kishan mandaviya

కార్మికుల సంక్షేమానికి మోదీ పెద్దపీట

కార్మిక సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని, కార్మికుల క్లైయిమ్​ లను కేవలం మూడు రోజుల్లోనే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ఆదేశాలిచ్చారని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. మార్చ్ 6న కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్​ మాండవీయాతో కలిసి ఆయన ఈపీఎఫ్​వో నూతన జోనల్​ కార్యాలయాన్ని హైదరాబాద్ బేగంపేటలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కిషన్​ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం అనేక నూతన విధానాలతో ముందుకు వెళుతుందన్నారు. దేశంలోనే సనత్​ నగర్​ ఈఎస్ఐ కార్మిక ఆసుపత్రి నెం.1గా నిలిచిందని, ఇందుకు మంత్రి మన్సుఖ్​ మాండవీయాకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కార్మికులకు అస్యూర్డ్​ బెనిఫిట్స్​ రూ.50 వేలు నిర్ణయించడం హర్షణీయమన్నారు. తెలంగాణ ప్రాంతంలో మరిన్ని ఆసుపత్రులు, ఈపీఎఫ్​వోలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. రామగుండం వంటి చోట్ల స్థలాలు కేటాయిస్తే పనులు మొదలు పెడతామన్నారు. హైదరాబాద్​ లో ఈ–కామర్స్​ (అసంఘటిత రంగం)లో పనిచేసే లక్షలాది కార్మికులకు కూడా ఈపీఎఫ్​వో ఫలాలను అందించాలని మోదీని కోరుతానన్నారు. ఈ వేదిక ద్వారా కేంద్రమంత్రి మాండవీయాకు కూడా విజ్ఞప్తి చేశారు. ఈ-కామర్స్​ రంగం ప్రస్తుతం దేశంలో దినదినం ప్రవర్థమానంగా ఎదుగుతుందని, ఆ రంగంలో ఉన్న కార్మికుల క్షేమాన్ని కూడా కోరుతున్నట్లు చెప్పారు. ఈపీఎఫ్​వో నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తూ సేవలను మరింత విస్తృతం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

కార్మికులకు సేవలందించే ఈపీఎఫ్​వో దేవాలయమేనని మన్సుఖ్​ మాండవీయా అన్నారు. ఈ దేవాలయం ద్వారా కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో మరింత ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో కార్యాలయాలకే రాకుండా డిజిటల్​ సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు వివరించారు. దేశంలో అత్యధిక ఎక్కువ నిధులున్న సంస్థ ఈపీఎఫ్​వో అని, ఈ కార్యాలయాలకు వచ్చే కార్మికుల సమస్యలను, క్లైయిమ్​ లను త్వరగా పరిష్కరించేలా చొరవ తీసుకోవాలన్నారు. కార్మికుల డబ్బుతో సమానంగా కేంద్ర ప్రభుత్వం కూడా నిధులను జమ చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడ పని చేసేవారైనా నేరుగా బ్యాంకుల నుంచే విత్​ డ్రా సౌకర్యాన్ని కల్పించామన్నారు. కార్మికుల సేవల కోసం 201 టోల్​ ఫ్రీ నెంబర్​ ను కూడా ప్రారంభించామని చెప్పారు. భవిష్యత్​ లో 301 నెంబర్​ తో మరిన్ని సేవలను అందించేలా ప్రణాళిక రూపొందించామని అన్నారు. గతంలో చిన్నచిన్న ఆటంకాలు, సమస్యలు అనేకం ఉండేవని, ప్రస్తుతం వాటన్నింటినీ దశల వారీగా తొలగించామన్నారు. మరిన్ని సేవలను విస్తృతం చేసేందుకు మెరుగైన విధానాలను అవలంబిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్​ లో ఈపీఎఫ్​వో లావాదేవీలు ఏటీఎం ద్వారా కూడా నిర్వహించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దేశాభివృద్ధికి వెన్నెముక కార్మిక శక్తియేనని పునరుద్ఘాటించారు. మారుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో పని విధానంలో కూడా మార్పులను తీసుకువస్తున్నట్లు చెప్పారు. కార్మికుల శ్రేయస్సు కోసం అన్ని విధాల కృషి చేస్తున్నామని మన్సుఖ్​ మాండవీయా స్పష్టం చేశారు.