సాగు చేసుకుంటున్న గిరిజనులకే భూములు
సాగు చేసుకుంటున్న గిరిజనులకే భూములు దక్కాలని మెదక్ ఎంపీ రఘు నందన్ రావు అన్నారు. అమాయక గిరిజనులకు అన్యాయం చేస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు. సాగు చేసుకుంటున్న బిలా దాఖలా భూములను అక్రమ పద్ధతిలో ఇన్వెస్టర్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. వెంటనే ఈ ప్రొసీడింగ్స్ ఆపాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని వివాదాస్పద భూముల వద్ద వెలిమెల, కొండకల్ తండా వాసులతో కలిసి ఆయన జనవరి 17న ధర్నా నిర్వహించారు. సంగారెడ్డి కలెక్టర్, ఎస్పీ వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. సాయంత్రం వరకు ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. దీంతో బీడీఎల్ భానూర్ పోలీసులు రఘునందన్ రావును అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు, బిజెపి కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ “గిరిజనులకు న్యాయం జరిగేదాకా పోరాడుతాం. పోలీసులు, బౌన్సర్లను పెట్టి కట్టిన గోడలను అధికారులే తొలగించాలి. లేదంటే గ్రామస్తులతో కలిసి గోడలు కూల్చేస్తాం. గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలి. భూముల వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకోవద్దని హైకోర్టు ఆదేశాలున్నా పట్టించుకోవడం లేదు” అని రఘునందన్ రావు మండిపడ్డారు
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తరువాత ఒక్క రంగు పోయి మూడు రంగులు వచ్చాయి తప్పా ఏం మార్పు రాలేదని ఆయన విమర్శించారు. కొందరు అమాత్యులు భాగ్యనగరం చుట్టూ ఉన్న భూములపై కన్నేశారని, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోని శంకర్ పల్లి, రామచంద్రాపురం మండలాల మధ్యలో ఒక భూ వివాదం చాలా రోజులుగా కొనసాగుతుందని చెప్పారు. వెలిమల గ్రామ శివారులో 429 ఎకరాల భూమిని దున్నుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగారని, అందులో 180 ఎకరాల భూమి వివిధ పరిశ్రమలకు ఏపీఐఐసీకి కేటాయించారని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన భూసామి కేవీ నర్సింహా రెడ్డి 1979లో సీలింగ్ చట్టం కింద ప్రభుత్వానికి ఇచ్చారని, 429 ఎకరాల్లో చివరకు 85 ఎకరాలు మిగిలిందని మండిపడ్డారు. 2009లో మొదలైన భూ పంచాయితీ ఇంకా కొనసాగుతుందని చెప్పారు. 2023లో సెక్షన్ 87 ప్రకారం క్లరికల్ ఎర్రర్స్ జరిగినప్పుడు రెండు సంవత్సరాలో సరిచేయవచ్చని, ప్రభుత్వ భూమిని మార్చడం క్లరికల్ ఎర్రర్ కాదని స్పష్టంగా ఉత్తర్వులు ఉన్నప్పటికీ కలెక్టర్ తెలివితో రిపోర్ట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1954లో తప్పు జరిగిందని శిల్పా రెడ్డి, రోహిణి రెడ్డి, నిత్యానందరెడ్డి ఆ భూమి తమకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. గిరిజనుల మీద 17 కేసులు పెట్టారని, ఊర్లో ఎవరూ ఉండకుండా ఖాళీ చేయించి 85 ఎకరాలు పోలీసుల రక్షణలో కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. సుమారు రూ.1200 కోట్ల విలువైన భూమి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని, 85 ఎకరాలు ప్రైవేటు కంపెనీకి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఏ మంత్రి ఈ కబ్జాకు సహకరిస్తున్నారో ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అరబిందో, అపర్ణ సంస్థల పేర్లు పహానీలో రాసే ప్రయత్నం చేస్తున్నారని, సీసీఎల్ఎకు పెట్టిన దరఖాస్తులో నిత్యానంద రెడ్డి పేరు ఉందని తెలిపారు. కబ్జాలో ఉన్న గిరిజనులకు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.