‘కుంభ మేళా’ ఐక్యతా మహాకుంభమేళా
ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారయయ్యే ప్రధానమంత్ర నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ ఈ నెలలో గణతంత్ర దినోత్సవం చివరి ఆదివారం రావడంతో మూడోవారంలోనే ప్రసారమైంది. 19 జనవరి 2025న ప్రసారమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) ముఖ్యాంశాలు.
ఈసారి గణతంత్ర దినోత్సవం చాలా ప్రత్యేకమైంది. ఇది భారత గణతంత్ర 75వ వార్షికోత్సవం. ఈ సంవత్సరానికి రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలవుతోంది. పవిత్ర రాజ్యాంగాన్ని మనకు అందించిన రాజ్యాంగ సభలోని గొప్ప వ్యక్తులందరికీ నమస్కరిస్తున్నాను. రాజ్యాంగ సభ సమయంలో అనేక అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. రాజ్యాంగ సభ పనులు ప్రారంభమైనప్పుడు బాబా సాహెబ్ అంబేద్కర్ పరస్పర సహకారం గురించి చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. బాబాసాహెబ్ రాజ్యాంగ సభ ఐక్యంగా, ఏకాభిప్రాయంతో ఉండాలని, అందరి హితం కోసం కలిసి పనిచేయాలని భావించారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మానవ విలువల పట్ల దేశం నిబద్ధత గురించి మాట్లాడారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అవకాశాల సమానత్వం అనే అంశాన్ని ప్రస్తావించారు. మన దేశ పౌరులమైన మనం ఈ ఆలోచనల నుండి ప్రేరణ పొంది, మన రాజ్యాంగ నిర్మాతలు కూడా గర్వపడే భారతదేశాన్ని నిర్మించడానికి కృషి చేయాలి.
ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభమైంది. ఎప్పుడూ గుర్తుంచుకునే జనసమూహం. ఊహకు అందని దృశ్యం. సమానత్వం, సామరస్యాల అసాధారణ సంగమం! ఈ కుంభమేళా భిన్నత్వంలో ఏకత్వాన్ని జరుపుకుంటుంది. భారతదేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు పవిత్ర సంగమ ఇసుక తిన్నెలపై గుమిగూడతారు. వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయంలో ఎక్కడా వివక్ష లేదా కులతత్వం లేదు. ఇందులో భారతదేశ దక్షిణ ప్రాంతం నుండి ప్రజలు వస్తారు. భారతదేశ తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుండి కూడా వస్తారు. కుంభమేళాలో ధనిక, పేద అందరూ ఒక్కటి అవుతారు. అందరూ సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తారు. భండారాలలో కలిసి భోజనం చేస్తారు. ప్రసాదాలు తీసుకుంటారు. అందుకే ‘కుంభ మేళా’ ఐక్యతకు సంబంధించిన మహాకుంభమేళా. కుంభమేళా వేడుక మన సంప్రదాయాలు మొత్తం భారతదేశాన్ని ఎలా ఏకం చేస్తాయో కూడా మనకు తెలియజేస్తుంది. ఉత్తరం నుండి దక్షిణం వరకు నమ్మకాలను అనుసరించే మార్గాలు ఒకేలా ఉంటాయి. ఒకవైపు ప్రయాగ్‌రాజ్, ఉజ్జయిని, నాసిక్ , హరిద్వార్‌లలో కుంభమేళా నిర్వహిస్తుండగా, దక్షిణ భాగంలో గోదావరి, కృష్ణ, నర్మద , కావేరి నదుల ఒడ్డున పుష్కరాలు నిర్వహిస్తారు. ఈ రెండు పండుగలు మన పవిత్ర నదులు, వాటి నమ్మకాలతో ముడిపడి ఉన్నాయి. అదేవిధంగా కుంభకోణం నుండి తిరుక్కడ్-యూర్ వరకు, కూడవాసల్ నుండి తిరుచెరై వరకు కుంభమేళాతో ముడిపడి ఉన్న సంప్రదాయాలు అనేకం ఉన్నాయి.
కొద్ది రోజుల క్రితం పశ్చిమ బెంగాల్లో కూడా గొప్ప ‘గంగా సాగర్’ ఉత్సవం జరిగింది. సంక్రాంతి శుభ సందర్భంగా ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ఈ జాతరలో స్నానమాచరించారు. ‘కుంభ’, ‘పుష్కరం’ ‘గంగా సాగర్ మేళా’ – ఈ మన పండుగలు మన సామాజిక పరస్పర చర్య, సామరస్యం, ఐక్యతను పెంపొందిస్తాయి. ఈ పండుగలు భారతదేశ ప్రజలను భారతదేశ సంప్రదాయాలతో అనుసంధానిస్తాయి. మన గ్రంథాలు ప్రపంచంలోని నాలుగు అంశాలు – ధర్మం, అర్థ, కామ, మోక్షాలను నొక్కి చెప్పుతాయి. అదేవిధంగా మన పండుగలు , సంప్రదాయాలు ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక , ఆర్థిక- ఇలా ప్రతి అంశాన్ని కూడా బలోపేతం చేస్తాయి.
ఈ నెల మనం ‘పుష్య శుక్ల ద్వాదశి’ రోజున రామ్‌లాలా ప్రాణ ప్రతిష్ఠ పండుగ మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకున్నాం. ఈ సంవత్సరం ‘ పుష్య శుక్ల ద్వాదశి’ జనవరి 11న వచ్చింది. ఈ రోజున లక్షలాది మంది రామ భక్తులు అయోధ్యలో రామ్ లల్లా దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొందారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ ద్వాదశి భారతదేశ సాంస్కృతిక చైతన్య పునఃస్థాపనకు ద్వాదశి. కాబట్టి ఈ పుష్య శుక్ల ద్వాదశి రోజు ఒక విధంగా ప్రతిష్ఠ ద్వాదశి రోజుగా కూడా మారింది. అభివృద్ధి పథంలో పయనిస్తున్నప్పుడు, మనం మన వారసత్వాన్ని కాపాడుకుంటూ దాని నుండి ప్రేరణ పొంది ముందుకు సాగాలి.
కొన్ని రోజుల క్రితం మన శాస్త్రవేత్తలు అంతరిక్ష రంగంలో మరో పెద్ద విజయాన్ని సాధించారు. మన శాస్త్రవేత్తలు ఉపగ్రహాల అంతరిక్ష డాకింగ్ చేశారు. రెండు అంతరిక్ష నౌకలు అంతరిక్షంలో అనుసంధామైనప్పుడు జరిపే ప్రక్రియను డాకింగ్ అంటారు. అంతరిక్ష కేంద్రాలకు, అంతరిక్షంలోని సిబ్బంది మిషన్లకు సామాగ్రిని పంపడానికి ఈ సాంకేతికత ముఖ్యమైనది. ఈ విజయాన్ని సాధించిన నాల్గవ దేశంగా భారత్ నిలిచింది. మన శాస్త్రవేత్తలు అంతరిక్షంలో కూడా మొక్కలను పెంచి వాటిని సజీవంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికోసం ఇస్రో శాస్త్రవేత్తలు డిసెంబర్ 30న పంపిన విత్తనాలు అంతరిక్షంలోనే మొలకెత్తాయి. ఇది చాలా స్ఫూర్తిదాయకమైన ప్రయోగం, ఇది భవిష్యత్తులో అంతరిక్షంలో కూరగాయలను పెంచడానికి మార్గం ఏర్పరుస్తుంది. ఇది మన శాస్త్రవేత్తలు ఎంత ముందుచూపుతో ఆలోచిస్తున్నారో చూపిస్తుంది.
ఐఐటీ మద్రాస్‌లోని ఎక్స్‌టెమ్ సెంటర్ అంతరిక్షంలో తయారీ కోసం కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై పనిచేస్తోంది. ఈ కేంద్రం 3D-ప్రింటెడ్ భవనాలు, మెటల్ ఫోమ్‌లు , అంతరిక్షంలో ఆప్టికల్ ఫైబర్స్ వంటి సాంకేతికతలపై పరిశోధన జరుపుతోంది. ఈ కేంద్రం నీరు లేకుండా కాంక్రీటు తయారు చేయడం వంటి విప్లవాత్మక పద్ధతులను కూడా అభివృద్ధి చేస్తోంది. ExTeM చేస్తోన్న ఈ పరిశోధన భారతదేశ గగన్‌యాన్ మిషన్, భవిష్యత్ అంతరిక్ష కేంద్రాన్ని బలోపేతం చేస్తుంది. ఇది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కొత్త మార్గాలను కూడా తెరుస్తుంది.
అస్సాంలో ‘నౌగావ్’ అనే ప్రాంతంలో ఏనుగుల గుంపులు పంటలను నాశనం చేసే అనేక సంఘటనలు జరుగుతూ ఉండేవి. రైతులు ఇబ్బంది పడేవారు. దీని కారణంగా చుట్టుపక్కల ఉన్న దాదాపు 100 గ్రామాల ప్రజలు చాలా కలత చెందారు. కానీ గ్రామస్తులు కూడా ఏనుగుల నిస్సహాయతను అర్థం చేసుకున్నారు. ఏనుగులు తమ ఆకలి తీర్చుకోవడానికి పొలాల వైపు వెళ్తున్నాయని వారికి తెలుసు. కాబట్టి గ్రామస్తులు దీనికి ఒక పరిష్కారం కనుగొనాలని ఆలోచించారు. వారి ఆలోచనలతో ‘హాతి బంధు’ అనే గ్రామస్తుల బృందం ఏర్పడింది. గ్రామస్తులు తమ తెలివితేటలను ఉపయోగించి, దాదాపు 800 ఎకరాల బంజరు భూమిలో నేపియర్ గడ్డిని నాటారు. ఏనుగులకు ఈ గడ్డి అంటే చాలా ఇష్టం. దీని ప్రభావంతో ఏనుగులు పొలాల వైపు వెళ్లడం తగ్గించాయి. ఇది వేలాది మంది గ్రామస్తులకు ఎంతో ఉపశమనం కలిగించే విషయం. ఏనుగులకు కూడా వారి ప్రయత్నాలు చాలా నచ్చాయి. గత రెండు నెలల్లో మన దేశంలో రెండు కొత్త పులుల అభయారణ్యాలు ఏర్పాటు కావడం మనందరికీ చాలా సంతోషకరమైన విషయం. వీటిలో ఒకటి ఛత్తీస్‌గఢ్‌లోని గురు ఘాసిదాస్-తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్. మరొకటి మధ్యప్రదేశ్‌లోని రాతాపాణి టైగర్ రిజర్వ్.
కొన్ని రోజుల క్రితం స్టార్టప్ ఇండియా 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. గత 9 సంవత్సరాలలో మన దేశంలో రూపొందిన స్టార్టప్‌లలో సగానికి పైగా టైర్ 2, టైర్ 3 నగరాల నుండి వచ్చాయి. ఇది విన్నప్పుడు ప్రతి భారతీయుడి హృదయం ఆనందంగా ఉంటుంది. అంటే మన స్టార్టప్ సంస్కృతి పెద్ద నగరాలకే పరిమితం కాలేదు. చిన్న పట్టణాల్లోని సగానికి పైగా స్టార్టప్‌లకు అమ్మాయిలు నాయకత్వం వహిస్తున్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంబాలా, హిసార్, కాంగ్రా, చెంగల్పట్టు, బిలాస్పూర్, గ్వాలియర్, వాషిమ్ వంటి నగరాలు స్టార్టప్‌లకు కేంద్రాలుగా మారుతున్నాయని విన్నప్పుడు మన మనసు ఆనందంతో నిండిపోతుంది. నాగాలాండ్ వంటి రాష్ట్రంలో గత ఏడాది స్టార్టప్‌ల నమోదు 200% కంటే ఎక్కువ పెరిగింది. వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం, బయోటెక్నాలజీ, లాజిస్టిక్స్ రంగాలలో స్టార్టప్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి సాంప్రదాయిక రంగాలు కావు. కానీ మన యువ స్నేహితులు కూడా సంప్రదాయానికి మించి ఆలోచిస్తారు. అందువల్ల వారు విజయం సాధిస్తున్నారు.
అండమాన్ – నికోబార్ దీవుల్లోని వర్జిన్ కొబ్బరి నూనె ఇటీవలే GI ట్యాగ్‌ను పొందింది. వర్జిన్ కొబ్బరి నూనెకు GI ట్యాగ్ తర్వాత మరొక కొత్త చొరవ తీసుకున్నారు. ఈ నూనె ఉత్పత్తిలో పాల్గొన్న మహిళలను సంఘటితం చేసి, స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. వారికి మార్కెటింగ్, బ్రాండింగ్‌లో ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. మన ఆదివాసీ వర్గాలను ఆర్థికంగా సాధికారపరిచే దిశగా ఇది ఒక పెద్ద ముందడుగు. నికోబార్ వర్జిన్ కొబ్బరి నూనె భవిష్యత్తులో ప్రపంచంలో ఒక సంచలనం సృష్టిస్తుందని విశ్వసిస్తున్నాను.
అరుణాచల్ ప్రదేశ్ లో దీపక్ నాబామ్ సేవకు ఒక ప్రత్యేకమైన ఉదాహరణను మన ముందుంచారు. దీపక్ అక్కడ ఒక లివింగ్ హోమ్ నిర్వహిస్తున్నారు. అక్కడ మానసిక రోగులు, శారీరక దివ్యాంగులు, వృద్ధులకు సేవలు అందిస్తారు. మాదకద్రవ్యాల వ్యసనంతో బాధపడుతున్న వ్యక్తులను కూడా ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటారు. దీపక్ నాబామ్ ఎటువంటి సహాయం ఆశించకుండా ఈ సేవలందిస్తున్నారు. సమాజంలో అణగారిన ప్రజలకు, హింసకు గురైన కుటుంబాలకు, నిరాశ్రయులైన వారికి సహకారం అందించడానికి ఒక ప్రచారాన్ని ప్రారంభించారు. నేడు ఆయన సేవ ఒక సంస్థ రూపాన్ని సంతరించుకుంది. ఆయన సంస్థకు అనేక పురస్కారాలు కూడా లభించాయి.
ఒక్క క్షణం ఒక దృశ్యాన్ని ఊహించుకోండి- కోల్‌కతాలో అప్పుడు జనవరి సమయం. రెండవ ప్రపంచ యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. భారతదేశంలో బ్రిటిష్ వారిపై కోపం హెచ్చుస్థాయికి చేరుకుంది. ఈ కారణంగా నగరంలోని ప్రతి మూలమూలలో పోలీసులను మోహరించారు. కోల్‌కతా నడిబొడ్డున ఉన్న ఒక ఇంటి చుట్టూ పోలీసుల బందోబస్తు మరింత అప్రమత్తంగా ఉంది. ఇంతలో… రాత్రి చీకటిలో ఒక బంగ్లా నుండి ఒక వ్యక్తి పొడవాటి గోధుమ రంగు కోటు, ప్యాంటు , నల్ల టోపీ ధరించి కారులో బయటకు వస్తాడు. అధిక భద్రత ఉన్న వివిధ చెక్‌పోస్టులను దాటిన తర్వాత అతను గోమో అనే రైల్వే స్టేషన్‌కు చేరుకుంటాడు. ఈ స్టేషన్ ఇప్పుడు జార్ఖండ్‌లో ఉంది. ఇక్కడి నుండి అతను రైలులో ముందుకు కదులుతాడు. తరువాత ఆఫ్ఘనిస్తాన్ ద్వారా యూరప్ చేరుకుంటాడు. ఇదంతా బ్రిటిష్ పాలనలో అభేద్యమైన కోటలు ఉన్నప్పటికీ జరిగింది.
ఈ కథ మీకు సినిమా సన్నివేశంలా అనిపించవచ్చు. అంత ధైర్యం చూపించే ఆ వ్యక్తి ఏ నేలకు చెందినవాడో అని మీరు ఆలోచిస్తున్నారా? నిజానికి ఆ వ్యక్తి మరెవరో కాదు- మన దేశ మహోన్నత నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇప్పుడు మనం ఆయన జయంతి అయిన జనవరి 23వ తేదీని ‘పరాక్రమ్ దివస్’గా జరుపుకుంటున్నాం. ఆయన ధైర్యసాహసాలకు సంబంధించిన ఈ గాథ ఆయన పరాక్రమాన్ని కూడా చూపిస్తుంది. బ్రిటిష్ వారి నుండి ఆయన తప్పించుకున్న అదే ఇంటికి కొన్ని సంవత్సరాల కిందట నేను వెళ్ళాను. ఆ కారు ఇప్పటికీ అక్కడే ఉంది. సుభాష్ బాబు ఒక దార్శనికుడు. ఆయన స్వభావంలోనే ధైర్యం దాగి ఉంది. ఇది మాత్రమే కాదు- ఆయన చాలా సమర్థవంతమైన కార్యనిర్వహణాదక్షుడు కూడా. కేవలం 27 సంవత్సరాల వయస్సులో ఆయన కోల్‌కతా కార్పొరేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అయ్యారు. ఆ తరువాత మేయర్ బాధ్యతలను కూడా స్వీకరించారు. పరిపాలకుడిగా అనేక గొప్ప పనులు చేశారు. పిల్లల కోసం పాఠశాలలు ఏర్పాటు చేశారు. పేద పిల్లలకు పాలు అందించారు. స్వచ్చతకు సంబంధించి ఎంతో కృషి చేశారు. ఆయన చేసిన కృషి ఇప్పటికీ గుర్తుండిపోతుంది.
నేతాజీ సుభాష్ కు రేడియోతో కూడా గాఢమైన సంబంధం ఉంది. ఆయన ‘ఆజాద్ హింద్ రేడియో’ని స్థాపించారు. అందులో ఆయన మాట వినడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఆయన ప్రసంగాలు విదేశీ పాలనకు వ్యతిరేకంగా పోరాటానికి కొత్త బలాన్నిచ్చాయి. ‘ఆజాద్ హింద్ రేడియో’లో ఇంగ్లీషు, హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, పష్తో, ఉర్దూ భాషలలో వార్తా బులెటిన్ల ప్రసారం జరిగేది. దేశవ్యాప్తంగా ఉన్న యువత ఆయన గురించి వీలైనంత ఎక్కువగా చదవాలని, ఆయన జీవితం నుండి ప్రేరణ పొందడం కొనసాగించాలని నేను కోరుతున్నాను.