Operation Sindhoor

ఆపరేషన్ సింధూర్ : ఉగ్రమూకలపై రుద్రనేత్రం

“ఈ రోజు, బీహార్ గడ్డపై నుంచి యావత్ ప్రపంచానికి నేను చెబుతున్నాను.. ప్రతి ఉగ్రవాదిని, వారికి అండగా నిలిచే వారిని భారత్ గుర్తిస్తుంది, వారి జాడ కనిపెడుతుంది, శిక్షిస్తుంది. భూమండలంలో ఏ చివరలో ఉన్నా వారిని వెంటాడుతాం” పహల్గాం దాడి మరుసటి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలివి. సాధారణంగా హిందీలో ప్రసంగించే మోదీ స్పష్టమైన ఆంగ్లంలో, తీవ్ర స్వరంతో అన్న ఈ వ్యాఖ్యలు, ఉగ్రవాదులకు ఊహించని రీతిలో శిక్ష ఉంటుందన్న హెచ్చరికలతో తాను ఏదో చేయబోతున్నానని ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇచ్చారు.

ఉరి దాడి అనంతరం సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా తర్వాత వైమానిక దాడులతో ఉగ్రవాదానికి దీటుగా బదులిచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చిన మోదీ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తప్పక తీర్చుకుంటారని యావత్ దేశ ప్రజలే కాదు, ప్రపంచ దేశాలు నమ్మాయి. అందుకు తగ్గట్టే మోదీ వ్యాఖ్యలు ఆ అంచనాలను పెంచాయి. 

అయితే.. సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులతో తలబొప్పికట్టించుకున్న పాకిస్తాన్ ఈసారి మాత్రం జాగ్రత్తగా ఉంది. భారత్ నుంచి ఎలాంటి దాడి వస్తుందో అని, దానిని ఎదుర్కోవాలని పూర్తి సన్నద్ధంగా ఉంది. అవసరమైతే అణుదాడులకూ వెనుకడామంటూ బెదిరించింది. భారత్‌లో పహల్గాం ప్రతీకార జ్వాలలు రగలుతున్న వేళ, తమపై దాడి జరుగుతుందని పాకిస్తాన్ కాచుకుకూర్చున్న తరుణాన, ప్రపంచాన్ని నివ్వెర పరుస్తూ భారత బలగాలు పాక్ గడ్డపై ఉన్న ఉగ్ర స్థావరాలపై చేపట్టిన సైనిక చర్యే ఆపరేషన్ సింధూర్¡

సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడుల సందర్భంలో మన బలగాలు పాక్ గడ్డపైకి వెళ్లి ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాయి. అప్పుడు ఒక్క ప్రాంతాన్నే లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపాయి. కానీ, ఆపరేషన్ సింధూర్‌లో సరిహద్దు దాటకుండానే మన సైన్యం పాకిస్తాన్‌ను చావుదెబ్బకొట్టింది. పాకిస్తాన్, పీఓకేలోని 9 చోట్ల లక్షిత దాడులు చేపట్టింది. పాక్ సైనిక స్థావరాలు, సామాన్య ప్రజలకు కించిత్తు హాని తలపెట్టకుండా కేవలం ఉగ్రవాద శిబిరాలనే నేలమట్టం చేసింది. 

దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా పాకిస్తాన్ ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. భారత క్షిపణులు, డ్రోన్లు కళ్ల ముందే బాంబుల వర్షం కురిపిస్తుంటే ఏమీ చేయలేక చేతులెత్తేసింది. భారత ఆధునాతన ఆయుధ సంపత్తి ముందు పాకిస్తాన్ అరువు తెచ్చుకున్న రాడార్ వ్యవస్థ ప్రభావం చూపలేకపోయింది. మోదీ ప్రభుత్వం వ్యూహ చతురత, భారత బలగాల శక్తిసామర్థ్యాలు, అందుకు తగిన ఆయుధ సంపత్తితో భారత్ ఆపరేషన్ సింధూర్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.

మే 6 అర్ధరాత్రి తెల్లవారితే మే 7.. అందరూ నిద్రపోతున్న వేళ.. అర్ధరాత్రి భారత్ రుద్ర నేత్రం తెరిచింది. ఉగ్రవాద స్థావరాలపై నిప్పుల వర్షం కురిపించింది. మహిళల మంగళ సూత్రాలను తెంపిన ముష్కర మూకల పీచమణిచింది. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పింది. క్షిపణులు, డ్రోన్లతో పాకిస్తాన్‌తో పాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పై ‘ఆపరేషన్‌ సింధూర్’ పేరుతో విరుచుకుపడింది. పాకిస్తాన్, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని(పీవోకే) జైషే మహమ్మద్, లష్కరే తయ్యిబా ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. 1.05 నుంచి 1.30దాకా 25 నిమిషాలపాటు క్షిపణులు, డ్రోన్లతో జరిపిన దాడుల ద్వారా 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. భూతలం, గగనతలాల నుంచి క్షిపణులను ప్రయోగించింది. ఇందుకోసం 24 క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. అన్ని దాడులూ లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయి. భారత సైన్యం, వైమానిక దళం సంయుక్తంగా చేపట్టిన ఈ దాడుల్లో 100 మంది వరకు ఉగ్రవాదులు మరణించారు, మరో 60 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులు అజ్మల్‌ కసబ్, డేవిడ్‌ హెడ్లీకి శిక్షణనిచ్చిన శిబిరాలు ధ్వంసమయ్యాయి. బహావల్‌పుర్‌లోని జైషే మహమ్మద్‌ ప్రధాన కార్యాలయంపై జరిగిన క్షిపణి దాడిలో ఆ సంస్థ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజార్‌ కుటుంబ సభ్యులు 10 మందితోపాటు నలుగురు సహాయకులు మరణించారు. మన సరిహద్దులకు ఆవల 100 కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లి 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. పీవోకేలో ఐదు, పాకిస్తాన్‌లో నాలుగు స్థావరాలను ధ్వంసం చేశాయి. నిఘా డ్రోన్లతో రియల్‌టైం పర్యవేక్షణ ద్వారా కచ్చితమైన లక్ష్యాలను ఛేదించింది. పౌర నష్టాన్ని సాధ్యమైనంత తక్కువ చేయడానికి ప్రయత్నించింది. ఉగ్రవాదుల కమాండ్‌ కేంద్రాలు, శిక్షణ శిబిరాలు, ఆయుధ డిపోలు ధ్వంసమయ్యాయి. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంది.

ఇంత భారీ స్థాయిలో దాడులు చేసినా తన బాధ్యతను భారత్‌ మరిచిపోలేదు. ఎక్కడా పాక్‌ సైనిక స్థావరాలపైగానీ, పౌరుల నివాసాలపైగానీ దాడి చేయలేదు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడలేదు. ప్రపంచానికి ముప్పుగా ఉన్న ఉగ్రవాద మూలాలను పెకలించడానికే ప్రాధాన్యమిచ్చింది. ఈ మొత్తం ఆపరేషన్‌ను ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షించారు. దాడి జరిగిన అనంతరం భారత్‌ మాతా కీ జై అంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు. న్యాయం జరిగింది.. అంటూ భారత ఆర్మీ ఎక్స్‌లో పోస్టు పెట్టింది.

వ్యూహాత్మకంగా నారీ శక్తి

దాడికి సంబంధించిన వివరాలను విదేశాంగశాఖ కార్యదర్శి విక్రం మిస్రీతోపాటు ఆర్మీ సిగ్నల్‌ కోర్‌కు చెందిన కర్నల్‌ సోఫియా ఖురేషీ, వైమానిక దళానికి చెందిన వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌ మే 7న మీడియాకు వివరించారు. చరిత్రలో తొలిసారి సైనిక ఆపరేషన్‌ వివరాలను మహిళా అధికారులు వెల్లడించడం విశేషం. ఉగ్ర స్థావరాలపై కచ్చితమైన దాడులు చేశామని ఇద్దరు మహిళా అధికారులు తెలిపారు. పక్కనున్న వాటికి నష్టం కలగకుండా జాగ్రత్తగా దాడులు చేయగలిగే వార్‌హెడ్‌లను ఎంపిక చేసుకున్నామని వెల్లడించారు. ప్రతి లక్ష్యమూ ఉగ్ర భవనం, భవనాల సమూహానికి విజయవంతంగా చేరుకుందని వివరించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రకటనకు అనుగుణంగానే.. పహల్గాం ఉగ్ర దాడి దోషులు, ఉగ్ర స్థావరాల నిర్వాహకులు, వారికి ఆర్థిక సాయం చేసేవారు, స్పాన్సర్‌ చేసేవారిని లక్ష్యంగా చేసుకున్నామని మిస్రీ తెలిపారు. ఉగ్ర దాడికి పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలనూ పాక్‌ చేపట్టకపోవడం వల్లే ఈ దాడులు చేశామని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఎటువంటి దుస్సాహసాలకు పాల్పడ్డా ఎదుర్కొనేందుకు భారత్‌ సైన్యం పూర్తి సన్నద్ధంగా ఉందని వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌ స్పష్టంచేశారు. దాడులకు సంబంధించిన చిత్రాలను, వీడియోలను వారు ప్రదర్శించారు.

అన్ని విధాల సన్నద్ధంగా

దాడుల అనంతరం క్యాబినెట్‌ సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ.. భారత సైన్యం జరిపిన విజయవంతమైన దాడులను ప్రశంసించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి పరిస్థితిని వివరించారు. ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఆయన క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్‌ పర్యటనలకు వెళ్లాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జాతీయ భద్రతా సలహాదారు అజీత్‌ డోభాల్‌ పలు దేశాల ప్రతినిధులకు దాడులకు సంబంధించిన సమాచారం ఇచ్చారు. పాక్‌ ఏదైనా దుస్సాహసానికి పాల్పడుతుందనే ఉద్దేశంతో గగనతల రక్షణ వ్యవస్థను భారత్‌ క్రియాశీలం చేసింది. పారామిలిటరీ దళాలకు కేంద్రం సెలవులను రద్దు చేసింది. సెలవులో ఉన్న సిబ్బందిని వెనక్కి రావాలని ఆదేశించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా.. సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు, డీజీపీలు, ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌ సీఎంలు, గవర్నర్లు, అధికారులు హాజరయ్యారు.

భారత దాడులతో ఉక్కిరిబిక్కిరైన పాక్‌.. భారత్‌లోని పౌరులను లక్ష్యంగా చేసుకుని సరిహద్దుల్లో కాల్పులు జరిపింది. ‘ఆపరేషన్‌ సింధూర్’ అనంతరం సరిహద్దుల్లో పాక్‌ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పౌర నివాస ప్రాంతాలే లక్ష్యంగా పాక్‌ కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనల్లో చిన్నారులు, మహిళలు సహా పలువురు భారత పౌరులు మృతి చెందారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు. మన సైనిక కేంద్రాలే లక్ష్యంగా క్షిపణులు, ఆత్మాహుత డ్రోన్లు, యుద్ధ విమానాలను ప్రయోగిస్తోంది. వీటిని భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతోంది. ఈక్రమంలోనే సరిహద్దుల్లో శత్రు దేశానికి చెందిన పలు సైనిక పోస్టులను మన దళాలు ధ్వంసం చేశాయి. యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైళ్లతో పాక్‌ మిలిటరీ పోస్ట్‌లను ధ్వంసం చేశాయి. సరిహద్దుల్లో పాక్‌ డ్రోన్‌ దాడులను సమర్థంగా తిప్పికొట్టింది.

పాకిస్తాన్ దిగ్బంధనం

ఆపరేషన్ సింధూర్ మాత్రమే కాదు, పహల్గాం ఉగ్రదాడి తర్వాత అన్నివైపుల నుంచి పాకిస్తాన్‌ను దిగ్బంధించడం భారత్ మొదలుపెట్టింది. ఆర్థిక, దౌత్య, వాణిజ్యరంగాల్లో దానిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచింది. ఆ దేశం ఒత్తిడిని ఎదుర్కొనే క్రమంలో ఉండగానే ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకొని.. సైనిక చర్యను కూడా చేపట్టింది. పహల్గాం ఉగ్రదాడి సమయంలో సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అర్ధంతరంగా దానిని రద్దు చేసుకొని వెంటనే భారత్‌ చేరుకొన్నారు. ఆయన పీఎంవోకు కూడా వెళ్లకుండా.. ఎయిర్‌పోర్టులోనే ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉగ్రదాడిని ప్రభుత్వం ఎంత సీరియస్‌గా తీసుకొందో.. ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పాక్‌తో ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసి.. ఆ దేశానికి ఊహించని షాక్‌ ఇచ్చారు. నీటి విడుదలను బాగా తగ్గించేశారు. ఆ దేశ జీడీపీలో దాదాపు 24శాతం ఈ జలాల నుంచే లభిస్తుంది. ఇవే కాకుండా పాక్‌ సైనిక, రవాణా, పౌర విమానాల కోసం భారత్‌ గగనతలాన్ని మూసివేసింది. ఇక పాక్‌ దేశీయుల వీసాలను రద్దు చేసి.. దేశాన్ని వీడాలని ఆదేశించారు. అట్టారీ-వాఘా బోర్డర్‌ గేట్లను మూసేసింది. దీంతోపాటు పాక్‌ నటుడు ఉన్న సినిమా రిలీజ్‌ను ఆపేశారు. అంతేకాదు.. పాక్‌ నటీనటులు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు సహా పలువురి యూట్యూబ్‌, ఇన్‌స్టా ఇతర సోషల్‌ మీడియా ఖాతాలను భారత్‌లో బ్లాక్‌ చేశారు. 

పాక్‌తో వాణిజ్య సంబంధాలను భారత్‌ పూర్తిగా తెంచుకొంది. మే నెల ఆరంభంలో పాక్‌ నుంచి దిగుమతులు, ఆ దేశానికి ఎగమతులను నిలిపివేసింది. పాక్‌ నౌకలు మన ఓడ రేవుల్లోకి రాకుండా నిషేధం విధించింది. ముఖ్యంగా దేశానికి ఎగుమతి అయ్యే ఔషధాలపై కూడా ఆంక్షలు విధించింది. చాలా ఏళ్లుగా ఇరు దేశాల మధ్య నేరుగా వాణిజ్యం జరగకపోయినా.. యూఏఈ, సింగపూర్‌, ఇండోనేసియా, శ్రీలంక వంటి దేశాల నుంచి మనకు ఎగుమతులు చేసేది. పండ్లు, ఎండు కర్జూరాలు, టెక్స్‌టైల్స్‌, రాక్‌ సాల్ట్‌, తోలు వస్తువులు ఉండేవి. వీటి విలువ 500 మిలియన్‌ డాలర్ల వరకు ఉండొచ్చు. ఈ మార్గంలో భారత్‌లోకి పాక్‌ సరకులు రాకుండా నట్లు బిగించింది. ఐఎంఎఫ్‌ నుంచి పాక్‌కు లభించాల్సిన రుణాన్ని పునఃసమీక్షించాలని భారత్‌ ఒత్తిడి పెంచేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. అమెరికా, రష్యా ఫ్రాన్స్‌, సౌదీ, యూఏఈ వంటి కీలక మిత్ర దేశాలకు పరిస్థితిని వివరించింది. ఐరాస భద్రతా మండలిలో కూడా పాక్‌ ఎటువంటి మద్దతు రాకుండా దౌత్యం నెరిపింది. దేశ ప్రజల కోసం వార్‌ మాక్‌ డ్రిల్స్‌ను మే7వ తేదీన నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇవి మొదలు కావడానికి కొన్ని గంటల ముందే పాక్‌ ఊహించనివిధంగా దాడి చేసి 9 ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టింది.

ప్రధాని సూచించిన పేరు ‘ఆపరేషన్‌ సింధూర్’

పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై జరిపిన సైనిక చర్యకు పెట్టిన పేరు ‘ఆపరేషన్‌ సింధూర్’. ఈ పేరే పాక్‌కు బలమైన సందేశం పంపింది. మిలిటరీ దాడులను రాత్రంతా పర్యవేక్షించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ‘ఆపరేషన్‌ సింధూర్’ పేరు సూచించారు. ఏప్రిల్‌ 22న పహల్గాంలోని బైసరన్‌ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. పలువురు మహిళలు కళ్ల ముందే తమ భర్తలను కోల్పోయారు. భారతీయ సంప్రదాయంలో వివాహిత మహిళలకు సిందూరం ఎంత ముఖ్యమైనది. ఆ సిందూరాన్ని వారికి దూరం చేసిన ఘాతకులపై ప్రతీకారం తీర్చుకోకుండా భారత్‌ వదిలిపెట్టదు అనే సందేశం బలంగా వెళ్లాలని ప్రధాని అధికారులకు స్పష్టంగా చెప్పారు. ఉగ్రమూక లక్ష్యంగా చేసుకొన్న జంటల్లో అప్పటికి ఆరు రోజుల క్రితమే పెళ్లైన నవ వధూవరులు వినయ్‌ నర్వాల్, హిమాన్షి ఉన్నారు. హనీమూన్‌కు వచ్చిన ఈ జంటలో వినయ్‌ను టెర్రరిస్టులు కాల్చిచంపారు. బైసరన్‌ పచ్చికబయలులో అతడి మృతదేహం వద్ద కూర్చొని గుండెలవిసేలా రోదిస్తున్న హిమాన్షి చిత్రం దేశం మొత్తాన్ని కదిలించింది. అలాగే రాయ్‌పుర్‌కు చెందిన దినేశ్‌ మిరానియా, నేహా దంపతులు వివాహ వార్షికోత్సవం జరుపుకొనేందుకు పహల్గాంకు రాగా.. దినేశ్‌ ముష్కరుల దాడికి బలయ్యారు. రెండు నెలల క్రితమే వివాహమైన కాన్పుర్‌ వ్యాపారి శుభమ్‌ ద్వివేదీని ఆయన భార్య ఏశాన్య, ఇతర కుటుంబసభ్యుల ముందు కాల్చిచంపారు.

…………..

‘ఆపరేషన్‌ సింధూర్’పై పహల్గాం మృతుల కుటుంబసభ్యుల స్పందన

“ఆపరేషన్‌ సింధూర్ పేరు సరిగ్గా సరిపోయింది. నా భర్త ఆత్మ ఇప్పుడు శాంతించి ఉంటుంది. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలి. నాలాంటి పరిస్థితి మరే కుటుంబానికి రాకూడదు. నేను ఎంత బాధను అనుభవిస్తున్నానో చెప్పలేను. కానీ, ఈ చర్యతో కొంత ఊరట వచ్చింది. ఉగ్రవాదం అంతానికి ఇదే ఆరంభం. పహల్గాం ఉగ్రదాడిలో మృతులకు అమరవీరుల హోదా ఇవ్వాలి.”

-హిమాన్షీ నర్వాల్‌, వినయ్‌ నర్వాల్‌ భార్య 

“ఎంతో మంది భారత మహిళల సిందూరాన్ని ఉగ్రవాదులు చెరిపేశారు. వారిపై దాడికి చేపట్టిన చర్యకు ‘ఆపరేషన్‌ సింధూర్’ అని పేరుపెట్టడం సరైన నిర్ణయం. మోదీ ప్రభుత్వం న్యాయం చేసింది.”

-చిన్నవీరప్ప, భరత్‌ భూషణ్‌ తండ్రి 

“నా కుమారుడి ప్రాణత్యాగం వృథా కాలేదు. అమాయకులను చంపినవారిని వదిలిపెట్టకూడదు. ప్రధాని మోదీపై మా నమ్మకం వమ్ముకాలేదు.”

-సుమతి, మంజునాథరావ్‌ తల్లి 

“మా సిందూరం తుడిచిపెట్టిన ఉగ్రవాదులకు ఇదే సరైన సమాధానం. ఈ ఆపరేషన్‌ పేరు వినగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.”

-ప్రగతి జగ్‌దలే, సంతోష్‌ జగ్‌దలే భార్య 

“పహల్గాం ఉగ్ర దాడుల్లో మృతి చెందిన నా మేనల్లుడు సోమిశెట్టి మధుసూదన్‌ రావు ఆత్మకు నేడు శాంతి కలుగుతుంది. మా కుటుంబానికి సాంత్వన కలిగింది.”

-వెంకటసుబ్బయ్య, మధుసూదన్‌ రావు మేనమామ 

…………….

ఆపరేషన్‌ సింధూర్ విజయవంతం మనందరికీ గర్వకారణం. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై లక్షిత దాడులను అత్యంత కచ్చితత్వంతో చేపట్టిన సైనిక దళాలకు అభినందనలు.

-నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

 

భారత సైన్యం ఎక్కడా గీత దాటలేదు. అమాయకులను చంపిన వారినే హతమార్చాయి. ఈ విషయంలో హనుమంతుడే ఆదర్శం. అశోకవనం విధ్వంసం సమయంలో తనపై దాడి చేసినవారిపైనే ఆంజనేయుడు విరుచుకుపడ్డారు. భారత సైన్యమూ అలానే వ్యవహరించింది.

-రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర రక్షణ శాఖ మంత్రి