Medigadda

మేడిగడ్డ పునరుద్ధరణ పట్టించుకోని రేవంత్ ప్రభుత్వం

‘కాళేశ్వరం ప్రాజెక్టు వృథా. కమీషన్ల కోసమే కట్టారు. రూ.లక్ష కోట్లు వృథా. అంత ఖర్చు చేసినా ఒక్క ఎకరాకూ నీరివ్వలేదు’ అంటూ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ నేతలు పదే పదే విమర్శలు చేశారు. లక్ష కోట్ల అవినీతి డబ్బు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారు. అయితే అధికారంలోకి వచ్చాక ఆ విషయంపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఒకవైపు పంటలు ఎండిపోయి, కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థతపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, ప్రాజెక్టులు అడుగంటడానికి, కాలువలు పారకపోవడానికి మేడిగడ్డ బరాజ్‌ పిల్లర్లు కుంగడమే కారణమని సాకులు చూపి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. సాగునీటి అవసరాలు, సాగునీటి ప్రాజెక్టులపై ఈ ప్రభుత్వంకు అవగాహనా ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ప్రాజెక్టు మూలనపడడంతో రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడుతుంటే ముందుగా యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేయించే అంశంపై దృష్టి సారించడం లేదు. ఎన్‌డీఎస్‌ఏ దయాదాక్షిణ్యాలకు ఆ ప్రాజెక్టును వదిలిపెట్టి చేతులు దులుపుకొని ప్రయత్నం చేస్తున్నది. నివేదిక వస్తే తప్ప ఏ చిన్న అడుగు వేయబోమంటూ భీష్మించుకుని కూర్చున్నది. తాత్కాలిక మరమ్మతులకు మధ్యంతర నివేదిక ఇవ్వాలని కోరి, చేతులు దులుపుకొన్నదే తప్ప ఆ దిశగా పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదు. ఈ ఏడాది వానలు ముందే కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ సూచిస్తున్నా, ఎమర్జెన్సీ పనులను సైతం చేపట్టడం లేదు. బరాజ్‌ కుంగుబాటు తరువాత రెండు రోజుల్లోనే నివేదిక విడుదల చేసిన అథారిటీ, ఇక ఆ తరువాత ప్రభుత్వం నుండి ఎటువంటి ఆసక్తి కనిపించకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొన్నట్లు కనిపిస్తున్నది. 

మేడిగడ్డ బరాజ్‌ 7వ బ్లాక్‌లోని 20వ పిల్లర్‌ గత అక్టోబర్‌లో కుంగుబాటునకు గురైన విషయం తెలిసిందే. విచారణ చేయకముందే ఆరోపణలతో కాలం గడపడం తప్ప రైతులను ఆదుకొనే విషయంలో ఆతృత, చిత్తశుద్ధి కనిపించడం లేదు. అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయడంతోపాటు ఒకవైపు విజిలెన్స్‌ ఎంక్వయిరీకి, మరోవైపు జ్యూడిషియల్‌ ఎంక్వయిరీకి ఆదేశించారు. ప్రాజెక్టు పునరుద్ధరణ అంశాన్ని మాత్రం ఎన్‌డీఎస్‌ఏ దయాదాక్షిణ్యాలకు వదిలేశారు. ఎన్‌ఎస్‌డీఏ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరమే ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను చేపడతామంటూ ప్రభుత్వం భీష్మించుకుని కూర్చున్నది. క్షేత్రస్థాయి పరిస్థితులను, తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టకపోతే వాటిల్లే ఇబ్బందులను ఎన్‌ఎస్‌డీఏకు వివరించి, నివేదికను తెప్పించుకునే ప్రయత్నం చేయకపోవడం ప్రభుత్వ ఉదాసీనతను వెల్లడిస్తోంది.

మేడిగడ్డ బరాజ్‌ వద్ద కుంగుబాటును సరిచేసి, శాశ్వత మరమ్మతులను డ్యామ్‌ సేఫ్టీ యాక్ట్‌ ప్రకారం ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ ఇచ్చిన మార్గదర్శకాల మేరకు చేయాల్సి ఉంటుంది. రాబోయే వానకాలం దృష్ట్యా, పిల్లర్‌ వద్ద ఏర్పడిన కుంగుబాటు మరింత విస్తరించకుండా అవసరమైన మేరకు తాత్కాలిక, తక్షణ చర్యలను చేపట్టాల్సి ఉన్నది. అన్ని బరాజ్‌ల్లో రాఫ్ట్‌ కిందనున్న రంధ్రాలను గుర్తించి వాటిని మూసివేయడం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల ఓఅండ్‌ఎం పనులను ఐఎస్‌ కోడ్‌ ప్రకారం చేపట్టేందుకు నిర్మాణ సంస్థలకు అవకాశం కల్పించడం, బరాజ్‌ల ఎగువన, దిగువన వాటర్‌ప్రూఫ్‌ కోసం సిమెంట్‌ గ్రౌటింగ్‌ చేపట్టడం అత్యవసరం. అదేవిధంగా, ప్రవాహాలకు ఆటంకంగా మారే రాళ్లను తొలగించడం, మేడిగడ్డలో బ్లాక్‌ 7లో జామ్‌ అయిన గేట్లను తొలగించడం, స్టీల్‌షీట్‌పైల్స్‌ను అదనంగా ఏర్పాటు చేయడం, బరాజ్‌లపై వరద ఒత్తిడిని తగ్గించేందుకు ఎగువ భాగంలో నదిపై రెగ్యులేటరీలు నిర్మించడం, బరాజ్‌ల ఎగువ, దిగువన నదీ గర్భంలోని ఇసుక మేటలను ఇరిగేషన్‌శాఖ పర్యవేక్షణలో తొలగించడం తదితర పనులను నిర్వహించాల్సి ఉన్నది.

కృష్ణ చైతన్య