మోదీకి ప్రపంచం ఫిదా… ఒంటరైన పాక్
అభివృద్ధితో ముందుకు పోతున్న మోదీ ప్రభుత్వానికి ప్రపంచం అపార గౌరవం ఇస్తుంటే…. భారత్ పై కుట్రలు చేద్దామనుకున్న పాకిస్తాన్ ఇప్పుడు ఒంటరైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉద్ఘాటించారు. భారత ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, రాబోయేది మళ్లీ బిజెపి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు.
ఇక 9వ రోజు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో విజయ సంకల్ప యాత్ర జోష్ కనిపించింది. 5 క్లస్టర్లలో కొనసాగిన యాత్రలలో భాగంగా కార్నర్ మీటింగుల్లో బిజెపి ముఖ్య నాయకులు నరేంద్ర మోదీ ప్రభుత్వంతో దేశంలో జరుగుతున్న సుపరిపాలనను ప్రజలకు వివరిస్తూ, బిజెపికి మరింత మద్దతు కూడగడుతున్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి దేశం కోసం మోదీ.. మోదీ కోసం మేం అంటూ నినదిస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో బిజెపికి వస్తున్న ప్రజాదరణ.. అత్యధిక మెజారిటీ సీట్లు సాధించేందుకు నిదర్శనంగా కనపడుతోంది.
రాజరాజేశ్వరి క్లస్టర్ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగిన విజయ సంకల్ప యాత్రకు జనం జేజేలు పలికారు. జహీరాబాద్ లో ప్రసిద్ధ కేతకి సంగమేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉగ్గెల్లి బైపాస్ నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ… కార్యకర్తల్లో కిషన్ రెడ్డి ఉత్సాహం నింపుతూ ముందుకెళ్లారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడాలనే సంకల్పంతో ప్రజలంతా ముక్తకంఠంతో మద్దతు తెలిపారు. యాత్ర పొడవునా కాషాయ జెండాలతో ఎదురెళ్లి, అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బిజెపి రథసారధి కిషన్ రెడ్డి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ, అదేవిధంగా తెలంగాణ ప్రజలను మోసం చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం, 6 గ్యారంటీలతో మభ్యపెట్టి అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందిపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాన్ని ఎండగట్టారు.
శ్రీరాముడిపై విద్వేష వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పై బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విరుచుకుపడ్డారు. రాముడే లేడని మాట్లాడిన కాంగ్రెస్ కావాలా? లేదా రాముడికి గుడి కట్టిన ప్రధాని నరేంద్ర మోదీ కావాలా? అని ప్రజలు ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకి అన్నగా నిలిచిన వ్యక్తి నరేంద్ర మోదీ అని అన్నారు. పాతబస్తీ బాగుపడాలంటే బిజెపిని గెలిపించాలని ఆయన కోరారు. గౌలిపురాలో విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ యాత్రలో భాగంగా పాతబస్తీ మొత్తం కాషాయమయంగా మారింది. ఈ యాత్ర భాగ్యలక్ష్మి క్లస్టర్ హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్ పురా, మలక్ పేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగింది. ఈ యాత్రలో ఎమ్మెల్యే రామారావు పటేల్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
కృష్ణమ్మ క్లస్టర్ నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో బిజెపి శాసనసభ్యుడు పాల్వాయి హరీష్ ఆధ్వర్యంలో అచ్చంపేట, దేవరకొండ, నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయ సంకల్ప యాత్ర ఉత్సాహంగా కొనసాగింది. ఈ యాత్రలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, చిత్తరంజన్ దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండలంలో బిజెపి విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దుతో మోదీజీ చరిత్రలో నిలిచిపోయారంటూ కొనియాడారు. కేంద్రంలో మూడోసారి బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత తొమ్మిది సంవత్సరాలలో అవినీతి రహిత పాలనతో దేశ ఆర్థిక వృద్ధిరేటును ప్రపంచంలోనే ఐదో స్థానానికి ఎదగడానికి దోహదపడ్డారని వివరించారు. తెలంగాణలో అబద్ధపు మాటలు, అమలుకు నోచుకోని హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రలతో కాషాయ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. రాష్ట్ర నేతలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు.