Hamara Sankalp Vikasit Bharat

రైతులకు శాపంగా రేవంత్ నిర్లక్ష్యం

కాల వర్షాల ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్నా, ఓ మాదిరిగా అక్కడక్కడా వర్షాలు పడుతున్నా, ధాన్యం తడిసిపోయి నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నా ధాన్యం కొనుగోలు పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణి రైతులకు శాపంగా మారుతుంది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం ఎక్కడికక్కడే ఉండిపోయింది. అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోని వడ్లన్నీ వర్షార్పణం అయ్యాయి. ఇలా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు కడగండ్లు మిగిల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 19, 20, 21 తేదీలలో కురిసిన అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మూడు వారాలు దాటుతున్నా పలుచోట్ల ధాన్యం కొన్న దాఖలాలు లేవు. కొన్నిచోట్ల కాంటా వేసినా ధాన్యం మిల్లులకు తరలించకపోవడంతో బస్తాలు తడిసిముద్దయ్యాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో ఎక్కడ చూసినా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.

వ్యవసాయ మార్కెట్లు, పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాలలో రైతుల కళ్ల ముందే ధాన్యం వాననీటికి కొట్టుకుపోయింది. రోడ్లపై ఆరబోసిన ధాన్యం కూడా వానపాలయ్యింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రంగంపేట సెంటర్‌లో వరదకు కొట్టుకుపోయిన ధాన్యం జంపన్న చెరువులో కలిసిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం తడవకుండా ఉండేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. సరిపడా టార్పాలిన్‌ కవర్లు లేకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతోనే ఈ దుస్థితి దాపురించిందని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నా ఎన్నికల బిజీ పేరుతో రైతాంగాన్ని యంత్రాంగం పట్టించుకోవడం లేదు. మంత్రులు, ఎమ్యెల్యేలు సైతం ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై తమ వైపు కన్నెత్తి చూడకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.

అకాల వర్షాలు, వడగళ్ల వానలతో నారా య ణపేట, కామారెడ్డి, నిజామాబాద్, నాగర్ కర్నూల్, యాదాద్రి, సిద్దిపేట జిల్లాలలో పంటనష్టం జరిగినట్లు ప్రాథమిక నివేదికలు అందాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దాదాపు 2200 ఎకరాల వరకు వరి, మొక్కజొన్న, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు పేర్కొన్నారు. వరి కోతల సమయంలోనే అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వం కన్నా ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పింది. 7వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రకటనలు గుప్పించారు. కానీ ప్రభుత్వ ప్రకటనలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేకుండా పోయింది. పేరుకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇందులో సగానికి పైగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లనే ప్రారంభించలేదు. 7200 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు సిద్ధం చేసిన పౌరసరఫరాల సంస్థ వాటిలో 2480 కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వంలో చిత్తశుద్ధి కనిపించడం లేదు. ఖమ్మం జిల్లాలో 157 కొనుగోలు కేంద్రాలను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 136 కేంద్రాలను ఏర్పాటు చేసినా ఇందులో కొన్నింటిలోనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. పలు జిల్లాలో కూడా పరిస్థితులు ఇదేవిధంగా ఉన్నాయి.

ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్‌ రైతుబంధు రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంచుతాం, రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం, క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇస్తామని మాయమాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసిందని రైతులు ఎక్కడికెళ్లినా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 100 రోజులలో రైతుబంధు చెల్లిస్తామని ఎప్పుడు చెప్పాం అంటూ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తప్పించుకొనే ధోరణి ప్రదర్శిస్తున్నారు.

– కృష్ణ చైతన్య