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లో బిజెపి మొత్తం 11,15,963 ఓట్ల ఆధిక్యత సాధించగా 2019 ఎన్నికల్లో అది 27,41,499 ఓట్లకు పెరిగింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కూటమి బిజెపి విజయాలను ఆపలేకపోయినా మెజారిటీని మాత్రం 2019 తో పోలిస్తే సగానికి తగ్గించింది. ఈ ఎన్నికల్లో బిజెపి ఏడు లోక్ సభ సీట్లలో కలిపి 10,14,331 ఓట్ల ఆధిక్యత మాత్రమే సాధించింది. ఈ పరిస్థితుల్లో ఆప్, కాంగ్రెస్ లు కనుక దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఉంటే బిజెపి ఇబ్బందుల్లో పడేది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవాలని కాక కేవలం రాజకీయాల్లో అస్తిత్వం నిలుపుకోవడానికి మాత్రమే పోటీ చేసింది. కానీ ఎన్నికల సమయంలో ఆ పార్టీలోని అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఇది కాంగ్రెస్ కి చాలా అవమానకరమైన పరిస్థితి. ఇండీ కూటమి పార్టీలు కాంగ్రెస్ ను అసలు పట్టించుకోకుండా ఆప్ కే మద్దతు ఇచ్చాయి. అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, ఉద్దవ్ ఠాక్రే వంటి అనేకమంది ఇండీ కూటమి నాయకులు, వారి పార్టీలు కాంగ్రెస్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఆప్ కి మద్దతు పలికాయి. 

అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీలు కాంగ్రెస్ కు షాక్ కు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో కనీసం ఒక్క సీటును కాంగ్రెస్ కు ఇవ్వడానికి కూడా అఖిలేష్ అంగీకరించలేదు. మరోవైపు మమతా బెనర్జీ కాంగ్రెస్ ను ఘోరంగా అవమానించారు. 2023లో ముర్షిదాబాద్ జిల్లాలోని ముస్లిం ఓటర్లు ఎక్కువగా గల సాగర్దిఘి అసెంబ్లీ స్థానానికి తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడి అకాల మరణం కారణంగా ఉపఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తృణమూల్, బిజెపిలను ఓడించి విజయం సాధించింది. అయితే ఆ తర్వాత మమతా బెనర్జీ ఆస్థానంలో విజయం సాధించిన బైరన్ విశ్వాస్ ను తమ పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ కు పెద్ద షాక్ ఇచ్చారు. దీనివల్ల రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ కు మళ్ళీ ఉనికి లేకుండా పోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, దిల్లీ, సిక్కిం, నాగాలాండ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటుకూడా లేదు. 

ఇప్పుడు ప్రతిపక్ష రాజకీయాలు ఎక్కడ మొదలయ్యాయో మళ్ళీ అక్కడికే చేరుకున్నాయి. అన్ని పార్టీలు తలా ఒక మాటా మాట్లాడుతున్నాయి. తమకు సొంతంగా గల అవకాశాలను విశ్లేషించుకుంటున్నాయి. రానున్న రోజుల్లో అవి బిజెపితో పోటీ పడేందుకు మళ్లీ జట్టు కట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ కు ఉన్న ఒకే ఒక సభ్యుడిని తన పార్టీలో చేర్చుకుని ఆ పార్టీకి అసెంబ్లీలో అస్తిత్వం లేకుండా చేసిన మమతా బెనర్జీ ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే 2027లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరగాల్సిన ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండా తృణమూల్ పై ప్రతీకారం తీర్చుకుంటుంది. అఖిలేష్ యాదవ్ కూడా 2027లో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయవకాశాలపై కాంగ్రెసు ప్రభావాన్ని తగ్గించే మార్గాలను అన్వేషిస్తున్నారు. 

ఇండీ కూటమిలో రాజకీయ సన్నివేశం పెనుమార్పులకు గురవుతోంది. పార్టీలు సమైక్య స్ఫూర్తి కంటే తాము ఏ విధంగా అస్తిత్వాన్ని నిలుపుకోవాలన్న అంశంపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. అంతర్గత విభేదాలు, ముఖ్యంగా కాంగ్రెస్, ఆప్, అలాగే ఇతర పార్టీల మధ్య విభేదాలు, దిల్లీ ఎన్నికలు, ఇతర ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో మరింత స్పష్టంగా కనబడుతున్నాయి.

అభయ్ కుమార్