mother toungue

మాతృభాషలో విద్యాబోధనతోనే పిల్లల విద్యావికాసం

భారత్ అనేక భాషలకు నిలయమే కాదు మన దేశంలో అనేక భాషలు వర్థిల్లుతున్నాయి కూడా. బహుభాషా సంస్కృతికి ఒక ఉత్కృష్ట ఉదాహరణ భారత్. మన భాషా భిన్నత్వం సుసంపన్నమైనది, భిన్నవర్ణాలతో కూడుకున్నది. దేశ సమైక్యతను పరిరక్షిస్తూనే మన భాషలు దేశంలోని విభిన్న అస్తిత్వాలకు అద్దం పడతాయి. వలస పాలనలో మన సాంస్కృతిక బలం క్షీణించింది. 1835 ఫిబ్రవరి 2న థామస్ బాబింగ్టన్ మెకాలే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఒక నివేదిక సమర్పించారు. ‘భారతీయ విద్య పై మెకాలే నివేదిక’ పేరిట తయారు చేసిన ఈ నివేదికలో ఆయన స్థానిక భాషల కంటే ఇంగ్లీష్ కు ప్రాధాన్యం ఇచ్చారు. బ్రిటిష్ ప్రయోజనాలకు విధేయులుగా ఉండే ఒక భారతీయుల వర్గాన్ని సృష్టించడానికి, తరతరాల భారతీయులను తమ సాంస్కృతిక భాషామూలాల నుంచి దూరం చేయడానికి ఆయన ఇంగ్లీష్ కు పెద్దపీట వేశారు. భారతదేశ జనాభాలో 80 శాతం మంది తమను తాము ఇంగ్లీష్ మాట్లాడని వారుగా, స్వదేశీ భాషలు మాట్లాడే వారుగా పరిగణిస్తారు. ఏదైనా అంశాన్ని లోతుగా అధ్యయనం చేయడానికి మాతృభాష కీలకం. ఎందుకంటే భాషలనేవి కేవలం ఒకరి అభిప్రాయాలను, భావాలను పంచుకునే సాధనాలు మాత్రమే కాక అవి చరిత్ర, సంప్రదాయాలు, జానపదాలకు కాణాచి వంటివి. తరతరాల విజ్ఞానాన్ని అవి భద్రపరిచి ఉంచుతాయి. ప్రపంచం పట్ల ప్రజలకు తమదైన సొంత దృక్పథాన్ని అందిస్తాయి. సృజనాత్మకత, భావోద్వేగాలు తొణికిసలాడే పిల్లలు విద్యాభ్యాసాన్ని తమ మాతృభాషలో ప్రారంభించినప్పుడు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారు. 

ప్రాథమిక విద్యను మాతృభాషతో ప్రారంభిస్తే ఇంటి నుంచి తరగతి గదికి వారి ప్రయాణం సాఫీగా సాగుతుంది. మాతృభాష నుంచి ఇతర భాషల్లోకి వారు సులభంగా పరివర్తన సాధిస్తారు. మాట్లాడటం నుంచి రాతలోకి మారడం కొత్త పదజాలాన్ని నేర్చుకోవడం, సబ్జెక్టును సులభంగా అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. “ఒక పిల్లవాడు పాఠ్యపుస్తకాల నుంచి మాట్లాడటం నేర్చుకోడు, తన తల్లి నుంచి నేర్చుకుంటాడు,” అని రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు. మాతృభాషలో విద్య మౌలిక అవగాహన నుంచి సంక్లిష్టమైన ఆలోచనా ప్రక్రియలకు ఒక సహజమైన పురోగతికి దోహదం చేస్తుంది. భారతదేశంలోని భాషా వైవిధ్యం మేధో సాంస్కృతిక సంపదకు ఒక భాండాగారం వంటిది. మంచు పర్వత శిఖరాలతో నిండిన కాశ్మీర్ నుంచి సూర్య కాంతి విరజిల్లే సముద్ర తీరంతో కూడిన కన్యాకుమారి వరకు కచ్ బంజరు భూముల నుంచి కోహిమాలోని పచ్చటి అడవుల వరకు భారతదేశంలో నలుమూలల్లోనూ స్థానిక భాషలు మన ప్రజల అంతఃసౌందర్యానీకి అద్దం పడతాయి. పిల్లలకు మాతృభాషలో విద్యను బోధించడం వల్ల మన వారసత్వంతో వారి బంధాన్ని పరిరక్షించడమే కాకుండా వారిని భవిష్యత్తు సవాళ్లు ఎదుర్కోవడానికి సిద్ధం చేసిన వాళ్ళం అవుతాం. మాతృభాషలో బలమైన పునాది వేయడం ద్వారా పిల్లలు ఇతర భాషలను సులభంగా నేర్చుకునే శక్తి సామర్థ్యాలను వివిధ అంశాలను సులభంగా ఆకళింపు చేసుకునే శక్తిని మనం వారికి కల్పించగలుగుతాం. 

జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 ఇదే దార్శనికతను ప్రతిబింబిస్తుంది. మన వారసత్వాన్ని మనం తిరిగి సాధించుకునే ప్రయత్నంలో భాగంగా ఎన్ఈపీ మాతృభాషను ప్రాథమిక విద్యలో ప్రధాన భాగంగా చేస్తుంది. భాష అనేది విద్యాభ్యాసానికి కేవలం ఒక సాధనమే కాక ఒక మనిషి అస్తిత్వాన్ని నిర్మించడంలో కీలకమైన అంశమని, వ్యక్తిలో విశ్వాసాన్ని పెంపొందించడంలో, అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడంలో కీలకమైన భాగమని భావిస్తుంది. వివిధ భాషల్లో అత్యంత నాణ్యమైన బోధనా సాధనాలు, అభ్యసనా సాధనాలు అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలని ఎన్ఈపీ 2020 నిర్దేశిస్తుంది. అప్పుడే విద్యకు సంబంధించి గరిష్ట స్థాయిలో ఫలితాలను అనుభవించగలం. సాంకేతిక పరిజ్ఞానం, విద్య మధ్య బలమైన సమన్వయానికి నూతన విద్యా విధానం ప్రాధాన్యమిస్తుంది. ముఖ్యంగా దేశంలోని భిన్న భాషా సంస్కృతులను పరిరక్షించడానికి ప్రోత్సహించడానికి ఇది అవసరం. విద్యలో సమ్మిళితత్వాన్ని సాధించడం కోసం భారతీయ భాషలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఒక బలమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా భాషా సంఘం కార్యక్రమం, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఏర్పాటు చేసిన యంత్ర అనువాద కేంద్రం, అనువాదిని యాప్ ఆధారంగా పాఠ్యపుస్తకాల అనువాదం మొదలైనవి ఉన్నాయి. ఇలా అనువాదం చేసిన పుస్తకాలలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి వివిధ భాషల్లో ప్రచురించిన సాంకేతిక పుస్తకాలు కూడా ఉన్నాయి. అలాగే ‘అనువాదం, విద్యా రచన’ (అస్మిత) కార్యక్రమం ద్వారా వివిధ భారతీయ భాషల్లో విద్యార్థుల అధ్యయనం కోసం పుస్తకాలను ప్రచురిస్తున్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, భారతీయ భాషా సమితి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. వీటితోపాటు 79 భారతీయ భాషల్లో ప్రాథమిక పాఠ్య గ్రంథాలను ప్రచురించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. ఈ నిర్ణయం వల్ల గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాల్లోని పిల్లలు తమ మాతృభాషలోనే తొలి సంవత్సరాలలో నాణ్యమైన విద్యను పొందగలుగుతారు. ఈ ప్రాథమిక పాఠ్య పుస్తకాలతో పాటు ఇతర విద్యా సామాగ్రి కేవలం విద్యకు సంబంధించిన వనరులు మాత్రమే కాదు, అవి సృజనాత్మక, కీలక ఆలోచనా ప్రక్రియలను ప్రోత్సహించడానికి, జీవితకాల అభ్యసనానికి దోహదం చేస్తాయి. భాష మన ఆలోచనలకు ఒక రూపం ఇస్తుంది, మన భావోద్వేగాలను వ్యక్తీకరిస్తుంది, మనల్ని మన సాంస్కృతిక మూలాలతో అనుసంధానిస్తుంది. పిల్లలు తమ మాతృభాషలో విద్యాభ్యాసాన్ని మొదలుపెట్టి క్రమంగా ఇతర భాషలలో ప్రావీణ్యం సంపాదించే వ్యవస్థలను ప్రారంభించడం ద్వారా ఎన్ఈపీ 2020 కొత్త శకానికి నాంది పలికింది. 

మన విద్యా వ్యవస్థను వలసవాద పోకడల నుంచి విముక్తం చేయడం ద్వారా మనం విద్యారంగంలో రాణించే ఆలోచనాపరుల తరాన్ని సృష్టించడమే గాక భారతదేశపు సుసంపన్న సంస్కృతీ వారసత్వాలను పరిరక్షించే తరాలను తయారు చేయాలనుకుంటున్నాం. ఈ పరివర్తన కేవలం విధానంలో తెచ్చిన మార్పు మాత్రమే కాదు, సాంస్కృతిక పునరుజ్జీవం కూడా. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ముందుకు సాగుతున్న మనకు భారతదేశపు భాషా వైవిధ్యం విద్యలో అద్భుతమైన పురోగతి సాధించడానికి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అభివృద్ధికి పునాదిరాయి వంటిది. వికసిత భారత్ లక్ష్యసాధన దిశగా పయనిస్తున్న ఈ అమృతకాలంలో మన మాతృ భాషలు అభివృద్ధికి ఒక శక్తిమంతమైన సాధనాలుగా మారనున్నాయి. మన భాష, వారసత్వాలను మన అభివృద్ధికి సాధనంగా చేసుకుందాం. భారత్‌ను ప్రపంచ వేదికపై ఒక గొప్ప శక్తిగా నిలుపుదాం.

ధర్మేంద్ర ప్రధాన్,
కేంద్ర విద్యా శాఖ మంత్రి

Tags: