00

కేంద్ర సహకారంతోనే పల్లెల్లో అభివృద్ధి పనులు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చింది తప్ప అమలు చేయలేదని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్రామీణ పేదల కోసం ఉచిత బియ్యం, ఇళ్ళు, మరుగుదొడ్లు, గ్యాస్ కనెక్షన్లు, పొదుపు సంఘాల మహిళలకు బ్యాంక్ రుణాలు, యువతకు స్వయం ఉపాధి రుణాల వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. గ్రామాల్లో రోడ్లు, మరుగుదొడ్లు, వీధి దీపాలు, స్మశాన వాటికలు, రైతు వేదికలు, హరితహారం కింద మొక్కలు నాటడం వంటి అనేక కార్యక్రమాలు కేంద్ర సహకారంతోనే అమలవుతున్నాయని వివరించారు. పల్లె నిద్రలో భాగంగా ఆయన ఆగస్ట్ 21, 22న రెండు రోజులు చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. నాంచైర్ లో ఆగస్ట్ 21న పల్లె నిద్ర చేశారు. ఈ పర్యటనలో భాగంగా తొలిరోజు ఆగస్ట్ 21న ఆయన చెన్వెళ్లిలో రైతులతో సమావేశమయ్యారు. నాంచైర్ లో కార్యకర్తల సమ్మేళనంలో ప్రసంగించి శ్రేణులను ఉత్సాహపరిచారు. ఆగస్ట్ 22న ఆలూరులో మహిళా సమ్మేళనం, ఖానాపూర్ గేట్ వద్ద యువ సమ్మేళనంలో పాల్గొని వారిని మార్గనిర్దేశనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ రాంచందర్ రావుతో పాటు రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షులు రాజభూపాల్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే రత్నం, ప్రభాకర్ రెడ్డి, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

ఈ పర్యటనలో వివిధ సందర్భాల్లో రాంచందర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్, గత బీఆర్ఎస్ ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టారు. దేశాభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలు, కార్యక్రమాలను వివరించారు. ‘‘ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద చిన్నకారు రైతులకు ప్రతి ఏడాది మూడు దశల్లో ఖాతాల్లో మొత్తం రూ. 6,000 చొప్పున జమ చేస్తోంది. ఇప్పటివరకు క్రమం తప్పకుండా మూడు దఫాల్లో రైతుల అకౌంట్లలో కిసాన్ సమ్మాన్ నిధులు చేరాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పింది. గతంలో కాంగ్రెస్ “రైతు భరోసా” కింద రూ.15,000 ఇస్తామని చెప్పింది, కానీ 19 నెలలు దాటినా అమలు చేయలేదు. రైతులకు అన్ని హామీలు బంద్ అయ్యాయి. నెదర్లాండు వంటి దేశాల నుంచి సీడ్స్ దిగుమతి అవుతున్నాయి. భవిష్యత్తులో మన దేశం నుంచే సీడ్స్ ఇతర దేశాలకు ఎగుమతి చేయగల సామర్థ్యం ఉంది. మోదీ ప్రభుత్వం రైతులకు అన్ని రకాలుగా ప్రోత్సాహం, సహాయసహకారాలు అందిస్తోంది. గత యూపీఏ పాలనలో అనేక సంవత్సరాలుగా పంటలకు మద్దతు ధరలను సరిగ్గా పెంచలేదు.

ప్రధానమంత్రి సడక్ యోజన కింద ప్రతి గ్రామానికి పక్కా రోడ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించారు. యువత జాబ్ సీకర్స్‌గా కాకుండా జాబ్ గివర్స్‌గా ఎదగాలని స్టార్టప్ ఇండియా, ముద్ర లోన్ వంటి పథకాలు ప్రారంభించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి కూడా అవకాశం ఇచ్చారు, కాని ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు. నిజమైన అభివృద్ధి కోసం, గొప్ప మార్పు కోసం ప్రజలు బిజెపికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నా.’’ అని రాంచందర్ రావు అన్నారు.