లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నిక
18వ లోక్‌సభ స్పీకర్‌గా బిజెపి ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. 48 ఏళ్ల తర్వాత మళ్లీ లోక్‌సభ సభాధ్యక్ష పదవికి ఎన్నిక జరగ్గా.. ఓం బిర్లా మూజువాణి ఓటుతో విజయం సాధించారు. దీంతో వరుసగా రెండోసారి సభాధ్యక్షులుగా ఎన్నికైన ఐదో స్పీకర్‌గా ఓం బిర్లా గుర్తింపు పొందారు. జూన్ 26న ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమయ్యాక.. ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు.. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు, టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, పలువురు ఎన్డీయే ఎంపీలు ఈ తీర్మానాన్ని బలపరిచారు. ఇండియా కూటమి తరఫున కె.సురేశ్ పేరును ప్రతిపాదిస్తూ శివసేన(ఉద్ధవ్ వర్గం) ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానాన్ని తీసుకురాగా.. విపక్ష కూటమి ఎంపీలు బలపరిచారు. అనంతరం మూజువాణి ఓటుతో ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ప్రకటించారు. ఆ వెంటనే ప్రధాని మోదీ లేచి.. ఓం బిర్లా వద్దకు వెళ్లి, ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ సభలో సంప్రదాయాలు, విలువలను కాపాడతానన్నారు. సభలో భిన్నాభిప్రాయాలు, విమర్శలు ఉండొచ్చని, అయితే.. లోక్‌సభ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకాలను ఏర్పరచకూడదని కోరారు. సభను అడ్డంకులు లేకుండా నడపాలన్నదే తన అభిమతమన్నారు. ప్రతిపక్షాలు ఇచ్చే నిర్మాణాత్మక సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఓం బిర్లా రెండోసారి స్పీకర్‌గా ఎన్నికవ్వడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మీ చిరునవ్వుతో సభలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీ చిరునవ్వు సభను ఎల్లప్పుడూ సంతోషకర వాతావరణంలో ఉంచుతుంది. కొన్ని దశాబ్దాలుగా సభాపతిగా పని చేసిన వారంతా ఎటువంటి పోటీని ఎదుర్కోలేదు. కానీ మీరు ఎన్నికల్లో గెలిచి, చరిత్ర సృష్టించారు. చరిత్రలోనే స్వర్ణయుగానికి మీరు నేతృత్వం వహిస్తున్నారు. కొత్తగా లోక్‌సభకు ఎన్నికైన వారికి మీ పనితీరు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు.