Dr K Laxman 00

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను ఎందుకు అరెస్టు చేయడం లేదు: డా. లక్ష్మణ్

Dr K. Laxmanఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నా… రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పట్టనట్టే వ్యవహరిస్తోందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. గత బీఆర్ఎస్ సర్కార్ లో జరిగిన అవినీతి, అక్రమాల చిట్టాను వెలికితీసి నిందితులను జైలుకు పంపిస్తామన్న కాంగ్రెస్ నాయకులు.. నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి విషయంలో.. అంతకుముందు టీఎస్పీఎస్సీ అవకతవకలపై హడావిడి చేసి.. తదనంతరం అంతా మర్చిపోయారని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పైనా అదే ధోరణి అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేశామని టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు ఇచ్చిన వాంగ్మూలంలోనే స్వయంగా వెల్లడించినప్పటికీ.. మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి, ఆయనపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నట్లు అని ఆయన ప్రశ్నించారు.

శాంతిభద్రతల పరిరక్షణకు, దేశ రక్షణ కోసం ఉపయోగించాల్సిన వ్యవస్థను… సొంత ప్రయోజనాల కోసం ప్రతిపక్ష నాయకులపైనా, సొంత పార్టీలోని నాయకులపైనా, రియల్టర్లపైనా, వ్యాపారులపైనా… జర్నలిస్టులు, అడ్వకేట్లు, జడ్జిలపైనా ఉపయోగిస్తే… చివరకు విద్యార్థులపైనా, సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవారిపైనా ఉపయోగిస్తే… ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై డాక్టర్ కె.లక్ష్మణ్ నిప్పులు చెరిగారు. ల్యాండ్ సెటిల్మెంట్లకు కూడా ఫోన్ ట్యాపింగ్ ను వాడుకొని… చివరకు వ్యాపారుల నుంచి బలవంతంగా పార్టీ ఎలక్టోరల్ బాండ్లు కొనిపిచ్చారంటే ఏ స్థాయిలో దుర్వినియోగం చేశారో ఊహకు కూడా అందడం లేదన్నారు. నిఘా వ్యవస్థ మొత్తం బిజెపి నాయకుల డబ్బును పట్టుకునేందుకు… బిజెపి ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకు… బీఆర్ఎస్ డబ్బును సురక్షితంగా చేర్చాల్సిన చోటుకు చేర్చేందుకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సామాన్య నేరం కాదు, దేశ ద్రోహం లాంటిదే. దేశ ద్రోహులను ఉపేక్షించ వద్దు. ఈ కేసులో సూత్రధారులపై చర్యలు తీసుకోవాలి. సీఎం రేవంత్ చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారు. దిల్లీ పెద్దల ఒత్తిడితో రేవంత్ ఈ కేసులో రాజీపడుతున్నారు. తాను ఫోన్ ట్యాపింగ్ బాధితుడే అయినా రేవంత్ ఏం చేయలేని స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ – బీఆర్ఎస్ ఒక్కటే అని ఈ వ్యవహారంతో తేలిపోయింది. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఇండీ కూటమిలో చేరడం ఖాయం. ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారనే ఆరోపణలతో దిల్లీ బిజెపి నేతను కేసులో ఇరికించి, కవితను కాపాడేందుకు ఈ కేసును వాడుకోవాలని కుట్ర జరిగిందని పోలీసు అధికారులు వాంగ్మూలంలో చెప్పడం, వారి దిగజారుడు చర్యలకు పరాకాష్ట.’’ అని డా. కె.లక్ష్మణ్ అన్నారు.