ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఉద్యోగులు, పెన్షనర్లు బలి
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీలో బీసీ గణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ.. ‘‘నా దగ్గర 88 కోట్ల పేజీలు ఉన్నాయి. ఏ గ్రామంలోని ఏ వార్డులో ఉన్న వ్యక్తి సమాచారమైన ఇవ్వగలను’’ అని తెలిపారు. ముఖ్యమంత్రికి గుర్తు చేసే విషయమేమిటంటే ఈ సమాచారాన్ని సేకరించింది ప్రభుత్వ ఉద్యోగులే. మీ ఎన్నికల మెనిఫెస్టోలో ఆరు (6) గ్యారంటీలతో పాటు ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాననే హామీ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయినట్లు ఉన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించమంటే మీ డిమాండ్లను పరిష్కరించలేం, మీ కంటే మాకు 98% ప్రజలే ముఖ్యమని రెచ్చగొట్టే ప్రసంగాలను చేయడం విడ్డూరంగా ఉంది. తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలల్లో మేం భాగమే అన్న విషయాన్ని మరవద్దని కోరుతూ, గత 60 ఏళ్లుగా ఉద్యోగులపై లేని నిర్లక్ష్యం, మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 11 సంవత్సరాలుగా ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురవుతున్నారని గ్రహించాలి.
ప్రస్తుతం రాష్ట్రంలో సుమారుగా 3.2 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయులు, 2.8 లక్షల మంది పెన్షనర్లు, మరో 3 లక్షల మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులతో కలిపి 9 లక్షల వరకు ఉంటారు. ఈ 9 లక్షల కుటుంబాలు, వీరిపై ఆధారితులు కుటుంబానికి 4గురు చొప్పున 36 లక్షల మంది ఉంటారు. ఈ సంఖ్య రాష్ట్ర జనాభాలో 9%. అసెంబ్లీ ఎన్నికలల్లో మీకు ప్రతిపక్ష పార్టీకి ఓట్ల వ్యత్యాసం 1.5%. గత ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక చర్యలు చేపట్టినందున మేం మీకు ఓట్లు వేసాం. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల తీరును విశ్లేషిస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 79 నియోజకవర్గాల్లో 2023లో 100కు పైగా స్థానాల్లో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష (మీ) అభ్యర్థులకు అధిక్యం ఇవ్వడం దీనికి నిదర్శనం. మీరు అధికారంలోకి రావడానికి పొందిన 40% ఓట్లలో మా పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో పాటు, మా ఆధారితుల ఓట్లు ఉన్నాయనే విషయాన్ని మరువకండి. ముఖ్యంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల విషయానికి వస్తే 29 రాష్ట్రాలలో మీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటక, హిమచల్ ప్రదేశాలతో పాటు ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో 5 డీఏలు పెండింగ్లో ఉండడం, మీరు అధికారంలోకి వచ్చినప్పుడు 3 డీఏలు పెండింగ్లో ఉంటే వాటిని అధికారం చేపట్టిన వెంటనే మంజూరు చేస్తామన్న ఎన్నికల హామీని కాదని 5కు పెంచిన ఘనత మీది. ఇక ఉద్యోగులకు 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ (పీఆర్సీ) జరుగుతుంది. గత ప్రభుత్వం కమిషన్ ను నియమించి 5% ఐఆర్ ఇస్తే పీఆర్సీ వర్తించాల్సిన తేది. 01.07.2023 నుండి ఇప్పటి వరకు 26 నెలలు గడుస్తున్న కమీషన్ రిపోర్టు బహిర్గతం కాలేదు. పీఆర్సీ విషయంలో మీ మెనిఫెస్టోలో 6 నెలల్లో గౌరవప్రదమైన పీఆర్సీ ఇస్తామన్న మాట తప్పి 20 నెలలు గడుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లకు ఒక్కసారి ఇచ్చే 8వ పీఆర్సీ వర్తింపు తేదీ జనవరి 2026 నుండి అమలుకు సన్నాహాలు చేస్తున్నది. కేంద్రంతో పోల్చుకుంటే 16వ పీఆర్సీలో ఉండాల్సిన మేం అమలులో జాప్యం వల్ల 4 పీఆర్సీలు నష్టపోతున్నాం. ఇప్పుడు వర్తించాల్సిన పీఆర్సీ తెలంగాణలో 2వది, (ఉమ్మడి ఏపీ 10+2) మొత్తంగా 12వది. ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ కొరకు ఇచ్చిన హెల్త్ కార్డుల ద్వారా ఏ ఆస్పత్రిలో చికిత్సలు జరగడం లేదు. గత ప్రభుత్వాన్ని, మిమ్మల్ని ఉద్యోగుల నుండి కాంట్రిబ్యూషన్ తీసుకొని ఈహెచ్ఎస్ ను సక్రమంగా అమలు చేయమంటే శ్రద్ధ చూపడం లేదు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జోనల్ విధానం వల్ల నష్టపోయిన జి.వో. 317 ఉద్యోగులను వారి స్వస్థలాలకు తీసుకొని వస్తామన్న ఎన్నికల హామీ కమిటీలతో కాలయాపన చేస్తూ పరిష్కరించడం లేదు. సీపీఎస్ రద్దు చేస్తామన్న హామీ మీకు గుర్తు లేకుండా పోయింది. ఇలా చాలా సమస్యలను పరిష్కరించకుండా మీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది.
ఏమైనా అంటే మేం ప్రతి నెలా మొదటి తారీఖున జీతాలు ఇస్తున్నాం అంటారు. మొదటి తేదీన జీతాలు ఇస్తున్నందుకు మాకు చెల్లించాల్సిన డీఏ 15% (5 విడుతలు కలిపి) కమిషన్ కింద తీసుకుంటున్నారా? ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచడం వల్ల ఉద్యోగ విరమణలు మార్చి 2024 నుండి ప్రారంభమై ప్రతి నెలా సుమారు 800 మంది చొప్పున ఈ 16 నెలల్లో 12000 మంది రిటైర్ అయ్యారు. వీరికి ఒక్కొక్కరికి సరాసరిన రూ.50 లక్షల చొప్పున పెన్షన్ బెనిఫిట్స్ చెల్లించాల్సి ఉంది. వీటి చెల్లింపు నిలిపివేస్తున్నారు. కోర్టుకు వెళ్ళి కోర్టు ఆదేశాలు తెస్తేనే చెల్లింపులు జరుపుతున్నారు. ఉద్యోగుల జీపీఎఫ్, సరెండర్ లీవు వేతనం, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ చెల్లింపు జరగడం లేదు.
ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని నిరసించడానికి ఉద్యోగ జేఏసీ ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టి జూన్ 9, 2025న ఇందిరా పార్కులో ధర్నాకు పిలుపునిస్తే సమస్యల పరిష్కారానికి ముగ్గురు మంత్రుల కమిటీ ముగ్గురు ఐఏఎస్ ల కమిటీ ఏర్పాటు చేసి చర్చలు జరిపి, వారు చేసిన పరిష్కారం ఏమిటి? పెండింగ్లో ఉన్న 5 డీఏలలో 2 డీఏలు ఇస్తామని, ఒకటి జూన్ నుండి మరొకటి 6 నెలల తరువాత అని జివో విడుదల చేయడం చాలా విడ్డూరంగా ఉంది. డీఏ అనేది 6 నెలల్లో ధరల పెరుగుదలకు అనుగుణంగా ద్రవ్యోల్బణం ఆధారంగా లెక్కించి 6 నెలలకు ఒకటి మంజూరు చేస్తారు. జూన్, జూలై 2025 నెలల్లో వస్తువుల కొనుగోలు శక్తి తగ్గి 29 రాష్ట్రాల్లో తెలంగాణ వెనుకబడిన విషయాన్ని గమనించగలరు. ఒక డీఏ ఇచ్చి 6 నెలలకు మరొ డీఏ అంటే 5 డీఏలు ఎప్పటికి పెండింగ్లో ఉంచడమేనా మీ ఉద్దేశ్యం? ఒక డీఏ మంజూరుకు 29 నెలలు ఆగి నగదుగా పొంది 29 నెలల బకాయిలను 28 వాయిదాల్లో అంటే మా పరిస్థితి ఏమిటి? మేం పెరిగిన ధరల భారాన్ని 29 నెలలుగా భరిస్తున్నామంటే మేం నెలకు పొందే డీఏ మొత్తం సరాసరి నెలకు రూ.2500 చొప్పున 29 నెలల మొత్తం రూ.70 వేలకు పైనే ఉంటుంది. దీనిపై నెలకు వడ్డీ ఎంత లేకున్నా రూ.700 వరకు నష్టపోతున్నాం. ఇంకా బకాయిల చెల్లింపు 28 వాయిదాల్లో చెల్లించడం వల్ల సీపీఎస్ ఉద్యోగులు, పెన్షనర్లు మరో 28 నెలలు రూ.700 నష్టపోతున్నారు. ఈ రోజుల్లో ఏ ఉద్యోగి కాని, పెన్షనర్ కాని గృహ, వ్యక్తిగత, విద్యా రుణాలు తీసుకోని వారు లేరు. వారు రుణాలపై వడ్డీ చెల్లిస్తూ వారికి వచ్చే మొత్తాన్ని ఆలస్యంగా 28 వాయిదాల్లో పొందడం సమంజసమేనా!
గత పీఆర్సీ కమిషన్ 01.07.2018న 1 లక్ష 90 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని తెలిపిన విషయం విదితమే. ఈ మధ్య కాలంలో ఉద్యోగ విరమణల ద్వారా ఖాళీ అయిన 20 వేలు ఇటీవల నియామకాలు చేసిన 50 వేల ఉద్యోగాలు తగ్గిస్తే ప్రస్తుత ఖాళీలు 1 లక్ష 60వేల వరకు ఉంటాయి. ఈ ఖాళీల వల్ల ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులే ఆ ఖాళీల పని భారాన్ని మోయాల్సి వస్తున్నది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న 30 లక్షల మంది నిరుద్యోగులకు నియామక ప్రక్రియ చేపట్టి ఖాళీలను భర్తీ చేసి, పని చేస్తున్న ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించాలి. ఉద్యోగులంటే ప్రభుత్వ యంత్రాంగం. ప్రభుత్వానికి మంచి పేరు ఉద్యోగుల పనితీరును బట్టే వస్తుంది. ఉద్యోగులకు ఇచ్చే జీతాలు అంటే యంత్రాంగానికి ఇంధనం అనుకోవాలి కాని నెలకు రాష్ట్ర ఆదాయం రూ.15 వేల కోట్లు అని వాటిని వడ్డీలకు, ప్రభుత్వ పథకాల అమలుకు చెల్లిస్తున్నామని చెబుతూ, ఉద్యోగులకు కోత పెడుతూ ప్రజల వద్దకు వెళ్దాం అని అనడం సరైంది కాదు. రాష్ట్ర ఆదాయం, నెల నెల అప్పుగా చేస్తున్న వేల కోట్ల రూపాయలు ఎటుపోతున్నాయి? ఇక్కడ దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ చెప్పిన మాట ‘‘ప్రభుత్వం రూ.100 పంపిస్తే ప్రజలకు చేరేది రూ.20 మాత్రమేనని, రూ.80 అవినీతిపరుల చేతుల్లోకి వెళ్తున్నాయి’’ అనేది ప్రస్తుతం మన రాష్ట్రంలో అక్షర సత్యం చేస్తున్నారు ఈ పాలకులు.
గతంలో ఉద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వాలకు ఏ గతి పట్టిందో గుర్తుంచుకోవాలి. 1989లో ఎన్టీఆర్ జి.వో. 370 తెచ్చి రెవెన్యూ డివిజన్ నుండి వేరే రెవెన్యూ డివిజనుకు బదిలీలు చేస్తే తదుపరి ఎన్నికలో ఎన్టీఆర్ ఓడిపోవడం, 1999-2024 కాలంలో చంద్రబాబు ఉద్యోగులకు 4 డీఏలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తే 2004లో ఆయన ఓడిపోవడం చరిత్ర. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యోగులది కీలక పాత్ర. జూన్ 02, 2014న ఏర్పడిన నూతన తెలంగాణలో ఏర్పాటైన ప్రభుత్వం 10వ పీఆర్సీ అమలు చేసి బకాయిలు 32 విడుతలుగా చెల్లిస్తామంటే, 2015లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన ఉద్యోగ సంఘం నేతను ఓడించడం, ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోవడం, ఇవన్నీ ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాల వల్లే అని ప్రభుత్వం గ్రహించాలి.
ప్రభుత్వ తీరు గమనిస్తే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా కాలం గడపాలని చూస్తున్నది. అందుకే ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకత్వాలను కోరేది ఏమనగా రాష్ట్రంలో ఉన్న మూడు జేఏసీలు ఒక్కటై, ఇప్పటికే ఉద్యమ కార్యచరణ మొదలు పెట్టిన పెన్షనర్ల జేఏసీలను కలుపుకొని, ఇటీవల రేవంత్ రెడ్డి దిల్లీలో జంతర్ మంతర్ లో చేసిన ధర్నాను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమ కార్యక్రమానికి పిలుపునిచ్చి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టాలి.
పులి సరోత్తం రెడ్డి,
పీఆర్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు,
బిజెపి రిటైర్డ్ ఎంప్లాయిస్, టీచర్స్ సెల్ రాష్ట్ర కో-చైర్మన్

