Hamara Sankalp Vikasit Bharat
Nitin Gadkari

పదేళ్ళలో చేసింది చెప్పి ఘనవిజయం సాధిస్తాం

Nitin Gadkariహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో తో తనకు ఎటువంటి విభేదాలు లేవని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఆయనను తానే రాజకీయాల్లోకి తీసుకు వచ్చానని గుర్తు చేస్తూ ఆయనకు తాను గురువునని అన్నారు. ఒక జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అయన అనేక అంశాలపై తన అభిప్రాయాలను వివరించారు. తాను రాజకీయాలనే వృత్తిగా ఎంచుకున్న వ్యక్తిని కాదని, అట్టడుగు స్థాయి కార్యకర్తగా, ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్‌గా ఉండేందుకు ఇష్టపడతానని అన్నారు. ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు: 

ప్ర: ‘అబ్ కీ బార్ 400 పార్’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై మీ అభిప్రాయం?

జ: 2014కు ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనలో విధానపరమైన నిష్క్రియాపరత్వంతో ప్రజలు కలత చెందారు. అది మాకు కలిసివచ్చింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా అంతకుముందు బాగా పని చేశారు. ఆయనను ప్రధానమంత్రిగా ప్రకటించడం మేం 2014 ఎన్నికలలో విజయం సాధించడంలో సహాయపడింది. 2019లో మరో విజయాన్ని సాధించేందుకు మేం సాధించిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేశాం. పదేళ్ల తర్వాత ఇప్పుడు దశాబ్ద కాలంలో ఏమి సాధించిందో, కాంగ్రెస్‌ అంతకుముందు 60-65 ఏళ్లలో ఏమి సాధించలేకపోయిందో ఇప్పుడు ప్రజలకు వివరిస్తాం. ప్రజలు మోదీ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచారు. రికార్డు మెజారిటీతో మరోసారి మమ్మల్ని ఎన్నుకుంటారు. గత దశాబ్దంలో అభివృద్ధి కారణంగా సానుకూలత ఉంది. మేం ఈసారి కచ్చితంగా 400 సీట్లను దాటుతాం.

ప్ర: అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం సృష్టించిన ఉత్సాహం, దూకుడు బిజెపికి సహాయపడుతుందని మీరు భావిస్తున్నారా?

జ: రామ మందిర అంశాన్ని రాజకీయం చేయకూడదని మేం భావిస్తున్నాం. ఇది విశ్వాసానికి సంబంధించిన అంశం. ప్రజలు తమ కల నెరవేరినందుకు సంతోషంగా ఉన్నారు. కులం, మతం, విభజన రాజకీయాలను నేను నమ్మను. సుదీర్ఘ న్యాయ పోరాటం, ప్రజల పోరాటం తర్వాత ఈ ఆలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. మా మేనిఫెస్టోలో కూడా ఇది ఉంది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చినందుకు సంతోషంగా ఉంది.

ప్ర: 2022లో మిమ్మల్ని బిజెపి పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ నుంచి తొలగించి ఫడ్నవీస్‌ని చేర్చుకున్నారు. ప్రధానమంత్రి మిమ్మల్ని దూరంగా పెట్టినట్టు భావించారా?

జ: నేను రాజకీయాలనే వృత్తిగా ఎంచుకున్నవాడిని కాదు. రాజకీయాలు సామాజిక-ఆర్థిక సంస్కరణలకు ఒక సాధనం అని నేను నమ్ముతున్నాను. కనుక నాకు పదవులపై వ్యామోహం లేదు. ప్రధాని మోదీతో నా సంబంధాలు చాలా స్నేహపూర్వకంగా ఉన్నాయి.

ప్ర: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? కొన్ని అంశాలపై మీ ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం లేదనే ఊహాగానాలు ఉన్నాయి. 

జ: ఆయన తండ్రిని కలిసిన తర్వాత ఫడ్నవీస్ ను రాజకీయాల్లోకి తీసుకువచ్చాను. ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు పెద్ద నాయకులుంటే జనాలు గుసగుసలు మొదలుపెడతారు. నేను ఎవరి విషయంలో జోక్యం చేసుకోను, ఎవరి మీదా ఫిర్యాదు చేయను. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బవాన్‌కులే కూడా నా సలహా తీసుకుంటారు. సాధకబాధకాలను బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకోవాలని వారికి చెబుతాను.

ప్ర: ఎన్డీయే మెజారిటీ సాధించడంలో విఫలమైతే మీరు ఏకాభిప్రాయ ప్రధానిగా ఉండవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?

జ: నేను ప్రధాని పదవికి పోటీలో ఎప్పుడూ లేను. ఈరోజు నాకు ఉన్నదానితోనే నేను సంతృప్తిగా ఉన్నాను. నేను నమ్మకం, నిబద్ధత కలిగిన బిజెపి కార్యకర్తనే గాని నిజంగా రాజకీయ నాయకుడిని కాదు. నేను ‘సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్‌’ని నమ్ముతాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో ఎన్డీయే ప్రభుత్వం ప్రశంసనీయమైన పని చేస్తోంది. మోదీ నాయకత్వంలో మళ్లీ మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే నమ్మకం నాకుంది.

ప్ర: ఇవే మీ చివరి ఎన్నికలా? ఎన్డీయే మూడవసారి అధికారంలోకి వచ్చినట్లయితే మీరు రవాణా, హైవేలు శాఖలోనే కొనసాగుతారా?

జ: నా శాఖను లేదా ప్రభుత్వంలో బాధ్యతలను నిర్ణయించేది ప్రధానమంత్రి, పార్టీ నాయకత్వం. నేను రేపటి గురించి ఆలోచించను. నేను స్వయంసేవక్‌ని, నిబద్ధత కలిగిన బిజెపి కార్యకర్తని, సామాజిక కార్యకర్తని. ఇదే నా గుర్తింపు. మాజీ పీఎంలు, మాజీ సీఎంలు, మాజీ మంత్రులు ఉండవచ్చు, కానీ పార్టీ కార్యకర్త ఎప్పుడూ కార్యకర్తగానే ఉంటాడు.

ప్ర: చీలిపోయిన ప్రతిపక్షం లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి లాభిస్తుందని మీరు భావిస్తున్నారా?

జ: నా అభిప్రాయం వేరేగా ఉంది. నేను నా ఎన్నికల ప్రచారంలో నా ప్రత్యర్థుల గురించి ప్రస్తావించను. గత ఐదేళ్లలో నేను ఎలా పని చేశానో, నేను ఏమి చేయాలనుకుంటున్నానో ఓటర్లకు చెబుతాను. ఇది ప్రజల్లో ఆకాంక్షను సృష్టిస్తుంది. మేం సానుకూల ప్రచారం నిర్వహించాలి. గత పదేళ్లలో వారి జీవితాల్లో మేం ఎటువంటి మంచి మార్పులు తీసుకు వచ్చామో ప్రజలకు వివరించాలి. 

ప్ర: ఎన్నికల విరాళాలు ఇచ్చిన వారి వివరాలను ఎన్నికల కమిషన్ కు విడుదల చేయాల్సిందిగా స్టేట్ బ్యాంకును కోరుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంపై మీ అభిప్రాయం? 

జ: సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇది కోర్టు విచారణలో ఉన్న అంశం. అయితే డబ్బు లేకుండా ఎన్నికల్లో పోరాడలేం. వ్యయ పరిమితి సమస్యను పరిష్కరించడానికి మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.

ప్ర: మిమ్మల్ని తరచుగా ‘హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. తొమ్మిదేళ్లలో 82,500కిలోమీటర్ల రోడ్లు ఎలా వేశారు?

జ: రోడ్ల నిర్మాణంలో ఏడు ప్రపంచ రికార్డులు సృష్టించాం. అవినీతికి తావు లేకుండా రూ.50 లక్షల కోట్ల ప్రాజెక్టులను పూర్తి చేశాను. 2014లో నేను బాధ్యతలు స్వీకరించినప్పుడు అడవులు, పర్యావరణం, రైల్వేల నుంచి అనుమతి లేకపోవడంతో 400కు పైగా ప్రాజెక్టులు నిలిచిపోయాయి. అలాగే భూసేకరణ కూడా నత్తనడకన సాగింది. బ్యాంకుల నిరర్థక ఆస్తులు రూ 3 లక్షల కోట్లకు పెరిగాయి. మా హయాంలో పనిని వేగవంతం చేయడం, సాధ్యం కాని ప్రాజెక్టులను రద్దు చేయడం ద్వారా మేం ఈ బ్యాంకులను కాపాడగలిగాం. మేం పని సంస్కృతిని మార్చాం. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేశాం. ఇప్పుడు మేం అటవీ, ఇతర శాఖల నుండి 90 శాతం ఆమోదం లేకుండా అనుమతులు మంజూరు చేయం. ఈ ఘనత మొత్తం జట్టుకు చెందుతుంది.

ప్ర: మీరు పెట్రోల్, డీజిల్ వాహనాలను పూర్తిగా తగ్గించి, విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టాలనుకుంటున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది?

జ: మేం విద్యుత్ వాహనాలను దూకుడుగా ప్రోత్సహిస్తున్నాం. వీటి ధరలు కొన్ని సంవత్సరాలలో పెట్రోల్/డీజిల్ వాహనాలతో సమానంగా ఉంటాయి. నేడు నగరాల పరిధిలో డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి, ఐదేళ్లలో పాత బస్సుల స్థానంలో కొత్త విద్యుత్ బస్సులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సుదూర ప్రయాణాలకు కూడా విద్యుత్ బస్సులు ప్రవేశ పెడతాం 

ప్ర: పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ)పై మీ ఆలోచనలు?

జ: పొరుగు దేశాలలో హిందువులు, బౌద్ధులు, సిక్కులు, క్రైస్తవులతో సహా హింసకు గురైన మైనారిటీలు ఇక్కడ పౌరసత్వం పొందేందుకు ఈ చట్టం తీసుకువచ్చాం. వారికి వెళ్లేందుకు వేరే దేశం లేదు. చట్టం వివక్షాపూరితమైనది కాదు. ఈ వర్గానికి వ్యతిరేకం కాదు.

ప్ర: సిల్క్యారా-బార్కోట్ సొరంగం కుప్పకూలడానికి కారణం సున్నితమైన హిమాలయ భూభాగంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) తవ్వకాలు జరపడమేనని పర్యావరణ ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. దీనిపై మీరేమంటారు?

జ: సొరంగంలో ఒక భాగం కూలిపోవడం, 40 మంది కార్మికులు అందులో చిక్కుకోవడం ఒక ప్రమాదం. భూభాగం పెళుసుగా, కఠినంగా ఉంది. కానీ దీని అర్థం మనం రోడ్లు, సొరంగాల నిర్మాణాన్ని నిలిపివేయాలని కాదు. ఇటువంటి దురదృష్టకర సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు ఇప్పుడు మేం స్వీడిష్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సొరంగాలను నిర్మిస్తున్నాం. చైనా వంటి శత్రు దేశాల నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవాలంటే రోడ్లు, సొరంగాలు అవసరం. ఈ సొరంగాల ద్వారా సైనికులు వేగంగా సరిహద్దుకు వెళ్లవచ్చు.