రుణమాఫీ కాని రైతులకు బిజెపి అండ
”రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా… ఇప్పుడు రుణమాఫీ అయినోళ్లు వెంటనే బ్యాంకుకు పోయి మళ్లీ రూ.2 లక్షల రుణం తీసుకోండి.. డిసెంబర్ 9 నాడు నేను రాంగానే మాఫీ చేస్తా..” ఇదీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రైతులకు ఇచ్చిన హామీ. డిసెంబర్ 9 దాటింది, రుణమాఫీ చేయలే. ఆగస్టు 15కు వాయిదా వేసిన రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకుంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. మాఫీ చేయక తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కార్ ఆంక్షలు పెట్టి రుణమాఫీ చేస్తున్నాం అంటూ రైతులను మోసం చేసింది. రాష్ట్రంలో లక్షలాది రైతులు రుణాలు మాఫీ కాక ఆందోళనతో ఉన్నారు. ఆవేదనలో మునిగిన రైతులకు న్యాయం జరిగేలా, బాధితులకు అండగా నిలిచేలా బిజెపి తెలంగాణ ‘రైతు సహాయ కేంద్రం’ హెల్ప్ లైన్ నంబర్ ను ప్రారంభించింది. హెల్ప్ లైన్ నంబర్ – 8886 100 097 ను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి జూలై 31న ప్రారంభించారు. దీంతో పాటు రుణాలు మాఫీ కాని బాధిత రైతులకు అండగా నిలుస్తూ ”ప్రశ్నిస్తున్న తెలంగాణ” పేరుతో పోస్టర్ విడుదల చేశారు. రుణమాఫీ అందని రైతుల వివరాలు సేకరించి, వారికి సాయం అందించడం ఈ కార్యక్రమం లక్ష్యం.
హెల్ప్ లైన్ నంబర్ ప్రారంభించిన సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి, ఆంక్షలు పెట్టి మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసి, రుణమాఫీ కాని అర్హులైన రైతులందరికీ అండగా నిలిచి న్యాయం జరిగేలా బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేశామన్నారు. రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరించి, గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాల ద్వారా రైతుల సమస్యలు తెలుసుకొని, రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ”గత శాసనసభ ఎన్నికల్లో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు రైతుల వద్దకు వెళ్లి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులు తీసుకున్న రూ.2 లక్షల వరకు రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతు డిక్లరేషన్ పేరుతో తెలంగాణ రైతులకు హామీలు గుప్పించారు. డిసెంబరు 9న సోనియమ్మ జన్మదినం సందర్భంగా రైతు రుణమాఫీ చేస్తామని నమ్మించి, రైతులెవరూ బ్యాంకులకు అప్పులు కట్టొద్దని, ఒకవేళ అప్పులు కడితే మళ్లీ రుణాలు తీసుకోండని రేవంత్ రెడ్డి రైతులకు వాగ్దానం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తోంది. ఇంతవరకు రైతు రుణమాఫీని పూర్తిగా ఎందుకు అమలు చేయలేదు..? ఏ రైతులకు, ఏ ప్రాతిపాదికన రుణాలు మాఫీ చేయబోతున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో అనేక మంది రైతులు రుణమాఫీ జరగకపోవడంతో బ్యాంకుల్లో డీఫాల్డర్ గా మారేలా ఉన్నారు. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో ఆందోళనలో మునిగిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో వాయిదాల పేరుతో కాలయాపన చేసింది. కోట్లాది రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పేరుతో ప్రకటనలు చేయిస్తోంది. కాని, రైతులకు న్యాయం జరగని పరిస్థితి. గ్రామస్థాయిలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తాం. రైతులకు న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం. కేంద్ర ప్రభుత్వం రైతులకు కిసాన్ సమ్మాన్ నిధులను నిర్ణీత సమయంలో అకౌంట్లలో జమ చేస్తోంది. కాని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ హామీని నెరవేర్చడం లేదు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం, కౌలు రైతులకు రూ.15,000 ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఏ ఒక్కటీ సరిగ్గా అమలు చేయలేదు. కాంగ్రెస్ 6 గ్యారంటీలలో వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పారు. వరి పంటలకు రూ.500 బోనస్ అన్నారు. సరిగ్గా ఇవ్వలేదు. అధికారం కోసం రైతులకు మోసపూరిత గ్యారంటీలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను దగా చేయడంలో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నేడు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఒక్కటే. గ్యారంటీల పేరుతో గారడీలు చేయడం, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేయడం కాంగ్రెస్ నైజం. రుణమాఫీపై రైతుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 6 గ్యారంటీలను 100 రోజుల్లోగా అమలు చేస్తామని సోనియా గాంధీ తన సంతకంతో కూడిన ఉత్తరాలు ప్రతి ఇంటికి పంపారు. కాని, ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేదు. రైతులు, యువత, బీసీలు, మైనారిటీలు, మహిళలకు.. అందరికీ వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ ప్రభుత్వం.
రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి నిధుల్లో కోతపెట్టి మోసం చేసింది. విద్యార్థుల సంక్షేమం కోసం 6 శాతం నుంచి 15 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చి, బడ్జెట్ లో అన్యాయం చేసింది. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విద్యారంగానికి 14 శాతానికి పైగా బడ్జెట్ కేటాయింపులు జరిపితే.. తెలంగాణలో మాత్రం 7.60 శాతం మాత్రమే కేటాయించింది. ధరణి పోర్టల్ తో భూములు కోల్పోయిన రైతుల సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పారు. మాటలు కోటలు దాటుతున్నాయి కాని, చేతలు మాత్రం సెక్రటేరియట్ దాటడం లేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక రైతులపై భారం పడకుండా పంటలపై మద్దతు ధరను రూ.1300 నుంచి రూ.2,300కు పెంచింది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.26 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తూ, రైతులకు అండగా నిలుస్తోంది. రైతులకు మద్దతు ధరతో పాటు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మరి ఏమైంది..? ఆడబిడ్డల వివాహానికి లక్ష రూపాలయ ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ కానుకగా తులం బంగారం ఇస్తామని హస్తం పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. ఇంతవరకు ఇవ్వలేదు. ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తామని చెప్పింది. ఇంతవరకు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలు, భూముల అమ్మకాలతోనే ఆదాయం పెంచుకోవాలని ఆలోచిస్తోంది తప్పితే ప్రజల ఆరోగ్యం, సంక్షేమం గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల పంట రుణమాఫీ, రైతు కూలీలకు రూ.12 వేలు, రైతులకు రూ.3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.” అని కిషన్ రెడ్డి అన్నారు.
అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి ప్రారంభించిన హెల్ప్ లైన్ నంబర్ కు విశేష స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఫోన్ చేసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కిసాన్ మోర్చా నేతలు ఈ రైతుల వివరాలు నోట్ చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ రుణాలు మాఫీ చేస్తానని ఓట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చాక తమను మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసపోయామని వాపోయారు. బిజెపితోనే రైతులందరికీ న్యాయం జరుగుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
రైతులందరికీ రుణ మాఫీ చేస్తున్నట్టుగా రేవంత్ సర్కార్ ప్రగల్భాలు పలుకుతుంటే వేలాది రైతులు రుణమాఫీ విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్లు చేస్తున్నారని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికల సమయంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా బేషరతుగా 2 లక్షల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ 567 పేరుతో అనేక ఆంక్షలు విధించి రైతులను రేవంత్ సర్కారు మోసం చేసిందని అన్నారు. జీవోలో పేర్కొన్న ఆంక్షలు కారణంగా 30 శాతం రైతులకు మాత్రమే రుణమాఫీ అమలయ్యే అవకాశం ఉందని, మిగతా రైతులకు ఈ ప్రభుత్వం మొండిచేయి చూపేందుకు ప్రయత్నం చేస్తున్నదని విచారం వ్యక్తం చేశారు. బిజెపి రైతు రచ్చబండ పేరుతో గ్రామాల వారీగా బాధిత రైతుల నుండి బిజెపి నాయకులు ఫిర్యాదులను స్వీకరిస్తారని తెలిపారు.
రైతులకు మనోధైర్యం కలిగించాలి
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన రైతు సహాయ కేంద్రం(హెల్ప్ లైన్)ను ఆగస్ట్ 4న బిజెపి జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్ జీ సందర్శించారు. ప్రజల నుండి వస్తున్న విజ్ఞప్తులకు సహాయ కేంద్రంలోని ప్రతినిధులు విజ్ఞతతో సమాధానం చెప్పాలని, బాధిత రైతులకు మనోధైర్యం కలిగించేలా ఉండాలని ఆయన సూచించారు. రైతులకు రుణమాఫీ అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి పార్టీ తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు రైతులకు వివరించాలని తెలిపారు.