spreading lies

తప్పుడు కథనాలనే నమ్ముకుంటున్న కాంగ్రెస్

జూన్ 4, 2024న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ అసత్య కథనాలను ప్రచారం చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇటీవల ముగిసిన ఎన్నికలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బిజెపి ‘ఓడిపోయాయని’ దేశ ప్రజలను, ప్రపంచాన్ని నమ్మించేందుకు చాలా కష్టపడుతున్నాయి. ఈసారి ఈవీఎంలపై గగ్గోలును పక్కనబెట్టి ప్రతిపక్షాల ఊహాజనిత విజయం కథనాలతో కాంగ్రెస్ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోంది. తన ఆశయాలు, విధానాల విషయంలో ప్రజలను నమ్మించడంలో నిరంతరం విఫలమవుతూ వచ్చిన పార్టీ ప్రజల్లో అయోమయంలో సృష్టించేందుకు మాత్రం సిద్ధమైంది.

కాంగ్రెస్, దాని అనుకూల వర్గాలు చేస్తున్న ఈ పనికి సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, టీఎంసీ, ఇతర చిన్న పార్టీలతో కూడిన ఇండీ కూటమి కూడా తమ వంతు సహాయం అందిస్తున్నాయి. ప్రజల దృష్టిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టను దిగజార్చడం, కేంద్రంలోని బిజెపి-ఎన్‌డిఎ ప్రభుత్వం గత పదేళ్లుగా సాధించిన విజయాలను కించపరచడం, పార్లమెంట్‌ ఉభయ సభల్లో కార్యకలాపాలను భగ్నం చేయడానికి తమ బలాన్ని పెంచుకోవడమే వారి ప్రధాన ఎజెండా. ఈ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి తప్పుడు కథనాలను, దుష్ప్రచారాలను సృష్టించి వాటిని చాలా ముమ్మరంగా అమలు చేస్తున్నారు. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంత ప్రతికూల ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ వరుసగా మూడోసారి లోక్‌సభలో మూడంకెల స్థాయి సీట్లను చేరుకోలేకపోయింది. మరోవైపు గత ఎన్నికలతో పోలిస్తే బిజెపి 63 సీట్లు కోల్పోయినా కాంగ్రెస్ కంటే ఒకటిన్నర రెట్లు అధికంగా, 240 సీట్లు సాధించగలిగింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఓటింగ్ శాతం దాదాపు 20 శాతం నుంచి 21 శాతానికి పెరిగింది. అఖిల భారత స్థాయిలో బిజెపి ఓట్ల శాతం 37 శాతం నుంచి 36 శాతానికి తగ్గింది. ఎన్డీయే కావలసిన మెజారిటీ కంటే ఎక్కువ, అంటే 293 సీట్లు సాధించింది. వాస్తవంగా సభలో దాదాపు 300 సీట్ల బలాన్ని కలిగి ఉంది. ఇండీ కూటమి 234 సీట్లు గెలుచుకుంది. వాస్తవంగా దాదాపు 240 సీట్లు కలిగి ఉండొచ్చు.

జాతీయ ఎన్నికల్లో కాంగ్రెస్ 250 సీట్లు సాధించలేకపోవడం వరుసగా ఇది పదోసారి. అయితే, 2024 ఎన్నికలు ఆ పార్టీ 1951 తర్వాత అధ్వాన్నమైన పనితీరు సాధించిన ఎన్నికల్లో వరుసగా మూడోవి. దీనితో పోలిస్తే, 2024 తీర్పు బిజెపి ఆవిర్భావం నుంచి సాధించిన మూడో అత్యుత్తమ విజయం. బిజెపి అంచనాలకు, ఆశలకు తగ్గ ఫలితాలు రాని మాట నిజమే. బిజెపి తనకు 350కి పైగా సీట్లు, ఎన్‌డీఏకు 400 సీట్లు లక్ష్యంగా పెట్టుకోగా ఇవి దాదాపు 50-100 సీట్లు తగ్గాయి. లోక్‌సభలో తమకు పెరిగిన సీట్ల సంఖ్య తమ ‘విజయం’, బిజెపి ‘పరాజయం‘ అని ప్రతిపక్షం జబ్బలు చరుచుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఉద్దేశించిన ఒక బూటకపు కథనం. ప్రభుత్వంపై కాంగ్రెస్, దేశవిదేశాల్లోని కొన్ని శక్తులు ప్రభుత్వంపై చేసిన తప్పుడు ప్రచారం, రాజ్యాంగాన్ని సవరిస్తారని, బడుగు వర్గాల రిజర్వేషన్లను రద్దు చేస్తారని వారు చేసిన దుష్ప్రచారాలు ఎన్నికల్లో ప్రభావం చూపాయి.

మైనారిటీ వర్గాల ఓట్లను రాబట్టే లక్ష్యంతో ప్రతిపక్షాల ద్వారా సనాతన ధర్మం, హిందూ విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి కూడా తీవ్రమైన ప్రయత్నం జరిగింది. అయినా బిజెపిని, మోదీని ఓడించాలనే వారి లక్ష్యం నెరవేరలేదు. ప్రధాన మంత్రి మోదీ ఇప్పటికే రెండు పదవీకాలాలు పూర్తి చేసుకున్నందున ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడుతుందని, అంతర్గతంగా కూడా మోదీని మార్చాలనే ఒత్తిడి పెరుగుతుందని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు, బిజెపి వ్యతిరేక శక్తులు భావించాయి. ప్రతిపక్షాలు, వారికి మద్దతు ఇచ్చే వ్యవస్థలు, దేశంలో, వెలుపల ఉన్న వామపక్ష-ఉదారవాద వర్గాలు, అమెరికా, యూరప్‌లో పని చేస్తున్న భారతదేశ వ్యతిరేక బడా లాబీయిస్టులు, పాకిస్తాన్‌లోని కొంతమంది ప్రముఖ భారత వ్యతిరేక రాజకీయ నాయకులు కూడా ఈ కథనాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అంటే ఇటీవల ఎన్నికలు ‘మోదీ వర్సెస్ అందరూ’ అన్నమాట. గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకత్వాలు విపరీతమైన ప్రభుత్వ వ్యతిరేకత, తిరుగుబాటును ఎదుర్కుంటున్నప్పటికీ ప్రధానమంత్రి మోదీ దృఢ సంకల్పంతో, నిశ్చల దృక్పథంతో గట్టిగా నిలబడ్డారు. 1962 తర్వాత మూడోసారి అధికారంలోకి వచ్చి అరుదైన ఘనత సాధించిన సందర్భంగా ఆయనకు ప్రపంచ నాయకులు, ప్రముఖుల నుంచి వందల కొద్దీ అభినందన సందేశాలు వచ్చాయి. కానీ దేశంలోని ప్రతిపక్ష నేతలు మాత్రం కనీసం మర్యాద కోసమైనా ఆయనను అభినందించలేదు. ప్రధానమంత్రి మోదీ ‘నైతికంగా ఓడిపోయారని’ పేర్కొంటూ వారు తమ ద్వేషాన్ని, కోపాన్ని, అసూయను నిరంతరం వ్యక్తం చేశారు. వారు పార్లమెంటు మొదటి సమావేశంలో తమ నిరాశా నిస్పృహలను బాహాటంగా ప్రదర్శించారు.

2024 సార్వత్రిక ఎన్నికలు 2017లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను గుర్తుకు తెస్తున్నాయి. ఆ సమయంలో దేశం, వెలుపల అన్ని రకాల భారత వ్యతిరేక శక్తులు గుజరాత్‌లో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించడంపై దృష్టి సారించాయి. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి పదవిని ఖాళీ చేసి 2014 నుంచి కేంద్రంలో ఉన్నందున, 20 ఏళ్ళ బిజెపి ప్రభుత్వాన్ని ఓడించేందుకు ఈ మోదీ వ్యతిరేకులు ఇదే ఉత్తమ అవకాశంగా భావించారు. రాష్ట్రవ్యాప్తంగా కుల ఆధారిత హింసాత్మక ఆందోళనలను, రైతులచే ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను రెచ్చగొట్టారు. పాటిదార్ల ఆందోళనను, ‘ప్రజల ఆకాంక్షలు’ అనే వాటిని అణచి వేసిందని ఆరోపిస్తూ బిజెపి, దాని నాయకత్వాలపై పెద్దఎత్తున మీడియాలో దుష్ప్రచారం చేసేందుకు ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలోనూ తప్పుడు కథనాలు సృష్టించేందుకు ఒక అమెరికన్ మీడియా ఏజెన్సీని నియమించారు. అయితే, బిజెపి తన శక్తులన్నిటినీ కేంద్రీకరించి 98 సీట్లు, మెజారిటీ కంటే ఆరు సీట్లు ఎక్కువ సాధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఆ తర్వాత అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుని బూటకపు కథనాలకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పని చేసింది. సమాజంలోని అర్హులైన, పేద వర్గాలకు సహాయం అందించడానికి ప్రభుత్వం ద్వారా అనేక చర్యలు తీసుకోవడంతో పాటు పార్టీలో సంస్థాగతంగా పలు మార్పులు తెచ్చింది.

ఆ విధంగా 2022 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి నాల్గింట మూడు వంతుల మెజారిటీతో చారిత్రాత్మక విజయం సాధించి కాంగ్రెస్‌ను దారుణంగా ఓడించింది. అదే సమయంలో తప్పుడు కథనాలను ప్రజలు ఎల్లప్పుడూ నమ్మబోరని, అవి ఎల్లప్పుడూ ఫలితాలు అందిస్తూ పోవన్న బలమైన సందేశాన్ని బిజెపి అందించింది. గత నెల రోజులుగా విపక్ష నేతలు చేస్తున్న మీడియా ప్రకటనలు, ప్రవర్తన, ప్రసంగాలు చూస్తుంటే వారు ఇంకా ఎన్నికల ప్రచారంలోనే ఉన్నారనిపిస్తుంది. వారు వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు. వారిలో కొందరు ఎన్డీయేలోని విభేదాలపై కూడా దృష్టి సారించారు. ఎన్డీయే పక్షాల మధ్య విభేదాల కోసం తమ ఆతృతను బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రతిపక్ష నాయకులు చేసిన ప్రసంగాలు, పార్లమెంటులో వారి ప్రవర్తన చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి లోపల, వెలుపల అడ్డంకులు సృష్టించే వారి కుట్రను బహిర్గతం చేస్తున్నాయి.

పార్లమెంటులో ప్రతిపక్ష నాయకులు, ముఖ్యంగా లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాలు బాధ్యతారాహిత్యమైన, అహేతుకమైన అంశాలతో నిండి ఉన్నాయి. ప్రతిపక్ష నేత మళ్లీ తన ప్రసంగంలో తప్పుడు కథనాలు, అవాస్తవాలు ప్రచారం చేయడం, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడడం, సభాపతిని, ప్రధానిని అగౌరవపరచడం గురించి ఇతర పార్లమెంటు సభ్యుల నుంచి తీవ్ర అభ్యంతరాలు, నోటీసులు వచ్చాయి. రాహుల్ గాంధీ ప్రసంగంలోని కొన్ని భాగాలను రికార్డుల నుండి తొలగించాలని స్పీకర్ ఆదేశించవలసి వచ్చింది.

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ ప్రసంగాన్ని ప్రధాని మోదీ శ్రద్ధగా వినగా రాహుల్ మాత్రం ప్రధాని ముగింపు ప్రసంగం సమయంలో తన పార్టీ సభ్యులను, ఇతర ప్రతిపక్ష సభ్యులను సభా వేదిక వద్దకు వచ్చి రభస చేయమని ప్రేరేపించడం గమనార్హం. ప్రధానమంత్రి ప్రసంగం సందర్భంగా ఆయన ఈలలు వేస్తూ కనిపించారు. ఇప్పటి వరకు ఇటువంటి సన్నివేశాన్ని మనం చూడలేదు. ప్రధాని మోదీ తన ప్రసంగంలో రాహుల్ గాంధీని ఉద్దేశించి పదేపదే ‘బాలక్-బుద్ది’ (పిల్ల చేష్టలు) అని చెప్పిన మాటలు దేశానికి తగిన సందేశాన్ని పంపాయి. ఆయన మాటల్లో వీసమెత్తు అసత్యం లేదు. రాహుల్ గాంధీ చెప్పిన అబద్ధాలను, తప్పుడు కథనాలను, సనాతన విశ్వాసాలకు వ్యతిరేకంగా ఆయన చేసిన ప్రచారాన్ని ప్రధాని తన ప్రసంగంలో చీల్చి చెండాడారు.

వాస్తవానికి, ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ తప్పుడు కథనాల వల్ల కలిగే ప్రయోజనాల ‘రుచి’ మరిగాయి. తాము చేసిన తప్పుడు ప్రచారాల కారణంగానే బిజెపికి సీట్లు తగ్గాయని నమ్ముతున్న కాంగ్రెస్ అదే పంథాను అనుసరించాలని భావిస్తోంది. మోదీ నాయకత్వంలోని బిజెపి-ఎన్‌డీఏ ఈ దుర్మార్గపు ప్రచారాలను ఎదుర్కోవడానికి, తమ లక్ష్యాలను సాధించడానికి సొంత ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలని కృతనిశ్చయంతో ఉన్నాయి. రాజకీయ వర్గాల్లోని విజ్ఞత గల శక్తులు ఈ తప్పుడు కథనాల ఆయుష్షు పరిమితమేనని, దీర్ఘకాలంలో దేశ రాజకీయాలకు ఈ బూటకపు ప్రచారాలు మార్గనిర్దేశం చేయలేవన్న విషయాన్ని ప్రతిపక్షాలకు తెలియజెప్పవలసిన అవసరం ఉంది. ప్రతిపక్షాల ఊహాలోకాల నుంచి వారిని బయటకు తీసుకురావాలి.

అశ్విని కుమార్