మోదీ విధానాలతో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
సమాజంలో చిట్టచివర ఉన్నవారికీ అభివృద్ధి ఫలాలు దక్కాలని అంత్యోదయ సిద్ధాంతం ప్రబోధిస్తోంది. గడచిన 11 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి విధానం, పెట్టిన ప్రతి పెట్టుబడి, సాధించిన ప్రతి నవీకరణ వెనక అంత్యోదయ స్ఫూర్తి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నాలుగు మూలస్తంభాల ఆధారంగా ‘అంత్యోదయ’ అమలవుతోంది. అవి- దేశమంతటినీ అనుసంధానించే మౌలిక వసతుల నిర్మాణం, సమ్మిళిత అభివృద్ధి సాధన, ఉపాధి కల్పనకు పరిశ్రమలకు ప్రోత్సాహం, పౌరులకు సాధికారత కల్పించడానికి వీలుగా శాసనాలను సరళీకరించడం.
నరేంద్ర మోదీ ప్రభుత్వం గడచిన పదకొండేళ్లలో భారీగా పెట్టుబడి వ్యయం పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది రూ.11.2 లక్షల కోట్లకు చేరింది. రోడ్లు, రేవుల వంటి భౌతిక మౌలిక వసతులతోపాటు సామాజిక, డిజిటల్ రంగాలలోనూ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది. దాదాపు 59వేల కిలోమీటర్ల పొడవున రహదారులు, 37,500 కిలోమీటర్ల పొడవున రైల్వే లైన్ల నిర్మాణం పూర్తయింది. ఇటీవలే ప్రారంభించిన చినాబ్, ఆంజి వంతెనలు ఆధునిక భారతానికి ఉత్కృష్ట ప్రతీకలు. ఇక ఇక్కడ విజయవంతంగా అమలవుతున్న యూపీఐ, ఆధార్, డిజిలాకర్‌లను ఇతర దేశాలూ అధ్యయనం చేస్తున్నాయి. ఇంతవరకు 141 కోట్ల ఆధార్ కార్డులు జారీ అయ్యాయి. ప్రతి రోజూ 60 కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. సాంకేతికతను ఇలా ప్రజాస్వామ్యీకరించడంలో భారత్ సఫలమైంది.
భారత ఏఐ మిషన్ కూడా ప్రజాస్వామ్యీకరణ స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. నేడు 34వేలకు పైగా హైస్పీడ్ కంప్యూటర్ చిప్స్(జీపీయూలు) అందుబాటులో ఉన్నాయి- అదీ అంతర్జాతీయ ధరలో మూడో వంతుకే. ఏఐ మోడల్స్‌కు శిక్షణ ఇవ్వడానికి, ఏఐ సాంకేతికతల అభివృద్ధికి ఈ చిప్స్ ఎంతో కీలకమైనవి. ఏఐలో శిక్షణ, అభ్యసనం, నవీకరణలకు రెండొందల ఏఐ మోడల్స్‌ను, 370కి పైగా డేటా సెట్లను ‘ఏఐ కోశ’ వేదిక అందిస్తోంది. వీటితోపాటు విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సేవలనూ అందరికీ అందించాలన్నది కేంద్రం లక్ష్యం. గడచిన పదకొండేళ్లలో దేశంలో వైద్య కళాశాలల సంఖ్య 387 నుంచి 780కి పెరిగింది. ఎయిమ్స్ వైద్య సంస్థలు ఏడు నుంచి 23కి చేరాయి. ఎంబీబీఎస్, పీజీ సీట్లు రెట్టింపునకన్నా ఎక్కువ పెరిగాయి. అందరికీ నాణ్యమైన విద్యావైద్యాలను అందించాలన్న నిబద్ధతకు ఇవి నిదర్శనాలు.
మనం అనుసరించిన అభివృద్ధి నమూనా ఎందరి జీవితాలను మెరుగుపరచింది అన్నది ముఖ్యం. అదే దాని విజయానికి నిదర్శనం. భారత్‌లో 53 కోట్లమందికి జన్‌ధన్ ఖాతాలను అందించాం. అంటే ఐరోపా దేశాల జనాభాకన్నా ఎక్కువమందికి జన్‌ధన్ ఖాతాలు ఉన్నాయన్న మాట. ఇంకా నాలుగు కోట్ల కొత్త ఇళ్లను, 12 కోట్ల మరుగుదొడ్లను నిర్మించి, పది కోట్ల కుటుంబాలకు వంట గ్యాస్ కనెక్షన్లను అందించాం. హర్ ఘర్ జల్ పథకం కింద 14 కోట్ల కుటుంబాలకు తాగునీటి సదుపాయం కల్పించాం. ఆయుష్మాన్ భారత్ కింద 35 కోట్లమందికి ఆరోగ్య బీమా, పీఎం కిసాన్ పథకం కింద 11 కోట్లమంది రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఇవి కేవలం అంకెలు కావు. ఉజ్వల పథకం లబ్ధిదారు మీరా మాంఝీ వంటివారి కళ్లలో అవి ఆనంద వెలుగులుగా తళుక్కుమంటున్నాయి. కడపకు చెందిన అన్నం లక్ష్మీ భవాని ముద్ర రుణంతో జనపనార సంచుల తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. హరియాణా రైతు జగదేవ్ సింగ్ ఒక ఏఐ యాప్‌తో సాగు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అట్టడుగు శ్రేణి పౌరులకు సైతం సాధికారత కల్పిస్తున్న నాయకత్వం వల్ల, వ్యవస్థాగత సంస్కరణల వల్ల ఇవి సాధ్యమవుతున్నాయి.
దేశంలో పారిశ్రామిక పునరుజ్జీవనం, ఉపాధి కల్పన కోసం 2015లో మేక్ ఇన్ ఇండియా పథకాన్ని ప్రారంభించాం. అప్పటికీ ఇప్పటికీ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి ఆరు రెట్లు పెరిగి రూ.12 లక్షల కోట్లకు చేరింది. ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు ఎనిమిది రెట్లు పెరిగి రూ.3 లక్షల కోట్లకు చేరాయి. భారత్ నేడు ప్రపంచంలో రెండో పెద్ద మొబైల్ ఫోన్ ఉత్పత్తిదారు. ఎలక్ట్రానిక్స్ విడిభాగాల ఉత్పత్తిలోనూ అగ్రస్థానానికి చేరుకోబోతున్నాం. భారత్‌లో సెమీకండక్టర్ల తయారీ ఊపందుకొంటోంది. దేశంలో మొట్టమొదటి వాణిజ్య స్థాయి ఫ్యాబ్రికేషన్ యూనిట్ నిర్మాణంలో ఉంది. మన ఇంజినీర్లు, విద్యార్థులు స్వదేశీ ఐపీతో 20 చిప్ సెట్లను డిజైన్ చేశారు. 270 విశ్వవిద్యాలయాలకు ప్రపంచస్థాయి ఈడీఏ టూల్స్ అందించాం. మరోవైపు, గడచిన దశాబ్దంలో 1,500 పాత చట్టాలను తొలగించాం. టెలికాం చట్టం, డీపీడీపీ చట్టం వంటి కొత్త శాసనాలను తీసుకొచ్చాం. పౌరులకు గౌరవమర్యాదలు కల్పించి, పెట్టుబడులూ నవీకరణలను ప్రోత్సహించి, అభివృద్ధికి ఊతమివ్వడానికి ఈ కృషి అక్కరకొస్తోంది.
గడచిన పదకొండేళ్లలో ఉగ్రవాదంపై భారత్ పంథా మారింది. సర్జికల్ దాడులతో మొదలుపెట్టి తాజాగా ఆపరేషన్ సిందూర్ నిర్వహించడం దీనికి తార్కాణం. ఉగ్ర దాడులకు వెనువెంటనే కఠినంగా స్పందిస్తున్నాం. ఉగ్రవాద నిర్మూలనకు ప్రధాని మోదీ పాటిస్తున్న వ్యూహం, అనుసరిస్తున్న సిద్ధాంతమిది. స్వీయ ఆలోచనలకు తగినట్లు భారతదేశం నిర్ణయాత్మక ఎదురుదాడి జరపడం, అణు బ్లాక్ మెయిల్‌కు తలవంచకపోవడం, ఉగ్రవాదులకూ వారి ప్రాయోజకులకూ మధ్య తేడా పాటించకపోవడం మోదీ సిద్ధాంతంలో ముఖ్యాంశాలు. ఆపరేషన్ సిందూర్‌లో స్వదేశీ సాంకేతికతలు, సామర్థ్యాలను వాడి శత్రువును చావుదెబ్బ తీయడం విశేషం. వికసిత భారత సాధనలో రక్షణ పరమైన ఆత్మనిర్భరత కూడా కీలక భాగం. 2004లో అటల్ బిహారీ వాజ్‌పేయి పదవీకాలం ముగిసేసరికి ప్రపంచంలో భారత్ 11వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. 2004-2014 మధ్య భారత్ అదే స్థానంలో దిగబడిపోయింది. గడచిన దశాబ్దంలో ప్రధాని మోదీ చేపట్టిన విధానాల వల్ల త్వరలోనే మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థ హోదా అందుకునే దిశగా భారత్ పరుగుతీస్తోంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజలకు సబ్సిడీలు, సేవలకు మించి విలువైనది లభిస్తోంది. అదే నమ్మకం. భారత్ ఉజ్వల భవిష్యత్తును సాధించగలదనే నమ్మకమది.
అశ్విని వైష్ణవ్,
కేంద్ర రైల్వే, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖల మంత్రి

