సభ్యత్వ పర్వానికి బిజెపి శ్రీకారం
భారతీయ జనతా పార్టీ సభ్యత్వ పర్వానికి శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన బిజెపి సభ్యత్వం పునరుద్ధరించుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే ముందస్తు సన్నాహాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆగస్ట్ 17న దిల్లీలో జాతీయ స్థాయి కార్యశాల నిర్వహించి రాష్ట్ర నాయకత్వానికి మార్గదర్శనం చేశారు. ఆగస్ట్ 21న హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి కార్యశాల నిర్వహించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా, మండల స్థాయిలోనూ కార్యశాలలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి కార్యకర్తకు సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పిస్తున్నారు.
బిజెపి భిన్నమైన పార్టీ. ఒక నాయకుడి కోసమో, ఒక కుటుంబం కోసమో పని చేయదు… దేశం కోసం పని చేస్తుంది, దేశ ప్రజల కోసం పని చేస్తుంది. దేశం కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలున్న పార్టీ బిజెపి. కార్యకర్తల త్యాగాలు, పోరాటాలు, నిర్విరామ సేవలు బిజెపి శక్తికి, బలానికి పునాదులు. క్రమశిక్షణ, దృఢసంకల్పం, పరస్పర విశ్వాసం బిజెపి పని విధానానికి గీటురాయి. ఒక సామాన్య కార్యకర్తను రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు, ప్రధానమంత్రిని చేసే పార్టీ బిజెపి. ప్రధాని నరేంద్ర మోదీ, దివంగత మాజీ ప్రధాని వాజ్ పేయి సహా ఎంతో మంది మహా నేతలు ఒక సాధారణ కార్యకర్తగానే పార్టీ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. నాయకులను తయారు చేయాలంటే కార్యకర్తలు కావాలి. పార్టీ కార్యకర్తలను తయారు చేయాలంటే సభ్యత్వం కీలకం. అందుకే బిజెపి క్రమం తప్పకండా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతుంది.
‘వికసిత్ భారత్ @ 2047’ అంటే 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం సాధించాలనేది మోదీ ప్రభుత్వం లక్ష్యం మాత్రమే కాదు, బిజెపి లక్ష్యం కూడా. బిజెపి భావజాలాన్ని, సిద్ధాంతాలను, వికసిత్ భారత్ లక్ష్యానికి ప్రజలను అనుసంధానం చేయాలి. ఇందుకు జాతీయ స్థాయి నుంచి ప్రతి రాష్ట్రం, నగరం, గ్రామం, బూత్ స్థాయి వరకు పార్టీ విస్తరించాలి. సమాజంలో ప్రతి వర్గాన్ని చేరుకోవాలి. అందుకే బిజెపి సభ్యత్వ నమోదుకు అత్యంత ప్రాధాన్యతినిస్తోంది. బిజెపికి సభ్యత్వ నమోదు అనేది ఒక కార్యక్రమం కాదు, ఒక పండుగ. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు ప్రతి బిజెపి కార్యకర్త ఇందులో ఉత్సాహంగా పాల్గొంటారు.
ఈసారి బిజెపి 10 కోట్లకు పైగా కొత్త సభ్యులను చేర్చుకోవాలని, ప్రతి బూత్ నుంచి 200 మంది పార్టీ సభ్యులు ఉండాలని లక్ష్యం నిర్దేశించుకుంది. బిజెపి సభ్యత్వం తీసుకునేందుకు 4 మార్గాలు ఉన్నాయి. అవి 1) 88 00 00 2024 కు మిస్డ్ కాల్, 2) నమో యాప్/ వెబ్ సైట్, 3) QR కోడ్, 4) మెంబర్షిప్ ఫాం. ఈ సభ్యత్వ నమోదు రెండు దశల్లో అమలవుతుంది. సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు ప్రాథమిక సభ్యత్వం, అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 31 వరకు క్రియాశీల సభ్యత్వంపై డ్రైవ్ కొనసాగుతుంది. ఆసక్తి ఉన్న వ్యక్తులు పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకునేందుకు 88 00 00 2024 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. మిస్డ్ కాల్ ఇచ్చిన తర్వాత SMS లింక్ ద్వారా ఫోన్ కు ఒక ఫారం వస్తుంది. 5 ఫీల్డులున్న ఈ మెంబర్షిప్ ఫారంను నింపాలి. ఈ ఫారం నేరుగా నమో యాప్ / వెబ్ సైట్ లోనూ నింపవచ్చు. ఈ ఫారం నింపిన తర్వాత సభ్యత్వ కార్డు జనరేట్ అవుతుంది, సదరు వ్యక్తి పార్టీ ప్రాథమిక సభ్యుడవుతారు. నెట్ వర్క్, సిగ్నల్ వంటి సమస్యలుంటే పేపర్ ఫారం నింపి కూడా సభ్యత్వం పొందవచ్చు.
2014లోనే బిజెపి ఆన్ లైన్ సభ్యత్వం ప్రారంభించింది. అప్పుడు చేపట్టిన డ్రైవ్ లో 11 కోట్లకు పైగా సభ్యత్వం పొంది ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బిజెపి అవతరించింది. అప్పుడు తెలంగాణ నుంచి 11,13,553 మంది సభ్యత్వం తీసుకున్నారు. 2019 డ్రైవ్ లో సభ్యత్వ నమోదు కోసం మిస్డ్ కాల్ నెంబర్, నమో యాప్ ప్రవేశపెట్టారు. అప్పుడు తెలంగాణ నుంచి 11,87,259 మంది సభ్యత్వం తీసుకున్నారు. ఈసారి అదనంగా QR కోడ్ అందుబాటులోకి తెచ్చారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు దేశవ్యాప్తంగా కియోస్క్ లు ఏర్పాటు చేయనున్నారు. ఈ కియోస్కులలో బిజెపి కార్యకర్తలు అందుబాటులో ఉండి సభ్యత్వ నమోదు ఎలా చేయాలో దగ్గరుండి వివరిస్తారు.
సభ్యత్వ నమోదు డ్రైవ్ కోసం పార్టీ జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి వరకు కమిటీలు నియమించింది. శక్తికేంద్రంలో ‘సదస్యతా సహయోగి’ అనే సభ్యత్వ సమన్వయకర్తను నియమించనున్నారు. మోర్చాలు, సెల్స్ కూడా ఈ సభ్యత్వ నమోదులో పాల్గొంటాయి. ఈ డ్రైవ్ లో భాగంగా ప్రతి ఆదివారాన్ని అటల్ సభ్వత్వ పర్వంగా జరుపుకోవాలని పార్టీ నిర్ణయించింది. అటల్ బిహారీ వాజ్ పేయి 100వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళిగా దీనిని చేపడుతోంది.
పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం 50 మంది సభ్యులను పార్టీలో చేర్పించిన కార్యకర్తలను క్రియాశీల సభ్యులుగా గుర్తిస్తారు. వీరు నమో యాప్ ద్వారా పార్టీకి నిర్దేశించిన మొత్తం డిపాజిట్ చేసి ధృవీకరణ ఐడీ పొందాలి. ఈ ఐడీతో పాటు క్రియాశీల సభ్యత్వ ఫారాన్ని మండల లేదా జిల్లా పార్టీకి సమర్పించాలి. ఈ ఫారాలను జిల్లా క్రియాశీల సభ్యత్వ సమీక్ష కమిటీ తనిఖీ చేసి, క్రియాశీల సభ్యత్వాన్ని ధృవీకరిస్తుంది. ప్రతి బూత్ నుంచి కనీసం ఒక క్రియాశీల సభ్యుడు నమోదు కావాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.
తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చేలా కృషి చేద్దాం: కిషన్ రెడ్డి
సభ్యత్వ నమోదు కోసం ఆగస్ట్ 21న హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యశాలలో రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బోగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్, బిజెపి జాతీయ కార్యదర్శి విజయ్ రాహత్కర్, అభయ్ పాటిల్, శాసనసభ బిజెపి పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, శాసనమండలి బిజెపి పక్ష నేత ఏవీఎన్ రెడ్డి తదితరులు పాల్గొని విలువైన సూచనలు ఇచ్చారు.
ఈ కార్యశాలలో జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘బిజెపి అంటే కుటుంబాలు, వ్యక్తుల కోసం పని చేసేది కాదు.. దేశం కోసం, సమాజం కోసం పని చేసేది. కార్యకర్తల ఆధారంగా, సిద్ధాంతాల ఆధారంగా పనిచేసే పార్టీ బిజెపి. దేశంలో వ్యక్తులు, కుటుంబాల ఆధారంగా పని చేస్తున్న కొన్ని పార్టీలు ఇష్టారాజ్యంగా చలామణి అవుతూ అవినీతికి పాల్పడుతున్నాయి. జనసంఘ్, ఆ తర్వాత బిజెపి ఆవిర్భావం నుంచి పార్టీ నియమావళి ప్రకారం పార్టీ సభ్యత్వ సేకరణ చేసుకుంటున్నాం. పోలింగ్ బూత్‌లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంలో సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని ఉద్యమరీతిలో కొనసాగిస్తున్నాం. భారతదేశంలో అత్యధిక సభ్యత్వాలు కలిగిన పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించింది. తెలంగాణలో కూడా సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అపూర్వ రీతిలో ప్రజల నుంచి మద్దతు కూడగట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ మరింత బలపడేలా సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. రాష్ట్రంలోని పార్టీని నంబర్ 1 గా తీసుకెళ్లేలా పోలింగ్ బూత్ స్థాయి నుంచి సభ్యత్వ సేకరణ కార్యక్రమం నిర్వహించుకోవాలి.
రాజకీయాల్లో పోటీతత్వం పెరిగినప్పటికీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 77 లక్షల ఓట్లు (సుమారు 36 శాతం) భారతీయ జనతా పార్టీకి వచ్చాయి. తెలంగాణ నుంచి 8 లోక్ సభ స్థానాలు గెలుచుకుని, దేశంలో అధికారంలోకి చేపట్టేలా భాగస్వామ్యం అయ్యాం. రానున్న కాలంలో తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలందరం కృషి చేయాలి. రెట్టింపు ఉత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి.
తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి, ఇచ్చిన హామీలకు తూట్లు పొడుస్తున్న పార్టీ కాంగ్రెస్. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, యువ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ పేరిట అనేక హామీలతో మభ్యపెట్టి, దేవుళ్లపై ఒట్లు పెట్టి అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా మోసం చేశారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ 50 శాతం కూడా పూర్తి కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తూతూ మంత్రంగా రుణమాఫీ చేసి చేతులు దులుపుకొంది. తెలంగాణలో రుణమాఫీ, రైతు భరోసా దక్కకుండా కాంగ్రెస్ చేతిలో మోసపోయిన రైతులకు అండగా నిలిచి న్యాయం చేసేలా ఉద్యమ తరహాలో గ్రామ స్థాయిలో బిజెపి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టాం. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు అధికారంలో ఉండి నియంతృత్వ పాలన కొనసాగించింది. బీఆర్ఎస్ తీరుగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన చేస్తున్నది. భారతీయ జనతా పార్టీకి చెందిన అన్ని మోర్చాల ఆధ్వర్యంలో మహిళలు, యువత, రైతులు, ఎస్సీ-ఎస్టీ వర్గాల ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర విమోచన 75 సంవత్సరాల వేడుకల్లో భాగంగా సెప్టెంబరు 17న హైదరాబాద్ విముక్తి దినోత్సవాన్ని నిర్వహించుకుందాం. రానున్న రోజుల్లో జిల్లాలు, మండలాలు, పోలింగ్ బూత్ ల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకుని, అన్ని వర్గాల ప్రజలను సభ్యులుగా చేర్చుకుని, చురుకుగా పని చేస్తూ పార్టీని మరింత బలోపేతం దిశగా ముందుకు తీసుకెళ్లాలి. సభ్యత్వ నమోదు కార్యక్రమం తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చే సాధనంగా ఉండేలా కార్యచరణ రూపొందించుకుందాం.’’ అని అన్నారు.