Muslims

ముస్లింల ఓట్లు తీసుకుని సీట్లు ఇవ్వని ‘లౌకిక’ పార్టీలు

Muslimsప్రస్తుత లోక్‌సభలో ముస్లిం ఎంపీల సంఖ్య 24 మాత్రమే. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అత్యల్ప ముస్లిం ఎంపీలు కలిగి ఉన్న రెండవ లోక్ సభ ఇదే. 2014లో అత్యల్ప స్థాయిలో 22 మంది ముస్లింలు మాత్రమే లోక్ సభకు ఎన్నికయ్య్యారు. ముస్లిం ఓట్ల అతిపెద్ద లబ్ధిదారు కాంగ్రెస్ ఎన్నికల్లో దెబ్బతిన్నది. వారి సంఖ్య 2019లో 26కి స్వల్పంగా పెరిగి మళ్లీ తగ్గుముఖం పట్టింది. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ముస్లిం ప్రయోజనాలకు సంరక్షకులుగా వ్యవహరించి వారి ఓట్లతో లబ్ధి పొందాయి. ఫలితంగా, ముస్లిం ప్రాతినిధ్యం ఎన్నికల్లో ఈ పార్టీల జయాపజయాలతో నేరుగా ముడిపడి ఉంది. ఈసారి, లోక్‌సభలో కాంగ్రెస్ తన సంఖ్యను దాదాపు 52 నుండి 99 సీట్లకు రెట్టింపు చేసుకుని, ఇండీ కూటమి 234 సీట్లు సాధించగా, ముస్లిం ప్రాతినిధ్యం మాత్రం తదనుగుణంగా పెరగకపోగా క్షీణించింది. ఈ క్షీణత ముస్లింలు ఈ పార్టీలకు ఓటు వేయనందువల్ల కాదు. ఈ పార్టీలు ముస్లింల ఓట్లను పొంది దామాషా ప్రకారం వారికి టిక్కెట్లు ఇవ్వకుండా మొహం చాటేయడం వల్ల.

కేరళలోని మలప్పురం నుంచి బిజెపి ఒక్క ముస్లిం అభ్యర్థిని మాత్రమే బరిలోకి దింపింది. కానీ ముస్లిం ఓటు బ్యాంకు బేహారులైన కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, ఎన్సీపీ, ఆర్జేడీ, కమ్యూనిస్టులు 2019లో 115 మంది ముస్లిం అభ్యర్థులను నిలబెట్టగా 2024లో కేవలం 78 మంది అభ్యర్థులను నిలబెట్టారు. బుజ్జగింపు రాజకీయాలకు పేరుమోసిన కాంగ్రెస్ 2019లో 36 మంది ముస్లిం అభ్యర్థులను నిలబెట్టి ఇప్పుడు కేవలం 19 మందిని నిలిపింది. ఇతర పార్టీల తీరూ అంతే. గత ఎన్నికల్లో 13 మంది ముస్లింలకు టికెట్లు ఇచ్చిన టీఎంసీ ఈసారి ఆరు సీట్లు మాత్రమే ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం ఓట్లతో అత్యధికంగా లబ్ధి పొందిన ఎస్పీ ముస్లిం అభ్యర్థుల అంకెను 8 నుంచి 4 కు తగ్గించింది. దీని ఫలితం? జనాభాలో 14 శాతం (2011 జనాభా లెక్కల ప్రకారం) ఉన్న వర్గానికి 18వ లోక్‌సభలో ప్రాతినిధ్యం 4.4 శాతానికి తగ్గిపోయింది. ఈ వర్గానికి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, అనేక ఇతర ప్రాంతాల నుంచి నుండి ఒక్క ప్రతినిధి కూడా లోక్ సభలో లేరు. ఇది కచ్చితంగా సమాజానికి సంతోషం కలిగించే పరిస్థితి కాదు. ఈ పతనానికి దారితీసిన వాతావరణాన్ని బిజెపియే సృష్టించిందని కొందరు రాజకీయ పండితులు నిందిస్తున్నారు. దేశ విభజన నేపథ్యంలో హిందూ ముస్లిం ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న సమయంలో కూడా 1952లో 21 మంది ముస్లిం ఎంపీలను ఎన్నుకున్న భారతీయ ఓటర్లను నిందించడం వంటిదే ఇది కూడా. అప్పుడు మరో నలుగురు ముస్లిం సభ్యులను సభకు నామినేట్ చేయడంతో వారి సంఖ్య 25కి చేరుకుంది.

అసదుద్దీన్ ఒవైసీ వంటి కొందరు ముస్లిం నాయకులు, దేశ విభజన అనంతరం మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ లాంటి ఒక అఖిల భారత ముస్లిం పార్టీని ప్రారంభించకూడదని భారత ముస్లిం నాయకత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విచారం వ్యక్తం చేశారు. కేరళలో ముస్లిం లీగ్ ఒకటి మిగిలి ఉంది. ఈసారి మూడు సీట్లు గెలుచుకుంది. కానీ అది కూడా ఒవైసీ మజ్లీస్ లాగానే ఒక ప్రాంతీయ సంస్థగా మిగిలిపోయింది. ఒవైసీ వంటి నాయకులు దేశ విభజన జరిగిన ఏడు దశాబ్దాల తర్వాత కూడా జిన్నా ధోరణిని కొనసాగిస్తున్నారు. బిజెపిని నిందించడం లేదా ముస్లింల కోసం ఒక జాతీయ రాజకీయ పార్టీకై ఆరాటపడటం, ఈ రెండు వాదనలూ ముస్లింల సమస్యలకు ప్రధాన కారణాన్ని గ్రహించడంలో వారి నాయకత్వ వైఫల్యాన్ని నిరూపిస్తున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ముస్లింలు విభజన రాజకీయాల నుంచి బయటపడలేదనడానికి తాజా నిదర్శనం. బిజెపిని ఓడించడానికి కొందరు పరిశీలకులు ‘వ్యూహాత్మక ఓటింగ్’గా అభివర్ణించే ముస్లిం ఓటింగ్ తీరు, ముస్లిం వర్గం ఓట్లను వాడుకునే వారికీ ఉపయోగపడుతుందే కానీ ముస్లింలకు కాదు. పోటీ ప్రాతిపదికగా నడిచే రాజకీయాలలో ఒక వర్గం ఒక వైపు చేరితే రెండో వర్గం కూడా ఏకమై అవతలి పక్షం వైపు చేరుతుంది. భారతదేశంలో ఇటువంటి వైరుధ్య మోహరింపు ముస్లిం వర్గానికి హానికరం. దానికి బదులుగా అది అభివృద్ధి, సామాజిక మార్పు రాజకీయాలను ఎంచుకోవాలి. ముస్లిం సమాజమంతా ఏకశిలా సదృశం కాదు. వారిలో 95 శాతం మంది అజ్లాఫ్, అర్జల్, అంటే ‘నిమ్న వర్గాలు’ కాగా, మిగిలిన 5 శాతం మంది అష్రాఫ్ వర్గం (ఉన్నత వర్గీయులు). అష్రాఫ్‌లు తమను తాము భారతదేశంలోకి వలస వచ్చిన తొలి ముస్లింల వారసులుగా భావిస్తారు. అజ్లాఫ్‌లు, అర్జల్‌లు ఓబిసి, దళిత వర్గాల నుంచి మతం మారిన హిందువులు. ఈ 95 శాతం మంది ముస్లింలను ‘పస్మండాలు’ (వెనుక వదిలివేయబడిన వారు అని అర్థం) అనే పెర్షియన్ పేరుతో పిలుస్తారు

కుల వివక్ష, ఆర్థిక, విద్యాపరమైన వెనుకబాటుతనానికి గురైన పస్మండాల అభివృద్ధి, సామాజిక అవరోధాలు సంబంధించిన అంశాలకు బిజెపి ప్రాధాన్యమిస్తుంది. 2022లో హైదరాబాద్‌లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో, పస్మాండ ముస్లింలకు చేరువ కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పస్మాండ ప్రముఖ నేతలతో పలు సమావేశాలు నిర్వహించారు. డిసెంబరు 2022లో దిల్లీలో జరిగిన మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో బిజెపి నలుగురు పస్మాండ అభ్యర్థులను నిలబెట్టింది. యూపీలో పస్మాండ ముస్లిం మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. గత సంవత్సరం, రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికలలో, బిజెపి మిత్రపక్షం అప్నా దళ్ నిలిపిన పస్మాండ అభ్యర్థి ఎస్పీకి చెందిన హిందూ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలకు ముందు బిజెపి ‘మోదీ మిత్ర’ కార్యక్రమం ద్వారా పస్మాండ ముస్లింలకు చేరువయ్యే కృషిని కొనసాగించింది. ముస్లింలను వారిని ఎడంగా ఉంచే రాజకీయాల నుంచి బయటకు తీసుకురావడానికి చేసిన ఈ ప్రయత్నాలు తొలుత ఫలితాలనిచ్చాయి. 2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి జనరల్ కేటగిరీ ముస్లింలలో 12.6 శాతం, పస్మాండ ముస్లింలలో 8 శాతం మంది బిజెపికి మద్దతు ఇచ్చారని ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాకు చెందిన కార్నెగీ ఎండోమెంట్ సర్వే తేల్చింది. 2022లో అసెంబ్లీ ఎన్నికల నాటికి బిజెపికి పస్మాండ ముస్లింల మద్దతు 9.1 శాతానికి పెరిగింది. దురదృష్టవశాత్తూ, ముస్లిం రాజకీయాలను మతతత్వ రహితం చేసేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలు అంతకుమించి ముందుకు సాగలేదని ఇటీవలి పార్లమెంట్ ఎన్నికలు మరోసారి రుజువు చేశాయి. వారి సంక్షేమం కోసం బిజెపి చేస్తున్న ప్రయత్నాలను విస్మరించడమే ముస్లిం సమాజ ప్రయోజనాలకు నిజమైన పరాజయం. దీనిపై ముస్లింలు, వారి నాయకులూ లోతైన ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది.

రామ్ మాధవ్,
బిజెపి నాయకులు