Food irradiation

రేడియేషన్ యూనిట్లతో ఆహార పరిశ్రమ అభివృద్ధి

నీస జీవనోపాధికి మించిన ప్రాముఖ్యం ఆహారానికి ఉంటుంది. ఇది పండుగలు, ఆచారాలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మన సాంస్కృతిక అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఆహార పరిశ్రమ వృద్ధికి చోదకశక్తిగా నిలిచి ఉద్యోగాలను సృష్టిస్తుంది, గ్రామీణ, వ్యవసాయ అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇది దేశీయ వినియోగం, ఎగుమతుల ద్వారా జాతీయ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదపడుతుంది. భారతదేశం 78వ స్వాతంత్య్ర సంవత్సరంలో వికసిత్ భారత్ లక్ష్యం వైపు సాగుతున్న తరుణంలో ఆహారశుద్ధి, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం చాలా అవసరం. ఇది వినియోగదారులకు చేరే ఆహారం సురక్షితంగా ఉండేటట్లు చూస్తుంది. అలాగే తగినంత పరిమాణంలో, పోషక ఆహారం అందరికీ అందుబాటులో ఉండేటట్లు చూసి వ్యర్థాలను తగ్గిస్తుంది. ఆహారోత్పత్తుల నష్టాలను, ముఖ్యంగా త్వరగా పాడైపోయే పండ్లు, కూరగాయలు వంటి వాటిని నివారించడం ముఖ్యం. ఇది రైతులకు లాభసాటి ధరలను కూడా కల్పిస్తుంది.

వ్యవసాయ, ప్రాసెస్ (శుద్ధి) చేసిన ఆహార ఉత్పత్తుల వ్యాపారం పెరుగుతున్నందున, ఆహారశుద్ధి నిర్వహణ ప్రధానంగా మారింది. అనేక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు దిగుమతుల విషయంతో సహా కఠినమైన ఆహారశుద్ధి నిబంధనలు, విధానాలు పాటిస్తున్నాయి. ఆహారశుద్ధికి సంబంధించిన సంఘటనలు తీవ్రమైన ఆర్థిక పర్యవసానాలు కలిగి ఉంటాయి. ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడటం, వినియోగదారుల్లో నమ్మకం పోవడం, ఆహార సరఫరాకు, ధరల స్థిరత్వానికి అంతరాయం ఏర్పడటం వంటి పరిస్థితులు తలెత్తుతాయి. ఆహార శుద్ధత, భద్రత సమస్యలను పరిష్కరించడానికి, ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల’కు అనుగుణంగా భారత్ 2024-25 కేంద్రబడ్జెట్ లో ఎంఎస్ఎంఈ రంగంలో 50 బహుళ ఉత్పత్తి ఆహార వికిరణ (ఇర్రేడియేషన్) యూనిట్లను ఏర్పాటు చేయడానికి నిధులను కేటాయించింది. ఆహార వికిరణ సాంకేతికత వ్యవసాయ ఆహార ఉత్పత్తుల నిల్వ కాలాన్ని పొడిగిస్తుంది, ఉత్పత్తి, సరఫరా వ్యవస్థల్లో ఆహార నష్టాన్ని తగ్గించడంతో పాటు నాణ్యమైన స్థితిలో వస్తువులు వినియోగదారులకు చేరేలా చేస్తుంది. వికిరణం (రేడియో ధార్మికత ద్వారా ఆహార ఉత్పత్తుల్లోని హానికారక క్రిములను, బూజు (ఫంగస్)లను నిర్మూలించడం) ప్రక్రియలో నియంత్రిత వాతావరణంలో ప్యాక్ చేసిన లేదా పెద్దమొత్తంలో ఆహారాన్ని ఐయోనైజింగ్ రేడియేషన్‌కు చేస్తారు. ఈ పద్ధతి హానికరమైన సూక్ష్మజీవులను తొలగించడం ద్వారా ఆహారం వల్ల కలిగే అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది పదార్ధాలు నశించే ప్రక్రియను మందగింపజేయడం ద్వారా అవి చెడిపోకుండా ఎక్కువకాలం ఉంచుతుంది. తొందరగా పక్వానికి రాకుండా ఆపుతుంది, అంకురోత్పత్తి లేదా మొలకెత్తడం ద్వారా (బంగాళాదుంపలు, ఉల్లిపాయలు వంటివి) కలిగే ఆహార నష్టాన్ని తగ్గిస్తుంది. ఇది ఆహారోత్పత్తులు ఎక్కువకాలం నిల్వ ఉంచేందుకు రసాయనాలు వాడే అవసరాన్ని తగ్గిస్తుంది. మరింత స్థిరమైన ఆహార సరఫరా వ్యవస్థకు దోహదం చేస్తుంది.

ఈ రేడియేషన్ ప్రక్రియలో అవసరమైన ఫలితాల కోసం సాధారణంగా ఒకసారి రేడియేషన్ కు గురిచేస్తే సరిపోతుంది. దీనివల్ల ఆహారశుద్ధి పద్ధతులు సులభమై ఆహార సరఫరా వ్యవస్థలో ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ఆహార సంరక్షణ కోసం రేడియేషన్‌ను ఉపయోగించడం కొత్తేమీ కాదు, ఎండలో పండ్లు, కూరగాయలు, మూలికలు, మాంసం, చేపలు మొదలైన వాటిని ఎండబెట్ట్టే సంప్రదాయం శతాబ్దాలుగా ఉంది. అయితే ఐక్యరాజ్య సమితికి చెందిన ‘ఆహరం, వ్యవసాయ సంస్థ’ (Food and Agriculture Organization-FAO) ఆధ్వర్యంలో కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్ అంతర్జాతీయ ప్రమాణాలను నిర్దేశించిన తర్వాత ఆహార వికిరణ సాంకేతికతపై ఆధునిక కాలంలో ఆసక్తి పెరిగింది. ఆహార వికిరణం మన వంట మాదిరిగానే ఆహార శుద్ధికి సురక్షితమైన సమర్థవంతమైన పద్ధతి. అధునాతన శుద్ధి ప్రమాణాలను పాటించే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, ఈయు వంటి దేశాల్లో వికిరణ శుద్ధికి సంపూర్ణ ఆమోదం లభించింది. దీన్ని దేశీయ, ఎగుమతి మార్కెట్లకు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. 20 ఏళ్ల నిషేధం తర్వాత భారతీయ మామిడి పండ్లను అమెరికాకు ఎగుమతి చేసేందుకు వీలు కల్పించిన 2012 ఒప్పందం ఈ వికిరణ శుద్ధి ప్రక్రియకు గల విలువకు ఒక ప్రబలమైన ఉదాహరణ. చీడపీడల ముప్పును తొలగించడం లేదా గణనీయంగా తగ్గించడం ద్వారా అమెరికా దేశీయ వ్యవసాయాన్ని రక్షించేందుకు విధించిన నిబంధనలకు అనుగుణంగా భారతదేశం తన మామిడి పండ్లను ఆ దేశానికి ఎగుమతి చేసే ముందు రేడియేట్ చేయడానికి అంగీకరించడంతో ఈ పురోగతి సాధ్యమైంది.

దేశవ్యాప్తంగా 34 రేడియేషన్ ప్రాసెసింగ్ (వికిరణం ప్రక్రియ) సదుపాయాలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ విషయంలో భారత్ గణనీయమైన పురోగతి సాధించింది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించింది. వీటిలో 16 కేంద్రాలకు మంత్రిత్వ శాఖ మద్దతు అందిస్తోంది. ఇది ప్రశంసనీయమే అయినా రేడియేషన్ కేంద్రాల సంఖ్యను, వాటిని దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరింపజేస్తే మన శక్తిమంతమైన వ్యవసాయ ఆహారోత్పత్తులకు పెరుగుతున్న మార్కెట్ అవసరాలను తీర్చగల సామర్థ్యం మరింత పెరుగుతుంది. అయితే ఆహార వికిరణ కేంద్రాలను విస్తృతంగా ప్రారంభించేందుకు అధిక మూలధన వ్యయం ఒక అవరోధంగా మారింది. ఒక ఎంసిఐ కోబాల్ట్ 60 సోర్స్‌తో రేడియేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి భూమి, అదనపు మౌలిక సదుపాయాల ఖర్చులు కాకుండానే దాదాపు రూ.25 నుంచి నుండి 30 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలి. ప్రతిపాదన పరిశీలన, ఆమోదం, ప్రదేశానికి అనుమతి, ప్లాంట్ నిర్మాణం, యంత్రాల ఏర్పాటు, భద్రతా పరిశీలన, మార్గదర్శకాలు, పర్యవేక్షణ, ప్రారంభించడం, రేడియేషన్ మూలాలను అప్పుడప్పుడు మార్చడంతో సహా నిర్వహణ వంటి అనేక దశలు ఈ కేంద్రాల స్థాపనలో భాగంగా ఉంటాయి. భాభా అణు పరిశోధనా కేంద్రం, అణు ఇంధన నియంత్రణ బోర్డ్ వంటి కీలక సంస్థలు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తాయి.

ప్రారంభంలో మూలధన ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ, పెట్టుబడిదారులకు ఇక్కడ గణనీయమైన అవకాశాలు ఉన్నాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో సురక్షితమైన, ఎక్కువకాలం నిల్వ ఉండే ఆహార ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ పెట్టుబడిదారులకు లాభదాయకమైన అవకాశాలను కల్పిస్తుంది. ఆహార శుద్ధిని పెంపొందించే, దాని నిల్వ కాలాన్ని పొడిగించే సామర్థ్యం కలిగిన ఆహార వికిరణ కేంద్రాలు ఆహార వ్యర్థాలను తగ్గించడంలో, కఠినమైన ఎగుమతి ప్రమాణాలను అందుకోవడంలో కీలకంగా పని చేస్తాయి. భారతీయ ఆహారశుద్ధి రంగం 2025-26 నాటికి 535 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. శుద్ధి చేసిన ఆహార ఎగుమతుల్లో ఎప్పటికప్పుడు పెరుగుతున్న భారత్ వాటాతో రేడియేషన్ సదుపాయాలు మంచి పెట్టుబడి అవకాశాలను కల్పిస్తాయి. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ రేడియేషన్ యూనిట్ల ఏర్పాటు కోసం ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ.10 కోట్ల వరకు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తోంది. గ్రాంట్లు లేదా సబ్సిడీ రూపంలో ఉండే ఈ సాయం పండ్లు, కూరగాయలతో సహా త్వరగా పాడైపోయే ఉత్పత్తులను శుద్ధి చేయడానికి, వాటి పరిశుభ్రతను, నిల్వకాలాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది.

కేంద్ర బడ్జెట్ 2024-25లో ప్రకటన తర్వాత, సమీకృత శీతల గిడ్డంగుల గొలుసు, విలువ చేర్పు మౌలిక సదుపాయాల కార్యక్రమం కింద బహుళ ఉత్పత్తుల ఆహార వికిరణ కేంద్రాల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తల నుంచి మంత్రిత్వ శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. భారతీయ ఆహార సరఫరా వ్యవస్థ, వ్యవసాయ ఆహార ఎగుమతి రంగం డిమాండ్లను తీర్చడానికి మన మౌలిక సదుపాయాలను విస్తరించాల్సిన అవసరం ఉంది. పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు మంత్రిత్వ శాఖ అందించిన ఆర్థిక సహాయాన్ని ఉపయోగించి అదనపు రేడియేషన్ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.

చిరాగ్ పాశ్వాన్,
కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి