Palvai Harish

పోడు రైతుల సమస్యల పరిష్కారం కోసం హరీష్ బాబు సత్యాగ్రహ దీక్ష

జీవో 49 రద్దు చేయాలని, పోడు రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిజెపి సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తన నివాసంలో సత్యాగ్రహ దీక్షకు దిగారు. ఈ దీక్షకు ఆదివాసీల నుంచే కాకుండా అనేక ప్రజాస్వామిక సంఘాల నుంచి విశేష మద్దతు వచ్చింది. రోజురోజుకూ అతని ఆరోగ్యం క్షీణిస్తున్నా తోలుమందం కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం లేకపోయింది. చివరికి బిజెపి శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలోని బిజెపి కమిటీ ఆగస్ట్ 22న ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేసింది. 

పులుల కారిడార్‌, కవ్వాల్‌ అభయారణ్యంలో భాగంగా ఉన్న ఆసిఫాబాద్‌ ప్రాంతాన్ని కుమరంభీం టైగర్‌ కన్జర్వేషన్‌ రిజర్వ్‌గా ప్రకటిస్తూ 2025 జూన్ 30న అటవీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆహ్మద్‌ నదీం జీవో-49 జారీ చేశారు. ఈ జీవో ద్వారా జిల్లాలోని ఆసిఫాబాద్‌, కెరమెరి, రెబ్బెన, తిర్యాణి, కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి), కర్జెల్లీ, బెజ్జూరు, పెంచికల్‌పేట రేంజ్‌ల పరిధిలో సుమారు ల‌క్ష‌న్న‌ర‌ హెక్టార్లను టైగర్‌ రిజర్వ్‌లోకి మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. జీవో విడుదలైన రోజు నుంచి దీన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. జీవో-49పై ఆదివాసీల్లో అనుమానాలు, అభ్యంతరాలు నెలకొన్న నేపథ్యంలో పలుమార్లు మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అదికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో మంత్రులు సమావేశాలు నిర్వహించి పూర్తి వివరాలు సేకరించారు. ఈ పరిణామాల దృష్ట్యా జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే నుంచి తాజాగా నివేదికలు తెప్పించుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి 2025 జూలై 21న‌ జీవో-49ని నిలుపుదల చేసేందుకు నిర్ణయించి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆహ్మద్‌ నదీం జీవో-49ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే జీవో 49ను తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వంలో చిత్తశుద్ధి లోపించింది. బిజెపి వీరోచిత పోరాటాన్ని చూసి, ఆదివాసుల్లో ప్ర‌భుత్వం ప‌ట్ల పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌ను చూసి స్థానిక ఎన్నిక‌ల్లో ఓట‌మి ఖాయ‌మ‌ని గ్ర‌హించి, ఆదివాసుల ఓట్ల కోసం కంటి తుడుపు చ‌ర్య‌గా జీవో 49ను తాత్కాలికంగా నిలిపివేశారు. స్థానిక సంస్థల ఎన్నిక‌ల అనంత‌రం జీవో49ను పున‌రుద్ధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో జీవో 49ను శాశ్వ‌తంగా ర‌ద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి రాజీలేని పోరాటం చేపట్టింది. ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు నిర్వహించింది. ఇందులో భాగంగా హ‌రీష్ బాబు ఆదివాసీ ప్ర‌జ‌ల కోసం జీవో 49ను శాశ్వతంగా రద్దు చేయాలని ఆ నాటి గోండు వీరుడు కొమ‌రం భీమ్ స్ఫూర్తితో నిర‌వ‌ధిక నిరాహార దీక్ష‌కు దిగారు. ఈ దీక్ష ఐదు రోజుల పాటు కొనసాగింది.

ఈ సందర్భంగా పాల్వాయి హరీష్ మాట్లాడుతూ జీవో 49 రద్దు చేసేవరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హామీ మేరకు పోడు రైతుల సమస్యలను పరిష్కరించాలని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో అట‌వీ హ‌క్కుల చ‌ట్టాన్ని ప‌టిష్టంగా అమ‌లు చేసి, అర్హులైన అంద‌రికీ పోడు భూముల ప‌ట్టాల పంపిణీ అని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. 20 నెల‌లుగా పోడు ప‌ట్టాలు ఎందుకు ఇవ్వ‌లేక‌పోయారని ప్రశ్నించారు. ద‌శాబ్దాలుగా, ముత్తాత‌ల‌ కాలం నుంచి పోడు చేసుకుని బతుకుతున్న ఆదివాసుల‌ను కాంగ్రెస్ స‌ర్కారు అడ్డు కోవ‌డం అన్యాయమన్నారు. పొట్టకూటి కోసం పోడు సాగు చేసుకుంటున్న వారిని అరెస్టు చేసి కేసులు పెట్ట‌డం దారుణమని వాపోయారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి… నీకు చాత‌నైతే హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీకి చెందిన వేల ఎక‌రాల ఫారెస్టు భూమిని ప‌రిర‌క్షించు. కంచ‌ గచ్చిబౌలిలో వందలాది మంది పోలీసుల సాయంతో బుల్డోజర్లు తెచ్చి వ‌న్య‌ప్రాణులున్నా లెక్క‌చేయ‌కుండా ఫారెస్టు భూమిని నాశనం చేస్తే… కనీసం వైల్డ్‌ లైఫ్‌ ప్రిజర్వేషన్‌ యాక్ట్‌, ఫారెస్ట్‌ కన్జర్వేషన్‌ యాక్ట్‌ కింద ఒక్క కేసు కూడా పెట్టలేదు, కానీ ఆసిఫాబాదులో మాత్రం అమాయ‌క పోడు రైతుల‌పై ప్ర‌తాపం చూప‌డానికి సిగ్గులేదా? పోడు రైతులను వేధించడం ఆపి, వారికి వెంటనే పట్టాలివ్వాలి. కుట్రపూరిత అరెస్టులను మానుకోవాలి.’’ అని హరీష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.