సికింద్రాబాద్ – గోవా డైరెక్ట్ ట్రెయిన్ ప్రారంభం
కేంద్ర ప్రభుత్వం నవరాత్రుల కానుకగా సికింద్రాబాద్ నుంచి గోవాకు బై-వీక్లీ రైలును ప్రవేశపెట్టింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అక్టోబర్ 6న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పచ్చ జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. ఇప్పటివరకు సికింద్రాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు డైరెక్ట్ ట్రెయిన్ ఉండేది కాదు. కనెక్టింగ్ ట్రెయిన్ అయినా సికింద్రాబాద్-గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లేవి. చాలా మంది సీట్లు దొరక్క ఇబ్బందులు పడేవారు. ఈ విషయాన్ని కిషన్ రెడ్డి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లి, సికింద్రాబాద్-గోవా మధ్య డైరెక్ట్ ట్రెయిన్ ప్రవేశపెట్టాలని కోరారు. కిషన్ రెడ్డి వినతికి సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి కొత్త రైలును ప్రకటించారు. దీంతో సికింద్రాబాద్-గోవా మధ్య డైరెక్ట్ రైలు లేదన్న కొరత తీరిపోయింది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరీ ముఖ్యంగా గోవా పర్యాటకులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ బైవీక్లీ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. వాస్కోడగామా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణం అవుతుంది. సికింద్రాబాద్ లో ప్రారంభమయ్యే ఈ రైలు కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ.. వాస్కోడగామా చేరుకుంటుంది.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘తెలంగాణలో రైల్వేలకు సంబంధించి గత పదేళ్లలో.. చాలా సానుకూలమైన పని జరిగింది. కొత్త రైల్వే లైన్లు, విద్యుదీకరణ, డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. మిగిలిన చోట్ల పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. దక్షిణమధ్య రైల్వే పరిధిలో విద్యుదీకరణ దాదాపుగా పూర్తయింది. వందకు పైగా రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పించాం. సికింద్రాబాద్ (రూ.715 కోట్లు), కాచిగూడ (రూ.425 కోట్లు), నాంపల్లి (రూ.429 కోట్లు) స్టేషన్ల ఆధునీకరణ, అత్యాధునిక వసతులతో రూ. 415 కోట్లతో చర్లపల్లి టర్మినల్ అభివృద్ధి జరుగుతోంది. 40కి పైగా రైల్వేస్టేషన్లను ఆధునిక వసతులతో (దాదాపు రూ.2,220 కోట్లు) తీర్చిదిద్దుతున్నాం.
దేశవ్యాప్తంగా దిల్లీ తర్వాత అత్యధికంగా (5) వందేభారత్ రైళ్లు మన సికింద్రాబాద్ నుంచి వెళ్తుండటం.. తెలంగాణలో ప్రయాణికుల సౌకర్యానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. ఈ వందేభారత్ రైళ్లు 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇవే కాకుండా.. పలు కొత్త రైల్వే మార్గాలకు సర్వేకు కూడా మార్గం సుగమం అయింది. రూ.521 కోట్లతో కాజీపేటలో ప్రతిష్టాత్మకంగా రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ (RMU)ను కేంద్రం ఏర్పాటు చేయనుంది. మొదట్లో దీన్ని పీరియాడిక్ ఓవర్ హాలింగ్ గానే అనుకున్నప్పటికీ.. మోదీ చొరవ తీసుకుని RMUగా అప్‌గ్రేడ్ చేయించారు. ఇక్కడ వ్యాగన్ల ఓవర్ హోలింగ్‌తో పాటుగా.. కోచ్ లు, ఇంజన్స్, వ్యాగన్స్ తయారవుతాయి. దీని ద్వారా 3వేల మందికి ప్రత్యక్షంగా మరెంతో మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.’’ అని అన్నారు.
వివిధ రాష్ట్రాలలో 900 కిలోమీటర్ల మేర రైల్ నెట్ వర్క్ ను విస్తరించేలా రూ.24,600 కోట్ల విలువైన 8 నూతన రైల్వే లైన్ ప్రాజెక్టులు ప్రారంభించామని తెలిపారు. ఇందులో తెలంగాణ నుంచి రూ. 4,109 కోట్ల అంచనా వ్యయంతో భద్రాచలం-మల్కాన్‌గిరి మధ్య 173 కి.మీ.ల ప్రాజెక్టుకు కూడా ఆమోదముద్ర పడిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. జహీరాబాద్ లో రూ.2,361 కోట్లతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపిందన్నారు. రూ. 10,000 కోట్ల పెట్టుబడులతో పాటు లక్షా 74 వేల ఉద్యోగాల కల్పన ఈ ప్రాజెక్టుతో సాధ్యం కానుందన్నారు. హైదరాబాద్-నాగ్‌పూర్ మధ్య రూ.6,661 కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని తెలిపారు. దీని ద్వారా.. ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధితో పాటు పెద్దమొత్తంలో ఉపాధి కల్పనకు బాటలు పడతాయని కిషన్ రెడ్డి అన్నారు.