gram panchayat

స్థానిక సంస్థల ఎన్నికలకు జంకుతున్న రేవంత్ రెడ్డి

ఫిబ్రవరి మధ్యలో షెడ్యూల్ ప్రకటిస్తారనుకున్న స్థానిక సంస్థల ఎన్నికలను రెండోసారి కులగణన జరిపే పేరుతో వాయిదా వేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్దపడింది. దానితో ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సాకుగా చూపిస్తూ ఎన్నికలకు వెనుకడుగు వేస్తున్నారు. అయితే, బీసీ రిజర్వేషన్ల పెంపునకు మార్చిలో కేబినెట్ ఆమోదం పొందిన అనంతరం అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేయాల్సి ఉంటుంది. మార్చిలో జరిగే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీసీ బిల్లు పెట్టాలి. అయితే, అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందినంత మాత్రాన రిజర్వేషన్లకు చట్టబద్దత లభించదు. అందుకు పార్లమెంట్‌లో కూడా రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే కేంద్ర బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ముగిసే నాటికి పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడతాయి. తిరిగి వర్షాకాల సమావేశాల సందర్భంగానే పార్లమెంట్ సమావేశం కానున్నది. ఆ సమావేశాలు 6 నెలల వ్యవధి తర్వాత జూలై, సెప్టెంబర్ మధ్యన జరుగనున్నాయి. ఒకవేళ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించాలంటే అప్పటిదాకా ఆగాల్సిందే. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం ఇలాంటి అనేక సాంకేతిక సమస్యలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తోంది.

బీసీల పేరుతో ముస్లింలకు సైతం రేజర్వేషన్లు కల్పించే ప్రయత్నాలను అడ్డుకుంటామని బిజెపి నేతలు స్పష్టం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న బీసీ కులగణనలో పలు ముస్లిం వర్గాలను కూడా చేరుస్తున్నారు. ఈ విషయమై వివాదం చెలరేగే అవకాశం ఉంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతాయని తెలిసినప్పటికీ రిజర్వేషన్ల ఆమోదానికి సాంకేతిక కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తూ వస్తోంది. ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేకనే ఈ విధంగా చేస్తున్నారని స్పష్టం అవుతుంది. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క దృష్టికి తీసుకురాగా, ఆయన కూడా ఆ విషయాన్ని ధృవీకరించారు. కొంతకాలం పాటు ఆర్థిక నష్టాన్ని కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ కారణాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసి ఇప్పటికే ఏడాది పూర్తయినప్పటికీ కనీసం మరో ఆరు నెలలైనా ఆగక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. 

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఈ మేరకు ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపింది. దీంతో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్‌ఈసీ సిద్ధమవుతున్న సమయంలో మళ్లీ కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం తెరపైకి తీసుకు రావడం ద్వారా ఎన్నికలను వాయిదా వేస్తున్నారు. ఎన్నికల వాగ్ధానాలను అమలు పరచకపోవడంతో ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత మూటగట్టుకోవడం, మరోవంక, ఎటువంటి చిన్న పని చేయడానికైనా ప్రభుత్వం నిధులు లేక అల్లాడిపోతూ ఉండడంతో పాలనా యంత్రాంగం స్తంభించి పోయిన పరిస్థితులు నెలకొన్నాయి. కులగణనలో బీసీ జనాభా తగ్గినట్లు చూపడం ఆ వర్గాలలో అసంతృప్తికి దారితీస్తుంది. మంత్రుల మధ్య సమన్వయం లోపించడం, పార్టీ ఎమ్యెల్యేలే పలువురు ప్రభుత్వం పనితీరు పట్ల బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం, నియోజకవర్గాల అభివృద్ధి నిధులు కేటాయించక పోవడంతో ప్రజలలోకి వెళ్లలేక పోతున్నామని చేతులు ఎత్తేస్తూ ఉండడంతో ఎన్నికలను ఎదుర్కొనే సాహసం చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. 

కృష్ణచైతన్య