తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా భారీగా సభ్యత్వ నమోదు చేయాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఉత్సాహంతో రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయాలని, పార్టీ సభ్యత్వ నమోదు ఇందుకు మంచి అవకాశమని నడ్డా పేర్కొన్నారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. బిజెపి సభ్యత్వ నమోదు సెప్టెంబరు 11న ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణలో పరిస్థితిపై సమీక్షించేందుకు నడ్డా హైదరాబాద్‌కు వచ్చారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో బేగంపేటలోని హరిత ప్లాజాలో సెప్టెంబర్ 28న సమావేశమయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యదర్శి, సభ్యత్వ నమోదు ఇన్‌ఛార్జి అరవింద్ మేనన్, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, అసెంబ్లీలో శాసనసభపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, చంద్రశేఖర్ తివారీ, వెదిరె శ్రీరాం సహా పలువురు నేతలు హాజరయ్యారు.
‘అక్టోబరు 15 వరకు సభ్యత్వ నమోదుపై పూర్తి దృష్టి పెట్టాలి. 18 నుంచి ప్రజాసమస్యలపై, రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలు చేద్దాం. లోక్‌సభ ఎన్నికల్లో 78 లక్షల మంది బిజెపికి ఓట్లేశారు. అందులో 50 లక్షల మందిని పార్టీ సభ్యులుగా చేర్పించాలి’ అని నడ్డా చెప్పారు. ఆ తర్వాత నాయకుల అభిప్రాయాల్ని తీసుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఈ సమావేశం వివరాలు వెల్లడించారు. సభ్యత్వ నమోదు సమీక్షకు ముందు బండి సంజయ్ కుమార్, రఘనందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎన్వీ సుభాష్ తదితర నేతలతో ఓ ప్రైవేట్ హోటల్‌లో నడ్డా సమావేశమై రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు.