రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదు
ఎన్నికల బాండ్ల విషయంలో ప్రతిపక్షాలు ప్రత్యేకంగా బిజెపిని దోషిగా చూపిస్తూ విమర్శలు చేయడాన్ని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఆక్షేపించారు. అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఎన్నికల బాండ్లను స్వీకరించాయని, బిజెపికి అందిన మొత్తంతో దాదాపు సమానమైన మొత్తాన్ని పొందాయని ఆయన గుర్తుచేశారు. ఎన్నికలు, ప్రతిపక్షాల అర్థం లేని ఆరోపణలు, ఆర్ఎస్ఎస్-బిజెపి బంధం, పార్టీ విస్తరణ తదితర అంశాలపై ఒక ప్రముఖ జాతీయ ఆంగ్లపత్రికకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధానాంశాలు:
ప్ర: 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వరుసగా 44, ఆ తర్వాత 52 సీట్లు మాత్రమే గెలుచుకుంది. మరి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని బిజెపి ప్రధాన లక్ష్యంగా ఎందుకు ఎంచుకుంది?
జ: దానికి మేం కాదు, మీడియానే కారణం. మీడియా ఆయన చెప్పే ప్రతి దాన్ని ప్రచారం చేస్తుంది. మరి మేం స్పందించాల్సి వస్తోంది. మేం మౌనంగా ఉండలేం కదా. రాజ్యాంగాన్ని చదవని వ్యక్తి రాజ్యాంగ ప్రతిని చేతిలో పెట్టుకుని తిరుగుతున్నాడు. మీరు ఆయన్ను ఎన్నడూ ప్రశ్నించలేదు. వారి పనితీరు నిరంతరం క్షీణిస్తోంది. లేకపోతే వారి గురించి మాట్లాడవలసిన అవసరం మాకేముంది? వారి సొంత వ్యవహారాలు వారే చూసుకుంటారు.
ప్ర: మీరు రాజ్యాంగాన్ని ప్రస్తావించారు. అయితే రాజ్యాంగాన్ని మార్చేందుకు వీలుగా బిజెపికి 400కి పైగా సీట్లు కావాలని కొందరు బిజెపి నాయకులు చెప్పడంతో అది చర్చనీయాంశమైంది.
జ: మా పార్టీలో రకరకాల వ్యక్తులున్నారు. నేను వెంటనే లల్లూ సింగ్ (ఫైజాబాద్ ఎంపీ)కి ఫోన్ చేసి ఇది పార్టీ ఎజెండా కాదని చెప్పాను. (నాగౌర్‌లో బిజెపి అభ్యర్థి) జ్యోతి మిర్ధాతో కూడా మాట్లాడాను. (లోక్‌సభ ఎంపీ) అనంత్‌కుమార్ హెగ్డే పలుమార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేసినందున ఆయనకు టిక్కెట్ నిరాకరించారు. వారి అభిప్రాయాలకు బిజెపి కట్టుబడి ఉండదు. మీరు స్పందన కోసం సాక్షి మహరాజ్ లేదా గిరిరాజ్ సింగ్ వంటి నాయకుల వద్దకు వెళ్లడం కూడా దీనికి కారణం. బిజెపి ఆలోచనా విధానాన్ని వారు శాసించరు. పార్టీ తన వేదిక మీద నుంచి చెప్పేదే అసలైన బిజెపి విధానం. రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదు.
సమస్య ఏమిటంటే రాహుల్ గాంధీ చదవకపోవడమే… అయన అధికారిక విద్యార్హత ఏమిటో నాకు తెలియదు. తన ముత్తాత (పండిట్ నెహ్రూ) వాక్ స్వాతంత్య్రాన్ని పరిమితం చేయడానికి రాజ్యాంగాన్ని సవరించారని ఆయనకు తెలియదు. అయన అమ్మమ్మ కోర్టు తీర్పును అడ్డుకోడానికి చేయడానికి రాజ్యాంగాన్ని మార్చింది. షా బానో కేసులో ముస్లింలను సంతృప్తి పరచడానికి ఆయన తండ్రి రాజ్యాంగాన్ని సవరించారు. ఒక రాజ్యాంగ సంస్థ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ స్వయంగా చించివేశారు. రాజ్యాంగాన్ని ఎవరు మార్చారు? మేం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం – జమ్మూ కాశ్మీర్లో తప్ప మరే రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలన విధించామా? ఎక్కడైనా అధికారం చేజిక్కించుకున్నామా? మేం ఎప్పుడూ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం. మేం రాజ్యాంగంతో ఆటలాడం, దానిని రక్షించడానికి మేం ఇక్కడ ఉన్నాం.
ప్ర: దళితుల్లో ఒక వర్గం రాజ్యాంగం గురించి అభద్రతా భావంతో ఉందని మీరు ఎందుకు అనుకుంటున్నారు?
జ: మీకు అటువంటి సమాచారం ఎక్కడి నుంచి వస్తోందో నాకు తెలియదు. మైనారిటీలు, దళితుల్లో ఈ భయం, అభద్రతా భావాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. కానీ మీరు అలాంటి నకిలీ కథనాలను ఎందుకు ప్రచారం చేస్తారు? అటువంటి భయాందోళనలకు అవకాశమిచ్చే పని ఈ పదేళ్ళలో మేం ఏం చేసాం? బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని మార్చేందుకు ఎవరినీ అనుమతించబోమని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఎంతకైనా తెగిస్తాం అని ప్రధాని స్వయంగా చెప్పారు.
ప్ర: బిజెపి అత్యంత బలంగా ఉన్న సమయం ఇది. మీరు ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకుని కూడా పార్టీని విస్తరించారు. మీ విస్తరణలో తదుపరి దశ ఏమిటి?
జ: పార్టీని విస్తరించడం అనేది ఒక నిరంతర ప్రక్రియ – ఇది బిజెపికి 24X7, 365 రోజులూ జరిగే పని. మేం స్థిరంగా పని చేస్తున్నాం. మేం మొదట్లో మధ్య భారతదేశంలో, తర్వాత ఉత్తరాన, పశ్చిమాన బలపడ్డాం. గత కొన్ని సంవత్సరాలుగా, మేం ఈశాన్య, తూర్పు భారతదేశంపై దృష్టి కేంద్రీకరించాం. మేం ఈశాన్య, తూర్పు భారతదేశంలో మంచి ఫలితాలను సాధిస్తాం. ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మేం తెలంగాణలో విస్తరిస్తాం, ఆంధ్రప్రదేశ్‌లో మాకు సీట్లు ఉంటాయి కర్ణాటకను నిలుపుకొంటూ తమిళనాడు, కేరళలో (లోక్‌సభ ఎన్నికలలో) మా ఖాతా తెరుస్తాం. ఈ రాష్ట్రాల్లో మా ఓట్ల శాతం పెరగనుంది. ఇప్పటికే విస్తరించిన రాష్ట్రాల్లోనూ మా స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాం. ఈ ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణలో అధికారంలోకి రాలేకపోయినా గణనీయమైన ఫలితాలు సాధించాం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అందరినీ ఆశ్చర్యపరిచేవిధంగా కొన్ని అపోహలను బిజెపి బద్దలు కొడుతుందని నేను విశ్వసిస్తున్నాను. ప్రధాని మోదీ చేతులను బలోపేతం చేయడానికి, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఈ దక్షిణాది రాష్ట్రాల ప్రజల నుంచి మాకు లభిస్తున్న మద్దతుతో, దక్షిణ భారతదేశంలో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ధీమాగా చెప్పగలను.
ప్ర: ఈ క్రమంలో మీరు చాలా మంది నాయకులను చేర్చుకున్నారు. వారిలో కొందరు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నాయకులను పార్టీలోకి చేర్చుకునే ముందు వారి పూర్వాపరాలు పరిశీలిస్తారా?
జ: మేం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. అన్నింటిలో మొదటిది, బయటివారిని చేర్చుకోవడం వల్ల బిజెపి విస్తరణకు కలిగే ప్రయోజనం ఏమిటి అనే అంశం. ఎందుకంటే పార్టీని బలోపేతం చేయాలి. కొంతమంది నాయకులపై కొన్ని ఆరోపణలు ఉన్నాయి. కానీ మేం విచారణ ప్రక్రియను అస్సలు ఆపలేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కొంత మంది బిజెపిలో చేరాలనుకున్నప్పుడు అది బిజెపికి లాభమని మేం కూడా భావిస్తున్నాం. అలా అని మేం రాజీ పడతామని కాదు.
ప్ర: మణిపూర్‌పై బిజెపి వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మీరు మణిపూర్‌లో కనీసం పర్యటించలేదు?
జ: అన్నింటిలో మొదటిది, మణిపూర్ చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి – మెయితీ, కుకీ తెగల మధ్య సంఘర్షణకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇది గిరిజనుల సమస్య. చాలా కాలంగా ఉంది. ఈ ఘర్షణ తీవ్రత ఇప్పుడు తగ్గింది. కాంగ్రెస్ హయాంలో రెండు మూడేళ్లు వివాదం కొనసాగింది. ప్రధాని సంగతి అలా ఉంచండి, అప్పుడు జూనియర్ మంత్రులు కూడా రాష్ట్రాన్ని సందర్శించలేదు. ఇప్పుడు గిరిజన సమస్య కాస్తా ఒకవైపు క్రైస్తవులతో మతపరమైన సమస్యగా మారింది. ఈసారి రెండు, మూడు వారాల్లో అదుపులోకి వచ్చింది. మాకు కుకీలు, మెయితీలు ఇద్దరూ సమానమేనని, శాంతిని స్థాపించడం మా లక్ష్యమని చాలా స్పష్టంగా చెప్పాం. కేరళకు వెళ్లి క్రైస్తవులకు అర్థమయ్యేలా మాట్లాడతాం. కానీ వాస్తవాలను వక్రీకరించడం విభజనవాద శక్తుల పని. బిజెపినే కాదు, దేశాన్నే బలహీనపరిచే కథనాలను వారు ప్రచారం చేస్తున్నారు.
ప్ర: ఎన్నికల తర్వాత ముస్లింలకు చేరువ కావడానికి బిజెపి ఏం చేయబోతోంది?
జ: మేం ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్’ సూత్రాన్ని నమ్ముతాం. మేం దానిని కొనసాగిస్తాం. పేదలు, మైనారిటీల జీవితాలను మార్చడానికి ప్రధాని మోదీ చాలా కార్యక్రమాలు చేపట్టారు. మేం ఎవరి పట్లా వివక్ష చూపడం లేదు. కానీ మేం ఈ సంక్షేమ పథకాలను ఓట్లుగా మార్చుకోడానికి, రాజకీయం చేయడానికి ఉపయోగించుకోలేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ముస్లిం మైనారిటీలు ‘విభజించి పాలించు’ అనే కాంగ్రెస్ దుర్మార్గపు ఉచ్చులో పడిపోతున్నారు. కాంగ్రెస్ హయాంలో ముస్లిం మైనారిటీలకు ఒరిగింది ఏమీలేదు. మోదీ కార్యక్రమాల వల్ల వారి జీవన ప్రమాణాలు మారిపోయాయి. కుల, మతాలకు అతీతంగా అందరినీ ఏకం చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.
బాధ్యతాయుతమైన పార్టీగా బిజెపి వారితో సంప్రదింపులు జరుపుతూనే ఉంటుంది. వాస్తవాలు వారికి తెలిసేటట్టు చేసేందుకు ప్రయత్నిస్తుంది. వారు పరిస్థితిని గ్రహించారు కానీ కొన్ని ఒత్తిళ్లు, పర్యావరణ వ్యవస్థ కారణంగా ఇప్పటికీ అలాగే ఉన్నారు. పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు 4-5 శాతం ముస్లింలు బిజెపికి ఓటు వేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. నలుగురు ముస్లిం మహిళల్లో ఒకరు బిజెపికి ఓటు వేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ మేం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇది ఒక సున్నితమైన సమస్య. ఎందుకంటే ఇది దేశ నిర్మాణ క్రతువు. అపార్థాలు మెల్లగా తొలగిపోతాయి. ఒకప్పుడు ‘బ్రాహ్మణ పార్టీ’ గా ముద్రపడిన బిజెపి క్రమంగా వెనుకబడిన తరగతుల విశ్వాసాన్ని సంపాదించుకుంది. మా ఉద్దేశాలు స్పష్టంగా ఉన్నందున ఈ పరిస్థితి మారుతోంది. దక్షిణాదిలో మాకు భాష సమస్య ఉంది. కానీ మేం వారిని నిందించలేం.
ప్ర: దక్షిణాదిలో మీ పార్టీ భిన్నంగా ఉందా? ప్రజల మధ్య భేదాలను సృష్టించే విషయంలో దూకుడు తగ్గిస్తారా?
జ: నాయకుల మాటలకు పెడర్థాలు తీయడం ఈ పరిస్థితికి కారణం. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముస్లింలను ప్రత్యేకంగా చూసింది. ఒక వర్గం వారికి పెద్దపీట వేసి మరో వర్గం వారిని విస్మరించారు. దక్షిణాదిలో అలా కాదు. ఇక్కడ రకరకాల పొత్తులు ఉంటాయి. మా నాయకులందరూ జాతీయవాదులుగా ఉంటారు. భిన్నత్వంలో ఏకత్వం అనే సార్వత్రిక సూత్రాన్ని ప్రతి నాయకుడు విశ్వసిస్తారు. మేం విభిన్న సంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలను గౌరవిస్తాం. అయితే మనం దేశాన్ని ఐక్యంగా ఉంచాలి. గోవా, ఈశాన్య రాష్ట్రాలు, ఇప్పుడు కేరళలో చూడండి, క్రైస్తవులకు మాతో ఏ పేచీ లేదు. వారు సమస్యలను మా కోణం నుంచి అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఉదాహరణకు ‘ది కేరళ స్టోరీ’ సినిమానే చూడండి. ఇది వారి ఇళ్లలో జరిగింది. వారు ఆ బాధను అనుభవించారు.
ప్ర: కానీ ‘ది కేరళ స్టోరీ’లో మనం చూసింది ఒక కథనం మాత్రమే… ఇది వాస్తవ పరిస్థితి కాదు; అటువంటివి ఎక్కడో ఒక కొన్ని సంఘటనలు మాత్రమే జరిగాయి.
జ: కాదు, వందల సంఖ్యలో ఇటువంటివి జరిగాయి. మీరు తప్పిపోయిన అమ్మాయిల జాబితాను చూడండి.
ప్ర: బిజెపి 10 ఏళ్లుగా అధికారంలో ఉంది, ఆర్ఎస్ఎస్ మీ సైద్ధాంతిక మాతృసంస్థ. మీరు ఇప్పుడు బలంగా ఉన్నారు, దేశవ్యాప్తంగా బలమైన యంత్రాంగాన్ని కలిగి ఉన్నారు. బిజెపి-ఆర్ఎస్ఎస్ బాంధవ్యం పరిస్థితి ఏమిటి? ప్రభుత్వంలో గాని, అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ విధానాల్లో కనిపించిన విధంగా గాని ఆర్ఎస్ఎస్ ఆలోచనాతత్వం కనిపించడం లేదు?
జ: చూడండి, మేం కూడా పెరిగాం. ప్రతి ఒక్కరికి వారి సొంత పని ఉంది. ఆర్ఎస్ఎస్ ఒక సాంస్కృతిక సంస్థ, మేం ఒక రాజకీయ సంస్థ. మొదట్లో మేం అంత బలంగా లేకపోవడం వల్ల ఆర్ఎస్ఎస్ చేయూతనిచ్చింది. ఈరోజు మేం సామర్థ్యాలను సంతరించుకున్నాం. బిజెపి తనంతట తానుగా నడుస్తుంది. అంతే తేడా.
ప్ర: కనుక మీ రాజకీయ కార్యకలాపాల్లో మీకు ఆర్ఎస్ఎస్ అవసరం ఉందని మీరు అనుకోరు…
జ: ఇక్కడ ‘అవసరం’ ప్రసక్తి లేదు. ఆర్ఎస్ఎస్ ఒక ఒక సైద్ధాంతిక సంస్థ. ఆర్ఎస్ఎస్, బిజెపిలకు కార్యక్షేత్రాల విషయంలో చాలా స్పష్టమైన విభజన రేఖలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్కు సామాజిక-సాంస్కృతిక అంశాలపై శతాబ్ద కాలం పాటు పని చేసిన అనుభవం ఉంది. వారు భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో విస్తృతంగా పని చేశారు. భారతదేశాన్ని ప్రగతిపథంలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న రాజకీయ పార్టీ బిజెపి. మా కార్యకర్తల శ్రమతో మేం 140 కోట్ల మంది భారతీయులకు ఇష్టమైన పార్టీగా అవతరించాం. ఆర్ఎస్ఎస్, బిజెపి రెండూ శక్తి మేరకు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాయి. రెండు సంస్థల మధ్య పరస్పర గౌరవం ఉంది. మీడియాలో కొందరికి ఆర్ఎస్ఎస్-బిజెపి సంబంధాలపై ఊహాగానాలు, కుట్ర సిద్ధాంతాలు, అపోహలు ప్రచారం చేస్తున్నారు. వాస్తవమేమిటంటే, ‘దేశం ముందు’ అనే లక్ష్యంతో కలిసి పని చేసిన ఘన చరిత్ర ఇద్దరికీ ఉంది.
ప్ర: ఎన్నికల బాండ్లను అత్యధికంగా స్వీకరించిన ఏకైక పార్టీ బిజెపి. ఇప్పుడు ఈ విధానం లేదు కాబట్టి ఎన్నికలకు నిధుల సమీకరణలో ఎదురయ్యే సవాళ్లు ఏమిటి?
జ: బిజెపిని మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు చూస్తున్నారు? అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఎన్నికల బాండ్లు అందుకున్నాయి. బిజెపికి ఎంతమొత్తంలో బాండ్లు అందాయో దాదాపు అంతే మొత్తాన్ని అవి కూడా పొందాయి. ఎన్నికల వ్యవస్థ నుంచి నల్లధనాన్ని తొలగించడమే ఎన్నికల బాండ్ల ఉద్దేశం. మేం సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. అయితే నల్లధనానికి మరోసారి తలుపులు తెరిచినందుకు చింతిస్తున్నాం. ఇది అందరూ సమష్టిగా ఎదుర్కోవాల్సిన సవాలు.
నాగార్జున