Vajpayee

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సాధనంగా ప్రజాస్వామ్యం

భారత పార్లమెంటు స్వర్ణోత్సవాల సందర్భంగా జరిగిన అంతర్జాతీయ పార్లమెంటరీ సదస్సులో 2003, జనవరి 22న ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి చేసిన ప్రసంగం

ఒక గొప్ప సందర్భం ఈ రోజు మనందరినీ ఒకచోట చేర్చింది. మన పార్లమెంటు స్వర్ణోత్సవాలు భారతదేశంలో మనకు, ప్రజలకు, ఎన్నికైన ప్రజాప్రతినిధులకు గర్వకారణమనడంలో సందేహం లేదు. ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం పురోగమనంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అని నేను విశ్వసిస్తున్నాను. అందుకే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అంతర్జాతీయ సదస్సును నిర్వహించేందుకు లోక్ సభ సచివాలయం చొరవ తీసుకోవడం అభినందనీయం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన వారు పాల్గొనడం నాకు నిజంగా సంతోషాన్ని కలిగించింది. వందకోట్ల భారత ప్రజల హృదయపూర్వక శుభాకాంక్షలను వ్యక్తపరిచే ఒకే ఒక్క సంస్కృత పదంలో, మన విదేశీ అతిథులకు నేను చెప్పదలుచుకున్నది: సుస్వాగతం! స్వాగతం!

ద్వేషం లేకుండా ప్రతిపక్షం ఉండి, హింసకు తావులేకుండా అధికారం చేతులు మారే వ్యవస్థే ప్రజాస్వామ్యం. ఏ ప్రాతిపదికననైనా వివక్షను అది అనుమతించదు. ఈ కోణంలో ప్రజాస్వామ్యం భారతదేశ జాతీయ విలువలు, మన పురాతన సంస్కృతిలో లోతైన మూలాలను కలిగి ఉంది. ఇవి భిన్నమైన, చివరికి విరుద్ధమైన దృక్పథాలను కూడా గౌరవించడాన్ని బోధిస్తాయి. మన స్వాతంత్య్ర ఉద్యమం వలెనే భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఆవిర్భావం, పరిణామం 20వ శతాబ్దంలో ప్రపంచ చరిత్రలో ఒక ముఖ్యమైన పరిణామం. భారతీయతత్వం స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని రెండు విడదీయరాని ఆదర్శాలుగా గౌరవించింది. అందుకే 1947లో మానవాళిలో ఆరో వంతు అయిన భారత్ ఒక్క అడుగుతో స్వాతంత్య్రంలోకి అడుగు పెట్టగా, ఆ తర్వాతి అడుగుతో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోకి కూడా అడుగుపెట్టింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పురోగతికి పెద్ద ఊపునిచ్చింది.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్య అభివృద్ధి పథంలో భారత్ సాధించిన విజయాలను అంతర్జాతీయ సమాజం ఎంతగా గౌరవిస్తుందో, మనం కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం సాధించిన విజయాలను అంతే ఎక్కువగా గౌరవించాం. గత శతాబ్దం చివరి దశాబ్దాలలో నియంతృత్వ వ్యవస్థలు కుప్పకూలాయి. వివిధ వర్ణాల నియంతృత్వాలను కొనసాగిస్తూ, అభివృద్ధి, మానవ సంక్షేమంలో, ప్రజాస్వామ్యం విషయంలో తమదే ఆధిక్యమని చెప్పుకొన్న సిద్ధాంతాలు పతనమయ్యాయి. కుట్రలను, రక్తపాతంతో కూడిన అధికార మార్పిడులను, సైనిక తిరుగుబాట్లను మన కాలపు నైతిక విలువలకు విరుద్దమైనవిగా పరిగణించడం మొదలుపెట్టాం. ఖాకీ ధరించిన పాలకులు కూడా ఏదో ఒక రకమైన ప్రజాస్వామిక చట్టబద్ధతను ఎంచుకోవాల్సి అవసరం ఉందని భావించారు. 20వ శతాబ్దంలో ప్రజాస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు కొత్త శతాబ్దంలో అది మరింత విస్తరించాలి, సుసంపన్నం కావాలి. ముఖ్యంగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి, వివాదాలు, వివాదాస్పద సమస్యలను పరిష్కరించడానికి ప్రజాస్వామ్యాన్ని ఒక సమర్థమైన సాధనంగా అభివృద్ధి చేయాలి. స్వేచ్ఛాయుత, ప్రజాస్వామిక సమాజాలు సృజనాత్మకమైనవి, తప్పులను సొంతంగా సరిద్దుకుని, తమకుతామే పునరుజ్జీవనం పొందే స్వభావం కలిగి ఉంటాయని చరిత్ర అనేక సందర్భాల్లో రుజువు చేసింది. క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించడం, వ్యక్తులు, పార్టీల జయాపజయాలు, కాలానుగుణంగా ప్రభుత్వాలు మారడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ఎన్నికైన ప్రజాప్రతినిధులను జవాబుదారీగా చేస్తాయి. అధికార దాహం పెరగకుండా వారికి పగ్గాలు వేస్తాయి. పాలన ఏకపక్షంగా, నిరంకుశంగా జరగకుండా నివారిస్తాయి. కొన్ని స్వార్థశక్తులు అధికారాన్ని తమ స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోకుండా నిరోధిస్తాయి. అదే సమయంలో మన పార్లమెంటరీ వ్యవస్థతో సహా పార్లమెంటరీ వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అనేక మార్గాలను మనం విస్మరించలేం. అన్ని ప్రజాస్వామ్య దేశాలు, ముఖ్యంగా గణనీయమైన వైవిధ్యాలు కలిగిన, అభివృద్ధిలో అసమతుల్యతను కలిగి ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలు ఒక ప్రధానమైన సవాలును ఎదుర్కోవలసి వచ్చింది: అదేమిటంటే గతంలో అణచివేతకు, అధికార దుర్వినియోగానికి గురైన వర్గాల న్యాయబద్ధమైన ఆత్మగౌరవ ఆకాంక్షలను సుపరిపాలన ఆవశ్యకతలతో ఎలా సమన్వయం చేయాలి? ప్రజాస్వామ్య వ్యవస్థలను పరిరక్షించి, మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందనేది దీనికి ఒక స్పష్టమైన సమాధానం. 

మన ప్రాచీన పీఠాధిపతులు ధర్మో రక్షతి రక్షితః అనే గురు మంత్రాన్ని బోధించారు. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. అదే విధంగా వ్యవస్థలను మనం పరిరక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. మనలో ప్రతి ఒక్కరూ ప్రతి వ్యవస్థ సారాంశం అయిన నిబంధనలను పాటిస్తేనే అవి బాగా పనిచేయగలవు. మన వ్యవస్థల నియమనిబంధనలకు మనం కట్టుబడి ఉంటే ప్రజాస్వామ్య సమర్థత పదిరెట్లు, వందరెట్లు కూడా పెరుగుతుంది. లేకపోతే ప్రమాదం తప్పదు. తప్పనిసరిగా మనం చేయాల్సిన రెండో పని కూడా ఉంది. మన ఆర్థిక వ్యవస్థలు అంతకంతకూ ఏకీకృతమవుతున్నాయి. మన ప్రజల అవసరాలు, కోరికలు కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. ఫలితంగా పాలన మరింత సంక్లిష్టంగా మారి, ప్రజాప్రతినిధుల నుంచి కొత్త సామర్థ్యాలను కోరుతోంది. అందువల్ల, అన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్యాలు ఒక ఉమ్మడి సవాలును ఎదుర్కొంటున్నాయి: ఢక్కామొక్కీలు తిన్న రాజకీయనాయకులతో నిండిన నేటి ఎన్నికల రాజకీయాలు పాలనలో ఆధునిక కాలానికి తగిన సంక్లిష్టమైన విధులను నిర్వహించగల వ్యక్తులను ఎలా అధికారంలోకి తీసుకురావాలి? ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మధ్య విభేదాలు తప్పవు, పార్లమెంటులో భిన్నాభిప్రాయాలు గల వారిమధ్య తీవ్రమైన చర్చలు జరగడం సహజం. విభేదాలు, పార్లమెంటు లోపల, వెలుపల బాగా అలోచించి, శోధించి చేసే వాటి స్పష్టమైన వ్యక్తీకరణలు ప్రజాస్వామ్యం సారాంశం లాంటివి. ప్రజాస్వామ్య చైతన్యానికి అవే మూలం. కానీ క్రమశిక్షణ, నిర్మాణాత్మక విధానం, దేశం ముందున్న ముఖ్యమైన సమస్యలపై ఏకాభిప్రాయ నిర్మాణానికి దోహదం చేయడానికి సంసిద్ధత, నియమాలకు కట్టుబడి ఉండటం కూడా ప్రజాస్వామ్య మౌలిక నియమం. తీరాలు దృఢంగా ఉంటేనే నది బాగా ప్రవహిస్తుంది.

గౌరవనీయులైన ప్రతినిధులారా, మనలో ప్రతి ఒక్కరూ పార్లమెంటరీ వ్యవస్థ విభిన్న నమూనాల నుంచి వచ్చారు. ఆ మాటకొస్తే, మనం విభిన్న అనుభవాల భాండాగారం. మన దేశాల్లో ఒక్కో వ్యవస్థ ఏదో ఒక నిర్దిష్ట సమస్యను మన ముందు ఉంచింది, మన ప్రతి దేశం ఆ నిర్దిష్ట సమస్యకు ఒక నిర్దిష్ట పరిష్కారాన్ని రూపొందించింది. మన ముందున్న సవాళ్లకు పరిష్కారాలు కనుగొనడానికి అవసరమైన అనుభవ సంపద మనకు ఉంది. ఉదాహరణకు మన పార్లమెంట్లు పూర్తి కాలం నడవడానికి అనుమతించాలా? బహుళ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలుపుకొంటూ పాలన, విధానాల స్థిరత్వాన్ని కొనసాగించే మార్గాలు ఉన్నాయా? ఈ రోజు మన అనేక దేశాలలో మనం దృఢమైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అన్ని స్థాయిల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలా? మన చట్టసభల్లో కొన్ని అన్నివేళల్లో విధానపరమైన చర్చకు, చట్టాల రూపకల్పనకు ఉపయోగపడటం లేదు. ప్రిసైడింగ్ అధికారులు మన సభలు సమర్థవంతంగా పనిచేయడానికి, ఎక్కువ పని జరిగేలా చూడటానికి మరిన్ని చర్యలు తీసుకోగలరా? శాంతికి, ప్రజాస్వామ్యానికి, నాగరిక ప్రపంచ వ్యవస్థకు పెను ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదం, తీవ్రవాదంపై పోరులో పార్లమెంటేరియన్లు పరస్పర సహకారాన్ని ఎలా బలోపేతం చేసుకోగలరు? అందువల్ల ఈ మహాసభ ఒక ఆరంభం కావాలని నేను సూచిస్తున్నాను. కేవలం సంప్రదాయ కార్యక్రమాల్లోనే కాకుండా తరచూ కలుసుకోవడం అలవాటు చేసుకోవాలి. మనమందరం కలిసి మన ప్రతి దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తరచుగా కలుసుకోవాలి, మన విభిన్న అనుభవాలను లోతుగా పంచుకోవాలి. సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదాలు.