Ramulu joins BJP

మోదీ సుపరిపాలనను గ్రామగ్రామానికీ తీసుకెళ్తా..

Ramulu joins BJP

బిఆర్ఎస్ నాగర్ కర్నూల్ ఎంపీ పి. రాములు ఫిబ్రవరి 29న బిజెపిలో చేరారు. దిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, తెలంగాణ ఇన్ ఛార్జి తరుణ్ చుగ్,  ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తమిళనాడు సహ ఇంఛార్జ్  పొంగులేటి సుధాకర్ రెడ్డిల సమక్షంలో రాములు కాషాయ కండువా కప్పుకొన్నారు. రాములు కుమారుడు, కల్వకుర్తి జడ్పీటీసీ సభ్యుడు భరత్ ప్రసాద్, వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, నాగర్ కర్నూల్ డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, సర్పంచుల సంఘం ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి కూడా బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా కె. లక్ష్మణ్ మాట్లాడుతూ “దళిత నాయకుడిగా నాగర్ కర్నూల్ ప్రజలతోపాటు తెలంగాణ ప్రజలకు రాములు సుదీర్ఘకాలం సేవ చేశారు. బిజెపిలో ఆయన చేరిక… తెలంగాణలో మోదీకి ఉన్న ప్రజాదరణకు అద్దం పడుతోంది. బిఆర్ఎస్ అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయి.. మార్పు కోరుకోవడం వల్ల కాంగ్రెస్ లాభపడింది. వారి మూణ్నాళ్ల పాలనను కూడా ప్రజలు చూశారు. బిజెపిలో చేరడానికి చాలామంది. ముందుకొస్తున్నారు. తెలంగాణలోని మొత్తం 17 లోక్ సభ సీట్లలోనూ పార్టీ విజయం ఖాయం” అని పేర్కొన్నారు. రాములు చేరిక బిజెపికి బలం చేకూరుస్తుందని డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ బిజెపి ఇంచార్జి తరుణ్ చుగ్ మాట్లాడుతూ ‘‘ప్రతిరోజు దేశంలో ఏదో ఒక ప్రాంతం నుంచి సమాజం కోసం పని చేసేవారు బిజెపిలో చేరుతున్నారు. ప్రధాని నేతృత్వంలో 10 ఏళ్లలో పేదిరికానికి వ్యతిరేకంగా మోదీ యుద్ధం చేస్తున్నారు. పేదలకు ఇళ్ళు, గ్యాస్, నీళ్లు, మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. దేశ ఖ్యాతి, వికసిత భారత్ లక్ష్యాన్ని, పేదరిక నిర్ములన కోసం మోదీ చేస్తున్న పని చూసి బిజెపిలో చేరుతున్నారు” అని పేర్కొన్నారు.

రాములు మాట్లాడుతూ… బిజెపిలో చేరడం సంతోషంగా ఉంది. దేశానికి సేవ చేయాలని నా తనయుడు భరత్ ప్రసాద్ రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోంది. నా నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో, ఎస్సి వర్గీకరణ కోసం, దళిత వర్గాలకు న్యాయం చేకూరుతుందన్న నమ్మకంతో బిజెపిలో చేరా. పార్టీ ఏదైనా ప్రజా సేవ, అభివృద్ధి మాత్రమే నాకు ముఖ్యం. మోదీ నాయకత్వంలో పని చేయాలని బిజెపిలో చేరాను తప్పితే  ఎవరిని విమర్శించడానికీ  కాదు.  మోదీ  సమర్థ నాయకత్వంలో కొనసాగుతున్న సుపరిపాలనను గ్రామ గ్రామానికి తీసుకెళ్తాను. తక్కువ మాట్లాడుతా..ఎక్కువ పనిచేస్తా.”  అని  రాములు పేర్కొన్నారు.