జీవ ఇంధనంతో రైతుల ‘మిగులు’ సమస్యకు పరిష్కారం
రైతుల ఆదాయాలు పెంచుకునేందుకు జీవ ఇంధనాలు దోహదపడుతాయని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దేశంలో పెద్దమొత్తంలో ఇథనాల్ ఉత్పత్తి అవుతోన్నా ఆహార కొరత ఏర్పడలేదని, పంట ఉత్పాదకత పెరుగుతోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని మా పదేళ్ళ పాలన దేశ చరిత్రలో అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులకు సంబంధించినంత వరకు స్వర్ణయుగం అని అభివర్ణించారు. రెండేళ్లలో సెమీకండక్టర్ల తయారీలో ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ.22 లక్షల కోట్లకు చేరుకుందని, 2030 నాటికి మన విద్యుత్ వాహన (ఈవి) పరిశ్రమ విలువ రూ.20 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. ఒక ఆంగ్ల జాతీయ దినపత్రికకు నితిన్ గడ్కరీ ఇచ్చిన ఇంటర్వ్యూలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, జీవ ఇంధనాలు, విద్యుత్ వాహనాలు, పటిష్టమైన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ఆవశ్యకతపై మాట్లాడారు. ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు:
ప్ర: ఇటీవలి లోక్‌సభ ఎన్నికలపైన, బిజెపికి 240 సీట్లు రావడంపై మీరేమనుకుంటున్నారు?
జ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని మా పదేళ్ళ పాలన దేశ చరిత్రలో అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులకు సంబంధించినంత వరకు స్వర్ణయుగం. మా ప్రభుత్వం నీరు, విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ వంటి మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యమిచ్చింది. ఇవి లేకుండా పరిశ్రమలు, వాణిజ్యం, వ్యాపారం, ఉపాధి లేదా పేదరిక నిర్మూలన సాధ్యం కాదు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మన ఎగుమతులను పెంచి, దిగుమతులను తగ్గించుకోవాలి. రెండేళ్లలో సెమీకండక్టర్ల తయారీలో ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తాం. ఈ రోజు మనం మొబైల్ ఫోన్‌లను ఎగుమతి చేస్తున్నాం. నేను బాధ్యతలు చేపట్టేనాటికి ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ.7 లక్షల కోట్లు కాగా అది ఇప్పుడు రూ.22 లక్షల కోట్లు. నాలుగు నెలల క్రితం మనం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారుగా జపాన్‌ను దాటాం. 2030లో మనం రెండో స్థానంలో ఉంటామన్న నమ్మకం నాకుంది.
ప్రస్తుతం అమెరికా మొదటి స్థానంలో, చైనా రెండోస్థానంలో, భారతదేశం మూడో స్థానంలో ఉన్నాయి. 2030 నాటికి మన విద్యుత్ వాహన (ఈవి) పరిశ్రమ విలువ రూ.20 లక్షల కోట్లుగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ప్రత్యామ్నాయ ఇంధనం, జీవ ఇంధన రంగాన్ని పరిశీలిస్తే, ఇప్పుడు రూ.22 లక్షల కోట్లతో శిలాజ ఇంధనాలను (చమురు, గ్యాస్, బొగ్గు) దిగుమతి చేసుకుంటున్నాం. ప్రత్యామ్నాయ ఇంధనం, జీవ ఇంధనం – ఇథనాల్, మిథనాల్, బయోడీజిల్, బయో ఎల్‌ఎన్‌జి, బయో సిఎన్‌జి, విద్యుత్, హైడ్రోజన్ విధానాన్ని అవలంబించడం ద్వారా మనం మన దిగుమతులను తగ్గించుకోగలమని నేను విశ్వసిస్తున్నాను. మన జీడీపీ (స్థూల జాతీయోత్పత్తి)ని పరిశీలిస్తే, ప్రధాన వాటా, 52-54 శాతం, సేవా రంగానిదే. సుమారు 24 శాతం వాటా తయారీ రంగానిది, 12 శాతం మాత్రమే వ్యవసాయం వాటా. అయినప్పటికీ జనాభాలో 72 శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఇథనాల్ వారి ఆదాయాలను పెంచడానికి కూడా ఉపయోగపడుతోంది. కనుక దిగువ, మధ్యాదాయ వర్గాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం వివిధ విధానాలను అనుసరిస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) వర్గం నుంచి 25 కోట్ల మంది ప్రజలను బయటకు తీసుకువచ్చింది. అదీ పురోగతి.
ప్ర: అలాంటప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సంఖ్య విషయంలో బిజెపికి ఎందుకు ఎదురుదెబ్బ తగిలింది?
జ: ఈ ఎన్నికల్లో బిజెపిని ఎలాగైనా ఓడించాలని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, గందరగోళానికి గురిచేసేందుకు పెద్దఎత్తున ప్రతిపక్షాలు ప్రయత్నించాయి. మొట్టమొదట బిజెపి డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌కు వ్యతిరేకమని, రాజ్యాంగాన్ని మారుస్తుందని ఓటర్లను గందరగోళపరిచేందుకు ప్రతిపక్షాలు వదంతులు ప్రచారం చేశాయి. బిజెపి మళ్ళీ వస్తే తమకు ఇప్పుడు అందుతున్న ప్రయోజనాలు ఆగిపోతాయని ప్రతిపక్ష నాయకులు ముఖ్యంగా వెనుకబడిన తరగతులలో భయాన్ని సృష్టించారు. రెండవది, రైతులకు మేలు చేసేందుకు మేం చేసిన పనులను అవి వారికి వ్యతిరేకమని తప్పుడు ప్రచారం చేశారు.
ప్ర: ఎన్నికల ఫలితాలు బిజెపి కూడా ఊహించని విధంగా ఉన్నాయి. అయినా పార్టీ విధానాల్లో మార్పు లేదా దిద్దుబాటు ఎందుకు కనిపించడం లేదు?
జ: మాది ప్రజాస్వామ్య పార్టీ. పార్టీ అధ్యక్షుడు సంబంధిత వ్యక్తులతో చర్చించారు. పార్టీలో పని పంపిణీ, అధికారాల విభజన ఉంది. సమావేశాల సమయంలో సంప్రదింపులు అనేది నిరంతర ప్రక్రియ. పార్టీ భవిష్యత్తు చాలా బాగుంటుందన్న నమ్మకం నాకు 100 శాతం ఉంది.
ప్ర: వివిధ రాష్ట్రాల బిజెపి ఎంపీలతో మాట్లాడినప్పుడు వారు నాయకత్వంలోగాని, పార్టీ యంత్రాంగంలో గాని ఎటువంటి చెప్పుకోదగ్గ మార్పులు లేకపోవడం పట్ల నిరాశానిస్పృహలకు గురైనట్టుగా మాకు అనిపించింది. పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిని నియమిస్తారంటారా?
జ: అందరూ పార్టీ కోసం పని చేస్తున్నారు, మంచి వాతావరణం ఉంది. కొన్ని ఎన్నికల ఫలితాలు బాగున్నా, కొన్ని మా అంచనాలకు అనుగుణంగా లేవు. ప్రజాస్వామ్యం అనేది నిరంతర ప్రక్రియ. మనం ఈ వ్యవస్థలో భాగం కావాలి.
ప్ర: జీవిత బీమా సంస్థ నాగ్‌పూర్ డివిజనల్ ఉద్యోగుల సంఘం చేసిన విజ్ఞప్తుల మేరకు జీవిత, వైద్య బీమా ప్రీమియంలపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మీరు రాసిన లేఖ ఎందుకు బయటికి వచ్చింది? కేబినెట్ మంత్రుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు గోప్యంగా ఉండాలి కదా? అయితే ఇప్పుడు ఆరోగ్య బీమాపై జీఎస్టీ రేటు తగ్గింపులను పరిశీలించడానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారనుకోండి.
జ: నేను క్రమశిక్షణ తప్పే మనిషిని కాదు, రాజకీయాలు చేయను. లేఖ నిజంగా అంతరంగికమైనదే. సదుద్దేశంతో రాసిందే. ఉద్యోగుల ప్రతినిధి బృందం నన్ను కలవడానికి వచ్చినప్పుడు, నేను వెంటనే నా వ్యక్తిగత కార్యదర్శికి వారి విజ్ఞప్తిని ముఖ్యమైన అంశంగా పరిగణించమని ఆర్థిక మంత్రిని అభ్యర్థిస్తూ ఒక లేఖను సిద్ధం చేయమని చెప్పాను. ఆర్థిక మంత్రికి లేఖ పంపిన తర్వాత, నా కార్యాలయం నాకు తెలియకుండా ప్రతినిధి బృందానికి ఒక కాపీని ఇచ్చింది. నేను అధికారులకు ఇలాంటి లేఖలు చాలా రాస్తాను గనుక వారు కూడా అమాయకంగా ఆ పని చేశారు. ఉద్యోగుల బృందం దానిని మీడియాకు విడుదల చేసింది. అది సమస్య.
ప్ర: విద్యుత్ వాహనాలు (ఈవీలు) ఇప్పుడు అత్యల్ప జీఎస్టీ రేట్ల శ్రేణిలో ఉన్నాయి. దానికి ఫ్లెక్స్, లో హైబ్రిడ్ వంటి ఇతర సాంకేతికతలకు మధ్య పెద్ద అంతరం ఉంది. ఎందుకు అలా?
జ: దేశానికి విస్తృత ప్రయోజనాలను కలిగించే ఇంధనాలను, సాంకేతికతను మనం ప్రోత్సహించాలి. అంతిమంగా లిథియం అయాన్ బ్యాటరీలు, ఇతర భాగాల ఉత్పత్తి పెరగడం వల్ల ఈవీల ధర తగ్గుతుంది. ఒక్కో బస్సుకు లిథియం అయాన్ బ్యాటరీ ఖరీదు రూ 40 లక్షలు. కాబట్టి దాన్ని రూ.22 లేదా 24 లక్షలకు తగ్గించినప్పుడు, బస్సు కొనడం చౌకగా మారుతుంది. ఇంతకుముందు లిథియం అయాన్ బ్యాటరీ ధర కిలోవాట్ గంటలకు 150 డాలర్లు. ఇది కిలోవాట్ గంటలకు 105 డాలర్లకు తగ్గింది. ఇప్పుడు టాటా, అదానీ, సుజుకి, పానాసోనిక్, ఓలా భారత్ లో లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేస్తున్నాయి. రెండు సంవత్సరాలలో ఎలక్ట్రిక్ కారు, బస్సు, స్కూటర్ లేదా ఆటో-రిక్షా ధర పెట్రోల్, డీజిల్ వేరియంట్లకు సమానంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఆ ప్రారంభ మద్దతుతో భాగంగా ప్రోత్సాహకాలు ఇవ్వడం మంచిది. ఇప్పుడు ఎల్‌ఎన్‌జి (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ట్రక్కులతో, డీజిల్‌తో పోలిస్తే రూ. 12 లక్షలు ఆదా చేసుకోవచ్చు. మనం ప్రత్యామ్నాయ ఇంధనాలను, జీవ ఇంధనాలను అభివృద్ధి చేస్తున్న కొద్దీ ఖర్చులు తగ్గుతాయి. ప్రభుత్వం వివిధ రకాల సాంకేతికతను ప్రోత్సహిస్తోంది. ఆటోమొబైల్ పరిశ్రమ అద్భుతమైన పని చేస్తోంది.
ప్ర: చాలా మంది రాజకీయ కుటుంబాలకు చెందిన మూడవ, నాల్గవ తరం నాయకులు టికెట్ కోసం బిజెపిని ఒక ప్రారంభ వేదికగా చూస్తున్నారు. ఇది పలువురు బిజెపి కార్యకర్తలను కలవరపరిచింది. ఇది పార్టీకీ సమస్య అవుతుందా?
జ: నేనెప్పుడూ వంశపారంపర్య రాజకీయాలు చేయలేదు. నా కుటుంబ సభ్యులెవరూ రాజకీయాల్లో లేరు. నేను, నా తల్లిదండ్రులు ఏది సంపాదించినా అది వారిదే అని చెప్పాను. కానీ నా రాజకీయ వారసత్వానికి నా కార్యకర్తలకు మాత్రమే హక్కు ఉంది. ఒక వ్యక్తి పార్టీ కార్యకర్తలకు తన విలువను నిరూపించుకుంటే వారు ఫలానా నాయకుడి కొడుకు లేదా కుమార్తె కావడం నేరమూ కాదు, అలా అని అది ఒక హక్కూ కాదు. వారు తగినంత మంచివారైతే, కార్యకర్తల విశ్వాసం పొందితే వారు తమకు టికెట్ కావాలని అభ్యర్థించవచ్చు. రాజకీయాల్లో కూడా ప్రతిభ ఉన్నవాడే ముందుకు వెళ్తాడు. ఎవరైనా ఒకరి పిల్లలు అయినంత మాత్రాన నాయకుడిగా ఉండే వారి చట్టబద్ధమైన, నిజమైన హక్కును వారికి నిరాకరించలేం.
ప్ర: అయితే ఆశ్రిత పక్షపాతానికి, వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమని బిజెపి చెబుతుంది కదా?
జ: తల్లిదండ్రులు తమ పిల్లలకు టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినప్పుడు అది సమస్య అవుతుంది.
ప్ర: పార్లమెంటు ఎన్నికల తర్వాత, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మీరే ఇంఛార్జ్‌గా ఉండాలని దిల్లీలోని కొందరు భావించారు, కానీ మీరు మొగ్గు చూపలేదు. ఎందుకు?
జ: అలాంటిదేమీ లేదు. పార్టీ ఏది అడిగితే అది చేస్తాను. లోక్‌సభ ఎన్నికల సమయంలో నేను దేశవ్యాప్త ర్యాలీలను రద్దు చేసుకుని 55 లోక్‌సభ స్థానాల్లో పర్యటించాను.
ప్ర: మోదీ ప్రభుత్వం బాగా కుదుటపడిందని మీరు చెబుతున్నప్పటికీ, అది ఐదేళ్ల పాటు ఉండదనే అభిప్రాయం ఉంది. ఈ అభిప్రాయాన్ని మీ ప్రభుత్వం ఎలా తొలగిస్తుంది?
జ: అభిప్రాయం వర్సెస్ వాస్తవం, వాస్తవ పరిస్థితులు వర్సెస్ సొంత దృక్పథాలు అనే విషయంలో బిజెపికి చాలా అనుభవం ఉంది. కానీ వాస్తవమేమిటంటే, పార్టీ, నాయకుడితో సంబంధం లేకుండా ప్రజలు ఇప్పటికీ మమ్మల్ని నమ్ముతున్నారు. ప్రతి మ్యాచ్‌లో ఎవరూ సెంచరీ కొట్టరు. కానీ ప్రజల మద్దతును నిర్ణయాత్మకంగా పొంది దేశాన్ని ముందుకు తీసుకుపోతాం.
ప్ర: ఇటీవల ప్రధానమంత్రి మోదీ తన మంత్రులందరికీ ‘సంస్కరణ, పనితీరు, రూపాంతరం’ మంత్రానికి ‘సమాచారం’ కూడా చేర్చాలని, అంటే ప్రజలకు ప్రభుత్వం చేసే మంచి పనులు తెలియజేయాలని చెప్పారు. మీరు, మీ మంత్రివర్గ సహచరులు దీన్ని ఎలా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు?
జ: మా మంత్రిత్వ శాఖకు ప్రజా సంబంధాల విభాగం (పీఆర్) లేదన్నది నిజం. మేం మా మంచి పనికి ఎటువంటి వార్తా కవరేజీని పొందలేం. ఎవరినీ పిలిచి మా విజయాలు చెప్పం. మేం 10 రూపాయల పని చేస్తాం కానీ మాకు రూపాయి విలువైన ప్రచారం కూడా రాదు. ప్రజల కోసం చేసిన మంచి పనిని వారికి తెలియజేయాలని ప్రధాన మంత్రి అన్నారు.
ప్ర: మీరు జీవ ఇంధనాల వాడకం పెంచాలని వాదిస్తున్నారు. అయితే ఆహారం, ఇంధనం వీటిలో ఒక్క దానికే ప్రాధాన్యం ఇవ్వాల్సిన భారతదేశంలో మనం వాటిని కొనసాగించగలమా? మీరు ఇటీవల జీవ ఇంధనాల కోసం చెరకు రసం, బియ్యం వాడకాన్ని నిలిపివేశారు. అంతిమంగా మనం 140 కోట్ల మందికి ఆహారం అందించాలి.
జ: ప్రభుత్వాల నుంచి మీడియా వరకు అందరూ ఒక పట్టాన ప్రజల దృష్టితోనే విషయాలను చూడటం పెద్ద సమస్య. గ్రామాలు, పేదలు, కూలీల సమస్యలు మీకు అర్థం కావడం లేదు. మీరు పేర్కొన్న రెండు విధానాలు తాత్కాలికమైనవి. మన దేశంలో చక్కెర ఎప్పుడూ మిగులుగానే ఉంటుంది. ప్రపంచంలో చక్కెర ధర కిలో రూ.49. ఇక్కడ కిలోకు రూ.36. అదేవిధంగా గోధుమలు, బియ్యం కూడా మిగిలిపోతున్నాయి. యూపీలో బంగాళదుంపలు కిలో ఒక రూపాయికి ఇచ్చేస్తున్నారు. నాసిక్‌లో ఉల్లిపాయలను నామమాత్రపు ధరలకు ఇచ్చేస్తున్నారు. పంజాబ్, హర్యానాలలో మూడేళ్ల క్రితం బియ్యం నిల్వ చేసే స్థలం లేక రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లపైనే ఉంచారు. తాత్కాలిక కొరత వచ్చి ఎప్పుడైనా ఉల్లిపాయ ధర రూ.50కు చేరితే అది మొదటి పేజీలో వార్త అవుతుంది. కానీ ఉల్లిపాయల ధరలు పతనమై రూ.1 కి పడిపోయినప్పుడు, రైతులు వాటిని నిస్పృహతో రోడ్లపై పారేసినప్పుడు ఏ వార్తలూ రావు. రైతులకు కనీస ధర లభించక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారు తమ ఆదాయాలు పెంచుకోవాలి. జీవ ఇంధనాలు ఆ పని చేస్తాయి. దేశంలో ఇంత ఇథనాల్ ఉత్పత్తి అవుతోంది, ఆహార కొరత ఏర్పడిందా? పంట ఉత్పాదకత పెరుగుతోంది, భూమి కూడా చాలా ఉంది.
ప్ర: ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టనందున భారతమాల ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి? పెరిగిన ఖర్చుల కారణంగా దాన్ని వదిలేశారా?
జ: అన్ని ప్రాజెక్టులకు అనుమతులు మొదలయ్యాయి. వాటిని ప్రధానమంత్రి దార్శనికత అయినా ‘వికసిత్ భారత్@2047’లో చేర్చారు. ఇటీవల జరిగిన సమావేశంలో రూ.51,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు అనుమతి లభించగా రూ.50,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు పరిశీలనలో ఉన్నాయి. డిసెంబర్ నాటికి రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను పూర్తి చేస్తాం.
ప్ర: ప్రతిపక్షాన్ని శత్రువుగా లేదా దేశ వ్యతిరేకిగా భావించని బిజెపి నాయకులలో మీరు కూడా ఉన్నారు. ఆ రకంగా చూస్తే రాజకీయాలకు బలమైన ప్రతిపక్షమే మంచిదా? లేక ఇంతకుముందు మాదిరిగా సభలో బిజెపి ఆధిక్యం ఉంటేనే మంచిదా?
జ: మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. మనం ‘ప్రజాస్వామ్యానికి తల్లి’ అని ప్రధాని చెప్పారు. ప్రజాస్వామ్యం నాలుగు స్తంభాలలో న్యాయవ్యవస్థ, మీడియా, శాసనసభ, కార్యనిర్వాహక వ్యవస్థ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి. కారు లేదా రైలు చక్రాల మాదిరిగానే రెండూ ముఖ్యమైనవి, సమతుల్యంగా ఉండాలి. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఘనత మాకు ఉంది. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్- అనేది మన వైఖరిగా ఉండాలి. గట్టిగా అరవడం ప్రతిపక్షాల పని.
ప్ర: అయితే బలమైన ప్రతిపక్షం దేశానికి మంచిదేనా?
జ: ఇది ప్రజాస్వామ్యానికి మంచిది. రాజకీయాలు సామాజిక-ఆర్థిక శక్తికి సాధనం. మనం కలిసి పని చేయాలి.
నాగార్జున