Hamara Sankalp Vikasit Bharat
Rajnath Singh

మోదీ ప్రధాని కావాలనే తెలంగాణ ప్రజల ఆకాంక్ష

Rajanath Singh

మరోసారి మోదీ ప్రధాని కావాలనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. దేశ గౌరవ ప్రతిష్టలను మోదీ మాత్రమే పెంచగలరన్న అభిప్రాయం తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఉందన్నారు. భారత ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం లేకపోవడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రతిపక్షం కుప్పకూలుతోందని, ఇందుకు వాటి వైఫల్యమే కారణమన్నారు. మనం 100కు పైగా దేశాలకు రక్షణ రంగ ఉత్పత్తులు ఎగుమతి చేయడం భారతదేశ పురోగతిని ప్రతిబింబిస్తుందన్నారు. గత కొన్నేళ్లుగా దేశీయ సేకరణ నిరంతరం పెరుగుతోందని వివరించారు. ఒక ఆంగ్ల వార్తాపత్రికకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో దక్షిణ రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు, రక్షణ రంగంలో పెరుగుతున్న దేశీయ సంస్థల వాటా, పాకిస్తాన్, చైనాలతో సంబంధాలు, కాశ్మీర్ పరిస్థితి గురించి మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:

ప్ర: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లకు పైగా గెలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అంటున్నారు. బిజెపికి ఎన్ని సీట్లు వస్తాయి?

జ: 400కు పైగా సీట్లు వస్తాయన్న నమ్మకం ఉంది. బిజెపికి ఒక్కదానికే 370 సీట్లకు తక్కువ కాకుండా వస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో మా సీట్లు పెరుగుతాయని భావిస్తున్నాం. ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్‌లో 2019లో బిజెపి 62 సీట్లు గెలుచుకుంది, అయితే ఈసారి 74-76 సీట్లు గెలుచుకుంటుందని, మొత్తం 80 సీట్లు ఎన్‌డిఎకు వెళ్లే అవకాశం ఉందని అనుకుంటున్నాం. బీహార్‌లో మొత్తం 40 సీట్లూ మేమే కైవసం చేసుకుంటాం. అక్కడక్కడ ఒకటి లేదా రెండు సీట్లు తగ్గవచ్చు. కానీ చాలా వరకు ఇది మా అంచనా.

ప్ర: దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే ‘బెంగుళూరులో కాంగ్రెస్ హవా, దిల్లీలో మోదీ హవా’ అని కాంగ్రెస్ చెబుతోంది. బిజెపికి కర్ణాటక ఎంత కీలకం?

జ: కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు కానీ కేంద్రం విషయానికి వస్తే మాత్రం మోదీ నేతృత్వంలోని ప్రభుత్వమే ఉండాలనే అభిప్రాయం రాష్ట్రంలో నెలకొంది.

ప్ర: తెలంగాణలో కాంగ్రెస్ గాలి కనిపించింది కదా?

జ: తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్‌ గెలిచిన మాట నిజమే. నేను దాన్ని కాదనడం లేదు. కానీ పార్లమెంటు ఎన్నికల విషయానికి వస్తే, దేశ గౌరవప్రతిష్ఠలను ఎవరైనా పెంచగలరంటే అది మోదీ మాత్రమే అనే అభిప్రాయం దేశవ్యాప్తంగా బలంగా ఉంది.

ప్ర: తమిళనాడులో బిజెపి పరిస్థితి కష్టంగా లేదా?

జ: తమిళనాడులో మేము ఏర్పాటు చేసుకున్న కూటమి ఓట్ల శాతం పెరగడం ఆనందం కలిగిస్తోంది. మేము ఎన్ని సీట్లు గెలుస్తామో కచ్చితంగా చెప్పలేను, అయితే ఫలితాలు కొంతమందికి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మేము ఇప్పటికే తమిళనాడులో రెండు బహిరంగ సభలు నిర్వహించాం. ఈసారి నేను చూసిన స్పందనను నా మొత్తం రాజకీయ జీవితంలో చూడలేదు. అసెంబ్లీలో కాంగ్రెస్ మాజీ విప్, మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఎస్ విజయధరణి వంటి కొందరు నేతలు బిజెపిలో చేరారు. ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో అనేక వర్గాలు బిజెపి వైపు ఆకర్షితులవుతుండడం మేము చూస్తున్నాం. అంతేకాదు అన్నాడీఎంకేలోని ఓ వర్గం కూడా మాతో పొత్తు పెట్టుకుంటోంది.

ప్ర: దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి ప్రాబల్యం పెరగడానికి కారణాలు ఏమిటని మీరు అనుకుంటున్నారు?

జ: సుపరిపాలన ప్రధానమని నేను భావిస్తున్నాను. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు లేదా మరే ఇతర సుపరిపాలన చర్యల ప్రయోజనాలను పొందని ఒక్క వర్గం కూడా సమాజంలో లేదు. ప్రపంచవ్యాప్తంగా దేశం ప్రతిష్ట పెరిగినందున ప్రతి భారతీయునిలో నేడు గర్వం తొణికిసలాడుతోంది. ఒకప్పుడు సున్నితమైన ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా పేరుపడిన భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ‘అద్భుతమైన ఐదు’ దేశాల జాబితాలో చేరింది. దాని ప్రయోజనాలు జనాభాలోని ప్రతి వర్గానికీ అందుతున్నాయి.

ప్ర: కేరళ సంగతేమిటి? బిజెపికి ఇది కొరకరాని కొయ్యగా మారిందా?

జ: కేరళలో కొన్ని సీట్లు గెలవాలన్నదే మా ప్రయత్నం. నేను ఇంకా సంఖ్య గురించి మాట్లాడలేను, కానీ మేము కచ్చితంగా అక్కడ కొన్ని సీట్లు గెలవాలి. బిజెపి కొన్ని సీట్లు గెలుస్తుందన్న సంకేతాలు క్షేత్రస్థాయి నుంచి అందుతున్నాయి. రెండు, మూడు లేదా ఆరు అని నేను చెప్పలేను. మేము ఆశిస్తున్న కొన్ని సీట్లు తిరువనంతపురం, పాలక్కాడ్ బహుశా త్రిస్సూర్.

ప్ర: పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ) మైనారిటీ వర్గాల్లో ఆందోళన కలిగించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ముస్లిం ఓట్లు తృణమూల్ కాంగ్రెస్‌కు అనుకూలంగా సంఘటితమయ్యే అవకాశం ఉంది. బిజెపిపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?

జ: మేము సీఏఏపై గందరగోళాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తున్నాము. చాలావరకు ఆ విషయంలో విజయం సాధించాం. సీఏఏ ఎవరి పౌరసత్వాన్ని రద్దు చేయదు. హింస, అణచివేతలకు గురైన మైనారిటీలకు పౌరసత్వాన్ని అందిస్తుంది. పశ్చిమ బెంగాల్‌లో ఈ సారి 25-30 సీట్లు గెలుస్తామని అంచనా. పోయినసారి కూడా 18-20 సీట్లు గెలుస్తామని చెప్పినప్పుడు కూడా లక్ష్యం చాలా ఎక్కువ అని భావించిన వాళ్లు ఉన్నారు, కానీ మేము దానిని సాధించాం. అదేవిధంగా ఈసారి కూడా లక్ష్యాన్ని సాధిస్తాం.

ప్ర: జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా పరిస్థితి ఎలా ఉంది? అక్కడ బిజెపి పరిస్థితి ఏమిటి?

జ: ఇటీవల ప్రధాని శ్రీనగర్‌లో కాశ్మీరీ నాయకులను కలుసుకున్నారు. ముస్లిం సమాజానికి చెందిన సభ్యులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చి అధికరణం 370ని రద్దు చేసినప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్‌లో శాంతి నెలకొందని ప్రజలు గ్రహించారని ఇది తెలియజేస్తోంది. ఇంతకుముందు, ప్రతి సంవత్సరం జమ్మూ కాశ్మీర్లో వందల సంఖ్యలో ఉగ్రవాద సంఘటనలు జరిగేవి, కానీ ఇప్పుడు అవి బాగా తగ్గాయి.

ప్ర: ముస్లింలు తమ అభిప్రాయాలను చెప్పడానికి భయపడుతున్నారనే భావన ఉంది?

జ: ఇది ఏమాత్రం నిజం కాదు. ఇది కొన్ని వార్తాపత్రికలలో ఉండవచ్చు, కానీ ఇది కచ్చితంగా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం కాదు.

ప్ర: రామ మందిర ప్రతిష్ఠాపన దేశ సాంస్కృతిక చరిత్రలో కీలకమైన ఘట్టం. దాని వల్ల బిజెపికి ఎన్నికల్లో ప్రయోజనం ఉంటుందా?

జ: బిజెపి రామాలయాన్ని ఎన్నికల ప్రయోజనాల కోణంతో చూడదు. రెండింటి మధ్య ఎటువంటి సంబంధం లేదు. ప్రజలకు రాముడి పట్ల భక్తి ఉంది. ఇది వారికి పవిత్రమైన అంశం. ఇక్కడ మనకు లాభమో, నష్టమో కనిపించదు. దేశం నలుమూలల నుంచి – తమిళనాడు, కేరళ మొదలుకుని లక్షద్వీప్ వరకు – ఆలయ నిర్మాణంపై సంబరాలు జరుపుకొన్నారు, కాషాయ జెండాలు ఎగురుతున్నాయి. లక్షద్వీప్‌లో 70 శాతం నుంచి 80 శాతం ముస్లిం జనాభా ఉంది. ఈ దేశంలో రామమందిర నిర్మాణంపై ఉత్సవాలు జరగని ప్రదేశమే లేదు. 

 ప్ర: ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు తీర్పును మీరు ఎలా చూస్తారు?

జ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని వివరాలూ విడుదల చేస్తోంది. సుప్రీంకోర్టు తన నిర్ణయం తాను తీసుకుంటుంది. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని పక్కన పెడితే, రేపు ‘ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో ఎవరు ఏపార్టీకి ఓటు వేశారో ప్రకటించాలి’ అనే డిమాండ్లు తలెత్తితే మనం అలా చేయాలా? ఈ సమాచారాన్ని బహిరంగం చేయాలా? వ్యక్తిగతంగా, మనం ఎన్నికల బాండ్‌లను బహిరంగం చేయకూడదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక నిర్దిష్ట దాత ఫలానా పార్టీకి దాని సిద్ధాంతం కారణంగా సహకరించి, రేపు మరో పార్టీ అధికారంలోకి వస్తే దాని వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇది నా అభిప్రాయం. అయితే సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తాం.

ప్ర: మంచి ప్రజాస్వామ్యానికి బలమైన ప్రతిపక్షం కూడా అవసరం. అయితే ఇప్పుడు చాలా ప్రతిపక్షాలు మీ వెంటే ఉన్నాయి.

జ: ఇది చాలా దురదృష్టకరం (బలమైన ప్రతిపక్షం లేకపోవడం). ప్రతిపక్షం బలంగా మారేందుకు తీవ్రంగా ప్రయత్నించాలి, కానీ అది కుప్పకూలుతోంది. ఇంత బలహీనంగా మారడం ప్రతిపక్షాల వైఫల్యమే.

ప్ర: బిజెపి ప్రతిపక్ష నేతలను ఎందుకు తన గుప్పిట్లోకి తీసుకుంటోంది?

జ: వారు మాతో చేరాలనుకుంటే మేమేం చేస్తాం? ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరినీ స్వాగతించాలని భారతదేశ సంస్కృతి, సంప్రదాయం చెబుతోంది. నేను మీ ఇంటికి వస్తే మీరు నన్ను ఆహ్వానించరా?

ప్ర: బిజెపిని సైద్ధాంతికంగా వ్యతిరేకించే నాయకులను మీరు స్వాగతించినప్పుడు, అది నిబద్ధత కలిగిన కార్యకర్తల్లో అసంతృప్తికి దారితీయలేదా?

జ: మా కుటుంబం పెద్దదవుతోంది. దాని గురించి మనం సంతోషించాలా? లేక బాధపడాలా? మన సైద్ధాంతిక నిబద్ధత ఎప్పటికీ తగ్గదు.

ప్ర: మీరు బిజెపి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, 2014 లోక్‌సభ ఎన్నికలకు బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థిగా మోదీని ప్రకటించారు. ఆ సమయంలో మీరు ఆయనలో ఎలాంటి లక్షణాలను చూశారు?

జ: అప్పుడు నేను ఆయనలో చూసిన సుగుణాలు కాలపరీక్షకు నిలిచాయి. భారతదేశం మునుపెన్నడూ లేని విధంగా ముందుకు సాగింది. అంటే నా అంచనా సరైనదని అర్థం.

ప్ర: మణిపూర్‌లో అశాంతిని మీరు ఎలా చూస్తున్నారు?

జ: మణిపూర్‌లో జరిగింది చాలా దురదృష్టకరం. ఇది జాతుల సమస్యగా మారింది, అయితే శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. నేడు పరిస్థితి అదుపులో ఉంది.

ప్ర: అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడానికి జమ్మూకాశ్మీర్లో పరిస్థితి అనుకూలంగా ఉందా?

జ: నేడు జమ్మూకాశ్మీర్ లో తీవ్రమైన అంతర్గత భద్రతా సవాళ్లు లేవు. పరిస్థితి ప్రశాంతంగా ఉందో, ఎన్నికలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉందో లేదో నివేదిక అందిన తర్వాత కేంద్ర పాలిత ప్రాంతం హోదా తదుపరి దశ (అసెంబ్లీ ఎన్నికల)పై నిర్ణయం తీసుకుంటాం. అయితే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం.

 ప్ర: పాకిస్థాన్ నుంచి సీమాంతర ఉగ్రవాదం అంతరించిపోతోందా?

జ: శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు పాక్‌ ప్రయత్నిస్తూనే ఉంది, కానీ అది విజయవంతం కావడం లేదు. గతంతో పోలిస్తే చొరబాటు ప్రయత్నాలు తగ్గుముఖం పట్టాయి.

ప్ర: ఆర్టికల్ 370 రద్దు తర్వాత, చైనాతో సరిహద్దు వివాదాన్ని మోదీ ప్రభుత్వం పరిష్కరిస్తుందనే అంచనాలు ఉన్నాయి?

జ: భారత్, చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయి. సైనిక చర్చలు కొంతకాలంగా నడుస్తున్నాయి. ఇది ఇప్పటివరకు రెండు దేశాల మధ్య సుదీర్ఘమైన సంప్రదింపులు అయినప్పటికీ మనం ఓపికపట్టాలి. అవి ముగిసే వరకు వేచి ఉండాలి.

ప్ర: అంగుళం అంగుళం చొప్పున మన భూమిని స్వాధీనం చేసుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందన్న భయం ఉంది. మనం భూభాగాన్ని కోల్పోలేదు అనేమాట నిజమేనా?

జ: భారత్-చైనా సరిహద్దు సమస్యపై ఇంతకు మించి వ్యాఖ్యానించడం సరికాదు. కానీ నేను ఏవైనా వివరాలను వెల్లడించగలిగితే భారతదేశ సామర్థ్యాలతో ప్రజలు సంతోషంతో ఆశ్చర్యపోతారు. కాంగ్రెస్ హయాంలోనే భూభాగం విషయంలో నష్టం జరిగింది. బహుశా భూభాగం గురించి మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ తన హయాంలో జరిగిన దాని గురించే మాట్లాడుతోందేమో.

ప్ర: భారతదేశ రక్షణ ఎగుమతులు మీ అతిపెద్ద విజయాలలో ఒకటి. గత ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.16,000 కోట్లు దాటాయి

జ: 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.1,143 కోట్ల నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.16,000 కోట్లకు (దాదాపు 2 బిలియన్ డాలర్లు) పెరిగాయి. మనం ఇప్పుడు 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. నేడు మనం అత్యాధునిక ప్లాట్‌ఫారమ్‌లు, వ్యవస్థలను ఎగుమతి చేస్తున్నాం. ఈ అద్భుతమైన పెరుగుదల రక్షణ తయారీ రంగంలో భారతదేశ పురోగతిని ప్రతిబింబిస్తుంది.

గత కొన్నేళ్లుగా దేశీయ సేకరణ నిరంతరం పెరుగుతోంది. 2021-22లో, మూలధన సేకరణ బడ్జెట్‌లో 64 శాతం దేశీయ సేకరణకు కేటాయించాం. 2022-23లో ఇది 68 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, దేశీయ సేకరణకు మూలధన బడ్జెట్‌లో 75 శాతం కేటాయించారు.

 ప్ర: రక్షణ మంత్రిగా మీకు గర్వకారణంగా నిలిచేందేంటి?

జ: భారత సాయుధ బలగాల విశ్వాసం, ధైర్యసాహసాలు నాతో పాటు భారతీయ పౌరులందరికీ గర్వకారణం. వారి విశ్వాస స్థాయిలు కూడా చాలా రెట్లు పెరిగాయని నేను భావిస్తున్నాను.