రైతు భరోసా పేరుతో రైతులకు మరోసారి రేవంత్ రెడ్డి మోసం
ఆరు గ్యారెంటీలు, హామీల అమలులో ఘోరంగా విఫలమైన రేవంత్ రెడ్డి తాజాగా `రైతు భరోసా’ అమలులో మరోసారి రైతులను మోసం చేసేందుకు సిద్ధమైంది. వరంగల్ రైతు డిక్లరేషన్, మ్యానిఫెస్టో సాక్షిగా కాంగ్రెస్ రైతులకిచ్చిన హామీని తుంగలో తొక్కింది. రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు సీజన్‌కు రూ.7,500 చొప్పున ఏడాదికి రూ.15 వేలు ఇస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జున ఖర్గే ఇప్పుడు మాట తప్పారు. ఓ ఏడాది పాటు రూపాయి కూడా ఇవ్వకుండా, ఇప్పుడేమో కేవలం రూ.12,000 మాత్రమే ఇస్తామని ప్రకటించారు. అది కూడా సాగు యోగ్యమైన భూమికి అంటున్నారు. మంత్రులేమో సాగు చేసిన భూమికే అంటున్నారు. ఏవిధంగా ఆ మొత్తం అందజేస్తారో ముఖ్యమంత్రి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు.
సాగు యోగ్యమైన భూమి వేరు.. సాగు చేసిన భూమి వేరు. వానకాలంలో రాష్ట్రంలో సాగునీరు పుష్కలంగా ఉండటంతో 136 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. యాసంగి సీజన్లో సాగు నీటి కొరతతో 60 లక్షల ఎకరాలకే పరిమితమవుతుంది. ఇందులో మిగిలిన 76 లక్షల ఎకరాల భూమి సాగు యోగ్యం అయినప్పటికీ, నీళ్ల కొరతతో సాగు చేయలేదు. అంటే యాసంగిలో సాగు యోగ్యమైన 136 లక్షల ఎకరాల భూమికి రైతుభరోసా ఇస్తారా? లేక సాగు చేసిన 60 లక్షలకే ఇస్తరా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ‘కేసీఆర్ ఇచ్చే ముష్టి పదివేలు ఎందుకు? మా ప్రభుత్వం రాగానే ఎకరాకు రూ.15వేలు ఇస్తాం’ అంటూ ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడేమో రూ.15 వేల హామీని పక్కకునెట్టి, ఆ 10వేలకు మరో రెండు వేలు మాత్రమే కలిపి ఇస్తున్నారు. రైతు భరోసా కింద ఎకరానికి సీజన్‌కు రూ.7,500 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు దీన్ని రూ.6వేలకే పరిమితం చేసింది. ప్రతి రైతుకు, కౌలు రైతుకు ఎకరానికి రూ.15 వేలు చొప్పున, వ్యవసాయ కూలీలకు రూ.12 వేల చొప్పున రైతు భరోసా సొమ్ము చెల్లిస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ నేడు అందుకు భిన్నంగా రూ.12 వేలు మాత్రమే ఇస్తానని ప్రకటించడమంటే రైతులను దగా చేయడమే అవుతుంది.
ఇప్పటికే వానకాలం పంటలకు రైతు భరోసా ఇవ్వకుండా రైతులకు రూ.11,000 కోట్లను ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఇప్పుడు యాసంగిలో కోతలు, షరతులతో పంపిణీకి సిద్ధమవుతున్నది. మంత్రివర్గ సమావేశంలోనే చాలామంది మంత్రులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు పరచకపోతే రైతుల మొహం చూడలేమని చెప్పినా ముఖ్యమంత్రి చేతులు ఎత్తేసినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే రైతులు ప్రభుత్వం పట్ల ఆగ్రహంతో ఉన్నారని, ఈ విషయంలో మోసం చేస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎదురు తిరుగుతారని కొందరు మంత్రులు ఆందోళన వ్యక్తం చేసినా చేయగలిగిందేమీ లేదంటూ ముఖ్యమంత్రి నిస్సహాయస్థితిలో ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ విషయాన్ని మీడియా ముందుకొచ్చి ఎవరు చెప్పినా ప్రజల్లో బదనాం అవుతారని కొందరు మంత్రులు చెప్పడంతో తానే మీడియా ముందు మాట్లాడుతానని ముఖ్యమంత్రి చెప్పక తప్పలేదు.
ఏడాదికి రూ.12,000 చెల్లిస్తామంటే రైతులకు అదనంగా నయాపైసా కూడా సాయం చేయడం లేదని తేటతెల్లమవుతుంది. ఎందుకంటే ఎగ్గొట్టిన ఏడాది రైతు భరోసా బకాయి మొత్తాన్ని విభజించి ఏటా రూ.2,000 చొప్పున రాబోయే నాలుగేళ్లకు జోడించి చెల్లించాలనుకుంటున్నారే తప్ప రైతులకు అదనంగా ఒరగబెట్టిందేమీ కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం చెల్లించిన దానితో పోలిస్తే కాంగ్రెస్ పాలనలో ఎకరాకు మరో రూ.2,000 రైతులు నష్టపోయినట్లు స్పష్టం అవుతుంది. రైతు భరోసాపై ఏదో చేస్తున్నట్టు గత ఆరు నెలలుగా ఎంతో హంగామా చేసిన ప్రభుత్వం తీరా కోతలకు పెద్దపీట వేసింది. ఈ మాత్రం దానికి మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయడం, ఆ కమిటీ నివేదిక ఆధారంగా ఏదో చేస్తామని చెప్పడం కాలయాపన కోసమే అని స్పష్టం అవుతుంది. రైతులను ఉద్దరిస్తామన్నట్టుగా హెలికాప్టర్లలో వెళ్లి మీటింగ్‌లు, అభిప్రాయ సేకరణ పేరుతో పెద్దపెద్ద సభలు, వీడియో కాన్ఫరెన్స్‌లు.. ఇలా ఎంతగానో హడావుడి చేసి చివరకు ప్రజలకు ఇచ్చిన హామీని కుదిస్తున్నట్లు ప్రకటించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఏడాదిపాటు తూట్లు పొడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండో ఏడాదిలోనైనా వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఎక్కడికక్కడ కుదించే ప్రయత్నం చేస్తున్నారు.